పొట్టి గుట్టలు
బడిలో గణగణమని మోగింది లాంగ్ బెల్. ‘పొలో’మని పిల్లోళ్లు బడినుంచి పరుగులు తీస్తూ బయటికి వచ్చారు.గంగమ్మ గుడికాడ గొర్రె ఒకటి పరిగెత్తుతా వస్తా ఉంది. గొర్రె కాలుకు అడ్డంగా తన కాలు పెట్టినాడు ఆరు చదివే గోవిందుడు.
‘ఇక్కడినుంచి వెళ్లిపో! మా వాళ్లు నిన్ను చంపేస్తారు’ అంటూ దానికి సైగ చేసినాడు.అది కదలలేదు, మెదలలేదు. “అరె.. ఛత్” అని గదిమినాడు.అది బాధగా చూస్తూ నాలుగు అడుగులు వేసింది.‘ఘల్ ఘల్’ శబ్దాలు వినిపించాయి.
బడిలో గణగణమని మోగింది లాంగ్ బెల్. ‘పొలో’మని పిల్లోళ్లు బడినుంచి పరుగులు తీస్తూ బయటికి వచ్చారు.గంగమ్మ గుడికాడ గొర్రె ఒకటి పరిగెత్తుతా వస్తా ఉంది. గొర్రె కాలుకు అడ్డంగా తన కాలు పెట్టినాడు ఆరు చదివే గోవిందుడు.అంతే.. అది ఎగిరి దూకింది.వెంటనే కాలు వెనక్కి తీసేశాడు.వెనక వచ్చే గొర్రెలన్నీ అడ్డం ఏమీ లేకున్నా ఎగిరెగిరి దుమికి వెళ్లాయి. పడీపడీ నవ్వినాడు పదేళ్ల గోవిందుడు.పక్కనే ఉన్న బడిపిల్లలందరూ ‘హ్హహ్హహ్హ..’ అని చప్పట్లు కొట్టినారు.నేరేడు చెట్టు కింద ముసలవ్వ, ఉడకబెట్టిన వేడివేడి మొక్కజొన్న కంకులు అమ్ముతుంటే మూడు కొన్నాడు గోవిందుడు. చేత్తోనే వాటిని విరిచి సావాసగాళ్లకు తలా ఒక ముక్క ఇచ్చినాడు. వాళ్లు ముసిముసిగా నవ్వుతూ థ్యాంక్స్ మీద థ్యాంక్స్‌లు చెప్పినారు.తనూ తింటూ బడి నుంచి ఇంటికి వెళ్లినాడు.
గోవిందుడు లక్స్ సోప్‌తో ముఖం కడుక్కుంటున్నాడు. ఇంతలో తక్కోళం మామ వచ్చి..“ఒరేయ్ గోవిందా.. మా కోడి మీ ఇంటికి వచ్చిందా!. మీ ఇంట్లో ఏమైనా గుడ్డు పెట్టిందా?”అని అడిగినాడు.
“లేదు మామా.. మీ కోడీ రాలేదు, గుడ్డూ పెట్టలేదు” అని బదులిచ్చినాడు గోవిందుడు.“మా కోడి దొంగ మరిగిపోయిందిరా! తిండేమో మా ఇంట్లో.. గుడ్డేమో ఎవరింట్లోనో పెట్టేస్తా ఉంది” అని బాధపడతా పోయినాడు తక్కోళం మామ.ఇంతలో.. గోవిందుడికి ‘మే.. మే..’ అన్న అరుపులు వినిపించినాయి.‘మన ఇంట్లో మేక ఎక్కడిదబ్బా’ అని ఇల్లంతా వెదికి, ఎక్కడా కనిపించక పోయేసరికి ఇంటి వెనక్కి వెళ్లినాడు. కానుగ చెట్టు కింద ఒక నల్ల మేకపోతు కనిపించింది. అది చూరుకు వేలాడదీసిన ఆకులు తింటున్నాది.
‘పొట్టితోక, పెద్దకొమ్ములు, పొడుగాటి చెవులు.. భలే ముచ్చటగా ఉందే..’ అని ఆనందపడినాడు.
