కాటుక కన్నుల సాక్షిగా..
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో తృతీయ బహుమతి రూ.10 వేలు పొందిన కథ.
మాఊళ్లో ఆ రోజుల్లో కాకులు, కోకిలలు కూడా కాటుక పెట్టుకున్నట్లే కనపడేవి నాకు. పూర్తిగా కూలిపోయి నల్లతుమ్మలు, రేగుపొదలతో చిట్టడివిలా మారిన దొర గడీ వెనుక ఎప్పుడో ఒకసారి కనపడే నెమలీ, పటేలు మామింట్లో నెమలి పుంజు కూడా! అలా అని నాకనిపించేవా? లేక నిజంగానే వాటికీ కాటుకేమైనా ఉండేదా?
ఊరిలో ఆడవారంతా కళాత్మకంగా కాటుక దిద్దుకునేవారు. రేచీకటి రమణక్కతో సహా! ఒకటో తరగతి వరకూ నాకూ మా అమ్మ కాటుకద్ది బడికి పంపేది. ఒకరోజు బళ్లో రామయ్య సారు.. ‘అరేయ్! ఈడు రోజూ కాటుక పెట్టుకుని వస్తున్నాడు. అమ్మాయిల మద్దెలో కూసోబెట్టండ్రా’.. అనేసరికి, మా పోర్లు పోరగాళ్లంతా ఒక్కపెట్టున నవ్వారు. అప్పుడు నాకు తెలిసింది.. ఆడ, మగను ‘వేరుచేసేది’ కాటుక అని!
ఎర్ర దమయంతి కాటుక ఎంతో ఇష్టంగా, అందంగా పెట్టుకునేది. ఆమె ‘నలుడు’ పోయి చాలా యేళ్లవుతున్నా, ఆమె ముత్తయిదువలకుండే ఐదుతనాల్ని వదిలేసినా.. ఎందుకో కాటుకను మాత్రం వదల్లేదు. కాటుకద్దుకున్న ఆమె కళ్లు రెక్కలు తొడుక్కున్న గండు చీమల్లా కనిపించేవి. ఊళ్లో ఎక్కడైనా ‘చక్కెర’ దొరుకుతుందా? అని అవి వెతుక్కుంటున్నట్లుగా అనిపించేవి! ఎంత ఇంపుగా కాటుక దిద్దుకున్నా ఆమె కన్నుల్లో పొద్దుజారుతున్న వేళ నారింజ రంగు మబ్బుల గీతల్లా ఎరుపు జీరలు కదలాడుతుండేవి. వాటిల్లో ఆమె కన్నీరంతా దాచుకున్నట్లు అనిపించేది.
నల్ల శ్రీదేవి కాటుకను దిద్దుకునేది, అద్దుకునేది, ఇంకా.. రాసుకునేది, పూసుకునేది అనేకంటే పొద్దున్నే లేచి కళ్లకు కాటుక ‘తినిపించేది’ అంటే బాగుంటదేమో! ఆ అమ్మాయి ఎంత మందంగా కాటుక దిద్దుకునేదంటే.. ఆమె అప్పట్లో అమెరికాలో పుట్టి ఉంటే ‘థామస్ విలియమ్స్’ అనే ఆయన ఎగిరి గంతేసేవాడు. ఒకరోజు తన చెల్లెలు మెత్తని బొగ్గుపొడి, వేజలైన్లాంటి జెల్లీతో కలిపి కాటుకలా పెట్టుకుంటుంటే చూసిన అతను ఆ ఫార్ములాతో మొట్టమొదటి కమర్షియల్ కాజల్‌ను తయారుచేసి, ఆమె పేరుతోనే ‘మేబిలీన్ కాస్మొటిక్స్’ సంస్థను ప్రారంభించాడట. అదే మెల్లగా ఒక మల్టీనేషనల్ కాస్మొటిక్ కంపెనీగా ఎదిగింది. మా ఊరి శ్రీదేవి అక్కడ పుట్టి ఉంటే.. వాళ్లు తమ సంస్థకు బ్రాండ్ ఐకన్‌గా ఆమెను పెట్టుకునేవాళ్లేమో! కన్నయ్య మేనిఛాయ తనది. తన నలుపు ముఖానికి తెల్లని మధ్యహద్దులుగా ఉన్న ఆ కన్నులకు శ్రీదేవి తన చూపుడు వేలితో చాలా బారుగా కాటుక రాసుకునేది. మధ్యలో ఆమె ఎప్పుడైనా ఓసారి లిప్తపాటు రెప్పలు మూస్తే ఒక గుండ్రని నీలి తటాకంలో ఉన్న రెండే రెండు పెద్ద కలువల్ని చటుక్కున ఎవడో వచ్చి తెంపుకెళ్లినట్టు ఉండేది. పక్క టౌన్లో కాలేజీ నుంచి సాయంత్రానికల్లా ఇంటికొచ్చిన శ్రీదేవి జడలోని కనకాంబరాలు వాడిపోయి మ్యాచింగ్‌గా వేసిన ఆ పూలరంగు ఓణీతోపాటు ఆమె కన్నుల కాటుక కూడా చెదిరిపోయి ఉండేది!
