‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో విశిష్ఠ బహుమతి పొందిన కథ.
నాంది :
హైదరాబాద్. జూబ్లీహిల్స్‌లోని ఓ అధునాతన భవంతి. ఆ ఇంటి ఆవరణలోని కెన్నెల్‌లో కళ్లు మూసుకుని ఉంది భూమి. కళ్లు తెరిచి ఈ లోకాన్ని చూడటానికే వణికిపోతున్నది. అప్పుడే ఆ ఇంటి లోపలి నుంచి ఒక యువతి బయటికి వచ్చింది. పచ్చిక పక్కగా ఉన్న దారిమీదుగా, భూమి వైపు అడుగులు వేస్తున్నది ఆమె. ఉషోదయపు లేత ఎండకన్నా కాంతిమంతంగా మెరుస్తున్నదా యువతి ముఖం.
నెల రోజుల క్రితం ఓ ఆదివారం సాయంత్రం యోగా చేస్తుండగా.. ఎక్కడినుంచో మూలుగు వినిపించింది ఆమెకు. లేచి బయటికి రెండడుగులు వేసింది. రోడ్డు పక్కన కనిపించిన ఆ దృశ్యాన్ని చూసి ఒక్కక్షణం ఆమె ఊపిరి ఆగిపోయింది. ఏడెనిమిది నెలల వయసున్న ఒక వీధికుక్క.. రక్తపు మడుగులో పడి ఉంది. ఆ దృశ్యం హృదయవిదారకంగా ఉంది. క్షణం ఆలస్యం చేయకుండా, ఇంట్లో పనిచేసే కవితను వెంటబెట్టుకుని.. ఆ కుక్కను తన కారులో హుటాహుటిన వెటర్నరీ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. రెండున్నర గంటల తర్వాత ఆ వైద్యుడు, ఆమె దగ్గరికొచ్చి..
“ఆ కుక్క మీదేనా?” అని అడిగాడు.
“కాదండీ! మా ఇంటి ముందు పడుంది. రక్తపు మడుగులో కదల్లేని స్థితిలో ఉంటే తీసు
కొచ్చాను. బతుకుతుందా? అసలు!” ఆ యువతి వివరించింది.
అప్పుడు ఆ డాక్టర్ దీర్ఘంగా శ్వాస తీసుకొని..
“దాన్ని ఎవరో దారుణంగా హింసించారు. నాలుగు కాళ్లూ కట్టేసి చిత్రహింసకు గురిచేశారు. నిర్లక్ష్యానికీ, హింసకు, ‘అబ్యూజ్’కు గురైన ఎన్నో జంతువులను చూశాను గానీ, మరీ ఇంత దారుణమైన హింసను నేనింతవరకూ చూడలేదు! రెండు సర్జరీలు చేయాల్సి వచ్చింది. ప్రాణం కాపాడగలిగాను. కానీ, పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుంది”.
ఆ మాటలు విని ఆమె నిర్ఘాంతపోయింది.
‘నోరు లేని జీవులమీద కూడా ఇంత క్రూరత్వమేంటి? అబ్యూజ్ ఏంటి?’.. ఆ కుక్కను బ్లూక్రాస్ వాళ్లకో, జంతు సంరక్షణ సంస్థలకో అప్పగించి అక్కడితో వదిలేయాలని అనిపించలేదు ఆమెకు.
తనతో ఇంటికి తీసుకువచ్చి, ఒక కెన్నెల్ కొని దానిలో ఉంచింది. ఆడ కుక్క కావడంతో ‘భూమి’ అని పేరుపెట్టింది. అయితే, భూమి తన శారీరక గాయాల నుంచి కోలుకుంటున్నది కానీ, తాను అనుభవించిన ఆ ‘ట్రామా’ నుంచి మాత్రం తేరుకోలేక పోతున్నది. దాని కళ్లలో జాలి తప్ప ‘జీవం’ కానరావడం లేదు. తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తున్నదానిలా, నిస్తేజంగా నిర్వికారంగా చూస్తుంది. దాని మనసంతా భయమే! ఆందోళనే! ఆహారం కూడా సరిగ్గా తినదు. మనిషైతే కౌన్సెలింగ్ లాంటివి చేయవచ్చు. నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్నీ నింపే సలహాలు, సూచనలూ ఇవ్వవచ్చు. కానీ, అది మూగజీవి. భూమిని అలా చూస్తుంటే.. జాలితో ఆమె గుండె కరిగిపోతూ ఉంటుంది. తన గతాన్నీ, ఆ దారుణమైన హింసనీ మర్చిపోయి.. భూమి తిరిగి మామూలుగా మారితే చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నదామె.
