ఆరుపదుల వయసు అవరోధం కాలేదు. ఆర్థిక పరిమితులు కష్టంగా తోచలేదు. లక్ష్యమే సర్వస్వంగా ఆయుర్వేద ఉత్పత్తుల వ్యాపారంలో అడుగుపెట్టారు హైదరాబాద్‌కు చెందిన కోమలాదేవి. తనదైన ‘వెనికా’ బ్రాండ్‌ను విదేశాలకూ తీసుకెళ్లాలన్నది ఆమె లక్ష్యం. వయసు ఓ అంకె మాత్రమే, జీవిత లక్ష్యాలతో దానికి లంకె పెట్టి నిరాశపడాల్సిన పనిలేదని చెబుతారు కోమలాజీ.
కోమలాదేవికి సౌందర్య పరిశ్రమ అంటే ఇష్టం. ఆ ఆసక్తితోనే ఇరాన్, కెనడా దేశాలు వెళ్లొచ్చారు. సౌందర్య ఉద్దీపనకు సంబంధించిన కోర్సులు చేశారు. ఆయుర్వేదాన్ని లోతుగా అధ్యయనం చేశారు. అప్పటికే మార్కెట్‌ను ఏలేస్తున్న వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. అవన్నీ రసాయనాలలో ముంచితేల్చినవే అని అర్థమైపోయింది. దుష్ప్రభావాలూ ఎక్కువే. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. తాను అందించబోయే ఉత్పత్తులు మాత్రం వీటికి భిన్నంగా ఉండాలని భావించారు కోమలాదేవి.
ప్రతి సమస్యకూ ప్రకృతిలోనే సమాధానం ఉందని కోమలాదేవి నమ్మకం. సహజసిద్ధమైన పదార్థాలతోనే అందానికి ఎందుకు మెరుగులు దిద్దకూడదు? అనే ఆలోచన మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రకృతిలో లభించే వనమూలికలను సేకరించడం ఆరంభించారు. వాటికి ఆయుర్వేద అద్భుతాన్ని రంగరించారు. సిద్ధ్ద, గృహవైద్యంలోని దినుసులనూ జోడించారు. అందంతో మహిళ ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. ఆ మనోబలంతో ఆమె తనదైన రంగంలో దూసుకుపోతుంది. సవాళ్లను ఎదుర్కోగల ధైర్యమూ వస్తుంది. అందుకే సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాన్ని సామాజిక బాధ్యతగా భావిస్తారామె. ఈ వ్యాపారం ద్వారా పేద మహిళలకు ఉపాధి కల్పించాలని కూడా తీర్మానించారు.
మహిళలు జుట్టును ప్రాణంగా భావిస్తారు. ఏ తలస్నానమో చేస్తున్నప్పుడు నాలుగు వెంట్రుకలు ఊడిపోయినా విలవిల్లాడతారు. జడ పలచబడితే ఆమె ముఖం చిన్నబోతుంది. రుతుక్రమ ఇబ్బందుల నుంచి హార్మోన్ రుగ్మతల వరకు.. ప్రతి సమస్యా కేశాల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చుండ్రు, వాయు కాలుష్యం, మానసిక ఒత్తిడి, కలుషిత జలాలు, రసాయన షాంపూలు.. అన్నీ కలిసి ఒత్తయిన జుట్టును పల్చగా మార్చేస్తాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా.. తొలుత హెర్బల్ హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్ తయారీకి శ్రీకారం చుట్టారు కోమలాదేవి. ఫలితాలు బాగుండటంతో ‘వెనికా’ పేరుతో ఉత్పత్తులను తీసుకొచ్చారు. అపార ఔషధ గుణాలున్న తులసి, పుదీనా, వేప, ఉసిరి, కుంకుడుకాయ, వట్టివేరు, కొబ్బరి వంటి సహజసిద్ధమైన పదార్థాలనే ఎంచుకున్నారు. హెర్బల్ ప్యాక్, ఫేస్ వాష్ కూడా తయారు చేస్తున్నారు. పురుషులూ వీటిని వాడొచ్చు. పసిబిడ్డల లేత చర్మానికి ‘బేబీ బాత్ పౌడర్’ ఉండనే ఉంది.
కోమలాదేవి భర్త రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్. ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు కెనడాలో స్థిరపడ్డారు. చిన్న కొడుకు హైదరాబాద్‌లోనే ఓ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్. భార్యగా, తల్లిగా, నానమ్మగా విభిన్న పాత్రల్ని పోషిస్తూనే.. అరవై నాలుగేండ్ల వయసులో ఆంత్ర ప్రెన్యూర్‌గా కొత్త జీవితం ప్రారంభించారు. మంచి డ్యాన్సర్‌గా, నటిగా, న్యూస్ రీడర్‌గానూ గుర్తింపు ఉందామెకు. ‘అప్పట్లో రెండు బ్యూటీ పార్లర్ల్లు నిర్వహించాను. చాలామంది కేశ సమస్యలు, చర్మ సమస్యలను ఏకరువు పెట్టేవారు. అందంగా లేమనే ఆత్మన్యూనతకు గురయ్యేవారు. వాళ్ల అందానికి మెరుగులు దిద్ది ఆత్మవిశ్వాసం పెంపొందిచేదాన్ని. నా దగ్గర శిక్షణ పొందిన 150 మందిలో చాలావరకూ బ్యుటీషియన్లుగా స్థిరపడ్డారు. కళాశాలల్లో సెమినార్లు నిర్వహిస్తూ.. విద్యార్థినుల్లో మనోబలం నింపే ప్రయత్నం చేస్తున్నా’ అంటూ తన ముప్పై ఏండ్ల ప్రస్థానాన్ని వివరించారు కోమలాదేవి.
వయసు గురించి ఆలోచించడం అంటే, మనల్ని మనం వెనక్కి నడిపించడమే. వయసు ఓ అంకె మాత్రమే. ఆకాశమే హద్దు. ఏకాగ్రత, శ్రద్ధ, నమ్మకం.. ఈ మూడూ మనల్ని లక్ష్యం వైపు తీసుకెళ్తాయి. ఆ స్ఫూర్తితోనే నేను ముందుకు సాగుతున్నా. ఇక్కడితో ఆగకుండా.. శుభకార్యాలకు అందించే పసుపు, కుంకుమ మొదలైన వాటిని కూడా అందుబాటులోకి తెచ్చాను. ‘వీ హబ్’ నాకు మార్కెటింగ్ మెలకువలు నేర్పింది. వ్యాపార విస్తరణకు సాయం చేసింది. మీషో, అమెజాన్ వంటి ఇ-దుకాణాల్లోనూ మా ప్రొడక్ట్స్ లభిస్తున్నాయి. నెలకు 10వేల ఉత్పత్తుల వరకూ విక్రయిస్తున్నాం. ఆర్థికంగా చేయూత లభిస్తే మరింత విస్తరిస్తాం. ఇంకొంత మందికి ఉపాధి కల్పిస్తాం. ‘వెనికా’ను జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని, ప్రపంచస్థాయి గుర్తింపు సాధించాలని నా కోరిక.
…? గంజి ప్రదీప్ కుమార్