‘ఊర్లో అందరికీ జీవాలు ఉండాయి. మన ఇంట్లోనే లేవని చాన్నాళ్లుగా గొడవ చేసినాను కదా!? అందుకని నాయన తీసుకొచ్చినట్లు ఉండాడు..’ అనుకున్నాడు. దగ్గరగా వెళ్లి దాని కళ్లలోకి చూసినాడు. ఎందుకో అది.. చాన్నాళ్లుగా, బాగా తెలిసినట్లు అనిపించింది. దాని మెడమీద చేయి వేసి మెత్తమెత్తటి బొచ్చును చిన్నగా తడిమినాడు. దానికి తొట్టెలోని నీళ్లు పోసి ఒళ్లంతా రుద్ది స్నానం చేయించినాడు.
ఇంట్లోకి వెళ్లి అక్క పాత రంగుపూసల దండని తెచ్చి మేకపోతు మెడలో వేసినాడు. దాని ముఖం కళకళలాడింది. చాన్నాళ్లుగా అక్క వాడకుండా నల్లడబ్బాలో పెట్టి ఉన్న పాతగజ్జెలను తెచ్చి దాని కాళ్లకు చుట్టినాడు.
అది అడుగుతీసి అడుగు వేసినప్పుడల్లా వచ్చే ‘ఘల్ ఘల్’ శబ్దాలు విని మురిసినాడు.ఇంతలో నాయన సిద్దులయ్య వచ్చినాడు.
“ఒరేయ్.. గోవిందా! మనదేరా ఈ మేక! వెదురుకుప్పం సంతలో కొనుక్కొచ్చినానురా. భద్రంగా చూసుకో” అని చెప్పి ఇంట్లోకి వెళ్లినాడు.
ఆ రోజు నుంచీ మేక.. గోవిందుడి నేస్తమయ్యింది.
సందు దొరికితే చాలు.. బీడు భూముల్లోకి, చెరువు కాడికి, కటవలోకి దాన్ని తోలుకెళ్లే వాడు. చింతచెట్ల లేత చిగుళ్లు కోసి దాని నోటికి అందించేవాడు. దానికి ఏవేవో కబుర్లు చెప్పేవాడు.
వాడి సావాసగాళ్లంతా..
“ఒరేయ్ గోవిందూ.. ‘ముందు వచ్చిన చెవుల కంటే, వెనుక వచ్చిన కొమ్ములు వాడి’ మాదిరి మమ్మల్ని మరచినావురా!”.. అని నిష్టూరం చేసినారు.
చీమిడి ముక్కులోడు గబగబా ముందుకొచ్చి..
“ఒరేయ్.. ఈ మేకని ముద్దుముద్దుగా చూసుకుంటా ఉండాడు గోవిందుడు. ఇంగ్లీషు కూడా నేర్పించ బోతాడేమోరోయ్! ఏదో సినిమాలో మాదిరి.. ఏప్రిల్ నెల తర్వాత ‘మే’ చెప్తుంది, జూన్ ముందు నెలడిగితే ‘మే’ అని చెబుతుందేమో ఈ మేక..” అని చెప్పినాడు.
అందరూ ఎగిరెగిరి నవ్వినారు.
గోవిందుడు రోషంగా..
“నవ్వితే నవ్వినారు.. నాకేమీ బాధ లేదు. నేను ఈ మేకను బాగా సాకుతాను. ఏదో ఒకరోజు మా మేకను చూసేదానికి మీరందరూ మా ఇంటి ముందర ‘క్యూ’ కడతారు చూడండి..” అని బదులిచ్చినాడు.
ఊర్లో గంగ జాతర జరుగుతున్నాది. పలకలు బలంగా మోగుతున్నాయి. ఊరి నిండా వేపాకుల తోరణాలు కట్టినారు.
గంగమ్మ గుడికి ఆగ్నేయాన ఆడోళ్లంతా పొంగళ్లు పెడుతున్నారు. మూడు పెద్ద రాళ్లు పెట్టి కట్టెలతో మంటపెట్టి ‘ఉడికిందా? లేదా?’ అని మెతుకుల్ని
పట్టిపట్టి చూస్తూ ఉన్నారు.
పడుచు పిల్లలు పొంగళ్లు పెట్టేచోట కుర్రోళ్లు ఈగలు మాదిరి చుట్టకలాడుతున్నారు.
‘ఏమైనా సహాయం కావాలా?’ అని ఒకటికి రెండుసార్లు అడుగుతున్నారు.