ఆరోజు తనకొక ఆలోచన వచ్చింది. దాన్ని కార్యరూపంలో పెట్టడానికే.. ఉదయాన్నే భూమి దగ్గరికి వచ్చింది. రోజూలానే, భూమి తన గూటిలో ఓ మూలన పడుకొని ఉంది. ఆమె రాకను గమనించి, బలహీనంగా కనురెప్పలు ఎత్తి ఓసారి ఆమె వైపు చూసింది అంతే! ఎలాంటి ఉత్సాహమూ లేదు. ఉద్వేగమూ లేదు. అప్పుడామె తనతోపాటు తీసుకొచ్చిన వేణువును పెదవులకు ఆన్చుకుంది. ఆమె చూపు కెన్నెల్ లోపల పడుకొని ఉన్న భూమి పైనే ఉంది. ఊపిరి మాత్రం ‘భూ’పాళ రాగంలో ఓ మృదుమంజుల నాదంలా మారి, వేణువులోంచి వెలువడుతున్నది. అది అక్కడి గాలితో, పూలతో మమేకమవుతూ.. ప్రకృతినే పారవశ్యంలోకి నెట్టేస్తున్నట్లుంది. ఆ మధుర సంగీతఝరి అలా కొనసాగుతుండగా.. అక్కడొక అద్భుతం జరిగింది. భూమి మెలమెల్లగా తల ఎత్తింది. ఈసారి జాలి గూడుకట్టుకుని ఉన్నా, దాని కళ్లలో ఏదో వింత కాంతి! మొట్టమొదటిసారి తలెత్తి మెల్లగా లేచింది. లేచి ముందుకు అడుగులు వేస్తున్నది. భూమిలో ఆ మార్పును చూస్తున్న ఆమె కళ్లు విప్పారాయి. ఆ సంగీత ధ్వని, ఆ మూగప్రాణి అంతరంగాన్ని ఎలా ప్రేరేపించిందో తెలియదుగానీ, భూమి తన తోకను మెల్లగా ఊపసాగింది. ఇన్నాళ్లుగా గూడుకట్టుకుని ఉన్న భయం, ఆందోళన, నిర్వేదం, అభద్రతాభావం.. అన్నీ మంచులా మెల్లగా కరగడం ప్రారంభించినట్లు.. భూమిలో చిన్నపాటి ఉత్సాహపు నీడ కనిపిస్తున్నది. వేణువు భూపాళంలో ఉన్నా.. భూమి గుండె ఆనందభైరవి అయ్యింది.
ప్రారంభం :
మహానగరానికి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పల్లె. ఉదయం పది గంటల సమయం. ఏపుగా పెరిగిన అరటి తోట.. మగ కూలీలు కొందరు అరటి చెట్లకు సేంద్రియ ఎరువులు వేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎండుటాకుల్ని కొడవలితో కోసి, పారతో చెట్టు మొదలు చుట్టూ తవ్వుతున్నాడు సీతారాముడు. అతని ఏకాగ్రతను చెదరగొడుతూ, కొంచెం దూరంలో కిలకిలమని నవ్వులు వినిపించాయి. తలెత్తి చూశాడు. పక్కనున్న గులాబీ తోటలోకి ఆడ కూలీలు వచ్చారప్పుడే! వాళ్లలో ఒకమ్మాయి మీద సీతారాముడి దృష్టి నిలిచిపోయింది. సరిగ్గా అప్పుడే ఆ అమ్మాయి దృష్టి కూడా అతని మీద పడింది. లంగావోణీ వేసుకుని తెల్లగా వెన్నెల తునకలా ఉన్నదామె. కళ్లతోనే చిరునవ్వులు పంచుకుంటున్నట్టూ.. చూపుల్లోనే పలకరింపుల ప్రసరింపులు జరిగిపోతున్నాయి. వాళ్ల కళ్ల భాష కనిపెట్టిన ఒక యువతి..
“గౌరీ!”.. అని పిలిచి, ‘మీ ముచ్చట నాకు దెల్సులే!’ అన్నట్టు కిసుక్కున నవ్వింది. ఆ అమ్మాయి పిలుపుతో ఉలిక్కిపడింది గౌరి. సీతారాముడి మీదినుంచి చూపు తిప్పేసుకొని..
“నీ పేరేంది?” అని అడిగింది ఆ అమ్మాయిని.
ఆ అమ్మాయి ఎందుకో ఒక క్షణం సందిగ్ధపడి..
“బేబంటరు” అన్నది.
“బేబి?” ప్రశ్నార్థకంగా పలికింది గౌరి.
‘అవును’ అన్నట్టు తలూపిందా అమ్మాయి.
బేబీ అన్నది ఆ అమ్మాయి అసలు పేరు కాదని అస్సలూహించలేదు గౌరి. అరటితోటలో ఉన్న సీతారాముడు తన్మయంగా గౌరినే చూస్తూ ఉన్నాడు.. ‘గౌరి సక్కదనం ముందల ఆ గులాప్పూల సక్కదనం నిలబడతదా?’ అనుకుంటూ! ఆడ కూలీలు గులాబీపూలు తుంచే పనిలో పడ్డారు.
పన్నెండెకరాల్లో పాతికేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ, ఉద్యోగం, వ్యాపారాలకంటే వ్యవసాయమే లాభదాయకం అన్న సత్యాన్ని నిరూపిస్తున్న ఆదర్శరైతు శ్రీనివాసరావు పొలాలు అవన్నీ. సహజ వ్యవసాయ పద్ధతుల్లో వివిధ పంటలనూ పండిస్తుంటాడాయన. అక్కడ పనిచేసే కూలీలను సొంతబిడ్డల్లా చూసుకుంటాడు. వాళ్లు కూడా కూలి కోసం కాక.. సొంత ఇంటిపని చేస్తున్నట్టు, ఇష్టంగా కష్టపడతారు.
కూలీలంతా మధ్యాహ్న భోజనాలకు చెట్ల కింద కూర్చున్నారు. సీతారాముడు, గౌరి మాత్రం.. కాస్త దూరంగా వెళ్లి ఓ కొబ్బరిచెట్టు నీడలో కూర్చున్నారు. ఆ పక్కనే దట్టంగా ఎదిగిన మల్లెపొదలు ఉన్నాయి. బాగా విచ్చుకున్న ఓ బొండు మల్లెను కాడతో సహా తుంచి, గౌరి ముక్కు దగ్గర ఆన్చి..
“ఈ మల్లెపూలు సూడు ఎంత వాసన గొడ్తున్నయో?” అన్నాడు రాముడు.
