Dr Money | మనం కష్టపడి చదువుకుంటాం. పోటీపడి ఉద్యోగం సాధిస్తాం. మంచి సంపాదనాపరులం అవుతాం. కానీ, ఆ సంపదను నిలబెట్టుకోలేకపోతాం. వచ్చిన జీతం వచ్చినట్టు ఖర్చయిపోతుంది. బ్యాంకు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ కూడా ఉండదు. దీనికంతా కారణం మనకు ‘ఆర్ట్ ఆఫ్ మనీ మేకింగ్’ తెలియక పోవడమే అంటారు హైదరాబాద్కు చెందిన ఫార్చ్యూన్ అకాడమీ వ్యవస్థాపకురాలు డాక్టర్ మణి (డాక్టర్ మనీ అని కూడా పిలవొచ్చు. ఆమె ఏం అనుకోరు).
నిజానికి డాక్టర్ మణి పవిత్ర వృత్తిరీత్యా డెంటిస్ట్. పంటి వైద్యురాలు అన్నమాట. ప్రవృత్తిరీత్యా మాత్రం ఆదాయపన్ను సెక్షన్లలో దిట్ట. ఎక్కడ పెట్టుబడి పెడితే నాలుగు పైసలు మిగులుతాయో వివరిస్తారు. ‘చాలా తెలివైన వాళ్లు, మేధావులే ఎక్కువగా పేదరికం బారినపడతారు. అంటే, సంపాదనకూ తెలివితేటలకూ సంబంధం లేదన్నమాట. డబ్బు సంపాదించడం అనేది ప్రత్యేకమైన నైపుణ్యం. ఆ పాఠాలు నేను నేర్పుతాను’ అంటున్నారీ పైసల డాక్టరమ్మ. గతంతో మణి పవిత్ర కుటుంబం ఓ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టింది. కానీ భాగస్వాములు నిండా ముంచేశారు. ఆ చేదు అనుభవమే ఆమెతో ఇటువైపు అడుగులు వేయించింది.