పొంగళ్లు పెట్టే వయసు పైబడిన ఆడోళ్లు.. ‘పని ఉంది’ అని పిలిచినా, వినపడనట్లు ఉంటున్నారు.ఊళ్లో వాళ్లు కుండలకు పసుపుకుంకుమలు పెట్టి, వేపాకు చుట్టిన గెరిగలు ఊరేగిస్తున్నారు.
సావాసగాళ్లతోటి గోవిందుడు వాటి వెనకే నడుస్తున్నాడు. రచ్చబండకాడికి వచ్చేసరికి తక్కోళం మామ చేతులు పైకెత్తి, నాలిక మడుస్తూ వచ్చి నిలబడినాడు.“పలకలు సరిగా మోగడం లేదు. వేడి చేసుకోండి..” అని చెప్పి, గడ్డి కొంచెం వేసి నిప్పు అంటించినాడు. ఆ నిప్పు మంటల్లో పలకలను ‘టంగు టంగు’ అని కొడుతూ వేడి చేసినారు.ఆ తర్వాత కొట్టిన పలకలకు తక్కోళం మామ.. ‘జెజ్ జెజ్ జెజ్జినక..’ అంటూ ఎగిరినాడు. అలసిపోతూ ఉంటే.. ఎవరో చేతి కర్చీఫ్ ఇచ్చినారు. రెండు చేతుల్తో దాన్ని పట్టుకుని ‘డంగ్ టక.. డంగ్ టక..’ అంటూ పంచె ఊడేంత వరకు ఎగిరినాడు. చుట్టూ చేరిన పిల్లోళ్లు పడీపడీ నవ్వినారు.
రాత్రి ఎనిమిదయ్యింది.పంచాయితీ ఆఫీసు కాడికి ఊరి సర్పంచ్ మేకప్ మాన్ని తీసుకొచ్చినాడు. నచ్చిన వేషం వేసుకోండని పిలకాయలకు చెప్పినాడు. అంతే.. ఒకరు రాముడంటే.. మరొకరు కృష్ణుడంటే.. ఇంకొకరు నారదుడంటే.. తలా ఒక వేషం కట్టాలని అనుకున్నారు. గోవిందుడు తనకు నచ్చిన ఈశ్వరుడి వేషం వేసినాడు.
“నీకెందుకురా ఈశ్వరుడి వేషం అంటే ఇష్టం?” అని అడిగినాడు మేకప్ మాన్.“చంకలో పెట్టుకున్న నీళ్ల తిత్తి అదుముతూ ఉంటే.. నెత్తి మీదినుంచి గంగ పడటం భలే ఉంటది” అని నవ్వుతూ బదులిచ్చినాడు.వేషం వేసుకుని వీధులన్నీ తిరుగుతూ ఉంటే.. ఎగువ ఇండ్లకాడ చెంచు నాయుడి మూడో మనవరాలు ఎదురయ్యింది. క్లాస్మేట్ అయిన ఆ పిల్ల బులుగు పావడ, జాకెట్టు వేసి తలస్నానం చేసి వెంట్రుకలు ఆర బెట్టుకుంటున్నాది.
“ఏమిరా గోవిందా.. ఇద్దరు పెళ్లాలుండే శివుడి వేషం వేసినావు” అని ఊగతా ఊగతా అడిగింది.సిగ్గుమొగ్గలైన గోవిందుడి ముక్కు ఒకటికి రెండుసార్లు అదిరింది. ఆ ఊపులో అందరి ముందరా..“శంకరా..” అంటూ పాట పాడినాడు.పాటతోపాటు శివ తాండవం కూడా చేయాలనిపించింది. అయితే నెత్తి మీది గంగ, ఒంటికి చుట్టిన పులి చర్మం జారి పడిపోతాయేమోనని ఆ పని చేయలేదు.
ఊరంతా తిరిగితిరిగి అలసి, రాత్రి రెండు గంటలకు పంచాయితీ ఆఫీసు కాడే వేషాన్ని తీసేసి ఇంటికి వచ్చినాడు. అందరూ నిద్రపోతున్నారు. శబ్దం చేయకుండా నేరుగా వెళ్లి మిద్దెపైన పడుకున్నాడు.
తెల్లారయ్యింది. చురచురమని ఎండ, కండ్ల మీద పడుతుంటే మెలుకువ వచ్చింది. కళ్లు తెరిచి చూశాడు.
ఇంటి ముందర పలకల శబ్దం జోరుజోరుగా వస్తున్నాది. ‘ఏమిటా!?’ అని తొంగి చూసినాడు.