గౌరి ఆ మల్లెల వాసన పీల్చి..
“అవును.. చానా మంచిగ గొడ్తున్నయ్!” అన్నది.. ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ.
అప్పుడు గౌరినొకసారి ఎగాదిగా చూసి..
“లంగా వోణీల నువ్వెంత ముద్దుగున్నవో!” అన్నాడు రాముడు.
ఆ బొండు మల్లెకన్నా స్వచ్ఛమైన నవ్వొకటి గౌరి పెదవులపైన మెరిసింది.
“నాకాకలైతంది!” అన్నది గౌరి, పొట్టమీద చేతిని ఉంచుకొని.
సీతారాముడు భోజనం డబ్బాల్ని తెరవడానికి ఉపక్రమించాడు.
ఆ రాత్రి.. గౌరి చెవిలో ఏదో చెప్పాడు రాముడు.
“బాగా రాతిరైంది గదా?”.. భయంగా, సంశయంగా అన్నది గౌరి.
“తొమ్మిదైతంది గంతే! ఎన్నెల మస్తు గొడ్తంది. ఎండకాలం రాత్రిల్ల ఎన్నెల బాగనిపిస్తది”.. ప్రోత్సహిస్తున్నట్టు చెప్పాడు రాముడు.
ఇద్దరూ కలిసి వెన్నెల్లో నడుస్తూ వెళ్తున్నారు. వెన్నెల తళతళలు పడ్డ వరిచేలు.. పిల్లగాలికి ఊగుతున్నాయి వయ్యారంగా! ఒకచోట పంట బోదెపై ఉన్న సన్నటి వంతెన మీదుగా నడవడానికి గౌరి భయపడుతుంటే.. రాముడు చటుక్కున తన రెండు చేతులమీద ఎత్తుకొని కాలువ దాటించాడు. ప్రకృతి, పంటచేల మధ్య వెన్నెల్లో అలా విహరిస్తుంటే.. ఇద్దరి ఆత్మలూ ఏవో తెలియని ప్రశాంతతతో తేలిపోతున్నాయి.
గ్రామంలో ఓ రైతు కూతురి పెళ్లి ఆ రోజు. ఆ వేడుకను ఆసక్తిగా చూస్తున్నది గౌరి. గ్రామం మొత్తం తరలివచ్చేసింది పెళ్లికి. పెళ్లికూతురి ముఖం నిండా సంతోషం పొంగిపొర్లుతున్నది.
పెళ్లి కార్యక్రమం ముగిశాక, చివర్లో ఓ పాట స్పీకర్లోంచి గట్టిగా వినపడసాగింది.
‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా!’..
పాట మొదలవ్వగానే.. పట్టుచీర, పూలజడ, బంగారు ఆభరణాలతో ముస్తాబై ఉన్న ఆ పెళ్లికూతురు ఉద్వేగంతో దిగ్గున లేచి, నృత్యం చేయడం మొదలుపెట్టింది. పెళ్లికూతురు అలా నృత్యం చేయడం చూసి అబ్బురపడుతూ, గౌరి వైపు చూశాడు సీతారాముడు. గౌరి కూడా రాముణ్నే చూస్తున్నది. సరిగ్గా అప్పుడే.. అక్కడొక ఊహించని సంఘటన జరిగింది. ఆ పక్కనే ఉన్న ఒక దుకాణానికి వేలాడుతున్న ‘ఆంజనేయులు కిరాణం’ అన్న బోర్డు.. ఊడిపోయి, అక్కడే నిలబడి పెళ్లివేడుక చూస్తున్న ఓ పదేళ్ల కుర్రాడి మీద పడింది. ఆ దెబ్బకు ఆ అబ్బాయి..
“అమ్మా!” అని అరిచి కుప్పకూలి పోయాడు.
“అయ్యో.. నా బిడ్డ!” అని అరుస్తూ కొడుకు దగ్గరికి పరిగెత్తింది అతని తల్లి.
స్పీకర్లోంచి వస్తున్న పాట ఆగిపోయింది. అంతదాకా ఆనందాలతో వెల్లివిరిసిన ఆ వాతావరణం.. ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. అందరూ ఆ అబ్బాయి చుట్టూ గుమిగూడారు. నేల ఎర్రబారుతున్నది.. ఆ పిల్లాడి రక్తంతో!
“నూటెన్మిది పోను గలుపుండ్రి ఎవ్వలైనా!” అరిచారెవరో.
అక్కడున్న జనంలో ఒక డాక్టరు ఉన్నాడు. ఆయన ముందుకొచ్చి..
“నేను డాక్టర్ని.. శుభ్రమైన గుడ్డొకటుంటే ఇవ్వండి!” అంటూ, ఆ పిల్లవాడి దగ్గర కూర్చొని పరిశీలనగా చూశాడు. మెడ దగ్గర రక్తం ధారగా కారిపోతున్నది. ఎవరో తుండుగుడ్డ అందించారు డాక్టర్‌కు. దాన్ని ఆ పిల్లవాడి మెడమీది గాయంపైన వేసి, గట్టిగా అదిమి పట్టుకున్నాడు డాక్టర్.
సరిగ్గా అప్పుడే.. గౌరి ముందడుగు వేసింది.
“‘ఓసారూ! నువు గట్ల నొక్కినవంటే.. పిల్లగాడు సచ్చిపోతడు. రకతం ఆపనీకి గట్ల నొక్కద్దయ్యా! పోరనికి ఊపిరిగిట్ల ఆడనియ్యవా ఏం?” అన్నది కంగారు పడుతూ.
