కట్రాళ్లు – కథ
గంపకింది కోడిపుంజు కూత.. షేక్ ఖాశీం శెవుల దూరింది. నిద్ర లేశిండు. అరశేతులు రాసుకొని కండ్లారా జూసి.. ముఖం దుడుసుకుంట నేలమ్మకు సలాం జేసిండు. మోత్కాకు సుట్ట జుట్టిండు. దాంట్లో పొగాకు నింపి నోట్లో పెట్టి జకమొక కొట్టిండు. సుట్ట ముట్టించిండు. రొండు - మూడు దమ్ములు ఘాటుగ బీల్సిండు
గంపకింది కోడిపుంజు కూత.. షేక్ ఖాశీం శెవుల దూరింది. నిద్ర లేశిండు. అరశేతులు రాసుకొని కండ్లారా జూసి.. ముఖం దుడుసుకుంట నేలమ్మకు సలాం జేసిండు. మోత్కాకు సుట్ట జుట్టిండు. దాంట్లో పొగాకు నింపి నోట్లో పెట్టి జకమొక కొట్టిండు. సుట్ట ముట్టించిండు. రొండు – మూడు దమ్ములు ఘాటుగ బీల్సిండు. దిమాక్ తేజ్ అయింది. తెల్లారె సుక్క వొడిసింది. పరుపు బండెక్కి తువ్వాల వరిసిండు. మోకాళ్లపై కూకుండి.. ‘అల్లాహ్ అక్బర్’.. అని నమాజు సదివిండు. ఆ సప్పుడే.. ఊరోళ్లకు తెల్లారిందని బండ గుర్తయ్యింది.
రొండు దిక్కుల గుట్టలు, ఓ దిక్కు గంగాళమోలె శెరువు. గుట్టల పొంట మాడితోటలు, వరిశేన్లు! దసరా, పీర్ల పండుగ.. ఏ పండుగైనా కలిసిమెలిసి, ఆపద సంపదలకు కలగూర గంపోలే ఆత్మీయతను పొదుగుకున్న పచ్చని పల్లెటూరు ఓబులాపూర్.
నలభై ఏండ్ల కింద బతుకుదెరువు కోసరం షేక్ ఖాశీం, నసీం తురక కాశి జంట గీ ఊర్లో అడుగు పెట్టిండ్రు. కాశవోశి మోకాళ్ల దాక దోతి గట్టి, నెత్తికి ఎర్ర గీతల రుమాలు, నడుముకు తువ్వాల గుంజి కడుతడు ఖాశీం. పిల్లిగడ్డం, సన్నని మీసాలు, భుజం మీద పెద్ద సుత్తెతోని.. యుద్ధానికి పొయ్యే వీరునోలె కనిపిస్తడు.
నమాజు సప్పుడుతోని నిద్రలేసి, పాసి పనులు, వంట జేసుకుని, నిలువు గోసిపెట్టి నడుంగట్టి.. ఖాశీంకు ఆసరాగా కంకర్రాళ్లు, కట్రాళ్లు ఊడేస్తుంటది నసీంబీ. గుట్ట కింది గుడిసెల.. పిట్టలోలె గూడి ఉంటరు. ఈళ్లకు ముగ్గురు మొగోళ్లు, ఇద్దరు ఆడోళ్లు సంతానం. కర్మ గాలి గోరి ఒక్కడే మంచిగున్నడు. గోర్బీ, మదర్‌బీ, కలీం, సలీం.. ఈ నల్గురు పుట్టుకతోనే గుడ్డోళ్లు! ఏ జన్మల పాపమో!
‘నోరోటి అంటే.. నొసలోటి తలుస్తది’.. ఊరిబడి శ్రీవాణి పంతులమ్మ, మల్లారెడ్డి పంతులయ్య, సిరిసిల్ల శంకరం పంతులయ్య.. ఖాసీం కొడుకులు కలీం, సలీంను కరీంనగర్ దోల్కవొయ్యి, అక్కడి గుడ్డోళ్ల బళ్లె జాయిన్ చేసిండ్రు. ఆడ సదువు, కూడు, గుడ్డ సర్కారుదే. ఆళ్ల మంచి శెడ్డలన్నీ దేవుళ్లోలె ఆళ్లే అరుసుకుంటుండ్రు. ఆళ్లకు అల్లా తోడుండాడు. ఇంగ ఆడి పొల్లగాల్ల బతుకు అన్యాయమైందని బాధవడు తుంటడు ఖాసీం.
* * *
“నసీం బీ! దేర్ హోగయా.. జల్దీ ఖానా దేవోజీ!” అని నెమ్మదిగ అడిగిండు ఖాశీం.