సాలోళ్ల రుక్కమ్మక్క కళ్ల కాటుక గురించి చెప్పకపోతే కాటుక్కాయ అలిగి ఆత్మహత్య చేసుకుంటదేమో! నిండార తలంటుపోసుకుని అమ్మవారికి దీపారాధన చేసొచ్చి, మగ్గం ఆడిస్తూ కూర్చున్న రుక్కమ్మ పండరీపురంలో ఆషాఢ ఏకాదశి రోజున ఎంతో శోభతో మెరుస్తున్న రుక్మిణీదేవిలానే ఉండేది. రుక్కమ్మ కన్నులు బంగారు చేపలే! గాజుతొట్టెలోవి కావు.. పాల సంద్రంలోవి! తెలతెల్లని ఆమె మోముపై చుట్టూ వలయంగా కాపలా కాస్తున్నట్లుండే నల్లని భటుల్లాంటి ఆమె మందపాటి కనురెప్పలు.. అసలా కన్నులకు కాటుకే అవసరం లేదు! ఐనా శివమ్మత్త చెప్పిందట.. కాటుక సైతాను పీడలేకుండా చేస్తుందని! ఆ నమ్మకంతోనే ఏ రోజూ మర్చిపోకుండా కాటుక ధరిస్తుంది రుక్కమ్మ. రుక్కమ్మ కళ్లు ఎంత బంగారు చేపల్లా ఉన్నా.. ఆమె పెనిమిటి వాటిని చూసుకోకుండా సానికొంపల్లో పిత్తపరిగెల పులుసులకు మరిగాడు. రుక్కమ్మకున్న సైతాను పీడ అదొక్కటే. భర్త తమను పట్టించుకోకున్నా తన ఇద్దరు ఆడపిల్లల రేపటికోసం రేయింబవళ్లూ మగ్గం తొక్కే రుక్కమ్మ.. కాళ్లు బలహీనమవుతున్నా ఆమె కాటుక కళ్లు మాత్రం ఎప్పటికీ వెలుతురు నదులే! మగ్గంపై జరీదారాల కాంతులు ఆ కళ్లల్లోపడి ప్రతిఫలించి ఇంద్రచాపాలయ్యేవి! మా రుక్కమ్మక్క కాటుక కళ్లు చేయి తిరిగిన చిత్ర లేఖకులు పాలరాతి ఫలకాలపై అద్దిన తెలుగక్షరాలలోని స్వర్ణాల వృత్తాలు.
నూర్ పర్వీన్ కాటుక కళ్లను దగ్గరగా చూస్తే అంతే మరి. నూర్ పూర్వికులు నవాబులంట. నిమ్మపండు రంగు మేనిఛాయతో పందిరెత్తుండే నూర్‌కు ఊరిలో మిగతా ముస్లిం అమ్మాయిలంటే కొంచెం చులకన. వాళ్లంతా దూదేకులోళ్లనీ, తమది మాత్రం పూర్వం నుంచీ గొప్ప నవాబుల ‘జనానా’ సంప్రదాయమని ముక్కుపుటాలెగరేస్తూ గర్వంగా చెప్పుకొచ్చేది. వాళ్ల జమానా నాటి వైభవపు రోజుల్లో వాళ్లిళ్లల్లో మూలికలు, ముత్యాల పొడులతో ఇంకేవో కలిపి ‘సుర్మా’ తయారు చేసేవారని, దానిని ఎంతో ఇష్టంగా తమ కుటుంబాల్లో స్త్రీలు, రంజాన్ మాసంలో పురుషులు కూడా చక్కగా దిద్దుకునేవారని కథాకథనంగా చెప్పేది. ఇప్పుడు మాత్రం వాళ్లు సిబ్బిరేకు మీద దీపం మసితోనే కాటుక చేస్తున్నారు. తల, ముఖానికి ఆమె హిజాబ్ చుట్టుకున్నా.. నేత్రభాగం వదలాలి కాబట్టి నూర్ పర్వీన్ కాటుక కళ్లు ఆ హిజబ్ వస్త్రం అనబడే నల్లని దిక్చక్రంపై రెండు చిరుముత్యాల్లా మెరుస్తూ కనిపించేవి. పర్వీన్వి కొంచెం చిన్నగా ఏనుగు కన్నుల్లా ఉన్నా.. తెలుగు మాస్టారు గారి అబ్బాయి రంగ
నాథను చూస్తే మాత్రం పొంగడాల్లా పొంగేవి.