ఆ డాక్టర్.. ‘నువ్వేంటి నాకు చెప్పేది?’ అన్నట్లు ఈసడింపుగా ఓసారి ఆమెను చూశాడు.
“నేను డాక్టర్ని. ఎంబీబీఎస్ చదివాను. ‘జగులర్ వెయిన్’ తెగిపోయింది. బ్లీడింగ్ ఆపుతున్నాను” అన్నాడు.
“వయసోళ్లకైతే గట్ల సెయ్యచ్చు గానీ.. ఈడు సిన్న పిల్లగాడాయే! జరంత ‘పైన’ నొక్కుండ్రి” చెప్పింది గౌరి.
“నేను అనాటమీ చదివాను. నాకు తెలుసు ఎక్కడ నొక్కిపెట్టాలో..” అహం దెబ్బతిన్నట్లు అసహనంగా చెప్పాడు ఆ డాక్టర్.
“డాక్టర్! యూ అర్ కిల్లింగ్ దట్ బోయ్..”
గౌరి గొంతులోంచి ఆ మాట ఒక తూటాలా బయటికి వచ్చింది. అంతే! ఆ డాక్టర్‌దే కాదు.. అక్కడున్న అందరి ఊపిరీ ఒక్కసారి ఆగిపోయింది! అప్పుడు సీతారాముడు డాక్టర్‌కు దగ్గరగా వెళ్లి, మెల్లగా చెప్పాడు..
“డాక్టర్! మీరు ‘ట్రెకియా’ మీద ప్రెషర్ పెడుతున్నారు. అలా అయితే పిల్లాడి శ్వాస ఆగిపోతుంది”.
సీతారాముడు అలా అన్న మరుక్షణం.. నిజంగానే పిల్లాడి శ్వాస ఆగిపోయింది. అప్పుడు కనిపించింది డాక్టర్ కళ్లలో విభ్రాంతి. గౌరి చటుక్కున డాక్టర్ చేతిని గాయానికి కాస్త పైకి జరిపింది. ‘ట్రెకియా’ మీద ఒత్తిడి తొలగగానే, అబ్బాయిలో శ్వాస తిరిగి ప్రారంభమైంది. కళ్ల ముందు ఏదో అద్భుతం జరుగుతున్నట్లు అందరూ నిశ్చేష్టులయ్యారు.
“సమ్‌థింగ్ రాంగ్ విత్ ద లంగ్స్! హిజ్ ఛెస్ట్ ఈజ్ మూవింగ్ స్ట్రేంజ్లీ!”.. ఆ పిల్లవాడి పరిస్థితిని నిశితంగా గమనిస్తూ చెప్పింది గౌరి.. రాముడితో. రాముడు గబగబా పిల్లవాడి చొక్కా విప్పాడు. అప్పుడు కనిపించింది.. వాడి పొట్టలో గుచ్చుకుపోయిన ఒక ఇనుప రేకు.
“ఓ గాడ్!” అంటూనే..
“నైఫ్ కావాలి.. కాస్త పొడుగాటిది!” అని చెప్పాడు రాముడు.
ఎవరో కత్తి తెచ్చి ఇచ్చారు.
పట్టుచీర, పూలజడ, బంగారు ఆభరణాలతో ముస్తాబై ఉన్న ఆ పెళ్లికూతురు ఉద్వేగంతో దిగ్గున లేచి, నృత్యం చేయడం మొదలుపెట్టింది. పెళ్లికూతురు అలా నృత్యం చేయడం చూసి అబ్బురపడుతూ, గౌరి వైపు చూశాడు సీతారాముడు. గౌరి కూడా రాముణ్నే చూస్తున్నది. సరిగ్గా అప్పుడే.. అక్కడొక ఊహించని సంఘటన జరిగింది.
“రెండు రిబ్స్ కింది నుంచి ఇన్సిజన్ చెయ్యాలి గౌరీ!” చెప్పాడు రాముడు.
వెంటనే గౌరి ఆ కుర్రాడి పక్కటెముకల కిందినుంచి గాటుపెట్టి కోసింది. పది నిమిషాల్లోనే ఆ ‘మేక్ – షిఫ్ట్’ శస్త్రచికిత్స ముగిసింది. ఆ పిల్లవాడి ఊపిరితిత్తులు ఇప్పుడు తిరిగి సక్రమంగా పని చేస్తున్నాయి. మెల్లగా కళ్లు విప్పాడు. అది చూసి, వాడి తల్లి భావోద్వేగంతో కదిలిపోయింది. చటుక్కున గౌరి కాళ్లను చుట్టేసుకుంది. ఆనంద బాష్పాలతో గౌరి పాదాలను అభిషేకిస్తున్నది. అదంతా దగ్గరగా చూస్తున్న ఓ ఆడపిల్ల.. గౌరి వంక ఆశగా చూస్తున్నది. ముళ్ల కంచెలో చిక్కుకుపోయి శిథిలమైపోయిన తన జీవితమూ, కొత్తచిగురు వేస్తుందనే ఓ చిరు ఆశ.. ఆ ఆడపిల్ల కళ్లలో క్షణకాలం మెరిసింది. ముందురోజు గులాబీతోటలో, గౌరితో తన అసలు పేరు చెప్పకుండా ‘బేబి’ అని అబద్ధం చెప్పిన ఆ ఆడపిల్ల కంటి కొసల్లో చెమ్మ ఊరిపోతున్నది.
హైదరాబాద్.