కంచు గిన్నెల సల్ల గట్టుక కలిపి ఇస్తూ..
“లేవోజీ!” అని పానంగ ఇచ్చింది నసీంబీ.
గుట్ట గుట్ట రొండు ముద్దలు మింగి.. సుత్తె సామాను సదురుకుండు ఖాశీం.
గుట్ట దిక్కు నడుసుకుంట వోయిండు.
‘పరుపు బండమీద శింతమొద్దుకు అగ్గితో కాలువు. వేడికి బండ పగిలి సల్పలు కంకర వస్తది‘ అంటూ గుట్ట ఎక్కిండు.
పెద్ద గుండ్లకు తొళ్లు గొట్టుకుంట శీల వెట్టి గొట్టంగ దోస కాయలోలె పగులుతుంటే.. యుద్ధంల గెలిచినంత సంబురంతో మొఖం మీద చిరునవ్వు.
పెద్ద సుత్తెతో తొలిలో శీల బెట్టి గట్టిగా బాదిండు. గురి తప్పింది చెంగన ఎగిరి.. శీల మొల బువ్వకాలు పిక్కకు గుచ్చింది.
“యా అల్లాహ్!” అంటూ మొదలు నరికిన శెట్టులెక్క నేల గూలిండు ఖాశీం.
“నసీంబీ! నసీంబీ!” అంటూ గట్టిగ కీకేసిండు.
సల్లగటుక తాగుతున్న నసీంబీకి ఖాశీం పిలుపు శెవుల వడ్డది.
గంతే! దిగ్గున లేశింది. ఉరుక్కుంట గుట్ట ఎక్కుతుంటే.. కాలుజారి బోర్లబొక్కల వడ్డది. మోకాళ్లు కొట్టుకుపోయినా.. మల్ల లేసి ఎగపోసుకుంట ఖాశీం దగ్గరికి చేరింది. సాపోలె కొట్టుకుంటున్న ఖాశీంను జూసి నిలువెల్లా చెమటలు కుమ్మరించినయి నసీంబీకి. మనసుల ఉప్పెనోలె దన్నుకొస్తున్న ఏడుపును ఉగ్గ పట్టుకొని ఇమ్మత్ తెచ్చుకుంది. మొలను ఊడవీకింది. బొయ్య బొయ్య నెత్తురు సిమ్మింది. నడుంకున్న తువ్వాల గట్టిగ గుంజి కట్టింది. నల్లాలం ఆకు దూసుకొచ్చి దెబ్బ మీద పసరు పిండింది. ఇమ్మతి తెచ్చుకోమని భుజం మీద శెయ్యి వేయించుకొని.. మెల్లగ గుట్ట కిందికి దింపింది. గుడిసెల నులక మంచం మీద పడుకోబెట్టింది. చెంబెడు నీళ్లు దాగించింది.
“బాబా! బాబా! బహుత్ మార్ లగా క్యా? దరత్ దేరా బాబా! హంకో నైయి దిక్తానా!” అంటూ చంటి పిల్లలోలే విలపించిండ్రు బిడ్డలు గోర్బీ, మదర్‌బీ.
ఆళ్ల గుండె చెరువైంది.
“డాక్టర్కో బులాకే లావుంగా!” అంటూ జెల్ది జెల్ది ఊరుదారి వట్టింది నసీంబీ.
“నకోజీ! ఇద్రావ్!” అంటూ పండుకొనే పిలిశిండు ఖాశీం.
మాట వినకుండా వెళ్లింది ససీంబీ. డాక్టర్ రాజేశం ఊరికెళ్లిండని వాడకట్టోళ్లు చెప్పిండ్రు.
“గాచారం పాడుగాను! శనేషుడు మా ఎంబడి వడ్డడు” అని నెత్తికొట్టుకొని అదే అరుగుపైన బీరిపోయి కూకుంది. కండల్ల నీళ్లు నిండి ఒక్కొక్క చుక్క మెరుస్తూ మత్తడి దుంకుతున్నయి. ఈ సంగతి తెలిసిన ఆ వాడోళ్లు..
“అయ్యో! అందరి నోట్లో పండసొంటోడు ఖాశీం. పీర్ల పండుగప్పుడు అల్వా సుట్టు ఆసోయ్ దూల, ఆటపాట గమ్మతిగ పాడుకుంట దుంకుతంటే దుమ్మురేగేది!” అన్నది పటేల్ బాలవ్వ.
“పాపం దాన గుణం ఉన్న దండి మనిషి! అనుమాండ్ల గుడికి కట్రాళ్లు ఇచ్చిండు. పైసలు తీసుకొమ్మని పూజారి అంటే.. ‘అయ్యా! నాది ఉడత భక్త్తి అనుకోండ్రి!’ అన్నడు”.. కంటతడి పెట్టుకుంట చెప్పింది అయ్యవార్ల అనంతమ్మ.