‘మియ్యాలకు అయ్యోర్లకు సెట్ కాదులేండ్రా.. ఈ లేత బాపన శరీరంపై మటన్ కత్తుల థిల్లానా ఆడిస్తారా ఏంట్రోయ్..’ అంటూ నవ్విస్తూ తప్పుకొనేవాడు రంగనాథ. వాడిప్పుడు ఎస్పీ. మా దోస్తుల్లో సివిల్ సర్వీసెస్ సాధించిన ఏకైక వ్యక్తి.
ఏ మగాడైనా సాధారణంగా ఓ సౌందర్యరాశిని నిండారా నఖశిఖం చూస్తే చలిస్తాడు.. జ్వలిస్తాడు.. ఉద్రేకాలు తట్టుకోలేనోడయితే స్ఖలిస్తాడు! ఒకటి కాదు.. రెండు దాల్ లేక్‌లను పక్కనుంచి కాటుక సింగారిస్తే ఎలా ఉంటుందో అలా చక్కగా ఉంటాయి దయామణి కాటుక పెట్టుకున్న కన్నులు. ఆమె కన్నులు చూస్తే పాషాండుడైనా రసిక పిపాసి అవ్వాల్సిందే! మా ఊళ్లో కమ్మోళ్ల, కాపోళ్ల పిల్లగాళ్లు ‘కాలనీ’లోకి వెళ్లారంటే కూలీకి మనుషుల్ని పిల్చుకురావడానికి, లేదంటే దయామణి నేత్రజ్యోతులను దర్శించి రావడానికే! దేవాలయాల్లో స్త్రీ మూర్తుల ప్రతిమల ముఖాలలో కొన్నిచోట్ల కళ్లను ముఖానికి ఇరువైపులా మించి ఆర్చీ వంపుల్లా, పూరేకుల కొసల్లా మిగులు కనురెప్పలు బయటకు చెక్కి ఉన్నట్లు దయామణి కన్నులు వైభవంగా మెరిసేవి. ఆ అమ్మాయి వాళ్లది ఆర్సీఎమ్ విశ్వాసుల కుటుంబం. పసుపు కుంకుమలు పెట్టకపోయినా కాటుక మాత్రం దిద్దుకునేది. అప్పట్లో నీలం రంగు లంగా జాకెట్టుపై తెల్ల జార్జెట్ ఓణీ యూనిఫాంతో సగం తెల్లని మేఘాలొకవైపు సగం నీలి మేఘా
లొకవైపు ప్రతిబింబించే తేట ఊట చెరువులా గంభీరంగా అగుపించేది దయామణి.
అసలు మా ఊరే ఒక పెద్ద కాటుక కన్ను. నల్లటి రేగడి మట్టి రోడ్లు.. పేడ, నల్ల బంకమన్నుతో అలికిన గోడలు, అరుగులు, వాకిళ్లు! ఎండీ తడిసీ వెలిసిపోయి నల్ల అట్టల్లా కనిపించే జమ్మిగడ్డితో వేసిన పై కప్పులు. గట్టున నల్ల తుమ్మల నీడల్ని వాటేసుకుని పడుకున్న పెద్ద చెరువు. కొండప్రాంతం కాబట్టి పిలిస్తే వస్తాయి అన్నట్లు ముసురుకునే వానమబ్బుల్తో, శివుని జటాజూటాల్లా వీధి వీధినా పెరిగిన నల్లవేప మానులు. ఊరంతా చెట్లపై కాకుల గుంపుల్తో, కాకుల్లాంటి ఎందరో మనుషుల గుంపుల్తో మా ఊరే దట్టంగా కాటుకద్దుకున్న చక్కని కన్నులా ఉండేది.
తెల్లవారు జాముకల్లా కోనేట్లో విడిచిన కార్తీక దీపాల్లా.. మా ఊరి ఆడవాళ్ల కాటుక కళ్లన్నీ ఇప్పుడు నా జ్ఞాపకాల్లో కొండెక్కాయి. కానీ నా ‘ఆరా’లో అంతర్భాగంగా ఉంటూ, నా చుట్టూ లక్షల దివ్వెల్లా ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నాయి..
‘కార్తీక’ కన్నులు.