గ్లోబ్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్. రెండు తెలుగు రాష్ర్టాల్లోనే అతిపెద్ద సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి. ముఖ్యంగా శస్త్రచికిత్సల్లో అత్యున్నత ప్రమాణాలు కలదిగా పేరుగాంచిన ప్రతిష్ఠాత్మకమైన ఆసుపత్రి. దాని చైర్మన్.. తన ఛాంబర్లో తనకు ఎదురుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను ఉద్దేశించి..
“సో! యూ ఆర్ రిపోర్టింగ్ బ్యాక్?” అని అడిగారు. ఎదురుగా ఉన్నవారు.. శస్త్రచికిత్స విభాగంలో అతిముఖ్యమైన సర్జన్లు. అపారమైన వైద్యశాస్త్ర పరిజ్ఞానం, అపురూపమైన మేధస్సూ, అనితరసాధ్యమైన శస్త్రచికిత్సా నైపుణ్యం వారి సొంతం.
వారిలో ఒకరు డాక్టర్ రామ్, మరొకరు డాక్టర్ ప్రియ! ఇద్దరూ కలిసి చదువుకున్నారు. కాలేజీలో చిగురించిన ప్రేమ, మూడేళ్ల క్రితమే పెళ్లిగా మారింది. పెళ్లి కోసం కూడా వాళ్లు నాలుగంటే నాలుగు రోజులే సెలవు తీసుకున్నారు. అవి తప్ప మళ్లీ ఎప్పుడూ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదా దంపతులు. డాక్టర్ (సీతా) రామ్, డాక్టర్ (గౌరీ) ప్రియ! వైద్యవృత్తి పట్లా, ప్రాణాల్ని కాపాడే పనిపట్లా ఆ దంపతులకున్న అంకితభావం అలాంటిది. చిరుప్రాయంలోనే అత్యంత ప్రతిభావంతులైన సర్జన్లుగా పేరుతెచ్చుకున్న ఆ ఇద్దరంటే.. చైర్మన్ గారికి ప్రత్యేక అభిమానం. నెలరోజుల క్రితం.. పాన్‌క్రియాస్ క్యాన్సర్‌కు సంబంధించిన ఒక అత్యంత అరుదైన, అత్యంత కఠినతరమైన శస్త్రచికిత్సను 23 గంటలపాటు నిర్విరామంగా నిర్వహించి విజయవంతం అయ్యారు డాక్టర్ రామ్, డాక్టర్ ప్రియ. దాంతో ఆ ఆసుపత్రి కీర్తి ప్రతిష్ఠలు పతాకస్థాయికి చేరిపోయాయి. అన్ని పత్రికల్లోనూ ఆ అరుదైన శస్త్రచికిత్స గురించి రాశారు. ఆ సందర్భంగా చైర్మన్ వాళ్లిద్దర్నీ పిలిచి..
“మీ పెళ్లయ్యాక హనీమూన్‌కి కూడా ఎక్కడికీ వెళ్లలేదని నాకు తెలుసు. యూ బోత్ నీడ్ ఎ బ్రేక్! అండ్ యూ డిజర్వ్ ఇట్. ఓ పది పదిహేను రోజులు సరదాగా ఎక్కడైనా తిరిగిరండి. ఎనీ ఎగ్జోటిక్ ప్లేస్ ఆఫ్ యువర్ చాయిస్.. ఇండియా అయినా, విదేశాల్లో అయినా మీ ఇష్టం! ఖర్చులన్నీ హాస్పిటల్ చూసుకుంటుంది. మీ చైర్మన్ నుంచి మీకు ఓ చిరుకానుక!” అని చెప్పారు.
వాళ్లు ఏ యూరప్‌కో, మాల్దీవులకో, స్విట్జర్లాండ్‌కో వెళ్లలేదు. రామ్ తండ్రిగారైన శ్రీనివాసరావు గారి గ్రామానికి.. సీతారాముడు, గౌరిగా వెళ్లారు. అక్కడి ఆ పల్లె వాతావరణంతో మమేకమయ్యారు. ఆ పచ్చటి పొలాల మధ్య స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, అక్కడి మట్టి పరిమళాన్ని తమ గుండెల నిండా నింపుకొన్నారు. పల్లెజనంతో కలగలసిపోయి వనాల్ని, వెన్నెల్ని.. ప్రకృతిలోని ప్రతి సౌందర్యాన్నీ అనుభూతి చెందారు. తమలో ఓ కొత్త ఉత్సాహాన్ని నింపుకొన్నారు.
హాస్పిటల్లో రిపోర్ట్ చేసి, చైర్మన్‌గారి గది నుంచి బయటికి రాగానే..
“రామ్.. నీతో ఓ కేస్ గురించి మాట్లాడాలి” అన్నది ప్రియ గంభీరంగా! ఇద్దరూ హాస్పిటల్లో తమ ఛాంబర్‌కు వెళ్లిపోయారు.
“మొన్న మనం గ్రామంలో ఆ పిల్లవాడి ప్రాణం కాపాడటం చూసి, ఓ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. ఆమె పేరు బేబీ! గులాబీ తోటలో పూలు తుంచే పనిక్కూడా వచ్చింది. ఆ పల్లెలో.. సంతోషంగా జీవిస్తున్నదని అనుకున్నాను. కానీ, ఆ అమ్మాయి వెనుక ఓ గతం ఉంది..”
“కేస్ గురించి మాట్లాడాలి అంటే.. ఏదైనా మెడికల్ ఇష్యూనేమో అనుకున్నా! గతం అంటున్నావ్ ఏం జరిగింది?” అడిగాడు రామ్.