మేకపోతుకు పసుపు కుంకుమలు రాసి ఉన్నారు. దాని మెడలో ముద్దబంతుల మాల వేసి ఉన్నారు. నడుము మీద తడి చేసిన పసుపు గుడ్డ వేసి వేపాకులు చుట్టి ఉన్నారు. గబగబా దిగి ఇంట్లోకి వచ్చినాడు గోవిందుడు. ఎదురైన నాన్నతో.. “సాక్కోవడానికి కదా మనం మేకను తెచ్చుకున్నది” అని అడిగినాడు.
“ఓరి తిక్కలోడా.. దాన్ని ఎల్లకాలం సాకితే మనకేమి వస్తుందిరా? అమ్మవారికి బలి ఇచ్చి కూర అమ్ముకుంటే కదా మనకి డబ్బులొచ్చేది” అని బదులిచ్చినాడు తండ్రి.“నేను ఒప్పుకోను. నాతోనే పెంచుకుంటాను” అని పెద్దగొంతుతో చెప్పినాడు గోవిందుడు.
“మేక మెడచన్ను కుడిస్తే ఆకలి తీరుతుందారా పిచ్చోడా!? పుస్తకాల్లో ‘హింస చేయొద్దు.. జీవ హింస నేరం’ అని ఏమేమో రాసి ఉంటారు. అది చదివి ఆచరిస్తా పోతే.. మనకి నోట్లోకి నాలుగేళ్లు ఎట్లపోతాయి!?” అని చెప్పి, మేక గొంతుకు తాడు కట్టి రెండు అడుగులేసినాడు.
“ఈ పిలకాయలకు ఏమీ తెలియదు. మీరు కొట్టండిరా పలకలు” అని గట్టిగా అరిచినాడు సిద్దులయ్య.
‘డిమికి.. డిమికి…డిమికి’ అని పలకలు కొట్టుకుంటూ మేకను గంగమ్మకు బలి ఇవ్వడానికి అందరూ బయలుదేరినారు. మేకపోతును బలవంతంగా ఈడ్చుకు పోవడం చూసి, తల తెగిన మేక మాదిరి గోవిందుడి మనసు గిలగిల్లాడింది. ఏడుస్తూ వెళ్లి, ఇంటి వెనక కానుగ చెట్టు కింద కూర్చున్నాడు.
పలకల బృందం తూర్పు వీధి నుంచి బయలుదేరింది. బడి పిల్లోల్లు ‘లక్కులక్కుం..’ అని ఎగురుకుంటూ, దాని వెనుకే నడుస్తున్నారు.
బిత్తర బిత్తర చూపులు చూస్తూ నడుస్తున్నాది మేక. పడమటి వీధిలోకి వెళ్లింది పలకల బృందం.
ఆ వీధి ఆడోళ్లు..
“ఎన్నో మేకల తలలు కసాయి అంగట్లో తెగతాయి. ఈ మేకకి ఎంత అదృష్టమో కదా.. అమ్మవారికి నైవేద్యం అవుతన్నాది” అని మేకను చూసి దండాలు పెట్టినారు.
బెదురు చూపులు చూసింది మేక.పలకల బృందం ఉత్తరం వీధిలోకి నడిచింది.
అప్పుడే నలుగురు కుర్రోళ్లు.. ‘గంగ తాగితేనే కదా గంగ జాతర’ అని తాగినంత తాగి అక్కడికి వచ్చినారు. కొంచెంసేపు ‘డబ్బుస్కు డబ్బుస్కు’ డ్యాన్సులేసినారు.
పోతూపోతూ.. “లొ.. లొల్లల్లో..” అని కిల్లరించినారు. సిద్దులయ్య కుడి చేత్తో పైగుడ్డ విసురుతూ..
“పదండి.. పదండి” అంటూ జనాన్ని తరిమి, ఎడమ చేత్తో మేక తాడును లాగినాడు.
మేక కొంచెం కూడా కదలలేదు. గట్టిగా కాలి గిట్టలతో నేలని బలంగా అదిమి పెట్టుకుని ఉంది. అది ప్రాణ భయంతో గట్టిగా గాలి పీల్చి వదులుతున్నది.
తాడును చేత్తో రెండో మడత వేసి లాగినాడు. మరింత బిగుసుకుంది మేక.