కార్తీక కన్నడిగ. ఆమె తండ్రి రామకృష్ణ షాజీ ఇంజినీర్. మా ప్రాంతంలో నాగార్జునసాగర్ కాలువల తవ్వకం జరిగే సమయంలో పాలమూరు కార్మికులకు బిస్తర్ మా ఊరి పొలిమేరలోనే. వాళ్ల బట్వాడా, బాగోగులు చూసుకునే పనిని కాంట్రాక్టర్లు షాజీకే అప్పగించారు. అందుకే ఆ కార్మికుల గుడారాలకు దగ్గరగా ఉండాలని మా ఊళ్లోనే ఉండేది వాళ్ల కుటుంబం. దానితో కార్తీక మాతోనే, మా ఊరి బడిలోనే చదివింది. తెలుగు బాగా నేర్చుకుంది. కానీ, ఆమె తండ్రికి కన్నడ సంస్కృతి, కర్నాటక అంటే మితిమీరిన స్వాభిమానం.. తెలుగును, తెలుగోళ్లనూ విమర్శించేవాడు! ఆ రోజుల్లో కాటుకను ఇళ్లలోనే చేసుకునేవారు. కార్తీక తల్లి స్వచ్ఛమైన గానుగ నూనెతో కోడిగుడ్డు దీపం వెలిగించి, తాంబూలంపై ఆ మసి పట్టించి, అందులో రవ్వంత కేరళ కర్పూరం కలిపి, సంపంగి పూల రేకులు నానబెట్టిన స్వచ్ఛమైన రెండు కొబ్బరినూనె చుక్కలేసి కాటుక వండేది. ఆ కాటుకను మొదటి రోజు దిద్దుకున్న కార్తీక బడికి రాగానే మా అక్క దగ్గరికి వచ్చేది.
‘అమ్మ నిన్ననే చేసింది చూడు!’.. అని మా అక్క ముఖానికి, నా ముఖానికి దగ్గరగా తన ముఖాన్ని ఉంచేది. భరతనాట్యంలో ‘ఆలోకిత’ అనే దృష్టి
భేదాన్ని ప్రదర్శించేటప్పుడు నృత్యకారిణి తన కళ్లను టపటపమని వర్తులంగా ఎలా ఆడిస్తుందో అలా కళ్లను కదిల్చేది ఆ క్షణంలో.. చక్కని కాటుక కళ్లు దృశ్యమానం.. కానీ, కార్తీక కళ్లు అప్పుడు ‘ఘ్రాణమానం’.. ‘అరోమా ఆఫ్ ది ఐ’.. పరిమళ నేత్రాలు! ఒక అందగత్తె ఏ మగపిల్లవాడి ముఖానికైనా తన ముఖాన్ని అతి దగ్గరగా తీసుకొచ్చి, అతడి చెక్కిళ్లపై తన పెద్ద గుండ్రని కళ్లను ప్రతిబింబిస్తే.. వాడు నిలువగలడా?
ప్రతి ఉదయం లేవగానే అమ్మ ముఖం చూసేవాడిని. అది మర్చిపోయి లేపాక్షి నోట్‌బుక్ నిండా రేనాల్డ్స్ బ్లాక్ పెన్నుతో జీవకళ ఉట్టి
పడేలా గీసుకున్న కార్తీక కాటుక కన్నులు చూసుకోవడం మొదలుపెట్టా. నా చుట్టూ ప్రతి పరిసరంలోకి కార్తీక కన్నులు పరకాయ ప్రవేశం చేసేవి. నేలకు చూస్తే ప్రతిమొక్క, ప్రతి మొగ్గ.. పైకి చూస్తే ప్రతి మేఘం, ప్రతి మెరుపూ, ప్రతి చుక్క, ప్రతి ఉల్క, ప్రతి నెలపొడుపు నాటి జాబిలి కూడా కాటుక ధరించినట్లు దర్శనమిచ్చేవి. అవన్నీ నావైపే చూస్తూ నవ్వుతున్నట్లు అనిపించి, విశ్రాంతి లేని భ్రాంతిలోకి నన్ను నెట్టివేసేవి. ‘సితార’ ఇరవై రోజులాడితే ప్రతిరోజూ ఫస్ట్‌షో చూశా. భానుప్రియ కన్నుల్లో నా కార్తీక కన్నులు! అవే ఇవి.. ఇవే అవి.. ఇప్పటికీ కాటుక దిద్దుకున్న ప్రతి కన్నుల్లో కార్తీక కన్నులే కనిపిస్తాయి నాకు.
పదిలో ‘ఫీలింగ్’ మొదలైంది. డిగ్రీ ఫైనలియర్లో ‘మ్యాటర్’ ఫైనల్కొచ్చింది! ఒకరోజు ఆ మ్యాటర్ సీదా బైటపెట్టేశా!
‘కార్తీకా.. లవ్ యువర్ ఐజ్ సోమచ్’..
‘కళ్లనేనా?’..
‘అవును!’..
‘ఐతే నే భక్తకన్నప్పలా ఈ కన్నులు
తీసివ్వనా?’..