“రంజాన్ పండుక్కు కుండెడంత ‘కీర్’ అండుకచ్చి.. మసీద్ కాడ మోత్కాకు దొప్పల్ల బోసుకుంట పొల్లగాండ్లకు ఇస్తుంటే.. ‘కీర్ వోత్తుండు కీర్ తాత!’ అనుకుంట సుట్టూ ఈగలోలె ముసురు కొందురు. తురక కాశి తాత!.. ఎట్ల పిలిశినా ముసి ముసి నవ్వుతుండె!” అన్నది కమ్మరి ఈరవ్వ.
మగని మంచితనం అందరి నోళ్లల్లో నానుతుంటే.. ఆపుకొన్న దుఃఖం కట్టలు దెంచుకున్నది నసీంబీకి. బోరున ఏడ్చింది.
అమ్మలక్కలందరూ ఓదార్చిండ్రు.
“ఇల్లంతకుంట, సిరిసిల్ల దవాఖాన్ల కన్నా దోలుకపోతే జెల్ది మగ్గుతది” అని సలహా ఇచ్చిండ్రు.
గుండె చెరువు గాంగ కండ్లు తుడుసుకుంట ఇంటికి చేరింది.
“క్యాజీ! ఊళ్లె డాక్టర్ లేడు. ఇల్లంతకుంటనన్న సిరిసిల్లనన్న పోదాం పా!” అన్నది దిక్కు తోచక నసీంబీ.
“గిసొంటి ఎన్నో దెబ్బలు పసరుతోనే తగ్గినై! ఫికర్ మత్‌కరో!” అంటూ ధైర్యం చెప్పిండు ఖాశీం.
* * *
ఓ వారం గడిచింది.
ఇంట్లో సామాన్లు నిండుకున్నయ్.
‘రెక్కాడనిదే డొక్కనిండది!’ అనుకొని దెబ్బమీద పాతబట్ట ఏశి, గట్టిగ గుంజి కట్టిండు ఖాశీం.
పెళ్లాం సాయంతోటి గుట్టెక్కి పనిలో నిమగ్నమైండు. కానీ, జల్దినే అల్శిపోయిండు. రాత్రంత నిద్ర కరువైంది.
వాపు, నొప్పి పెరిగింది. ధైర్యం శెడ్డది. తల్లడిస్తుండు. ఇంగ ఇంటికాడ మగ్గదని సైకిల్ మీద ఖాశీంను కూకుండ వెట్టి.. నెట్టుకుంటనే బాటెంబడి వడ్డది నసీంబీ.
ఆళ్లను సూశిన బ్రాహ్మణ అనసూయమ్మ.. “చూసిండ్రానుల్లా! పెనిమిటి పెళ్లామంటె.. అగో గట్ల ఉండాలె. అర్దనారీశ్వరోలె గంపెడంత ప్రేమ ఉండాలె. నిండ నూరేళ్లు బతకాలె ఈళ్లు!”.. అని దీవించింది.
పక్కనే ఉన్న పటేల్ పార్వతమ్మ.. “మన ఊళ్లె ఇంత మంచి జంట కనిపించది. ఈళ్లు సల్లగుండాలె!” అన్నది.
తొవ్వొంటి ఆళ్ల ముచ్చట్లు ఇనుకుంటనే.. పెయ్యంత సల్ల శెముటలు గారంగ, అతికట్టం మీద ఇల్లంతకుంట సర్కారు దవాకాండ్లకు చేరుకుండ్రు.“అయ్యా! మీకు హజారు సలాంలు!” అని డాక్టర్‌తో మొరపెట్టుకుంది నసీంబీ.
“దెబ్బ తాకిన్నాడే ఎందుకు రాలేదు? ఇంత వాపు వచ్చింది. బాగా సెప్టిక్ అయ్యింది. ఈడ కాదు.. సిరిసిల్ల దావకాండ్లకు పోండ్రి” అన్నడు డాక్టర్ ఆవేశంగా.
“అయ్యా! సిరిసిల్లకు పోవాల్నంటే మాతాన పైసలు లేవు. నీ కాళ్లు మొక్కుత! ఈడనే నయం చేయుండ్రి”.. అని గొడగొడ ఏడ్సుకుంట బతిమ్లాడింది నసీంబీ.