పళ్లను కింది పెదవితో అదిమి పట్టి మరింత గట్టిగా లాగినాడు. రెండు అడుగులు దాన్ని బరబరా ఈడ్చినాడు. దాని మోకాళ్లు నేలకి రాసుకుని దుమ్ము లేస్తున్నాది. అది తన శక్తినంతా కూడగట్టుకుని మొండికేసి మెడను గట్టిగా విదిలించింది.
అంతే.. పుటుక్కున తెగింది తాడు. డబుక్కున ఎగిరి నిలబడింది మేక. క్షణం కూడా అక్కడ నిలవలేదు. పరిగెత్తడం ప్రారంభించింది. దాని వెనక సిద్దులయ్య, బడి పిల్లోళ్లు, పలకలు కొట్టేవాళ్లు పరుగో పరుగు..
చింతల చేను వరకు అందరూ పరుగులు తీసినారు. ఆ పైన ఉండేది అంతా మిట్ట ప్రాంతమే! పలకలు కొట్టేవాళ్లు గెస పోసుకుంటూ గెనుము మీద కూర్చునేసినారు.
‘మేకపోతు ఎక్కడికి పోతుందిలే.. మన సిద్దులయ్య ఎట్లనో ఒకట్ల పట్టకచ్చేస్తాడు!’ అనుకుంటూ..ఆమాటా ఈమాటా చెప్పుకొంటున్నారు. సందిట్లో సడేమియాగా బడి పిల్లోళ్లు పిల్లకాలువలో చేపలు పట్టే పని ప్రారంభించినారు.
ముందు మేక.. దాని వెనుక సిద్దులయ్య!
మూడు మూరల దూరంలో తక్కోళం మామ.మేక పరిగెత్తి పరిగెత్తి తాటికాయల గుంత కాడికి పోయి నిలబడింది.‘అబ్బ! దొరికిందిలే..’ అనుకున్నాడు సిద్దులయ్య.అట్లా ఇట్లా చూసిన మేక, మెరుపు మాదిరి టక్కుమని ఎగిరి పాత గుట్ట మీదికి ఎక్కి నిలబడింది.
గెస పోసుకుంటున్నాడు సిద్దులయ్య. ఒళ్లంతా చెమటలు కారుతున్నాయి. వెనకనే వచ్చిన వాళ్లలో తక్కోళం మామ మాత్రమే మిగిలినాడు. ఎడమకాలి మోకాలు నొప్పి పుట్టడంతో గుట్ట ఎక్కలేక నిలబడినాడు. మేక సర్రుసర్రున పాత గుట్ట దాటి పొట్టి గుట్టలు ఎక్కింది.
“దీనెమ్మ .. నాయాల్ది! ఉపద్రవం చేస్తా ఉందే..” అంటూ, ఒక కాశి రాయి తీసి దానిపైకి విసిరినాడు.
అది చటుక్కున పెద్ద బండ వెనక్కి వెళ్లింది.
విసిరిన రాయి నేరుగా వెళ్లి బండకి తగిలి పది ముక్కలై చెల్లా చెదురుగా పడింది.సిద్దులయ్య ఆవేశం కట్టలు తెంచుకుంది.
పంచ ఎగ గట్టి గబగబా పొట్టి గుట్టలు ఎక్కి నిలబడినాడు. దూరంగా వెదురు చెట్టు పొదల ముందు నిలబడి ఉంది మేక.
‘ఈసారి వదిలేది లేదు’ అనుకుంటూ.. ఒక రెండు అడుగుల రాయి మీద కాలు పెట్టినాడు. దాని కింద ఇసుక ఉండటంతో సర్రున జారింది. పట్టు తప్పినామని తెలుసుకుని, పక్కనే ఉన్న మామిడి కొమ్మ పట్టుకున్నాడు. బరువు భరించలేని కొమ్మ విరిగిపోయింది. దొర్లుకుంటూ రెండు పొడుగాటి తాటిచెట్లంత లోతు లోయలో పడినాడు.
వెనకనుంచి చూసిన తక్కోళం మామ వెంటనే వెనక్కి తిరిగి పరుగులు తీసి ఊర్లో వాళ్లకి విషయం చెప్పినాడు. ఊర్లో వాళ్లు వెదురు కర్రలు, చేంతాళ్లు, టార్చిలైట్లు, నీళ్ల బిందెలు ఎత్తుకుని పొట్టి గుట్టలకాడికి పరుగులు తీసినారు. మేక తప్పించుకుందని, నాన్న లోయలో పడినాడని గోవిందుడికి విషయం తెలిసింది. రేసుగుర్రం లెక్కన అడ్డదారిలో ఒంటిగా పరుగులు తీసినాడు.నేరుగా వెళ్లి లోయ ముందర నిలబడినాడు.