‘నేనేమీ శివుణ్ని కాదులే!’..
‘నేను మాత్రం నీ పార్వతినే..!’..
ఈ మాట అంటూ కొంచెం కొంచెంగా కాకుండా ఒక్కసారే ఒక్క నిమిషంలోనే బ్రహ్మ కమలం వికసిస్తే ఎలా ఉంటుందో అలా విప్పారింది ఆమె ముఖం.. ఎలా తట్టుకోగలను? లిప్తపాటులో కదిలి ఆమెను గట్టిగా హత్తుకుని, నా వెచ్చని పెదాలు ఆమె చల్లని కాటుక కన్నులపై ఉంచి గట్టిగా అదిమి ముద్దుల సునామీ సృష్టించాను. ఆమె శరీరంలో చక్కిలిగింతలకు మొత్తం కేంద్రక స్థానం కళ్ల చుట్టూతా ఉన్నట్లు ఆమె ఒకటే గిలిగింతలతో ఉక్కిరిబిక్కిరై నవ్వుతోంది. పైన కనుబొమ్మల నుంచి కింద చెంపలపై అంచుల వరకూ చెల్లాచెదురైన ఆమె ఆ కాటుక రేఖల మోము అలలు.. అప్పుడే వేగంగా మోసుకొచ్చి చెల్లాచెదురుగా విసిరేసిన నల్లని గవ్వలు నిండిన తీరంలా అయిపోయింది. ఇక కాటుక, నా నోటితడి కలగలిసి అంటుకుపోయిన నా పెదాలు మాత్రం మిగలపండి రసాలూరుతున్న నేరేడు పళ్లలా అయ్యాయి.
“అబ్బో! ఎన్నాళ్లు నడిచిందలా?”.
“కొన్నాళ్లే!”.
“పెళ్లెందుకు చేసుకోలే మరి?”.
“గంగతో రాసిపెట్టుందిగా!”.
గంగ నా భార్య! ఇప్పటివరకూ పై ముచ్చట్లన్నీ తనకే చెబుతూ ఉన్నా.. ఆ పూట!
“శివుడు గంగమ్మని వదులుకున్నాడు. పార్వతిని కాదుగా! ఆ కార్తీకే నీకు పార్వతిలా ఇంకా గుండెల్లో ఉందన్నమాట.. నేను కాదు!”.
“అమ్మో అట్లా అనకే! నా హృదయం పెద్ద హైరైజ్ ఆకాశహర్మ్యం లేవోయ్. అందులో హై ఎండ్ లగ్జరీ ఫ్ల్యాట్వి నువ్వేనోయ్!”.
“చాల్లెండి మీ బడాయి బిల్డర్ మాటలు”.
“బిల్డర్లకు మాటలే సగం పెట్టుబడి”.
“సర్లే.. అన్ని మాటలూ చెప్పారు. ఇన్నేళ్లూ ఈ ముచ్చటెలా దాచారు?”.
“వయసులో ఉన్నపుడు రహస్యం దాచుకోవాల్సి ఉంటుంది. వయసు దాటేకొద్దీ ఏదీ దాయబుద్ధవ్వదు!”.
“ఇదేమీ రహస్యం కాదులెండి!”.
“రహస్యం కాదా!?”.
“అవును. నాకెప్పుడో తెలుసు శ్రీవారూ!”.
దిమ్మ తిరిగిపోయింది నాకు.
“నిజంగానా ! ఎలానే గంగా?”.
“కార్తీక డిగ్రీ వరకు నీకు క్లాస్మేట్. నాకు తను మైసూర్ ఆర్.ఐ.ఈ.లో క్లాస్మేట్. అక్కడ మేం ఎడ్యుకేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ కలిసి చదువుకున్నాం. అప్పుడు తెలియదు మీ లవ్ ముచ్చట. ఆ మధ్య మా బ్యాచ్ గెట్ టుగెదర్ జరిగింది. గుర్తుందా మీకు. ఆర్నెల్లక్రితం నేను మైసూర్ వెళ్లొచ్చా!”.
“హా.. ఔను. టికెట్స్ నేనే కదా బుక్ చేసింది!”.