“సూడమ్మా! ఇప్పటికే పాణాల మీదికి తెచ్చిండ్రు. జరగరానిది జరిగితే నామీద దుమ్మంటరు.. మన్నంటరు! ఆయినె బతకాల్నంటే సిరిసిల్లకు పోండ్రి!”.. డాక్టరు గద్దరించి పెట్టిండు. చేతుల సిల్లిగవ్వ లేదు. తొవ్వల అటుఇటు దిక్కులు చూసింది. సర్పంచ్ కొడుకు దయాకర్ రావు.. బైక్‌పైన దేవునోలె కనిపించిండు.
“అయ్యా! శిన్నదొర!” అని గట్టిగా పిలిశింది నసీంబీ.
ఎన్కకు తిరిగి చూసి.. మనోళ్లే అనుకొని దగ్గరికి అచ్చిండు దయాకర్ రావు. సంగతి తెలుసుకొని డాక్టర్‌తో మాట్లాడిండు. తనకు ఖాశీం జేసిన మేలు యాదికి వచ్చింది. రుణం దీర్చుకోవాలనుకుండు. ఆటోల కోసం బస్టాండ్‌కు, అడ్డాల మీద చూసిండు. ఒక్క ఆటోగుడ లేదు.
“నువ్వు ఏడ్వకు. నడుమల ఖాశీంను కూకోవెట్టు. నువ్వు ఎన్క కూసొని గట్టిగ వట్టుకో!” అని నసీంబీకి శెప్పి.. బైక్ స్టార్ట్ చేసిండు.
బైక్‌ను పైలంగ నడుపుకొంట.. సిరిసిల్ల తొవ్వ వట్టిండు దయాకర్ రావు. పొక్కలున్న కాడ, రాళ్లు రప్పలున్న కాడ బండి ఎత్తేత్తుంటే.. ఖాశీం మూలుగుతూ అవస్థ పడుతుంటే.. దయాకర్ రావు మనసుల తుపాను చెలరేగింది.
‘పుటుక్కున పానం పోతే బద్నాం అయితనేమో! అయ్యో! అంజన్న దేవుడా! దవాకాండ్లకు పోయేదాకా ఏం గానీయకు!’ అని మనసుల్నే మొక్కుకుంట.. బుగులు బుగులుగనే సిరిసిల్ల చేరుకున్నడు. గప్పుడు జర ఊపిరి పీల్చుకుండు దయాకర్ రావు.
తొవ్వల్నే ఉన్న ఓ ప్రైవేటు దవఖానకు దీసుక పోయిండ్రు. అక్కడ పదివేలు అడ్వాన్స్ కట్టమన్నరు.
అక్కడ పనిజేసే డాక్టర్ ఆళ్లూరి పట్వారి కొడుకు కనుకారావు. దయాకర్ దోస్తే! ఆయినె రూములకు వోయి.. “నమస్తే డాక్టర్ సాబ్!” అన్నడు చిరునవ్వు చిందిస్తూ.. “అరే దయాకర్ రావు బాగున్నావురా! ఏంది గిట్లచ్చినవ్!?” అడిగిండు కనుకారావు.
“అరే కనుకం! మనూరి తురక కాశితాత! గదే కీర్ తాత! యాదికున్నడారా!”.. “అవున్రా! మనూళ్లే ‘కీర్ తాత’ అంటే తెల్వనోడు ఎవలురా!” అన్నడు కనుకారావు.
“ఆయినె కాలుకు శీలమొల దిగి సెప్టిక్ అయ్యింది. దవాఖాన్ల శెరిక్ జేద్దామంటే అడ్వాన్స్ అంటున్నరు. గిప్పుడు ఆళ్లకాడ పైసలు లెవ్వు. నువ్వు చెప్పురా కనుకం!” నెమ్మదిగా చెప్పిండు దయాకర్ రావు.
“అది గంతేరా! ఎవరికైనా రూలే. అడ్వాన్స్ కట్టి శెరిక్ కావాల్సిందే!”.. కనికరం లేకుండా, నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పిండు.. కనుకారావు.
గుండెల్లో కలుక్కుమన్నది దయాకర్ రావుకు.
“అరే కనుకం! శిన్నప్పుడు బతుకమ్మ పండుక్కు తంగెడు పువ్వు కోసం పోతే.. నిన్ను పెద్ద నాగుపాము కర్సింది. గది జూశిన ఖాశీం తాత నిన్ను భుజం మీద ఏసుకొని.. శెముటలు కక్కుకుంట మీ ఇంటి దాకా ఎత్తుకొచ్చిండు. మీ నాయన ఇంటికాడ లేకుంటె.. సవారి కచ్చురం గట్టి మీ అమ్మను, నిన్ను సిరిసిల్ల సర్కారు దావఖాండ్లకు తీసుకొచ్చిండు. నీకు పాముసూది ఇప్పించినంకనే నిమ్మలమైండు ఖాశీం తాత! నీకు ప్రాణదాత కదరా! గిట్లనే ఊళ్లె ఎందరినో ఆదుకున్నడు. ఆయనె రుణం తీర్చుకోవడం.. మన ధర్మం కదరా!”.. అంటూ బుద్ధిమాట చెప్పిండు దయాకర్‌రావు.