“బేబీది ఆ ఊరు కాదు. కాస్త దూరంలోని మరో కుగ్రామం. అక్కడ కొన్ని సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు. ఆ కక్షలకు.. కులం ప్రధాన కారణమవడం బేబీ పాలిట శాపమయ్యింది. ఎనిమిదేళ్ల వయసులో ఒక రోజు బహిర్భూమికి వెళ్లి వస్తున్నప్పుడు.. ఇద్దరు యువకులు బేబీని అపహరించుకు పోయారు. నాలుగు గంటల పైశాచికానందం తర్వా త ఆ పిల్ల శరీరాన్ని రోడ్డుమీద పడేసి పోయారు. రక్తం మడుగులో నిశ్చలంగా పడి ఉన్న ఆ ఎనిమిదేళ్ల నగ్న శరీరాన్ని చూసి బతికి ఉండే అవకాశం ఏ మాత్రం లేదనే అనుకున్నారట. ఎలాగోలా ఆసుపత్రికి తీసుకువెళ్తే.. అక్కడ పాపను పరీక్షించిన వైద్యు డు ఒకలాంటి షాక్‌తో విచలితుడైపోయాడట. అది కేవలం అత్యాచారం కాదు. దారుణమైన హింస. క్రూరత్వం. పెద్దజాతి, చిన్నజాతిని అణచివేసే హేయమైన రాక్షసక్రీడ. షీ వజ్ బ్రూటలైజ్డ్.. బియాండ్ వర్డ్స్ రామ్!”.
ప్రియకు లోపలి నుంచి దుఃఖం పొంగుకు వస్తున్నది. ఆమె కంటి నుంచి ఆమెకు తెలియకుండానే అశ్రుకణాలు రాలిపడుతున్నాయి. ప్రియ తిరిగి మాట్లాడసాగింది..
“నిర్భయ, దిశలే కాదు.. ఇంకా ఎందరో ‘బేబీ’లు ఉన్నారు మన చుట్టూ. అంతకన్నా దారుణమైన హింసకు గురిచేశారు ఆ పసిదాన్ని. కాళ్ల మధ్య ధారాపాతంగా కారుతున్న రక్తం. లోపల గుచ్చుకు పోయిన పదునైన గాజుపెంకుల్ని తొలగించడానికే ఆ డాక్టర్‌కు చాలా సమయం పట్టిందట!”.
గగుర్పాటుతో వింటున్న రామ్లోనూ బాధ సుడులు తిరుగుతున్నది. ఇద్దరూ ఒకరి చేతిని ఒకరు గట్టిగా పట్టుకొని ఉన్నారు.
“రామ్! షీ నీడ్స్ ఎ రీకన్స్ట్రక్షన్ సర్జరీ! ఆనాటి రాక్షసోన్మాదం ఆమె శరీరభాగాన్ని ఛిద్రం చేసింది. కంప్లీట్ జెనిటల్ మ్యుటిలేషన్! బేబీని తిరిగి మా మూలు ‘ఆడపిల్ల’గా మార్చాలి. ఆ గ్రామంలోని దివాకరం అనే అబ్బాయి తనను ప్రేమిస్తున్నాడట. పెళ్లి చేసుకోమని ప్రాధేయ పడుతున్నాడట. దాం పత్య జీవితంలోని మాధుర్యాన్ని కూడా ఆమె శరీరం గ్రహించలేనంతగా ఛిద్రమైన తను.. తనను తాను అతనికెలా అర్పించుకోగలదు?”.
రామ్‌కి అర్థమయింది. ‘అనుభూతి’కి కేంద్రబిందువైన ‘అతి సున్నితమైన ఒక భాగం’ కూడా గాజుపెంకులకు బలైపోయిందనీ! ఆమెకు ఎలాంటి స్పం దనలూ, భావాలూ ఉండవు. ప్రేమ అనే అనుభూ తీ తెలియదు. కానీ, ఆనందంగా ఉండటం, ఆనం దం కోసం ప్రయత్నించడం మనిషికున్న విశ్వజనీనమైన హక్కు. ఆ హక్కును ఆమెకు ప్రసాదించాలి.
“బేబీని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్న అబ్బాయికి జరిగిందంతా తెలుసా?” అడిగాడు రామ్.
“తెలీదు. తను చెప్పలేదట”.
“సర్జరీకి ఆమె తల్లిదండ్రుల సమ్మతి అవసరం అవుతుంది కదా?”.
“తను అనాథ రామ్! ఆ అత్యాచారం విషయం బయటికి పొక్కగానే.. తల్లిదండ్రులిద్దరూ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారట. ఎవరో దూరపు బంధువు ఒకరి దగ్గర కొన్నాళ్లు పెరిగిందట. ఆ తర్వాత ఆ ఊరు వదిలేసి వచ్చేసిందట!”.
“ఎప్పుడు ప్లాన్ చేద్దాం.. ఆపరేషన్?”.
“రేపే!” చెప్పింది డాక్టర్ ప్రియ
మర్నాడు ఉదయం ఏడు గంటలకే బేబిని సర్జరీకి సిద్ధం చేశారు. ప్రియ అంతకు ముందెన్నడూ ఇలాంటి శస్త్రచికిత్స చేయలేదు. ఇది శరీరాన్ని కోసి, కుట్లు వేసేయడం లాంటిది కాదు. ఒక మోడును ‘చిగురింప’ చేసే ప్రయత్నమది. మూగబోయిన వీణకు ఊపిరులూదే ప్రక్రియ. నిస్తేజమైపోయిన పుడమి తల్లికి పులకింతలు రేపే యజ్ఞమది.. జననేంద్రియ పునర్నిర్మాణపు శస్త్రచికిత్స.