అక్కడే ఉన్న తక్కోళం మామ..
“గోవిందా.. చెడ్డ కాలంలో మంచి కాలం. మీ నాయనకు ఏమీ కాలేదు” అని ధైర్యం చెప్పినాడు.
ఇంతలో పలకలు కొట్టేవాళ్లు, బడి పిల్లోళ్లు, ఊర్లో వాళ్లు వచ్చి చేరినారు. పైనుంచే సిద్దులయ్యకు ధైర్యం చెప్పినారు.
“భయపడొద్దు. ఏమీ కాదు. మేమున్నాం!” అని ఒకటికి రెండుసార్లు చెప్పినారు.
సిద్దులయ్య గుండె డబుక్కు డబుక్కుమని కొట్టుకుంటున్నాది. మొదటిగా టార్చిలైటును చిన్నతాడుకు కట్టి వదిలినారు. తన చుట్టూ పాము లాంటిదేమైనా ఉంటుందేమోనని టార్చిలైటు వేసి చూసినాడు. చిన్నచిన్న పురుగులు తప్పితే ఇంకేమీ కనిపించకపోయేసరికి సిద్దులయ్యకు ధైర్యం వచ్చింది. చిన్నతాడుకు నీళ్ల బిందె కట్టి లోపలి దింపినారు. నీళ్లను చూసిన సిద్దులయ్యకు ప్రాణం లేచి వచ్చింది. కొన్ని నీళ్లను ముఖం పైన చల్లుకున్నాడు. పైగుడ్డతో ముఖం తుడుచుకున్నాడు. బిందెను పైకి ఎత్తి నీళ్లన్నీ గుటగుటా తాగి బిందెను పైకి పంపించేసినాడు. పైన ఉన్నవాళ్లు తాళ్లను ఒకదానికొకటి బలంగా పెనవేసి కట్టినారు. తెగుతుందేమోనని బలంగా లాగి చూసినారు. ఏమీ కాదని ధైర్యం తెచ్చుకుని చిన్నగా తాడును లోయలోకి వదిలినారు.
తాడును చూసిన సిద్దులయ్య.. ‘హమ్మయ్య’ అనుకున్నాడు. తాడుని గట్టిగా పట్టుకుని చిన్నచిన్నగా పైకి వస్తున్నాడు సిద్దులయ్య.
‘నాన్న క్షేమంగా ఉన్నాడు. భయం లేదు. ఎలాగోలా ఊర్లో వాళ్లు బయటికి తీస్తారు. మరి మేక ఏమయ్యింది?’ అనుకుని, నిక్కినిక్కి తల ఎత్తి చూసినాడు గోవిందుడు.
దూరంగా పొట్టి గుట్టల మధ్యలో పెద్ద బండరాయి వెనుక దాక్కొని ఉంది. మేక పూర్తిగా కానరాలేదు కానీ, దాని బెత్తెడు తోక మాత్రం కనిపించింది.
దాన్ని ఎలాగైనా కాపాడాలనుకున్నాడు.
ఎవ్వరూ చూడకుండా చెట్ల మధ్యన కొంచెంసేపు చిన్నగా నడిచి ఫర్లాంగు దూరం పోయినాక పరుగు అందుకున్నాడు. దారిలోని తుమ్మ చెట్టు చొక్కాయికి తగులుకుని చొక్కాయి చినిగిపోయింది. పట్టించుకోలేదు.
ఇసుక కాలువ అడ్డం వచ్చింది. అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టమయ్యింది. పక్కనున్న చెట్లను లాగి పట్టుకుంటూ నడిచినాడు.
చూసుకోకుండా బ్రహ్మజెముడు ముళ్లు తొక్కినాడు. రక్తం వచ్చింది. గబుక్కున ఇసుకని గుప్పిట్లోకి తీసుకుని దాని పైన పోసినాడు. కుంటుకుంటూ కొంచెం ఎత్తు ఎక్కి దిగేసరికి మేక ఉన్న బండ వచ్చింది.