“చూడురా! నువ్వేంది నాకో చెవ్వు పోటైనవు. లక్షల పెట్టుబడితో ఈ దావఖాన పెట్టినం. పుక్యానికే వైద్యం చేస్తే.. మేము నెత్తికి బురద పూసుకునుడే. ఇంగ నీ నీతులు కట్టిపెట్టి ఇసొంటి కేసులు తీసుకురాకు. నా ఇజ్జత్ తీయకు. నా టైం వేస్ట్ చేయకు. సర్కారు దావఖాన్లకు పో! ఇంగ పోరా!” అంటూ రుసరుస వార్డులోకి వెళ్లిండు కనుకరావు.
తలవంచుకొని ఖాశీంను సర్కారు దావఖానలో జాయిన్ చేసిండు. కనకారావు అన్న మాటలు మెదడును తొలిచినయి .
“ఏమయ్యా! దొంగలు వడ్డంక ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు.. గిప్పుడు వస్తే ఏం చేసేది. కాలంతా సెప్టిక్ అయ్యింది. నేను రాసిన పరీక్షలు చేయించుకోండి. రిపోర్టు వచ్చినంక చెప్పుతా కాలు తీసేసుడా! ఉంచుడా?” అన్నడు కాశిరెడ్డి డాక్టర్.
ఒక్కసారి గుండెలో పిడుగు వడ్డట్లైంది ఖాశీంకు.
“ఒరేయ్ ఖాశీంగా! ఛీ..ఛీ! నీ జిందగీ పూర కిరికిరి రా! ఎదురైనోళ్లకు పుణ్యం చేస్తే, నీకు పాపం చుట్టుకుందిరా!” అంటూ తనకు తానే గట్టిగ తిట్టుకుండు.
“ఓయ్! ఎవలను తిడుతున్నవ్? పురుగు మెసులుతుందా!” అన్నడు డాక్టర్.
“అరే అల్లా! నిన్నెందుకు తిడుత బాంచన్! నన్ను నేను తిట్టుకుంటున్న”.. బతిమాలుతూ అన్నడు ఖాశీం.
“నీ పేరేంది?” అడిగిండు డాక్టర్.
“అయ్యా! ఖాశీం!” అన్నడు.
‘ఓహో! పేరు పోలికా?!’ అనుకుండు మనసుల డాక్టర్.
కాసేపైనంక.. “అయ్యా! మనం మంచిచేస్తే.. మనకుబీ మంచే జరుగుతదట నిజమేనా అయ్యా?!”.. డాక్టర్‌తో ముచ్చట మొదలువెట్టిండు ఖాశీం.
“అక్షరాలా జరుగుతుంది. ఇంతకు నువ్వేం చేసినవయ్యా?” అడిగిండు డాక్టర్.
“మత్తుగ చేసిన! అండ్ల ఒక్కటి చెప్త! ఓనాడు మైసమ్మ మూలకు నల్లగ మొగులైంది. కుండపోత వాన. ఉరుములు, మెరుపులు.. నేను, నా నసీంబీ జల్దీజల్దీ గుట్ట దిగుతున్నం. మా సూపు వరిచేనుల పడింది. ఆడ మనిషి ఒడ్డు మీద తల్లడిస్తున్నది. ఇద్దరం ఆడికి చేరుకున్నం. పోలీస్ పటేల్ భార్య పొట్టతో ఉన్నది. బర్రె గడ్డికి అచ్చిందేమో! నొప్పులతో పడిపోయింది. హల్లు హల్లు రాస్తా తక్ లేకే ఆయి నసీంబీ. పోతుల బండిగట్టుకొచ్చి, మెత్తగ బొంతలు వరిసి పండుకోబెట్టి, వాన గురవంగ.. ఒర్రె జోరు పెరిగినా.. ధైర్యంతో దాటించిన. ఆమె ముఖం మీద చినుకులు పడకుండా జోరతట్టు అడ్డం పట్టింది నసీంబీ. వాన ఇంకా జోరందుకుంది. ఊరు దగ్గర బుడుగుల పయ్య దిగబడ్డది. భుజంతో గట్టిగ ఎత్తి దాటించే వరకు కడుపులో పేగులు నోట్లో కచ్చినట్టయింది. కట్టపడి పటేల్ ఇల్లు చేరినం. పటేలు పట్నం పోయిండు. మంత్రసాని మంగలి ముత్తవ్వ అచ్చి చూసింది. ‘రాజక్కా! బిడ్డ అడ్డం దిరిగింది. తొలి కాన్పు ఇక్కడ కాదు. జల్ది ఇల్లంతకుంట దావఖాన్లకు పోనీ.. లేకపోతే పటేల్తోని మాట వస్తది’ అన్నది. ఇంటి పక్క ఎల్లక్క, రాజక్క ఎంబడి వచ్చిండ్రు. పోతుల బండిని గెదిమిన! ఇల్లంతకుంట శేరుకున్నం. డాక్టరు రమణమ్మ వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను తల్లిని కాపాడింది. ‘సమయానికి వచ్చిండ్రు! కాబట్టి ఇద్దరూ క్షేమంగ ఉన్నరు’ అని శెప్పింది. మేము సంబురవడ్డం. చంద్రారెడ్డి పటేల్ అచ్చినంక నన్ను పిలిపించి మెచ్చుకున్నడు. ఇట్ల మత్తు మందికి సాయం చేసిన!” శెప్పిండు ఖాశీం.