అత్యంత ఏకాగ్రతతో ప్రియ ఆ సర్జరీని నిర్వహిస్తున్నది. రామ్.. భార్య పక్కనే ఉండి తన సహకారాన్ని అందిస్తున్నాడు. నాలుగు గంటల ఇరవై నిమిషాల తర్వాత సర్జరీ ముగిసింది. బేబిని ప్రత్యేక గదికి తరలించారు. కొద్దిసేపటికి ఆమెకు స్పృహ వచ్చింది. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా..
‘గౌరమ్మా, సీతారాముడు’ కనిపించారు.
“హాయ్ బేబీ!” గౌరీప్రియ పలకరించింది.
“కంగ్రాచ్యులేషన్స్! సర్జరీ చాలా చక్కగా జరిగిందమ్మా! నువ్విప్పుడు అందరు ఆడపిల్లల్లా మాములుగా అయిపోయావ్. నువ్వు ఆనందంగా జీవితాన్ని గడపగలవు. నిన్ను ఇష్టపడుతున్న ఆ అబ్బాయిని ఏ సంకోచమూ లేకుండా వివాహం చేసుకోవచ్చు”.. గౌరి మాటలు వింటుంటే, ఆ అమ్మాయి కళ్లలోంచి జలజలా కన్నీళ్లు రాలిపోతున్నాయెందుకో! పొంగిపోతున్న కృతజ్ఞతాభావంతో ఆమె గుండె నిండిపోతున్నది. మాటకూడా రానంత సంతోషపు ఉక్కిరి బిక్కిరి. ఇన్నాళ్లుగా గుండెలో పేరుకుపోయిన మంచుగడ్డ ఒకటి కరిగిపోయి, శరీరమంతా గాల్లో తేలిపోతున్న భావన.
ఇద్దరూ కలిసి చదువుకున్నారు. కాలేజీలో చిగురించిన ప్రేమ, మూడేళ్ల క్రితమే పెళ్లిగా మారింది. పెళ్లి కోసం కూడా వాళ్లు నాలుగంటే నాలుగు రోజులే సెలవు తీసుకున్నారు. అవి తప్ప మళ్లీ ఎప్పుడూ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదా దంపతులు. డాక్టర్ (సీతా) రామ్, డాక్టర్ (గౌరీ) ప్రియ! వైద్యవృత్తి పట్లా, ప్రాణాల్ని కాపాడే పనిపట్లా ఆ దంపతులకున్న అంకితభావం అలాంటిది. చిరుప్రాయంలోనే అత్యంత
ప్రతిభావంతులైన సర్జన్లుగా పేరుతెచ్చుకున్న ఆ ఇద్దరంటే.. చైర్మన్ గారికి ప్రత్యేక అభిమానం.
శస్త్ర చికిత్స జరిగిన నెల రోజులకే పెళ్లి కూతురు అయిపోయింది బేబి. ఏర్పాట్లన్నీ శ్రీనివాసరావు గారు చూసుకున్నారు. పచ్చటి పందిట్లో పీటలమీద బేబి పక్కన కూర్చున్నాడు దివాకరం. పంతులు గారు వేదమంత్రాలు చదువుతున్నారు. మోగుతున్న సన్నాయి నేరుగా బేబి గుండెల్లోకి పాకుతున్నది తీయగా.. అయితే, ఆమె మనసంతా డాక్టర్ గారి మీదే ఉంది! సరిగ్గా అప్పుడే కాస్త దూరంలో కారు ఆగిన చప్పుడైంది. మరునిమిషం బేబి కళ్లెదురుగా గౌరీ, సీతారాముడు ప్రత్యక్షమయ్యారు. ఆ దంపతుల్ని చూడటంతోనే బేబీ హృదయం ఆనందంతో ఎగిసిపడింది. దగ్గరగా రమ్మన్నట్టు చేతితో సంజ్ఞ చేసింది. ప్రియ తన దగ్గరికి రాగానే.. ఆమె పాదాల్ని పట్టుకొని కళ్లకు అద్దుకుంది.
వేదమంత్రాల సాక్షిగా దివాకరం.. బేబి మెడలో తాళిబొట్టు కట్టాడు. మైకులోంచి అప్పుడొక పాట ప్రారంభమైంది.
‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా..’ అంటూ
“లే! డాన్స్ చెయ్..” చెప్పింది గౌరి.
సిగ్గుపడుతూనే లేచి నృత్యం చేయడం ప్రారంభించింది బేబి. పాట పూర్తవగానే దివాకరం గబగబా ప్రియ, రామ్ దగ్గరగా వచ్చి.. చటుక్కున వారి పాదాలమీద వాలిపోయాడు.
“నో ప్లీజ్! లే దివాకరం..” అంటూ, పైకి లేవమన్నట్టు అతని భుజాల్ని పట్టుకుంది గౌరి.
అతని కళ్లలో అవ్యక్తమైన భావోద్వేగం. సన్నటి నీటి చెమ్మ. రెండు చేతులూ జోడించి హృదయపూర్వకంగా నమస్కరించాడు. అప్పుడు వచ్చింది ప్రి యకు ఆ సందేహం. ఆమె కళ్లు బేబీవైపు చూశా యి.. ‘చెప్పేశావా?’ అన్నట్టు.
‘అవ్.. ఏం దాపెట్లా! అంతా సెప్పేసినా’ అన్నభావాన్ని కళ్లతోనే వ్యక్తం చేసింది బేబి.
అప్పుడు బేబి.. “గౌరమ్మా! నీకాడ నేనొకటి దాపెట్నా! నాపేరు బేబి కాదు..” అన్నది.
“మరి?”.
“లచ్మి.. భూలచ్మి!”.
“భూలక్ష్మి?”.