“మేమిద్దరం కలిసి చదువుకునేప్పుడు తన లవ్‌స్టోరీ గురించి ఎప్పుడూ చెప్పలేదు కార్తీక. మా గెట్ టుగెదర్ పార్టీలో నేను ఈ టౌన్లో ఉంటున్నానని, ఫలానా కుటుంబం వాళ్లు నా అత్తిల్లనీ చెబితే.. ఇంకా వివరాలడిగింది. మా వారని మీ పేరు చెప్పగానే.. ముందు చిగురాకులా కంపించింది. భళ్లున ఏడ్చింది. మన టౌన్ ఒకప్పుడు చిన్న పల్లెటూరనీ, వాళ్ల నాన్న ఇక్కడ చాలాకాలం ఇరిగేషన్ ఇంజినీర్‌గా చేశాడనీ, ఇక్కడ తాము చాలా యేళ్లు ఉన్నామనీ చెప్పింది. మెల్లిగా మీ విషయమూ చెప్పింది! మీ ప్రేమ ముదిరి పాకానబడుతుందని గమనించి, కార్తీక తండ్రి రాత్రికి రాత్రే కుటుంబాన్ని ఇక్కడినుంచి తరలించాడంట. తను కనిపించక నువ్వు పిచ్చోడివి అయ్యుంటావని అనుకుంటూ ఉందట.. కానీ, నువ్వు కుదుటపడ్డావనీ, పెళ్లాడావనీ, పిల్లల్ని కూడా కన్నావని తెలిసి సంతోషించిందిలే!”.
“మరి నువ్వేమనుకుంటున్నావు గంగా?”.. చాలా గిల్టీ కాన్షస్‌గా అడిగా.
“ఇన్నాళ్లూ మనిద్దరి మధ్య రహస్యాలు లేవనుకుంటూ ఉన్నా! అయినా పెద్దవాళ్లమై పోతున్నాం. పిల్లలూ సెటిలయ్యారు. ఇంకా గత జల సేతుబంధనాలు ఎందుకులెండి! మన పెళ్లికి ముందుకదా అది జరిగింది”.
“జోహార్లు.. నీ పెద్దమనసుకి గంగా! అది సరే.. అసలు విషయం చెప్పవా.. కార్తీక ఇంకా కాటుక పెట్టుకుంటూనే ఉందా?”.
“అవును.. అబ్బ! ఏం కళ్లండీ దానివి!”.
“తననోసారి చూడాలి!”.
“మైసూరెళ్లి చూద్దురులే.. పర్మిషనిస్తా! అందాక ఈ ఫొటో చూసుకోండి”.
తన ఫోన్లో గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి, ఒక ఫొటోను జూమ్ చేసి చూపించింది గంగ.
“ఈ కాటుకలద్దిన కళ్లే నన్ను ఇన్నేళ్లూ బాధిస్తున్నాయి గంగా!”.
“నాకర్థమైందిలెండి. నాతో తమరు గొడవ పడ్డప్పుడల్లా ఈ కాటుక కళ్లే వందలు వేలుగా మీ ముందు మెదిలేవని!”.
“ఎప్పుడు బయల్దేరమంటావు?”.
“మీ ఇష్టం. వాళ్ల ఇంటిదైవం చాముండీ అమ్మవారు. ఈ శరవన్నవరాత్రులూ ప్రతి ఉదయం, సాయంత్రం తను చాముండీ హిల్స్ గుడికెళ్తుంది. అక్కడ కచ్చితంగా కనిపిస్తుంది. చూసి రండి!”.
“శ్రీమతీ.. జిందాబాద్!”.
“ఆగండాగండి! షరతులు వర్తిస్తాయి”.
“చెప్పండి మేమ్!”.
“కార్తీక కలిసినా మీరు ఆమెతో ఏమీ మాట్లాడొద్దు. పూర్వ పరిచయాలు, పురానీ ప్యార్ కహానీలొద్దు. కార్తీక తండ్రి ఇప్పుడు లేడు. కానీ, దాని భర్త పెద్ద మూర్ఖుడంట. అదీగాక వాళ్ల ఒక్కతే కూతురికి మొన్నీమధ్యే పెళ్లయిందట. పెద్దరికం రెండువైపులా ఏపుగా పెరిగిపోయి ఉంది. కాపాడండి.. కాపాడుకోండి!”.
“ఐ స్వేర్ ఇట్.. హండ్రెడ్ పర్సెంట్ గంగా! ఒకే ఒక్కసారి తన కాటుక కళ్లని చూసొస్తా!”.
“ఒకే.. ఐతే జర్నీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు !”.
తనను దగ్గరికి తీసుకొని, నుదిటిపై పెదాలుంచి చాలాసేపు అలాగే ఉండిపోయా. నన్ను పొదివి పట్టుకుని తనూ అలాగే ఉండిపోయింది.
హిమాద్రి శిఖరాల మధ్య సమున్నతంగా ప్రవహించే ఆ గంగనే.. నా ఈ గంగ!