“ఖాశీంజీ! ఆ చంద్రారెడ్డి కొడుకును నువ్వు చూసినవా? ఇప్పుడు ఏం చేస్తుండో తెలుసా? ఎట్లున్నడో తెలుసా?” అని ప్రశ్నించిండు డాక్టర్. “అయ్యా! పటేల్‌ను నేను అడుగుతనా!? పట్నంల ఉన్నడనంగ ఇన్న” అన్నడు ఖాశీం.
కుర్చీలోంచి లేచి.. ఖాశీంను ఆత్మీయంగా అలుముకుండు.. కళ్లల్లో నీళ్లు చెమ్మగిల్లంగ డాక్టర్ కాశిరెడ్డి.
“నేనే తాతా! చంద్రారెడ్డి కొడుకును. నీపేరే వెట్టుకున్నరు నాకు. నాపేరు కాశిరెడ్డి!” శెప్పిండు డాక్టర్.
“అయ్యా! నేను చేసిన పుణ్యం ఫలించింది. అల్లాలెక్క నువ్వుండంగ ఇంగ నాకేం గాదు!” అని సంబురంతోని కండ్లల్ల నీళ్లు దెచ్చుకున్నడు ఖాశీం.
గప్పుడే రిపోర్టులు అందినయి. డాక్టరు చూసిండు. అప్పటిదాకా సంతోషంగ ఉన్న ఖాశీంకు.. ఏమని చెప్పాలో! ఎట్లని చెప్పాలో! తోచక కండ్ల నిండ కన్నీళ్లు నిండుకున్నయ్ డాక్టర్‌కు. చెప్పక తప్పదనుకున్నడు.
“ఖాశీం తాతా! నీకు అల్లా అన్యాయం చేసిండు. కాలు తీసెయ్యాలె. అయినా గ్యారెంటీ లేదు. పానాలకు ప్రమాదం ఏర్పడ్డది” అని కుండబద్దలు కొట్టినట్టు ఆవేదనతో చెప్పిండు కాశిరెడ్డి డాక్టర్.
“ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మీ ధర్మంగా భావిస్తున్నందుకు అభినందిస్తున్న! ఖాశీంను ముందు దోలుకొస్తే బాగుండేది దయాకర్!ఇప్పటికైనా జల్ది నిర్ణయం తీసుకోండి. కాలు తీసెయ్యాలె! లేకుంటె ప్రాణాలకే ప్రమాదం” అని చెప్పిండు డాక్టర్.
“అయ్యా! నా మొగుడు కళ్ల ముందట పానాలతో ఉండాలె. కూలి నాలి చేసుకొని సాదుకుంట!” అని ఏడుసుకుంటనే శెప్పింది నసీంబీ.
ఆ మాటలు విన్న డాక్టర్ వెంటనే ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి.. కాలు తొలగించిండు. వారం రోజులు దవాఖాన్లనే ఉన్నరు. ఖర్చులు లేకుండ ఇల్లు చేరుకుండ్రు.
‘మంచంలనే పండి ఉంటే.. నా గుడ్డి పిల్లలు ఎట్ల బతుకుతరు? నా నసీంబీ కైసా ఎల్ల దీస్తది? నాకేమన్నయితే నా పరివార్ క్యాహోగా?’ ఈ ప్రశ్నలన్నీ ఖాశీం దిమాక్ను తొలుస్తున్నయి.
రోజురోజూ మనుసులనే కుములుతున్నడు. గంపెడంత దుఃఖం.. మానేరు అలల్లా తన్నుకొచ్చి, కన్నీళ్లు టప్పటప్ప రాలుతున్నయి.