‘అవును’ అన్నట్టు తలూపింది భూలక్ష్మి.
అప్పుడు గౌరి ఏదో స్ఫురించినట్టు.. వెనక్కి తిరిగి తమ కారు ఆపి ఉంచిన చోటుకేసి చూసి..
“భూమీ! కమాన్!” అన్నది గట్టిగా. గౌరి గొంతు వినగానే చెంగు చెంగున దూకుతూ.. వేగంగా, ఉత్సాహంగా ఆమె దగ్గరికి రివ్వున దూసుకొచ్చింది భూమి. ఆనాటి నిర్లిప్తత, నిస్తేజం మచ్చుకైనా లేవిప్పుడు భూమిలో! మందులతో మానని మానసిక గాయం.. సంగీత చికిత్సకు లొంగింది!
“ఇది మా భూమి!” చెప్పింది గౌరి.
ఉపసంహారం
“ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రియా!”.. అన్నాడు రామ్.. భార్యతో!
“దేనికి?”.
“భూలక్ష్మికి నిజంగా కొత్త జీవితాన్ని ఇచ్చావ్”.
“నేను కేవలం మెడికల్‌గా ఓ చికిత్స చేశానంతే! కానీ, గతం తెలిసి కూడా ఆమెను భార్యగా ఇంటికి తెచ్చుకున్న దివాకరమే.. నా దృష్టిలో ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చినట్టు!”.
రెండుక్షణాలు అగి..
“కానీ రామ్! మనకు తెలియకుండా ఇంకెందరో ఆడపిల్లలు అలాంటి అకృత్యాల బారిన పడుతూనే ఉంటారు కదా! ఆఖరికి నోరులేని జీవాల్నీ విడిచిపెట్టడం లేదీ కీచకమూకలు. ఈ దురాగతాల్ని మనం ఆపలేక పోవచ్చు. కానీ, ఈ ‘భూమి’ల కోసం.. ఈ ‘భూలక్ష్మి’ల కోసం ఏదైనా చేయాలని అనిపిస్తున్నది”.
భార్య ఆవేదన అతనికి తెలుస్తున్నది.
“ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేద్దాం! అకృత్యాల బారినపడి, హింసకు గురైన బాధితులకు మనవల్ల చేతనైన సాయం చేద్దాం! సాంత్వన ఇద్దాం.. రామ్!” ఆమె ఉద్వేగపూరితంగా చెప్పింది.
క్షణంసేపు కూడా ఆలోచించలేదు అతను. బొటనవేలు చూపిస్తూ..
“ఐ సెడ్.. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ! ఆశ్రమానికి ఏపేరు పెడదాం?” అడిగాడు.
“ఆకాశ్ అని పెడదాం. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు పడినా, హేయమైన అఘాయిత్యాలు జరిగిపోతూనే ఉంటాయి. వాటికి ‘భూ(లచ్చి)మి’లు బలి అవుతూనే ఉంటారు. అందుకే, ‘భూమి’ చుట్టూ ఉండే ‘ఆకాశం’లా మన ఆశ్రమం వారికి నీడనిస్తుంది”.
ఆ వివరణ అతనికి ఎంతగా నచ్చిందంటే.. చప్పున దగ్గరికి వెళ్లి భార్య నుదుటన ముద్దు పెట్టుకున్నాడు ఆర్ద్రంగా! అప్పుడామె భర్త చేతిని గట్టిగా పట్టుకుంది. కళ్లలోకి చూస్తూ.. అదోలా అందంగా నవ్వింది. ఆమె చూపులో సిగ్గు కూడా తొంగి చూస్తుంటే.. “ఏంటి?” అన్నాడు రామ్ అర్థంకాక.
“.. అంతేకాదు! త్వరలోనే మిమ్మల్ని తండ్రిని చేసే మన బాబుకు పెట్టబోయే పేరు కూడా అదే.. ఆకాశ్!” అన్నది ప్రియ. మామూలు ఆడపిల్లలా సిగ్గుపడిపోతూ.. అతని గుండెల్లో దాచేసుకుని!
ఆ క్షణం.. గౌరి, సీతారాముడి హృదయాలలోని ఆనందం కూడా ఆకాశమే అయ్యింది. వారి ఆశయంలా!
గుమ్మడి రవీంద్రనాథ్
గుమ్మడి రవీంద్రనాథ్ స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ. ఎమ్మెస్సీ చదివారు. ప్రభుత్వ బీమా రంగ సంస్థ.. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా, హైదరాబాద్ రీజినల్ చీఫ్‌గా పనిచేశారు. ఇటీవలే విరమణ పొందారు. ఈయన రాసిన తొలి కథ ‘కొస విరుపు’, తొలి నవల ‘గన్‌మేన్’. ఇప్పటివరకూ 160 కిపైగా కథలు, 9 నవలలు (ధారావాహికలుగా) వివిధ వార, మాస, దిన పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఐదు నవలలను వెలువరించారు. గన్‌మేన్, నా నువ్వు – నీ నేను, హైటెక్ ప్రియుడు, మ్యూజిక్ (ఆఫ్ లవ్), సుమధురం నవలలను పుస్తకాలుగా తీసుకొచ్చారు. వివిధ కథల పోటీల్లో బహుమతులు అందుకొన్నారు. హింసాత్మక అత్యాచారంలో ఛిద్రమైన ఒక జీవితానికి ‘కొత్త చిగురు’ అద్దిన అసామాన్యమైన కథ.. ‘ఆకాశం’ అని చెబుతున్నారు రవీంద్రనాథ్.
-గుమ్మడి రవీంద్రనాథ్ , 82973 56766