చాముండీ హిల్స్‌పై శరవన్నవరాత్రుల వేడుకలు. అమ్మవారిని దర్శించుకుని, అక్కడి ఆంజనేయుస్వామి విగ్రహం పక్కనే ఉన్న మెట్లపై కూర్చొని ఎదురుచూడసాగాను. ఈ శరవన్నవరాత్రులు ప్రతిరోజూ కార్తీక అమ్మవారిని దర్శించుకుని వచ్చి తను ఆ దగ్గరలోనే కూర్చుంటుందట.. గంగ చెప్పింది! కానీ, ఈ రోజు వస్తుందో లేదో మరి? నన్ను చూస్తే గుర్తుపడుతుందా? నేను మాత్రం గుర్తుపట్టగలను. ఫోన్ స్క్రీన్‌పై తన ఫొటోను జూమ్ చేస్తూ చాలా సేపు కూర్చున్నాను. ఒకవేళ రాకపోతే తనకు ఫోన్‌చేస్తే? గంగ ఫోన్లో కార్తీక నెంబర్ని తస్కరించా! తప్పే కదా.. తప్పని తప్పు!
కొంచెం దూరంలో.. ప్రాకారం పక్కనే ఉన్న ఒక స్త్రీ మూర్తి కార్తీకలా అనిపించింది. లేచి నాలుగడుగులు ముందుకేసి చూస్తే.. తను కార్తీకే! ఫొటోలో ఉన్న రూపునకు కొంచెం మార్పు.. మరో స్త్రీ కాదు. తనే.. అదిగో ఆ కన్నులు.. ఆ కాటుక కన్నులే ఆమె ఉనికి! ఆ కాటుక దిద్దుకునే తీరే ఆమె ఆచూకీ! స్త్రీ మూర్తులు తాము ధరించిన దేహాల కాన్వాస్‌లపై గీసుకునే కళాకృతులే కన్నులు! కార్తీక ముఖంపై రెండు నీలి చిత్తరువుల్ని గుర్తుపట్టకుండా ఎలా ఉండగలను? దగ్గరికెళ్లి నవ్వుతూ.. ‘ఇంకా ఇంకులేని రీఫిల్‌తో, నెమలీకతోనే కాటుక అద్దుకుంటున్నావా కార్తీకా?’ అని అడుగుదాం అనుకున్నాను. నాలుగడుగులు ముందుకేశా.. కానీ, రెండడుగులు వెనక్కు. మళ్లీ నాలుగడుగులు ముందుకు.. రెండడుగులు వెనక్కు. ఆమె కన్నులు ఆ సమయంలో కొద్ది సమయం క్రితం తాను చూసిన అమ్మవారి కళ్లలానే ఉన్నాయి. స్పెషల్ దర్శనం టికెట్‌తో ఆ ఉదయం అమ్మవారిని దగ్గరగా చూడగలిగా! అమ్మవారు ఒక్కసారి తనవైపు పెద్ద కళ్లతో చూసినట్లనిపించింది. ఉలిక్కిపడ్డాను ఆ క్షణంలో! ఇప్పుడు నా ఎదురుగా అటువంటి దివ్య నేత్రాలే! కార్తీక కళ్లు.. వయసుతోపాటు పెద్దగా మారని కన్నులు. అయితే ఆ కళ్లల్లో ఇప్పుడు ఎర్రజీరలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. వయసు ప్రభావమేమో.. నల్లగుడ్డు కొంచెం కళ కోల్పోయింది. ఇంకో రెండడుగులు ముందుకేశా. అంతలో ఒకసారి టపటపమని కళ్లాడించింది తను. కనురెప్పలు చిరు వింజామరల్లా కదిలాయి. ఇప్పుడు ఆ కళ్లు నన్నే చూస్తున్నాయి. ఆ సుందర చక్షవులు.. ఎన్నో సాయంత్రాలు ఏటి ఒడ్డున తనకై ఎదురుచూసిన చకోరాలు.. తను మౌనముద్రలో అలానే కూర్చొనుంది. తను కదలకుండా తన కళ్లు నన్నే చూస్తున్నాయి. ఆమె కనుపాపల, నా కనుపాపల చివర్లను బిందువులుగా కలుపుతూ, ఎవరైనా ఓ బారు రెక్టాంగిల్ను గీస్తే ఎంత బాగుండు! తలను అలాగే కదపకుండా నిలిపి నావైపే ఇంకా చూస్తున్నది. మరెందుకు గుర్తుపట్టడం లేదు నన్ను? గుర్తుపట్టినా పట్టనట్లు నటిస్తున్నదా? ఒక్కోసారి అది ఆడవాళ్లకు అవసరమే కదా! మరొక్క మూడడుగులు ముందుకేశా. ఒకడుగు వెనక్కి! ఇదేం న్యాయం? కార్తీక కూడా చాలా మంది ఆడోళ్ల మాదిరేనా? నేను ప్రొసీడ్ కాలేను.. గంగకు మాటిచ్చాను! తప్పే.. అయినా తప్పేలా లేదు. ఒక్కసారి.. ఒక్కసారంటే ఒక్కసారి.. నా ఆ పాత ఆస్తులు.. ఆ కాటుక కన్నులను ఒక్కసారే బాగా దగ్గరగా.. ఇంకా దగ్గరగా చూసుకుంటూ.. ఒక్కసారి తనను పలకరిస్తేనో! నో ప్రాబ్లం.. ఒట్టుతీసి గట్టునపడేయ్.. ఊం.. పద.. కదులు.. ఇంకో రెండడుగులు ముందుకు..