పోతులను, బండిని అమ్మేసిండు. సర్కారు ఇచ్చిన పించిని పైసలతోని పూట గడుత్తంది.
గుట్ట సుట్టు మొలిసిన పచ్చగూర, గునుగు కూర, తెల్ల గలిజేరు, పొన్నగంటి కూరలే.. ఆళ్ల కడుపులు నింపుతున్నయి.
ఓనాడు ధైర్యం తెచ్చుకుండు.
“నసీంబీ! నువ్వు నాకు ఇమ్మతిస్తే గుట్టెక్కి గుండ్లకు తోళ్లు కొడుత. నువ్వు పెద్ద సుత్తెతోని కొడుదువు!” అన్నడు.
అట్ల కొంతకాలం బతుకు ఎల్లతీసిండ్రు.
ఓనాడు దయాకర్ రావును కలిసింది నసీంబీ.
“అయ్యా! కట్టెపుల్లోలె ఎండుకొస్తుండు నా మొగుడు. మల్లొకపారి సిరిసిల్ల దావఖాన్లకు తోలుకపోండ్రి! మీకు సలాంజేత్త!” అని దీనంగ బతిమ్లాడింది.
ఎంటనే ఆటో మాట్లాడి సిరిసిల్ల దావఖానకు తీసుకపోయి.. కాశిరెడ్డి డాక్టర్‌కు చూపించిండు. పరీక్షలు చేయించి, రిపోర్టులు పరిశీలించి..
“ఖాశీం తాతా! నిన్ను అల్లా చిన్నసూపు చూసిండు. నీ పెయ్యంత పాయిజన్ అయింది. నేనేం చేయలేని పరిస్థితి ఎదురైంది. నిన్ను కాపాడుదామని నా మనసులో ఎంత ఉన్నా సాధ్యం కాని పని”.. అని కంటతడి పెట్టిండు డాక్టర్ కాశిరెడ్డి.
నసీంబీ గుండెల పిడుగు పడ్డట్లయింది. గంపెడు ఏడుపుతో ఇంటికి చేరిండ్రు. అంతదాకా కొట్టిన రాళ్లు అమ్మేసింది. ఆకలి బాధకు పిల్లలు తట్టుకోవడం ఓ నరకమైంది. మనసులో తుఫాను చెలరేగింది. ఊర్లోకి పోయింది. ఓ అరుగు మీద కూకుంది. కన్నీళ్లు కారికారి ఇంకిపోయినయి. ‘అయ్యో! పాపం!’ అని మనిషికింత కూడు, కూర, తొక్కు, చలి కూరలు పెట్టిండ్రు. దాన్ని పిల్లలకు పెట్టి.. మగనికి తినిపించి తాను తిన్నది. సిగ్గు విడిచి మనసు రాయి చేసుకుని ఉంటే పిల్లలు బతుకుతరు అనుకున్నది.
‘ఎవరు ఎన్ని తిట్టినా.. గొంగెడు కావు’ అనుకుంది. ఇజ్జత్‌ను సంపుకొన్నది. ఊళ్లె బిచ్చమెత్తింది.
ఓ వారం రోజులదాకా అందరూ ఆదరించిండ్రు. కొందరు ఈసడింపులు మొదలుపెట్టిండ్రు. బువ్వ పెట్టిన వాళ్లను.. ‘అవ్వ ఇంత తొక్కేయి!’ అంటే.. ‘పాపమని పటివెడు అంబలి పోస్తే కారం లేదని కచ్చీరుకెక్కిందట.. నీ అసొంటిది’ అని దెప్పిపొడిచిండ్రు. సూదులోలే మనసుకు తగిలి తగిలి మొద్దు బారింది. ఓనాడు రాత్రంతా కాకి శోకమైంది. తెల్లార చుక్క పొడిచే దాకా ఖాశీం అవస్థ చూస్తూనే ఓదార్సుకుంటనే ఉన్నది.
ఒక్కసారిగా.. “నసీంబీ.. నువ్వూ, పిల్లలు ఎట్ల బతుకుతరు? యా అల్లా!” అని పెద్దగ అరిసి, ఇరుగ చూసి సల్లవడ్డడు.
తెల్లారి సుక్క పొడిశింది. సుక్కల్లో సుక్కయ్యిండు ఖాశీం. నసీంబీ గుండెలో తుఫాను చెలరేగి, గుండె చెరువైంది. గుండెలో కుంపటి రగులుతుంది. కానీ, పైకి ఏడిస్తే గుడ్డి పిల్లలు గుండె పగులుతరని పిల్లలకు చెప్పకుండనే.. మస్కులనే ఊర్లకు పోయింది. సర్పంచ్, పటేల్, పట్వార్లను కలిసి బోరున గుండె పగిలేట్టు ఏడ్చింది. ఈ వార్త ఊరంతా పాకింది. ఖాశీంను చూడ్డానికి దారి వడ్డరు.