గోవిందుడిని అది భయభయంగా చూసింది. అక్కడినుంచి తప్పించుకెళ్లాలని కొంచెం కదిలింది.
ఎప్పుడూ తను అభిమానంగా పిలిచేలా.. ‘యా.. యా..’ అంటూ పిలిచినాడు.తల తిప్పి గోవిందుడి కళ్లనే చూసింది. ఏమీ చేయడని ధైర్యం వచ్చిందేమో.. అక్కడే కదలకుండా నిలుచుంది.దగ్గరికి వెళ్లాడు. దాని తడి కళ్లను చూసి గట్టిగా దాని మెడను వాటేసుకున్నాడు.
‘ఇక్కడినుంచి వెళ్లిపో! మా వాళ్లు నిన్ను చంపేస్తారు’ అంటూ దానికి సైగ చేసినాడు.
అది కదలలేదు, మెదలలేదు.
“అరె.. ఛత్” అని గదిమినాడు.
అది బాధగా చూస్తూ నాలుగు అడుగులు వేసింది.‘ఘల్ ఘల్’ శబ్దాలు వినిపించాయి.‘వాటిని తీసేయాలి. లేకుంటే దాని జాడ తెలిసిపోతుంది ఊళ్లో వాళ్లకి..’ అనుకుంటూ, దాని దగ్గరికి పరిగెత్తినాడు. దాని కాళ్లకున్న గజ్జెలు తెంపినాడు. వాటిని దూరంగా నీటి కుంటలోకి విసిరినాడు.“పో.. పో..” అని అరుస్తూ దాన్ని తరిమినాడు.అది తడి కళ్లతో.. ఒకటికి రెండుసార్లు దీనంగా గోవిందుడి వైపు చూసింది. “నీకే కదా.. చెప్పేది!” అని ముల్లుకర్ర చూపినాడు.అంతే.. అది జింక లెక్కన ఎగురుకుంటూ అడవిలోకి పరుగులు తీసింది. మేక పరిగెత్తుతుంటే దాని ఒంటికున్న పసుపు కుంకుమలు రాలి నేల మీద పడ్డాయి.కంటికి కనిపించనంత దూరం అది వెళ్లేంతవరకు అక్కడే నిలబడ్డాడు. వెళ్లిందన్న నమ్మకం కుదిరాక, ఏమీ తెలియనట్లు.. ఎవ్వరికీ అనుమానం రాకుండా.. చిన్నగా ఇంటివైపు నడిచినాడు.
ఆర్.సి.కృష్ణస్వామి రాజు
సమాజంలో జరిగే సంఘటలను పాఠకుల కళ్లకు కట్టేలా.. కథలుగా మలుస్తున్నారు ఆర్.సి.కృష్ణస్వామి రాజు. ఈయన స్వస్థలం తిరుపతి. ఎంఏ జర్నలిజంతోపాటు పబ్లిక్ రిలేషన్స్, మార్కెటింగ్‌లో డిప్లమోలు చేశారు. ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పనిచేసి, ఉద్యోగ విరమణ పొందారు. 1984 నుంచీ కథలు రాస్తున్నారు. ఇప్పటివరకు 500కుపైగా కథలు రాశారు. వీటిలో దాదాపు 500 కథలు వివిధ దిన, వార పత్రికల్లో అచ్చయ్యాయి. 13 కథా సంపుటాలను వెలువరించారు. ఈయన రాసిన మొదటి కథ.. ‘ఈకాలం పిల్లలు’. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైంది. ముగ్గురాల్ల మిట్ట, పల్లెకు పోదాం, పాడిలేని ఇల్లు.. పాడి లేని చేను, రాళ్ల బియ్యం, అమ్మ విమానం ఎక్కాలంది, సల్లో సల్ల, బడి బియ్యం, దుశ్శాలువా కప్పంగ కథలు పాఠకుల మన్ననలు పొందాయి. వివిధ పత్రికలు, సాహితీ సంస్థలు నిర్వహించిన కథల పోటీల్లో పాతిక కథలకు పైగా బహుమతులు గెలుచుకున్నారు. సాహిత్య సేవలో భాగంగా లెక్కకు మిక్కలి పురస్కారాలు, సన్మానాలు అందుకున్నారు.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.2 వేల బహుమతి
పొందిన కథ.
-ఆర్.సి.కృష్ణస్వామి రాజు
93936 62821
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