‘అయ్యో! కీర్ తాత! ఎంత మంచోడుండె!’ అని పిల్లలు – పెద్దలు చూడ్డానికి శీమలధారోలె పోతున్నరు. కన్యారం నుంచి గుడ్డి కొడుకుల్ని రప్పించిండ్రు. నలుగురు గుడ్డి పిల్లలు పుణుకుతూ ఏడుస్తూ ఉంటే.. చూసేవాళ్ల గుండెలు అవిసిపోతున్నయి. రాయి అసొంటి మనసున్నోళ్ల ఎదలు గూడ చెమ్మగిల్లి కన్నీరు ఒలికింది. ఊళ్లోని పకీర్ రహీం, అబ్బాస్‌ను పిలిపించి ఇస్లాం పద్ధతి ప్రకారం ఊరు పెద్దలు కలిసి నిలబడి అంత్యక్రియలు చేయిస్తున్నరు. నసీంబీ గోడైంది. ఏడుపు లేదు. కన్నీరు రావడం లేదు. శవయాత్ర మొదలైంది. ఇస్లాం పద్ధతి ప్రకారం ఆడవాళ్లు ఖబ్రస్తానుకు రావొద్దని ఆపినోళ్లను కొరికి.. ఇనకుండ ఎంటబడి పోతనే ఉంది నసీం. ఖాశీం శవాన్ని బొందలో పెట్టిండ్రు. గంతే ఒక్కసారి పెద్దగా కేక వేసి.. “నా ఖాశీంను కైకు ఖబర్ మే డాలే!” అంటూ అరిసి.. “ఖాశీంజీ! తుమారేసాత్ మైబీ ఆరూం!” అంటూ గుండెపగిలి కుప్పకూలింది నసీంబీ.
పక్కనున్న వాళ్లు నీళ్లు తాగిస్తే కారి పోయినయి. శ్వాస చూసిండ్రు. దాతు చూసి.. ప్రాణం వదిలిందని నిర్ధారించిండ్రు. కొద్దిసేపు నిశ్శబ్దం నిండుకుంది. అందరి కండ్లూ చెమ్మగిల్లినయి.
‘వీళ్లది జన్మజన్మల విడదీయరాని కట్రాళ్ల బంధం!’ అని ఇద్దరినీ ఒకే బొందలో.. ‘జోడి ఖబర్’ సమాధి చేసిండ్రు.
ఊరంతా పిల్లలకు అండగా నిలిచిండ్రు.
డిగ్రీ చదువుకున్న ఇద్దరు కొడుకులు ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నరు.
రచయిత పరిచయం : డాక్టర్ జనపాల శంకరయ్య
తన రచనల ద్వారా పల్లె జీవితాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు డాక్టర్. జనపాల శంకరయ్య. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవునూరు ఈయన స్వస్థలం. ఏడో తరగతితోనే చదువు కొండెక్కింది. అయినా, ఉన్నత విద్యాభ్యాసంపై మక్కువతో వృత్తి, వ్యవసాయం చేస్తూనే.. ప్రైవేట్‌గా ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ చేశారు. ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడిగా 33 ఏళ్లపాటు సేవలందించారు. జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నారు. పద్య, వ్యాస, నాటిక, వచన కవిత, ఏకపాత్ర, ఒగ్గుకథ, బుర్రకథ, కథా ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. కరీంనగర్ జిల్లా లంబాడీల ఆచార వ్యవహారాలు, తెలుగు లంబాడీల గేయ సాహిత్యం, ఆచార్యదేవోభవ శతకం, బహుముఖ ప్రజ్ఞాశాలి కల్వకుంట్ల తారక రామారావు బుర్రకథ బాలగీతాలు రచించారు. తెలంగాణ సమరశంఖం, అవినీతిపై అక్షరాంకుశం, పర్యావరణ పరిరక్షణ పాంచజన్యం, వైద్యం – ఆరోగ్యం మొదలైన సంకలనాలకు సంపాదకత్వం వహించారు. సినారె 64 వసంతాలు, అంతర్రాష్ట్రీయ ఇందిరాగాంధీ, కళాలయ విశిష్ట సాహిత్య, సిరివెలుగులు, పురిటిగడ్డ మొదలైన అవార్డులు అందుకున్నారు. ‘నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజా గ్రంథాలయం’ కథల పోటీల్లో ముచ్చటగా మూడు బహుమతులు గెలుచుకున్నారు.
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