“కా.. కా.. కార్తీ.. కా..”.
మా ఇద్దరి మధ్యకు చిలుక పిల్లలా ఒక పాప తుర్రున పరుగెత్తుకొచ్చింది.
“సారీ తాయీ.. అక్కడ ప్రసాదం తీసుకునేటప్పుడూ పక్కనబెట్టి మర్చిపోయా! ఇదిగో అక్కడే దొరికిందిలే! పదండి తాయీ పోదాం”.. అంటూ చెంగున కార్తీక ముందుకు దూకి, ఒక తెల్లటి పొడవాటి బ్లైండ్ స్టిక్‌ను ఆమె ఒడిలో ఉంచింది ఆ పాప. అచేతనుడినయ్యాను. నా తలలో వందల డ్రోన్ల రొదలా అలజడి రేగింది. మాట పడిపోయింది. ఆ క్షణమే నన్నెవరో విగ్రహంగా మార్చి ఒక రాతి పీఠానికి నన్ను అతికించి పోయినట్లుగా నిలబడ్డా. మైగాడ్.. కార్తీక కన్నులున్నాయి.. కాటుక ఉంది.. చూపులేదా?
కార్తీకకు సహాయకురాలిగా వచ్చిన ఆ పాప..
“డ్రైవరన్నయ్య పార్కింగ్‌లోనే వెయిట్ చేస్తున్నాడంట తాయీ.. ఫోన్ చేశాడు” అని అంటూ, కార్తీకకు పెద్ద గాగుల్స్ పెడుతూ, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని.. ఒక్కో మెట్టూ చాలా జాగ్రత్తగా నెమ్మదిగా దింపుతూ గుడి బయటికి తీసుకెళ్తున్నది.
“మిన్నూ! అక్కడిందాక నన్నెవరైనా పిలిచినట్లుందా?”.. కుడిచేతిలో బ్లైండ్‌స్టిక్, ఎడమచేతితో పాప ఆసరాతో నడుస్తూ అడుగుతున్నది కార్తీక.
“లేదు తాయీ! ఎవరూ పిల్చినట్టు లేదే!” ముద్దుగా బదులిచ్చింది పాప.
దృశ్యంగా చూపలేనివాటిని మనసు నాదంగా వినిపిస్తుందంటారు. కార్తీక విన్నదా? విని ఉంటే.. విన్నది నా అర్ధ పిలుపునా? వ్యర్థ తలపునా?
కార్తీక వెళ్లిపోగానే శ్రీమతికి కాల్ చేశా.
“గంగా.. నాకెందుకు చెప్పలేదు?”.
“తట్టుకోలేవని!”.
“ఎలా జరిగిందట?”.
“గ్లకోమా.. టైంకి తెలుసుకోలేదట. క్రానిక్ అయ్యింది”.
“అయినా తనింకా కాటుక దిద్దుకుంటూనే..!”.
“నీ గురించే!”.
“నా గురించా.. ఎందుకు?”.
“ఎప్పుడో మాట తీసుకున్నావటగా”.
“ఏమని?”.
“తన ఆ కన్నుల జ్యోతులు కొండెక్కే వరకూ కాటుకను వదలొద్దని !”.
“ఆ.. అవును.. అవును..”.
“అయితే మరెందుకు అడిగావు?”.
“మర్చిపోయానులే!”.
“మగాడివి గదా!”.
నాలుగడుగులు ముందుకు..
రెండడుగులు వెనక్కు. ఆమె కన్నులు ఆ సమయంలో కొద్ది సమయం క్రితం తాను చూసిన అమ్మవారి కళ్లలానే ఉన్నాయి. స్పెషల్ దర్శనం టికెట్‌తో ఆ ఉదయం అమ్మవారిని దగ్గరగా చూడగలిగా! అమ్మవారు ఒక్కసారి తనవైపు పెద్ద కళ్లతో చూసినట్లు అనిపించింది. ఉలిక్కిపడ్డాను ఆ క్షణంలో! ఇప్పుడు నా ఎదురుగా అటువంటి దివ్య నేత్రాలే! కార్తీక కళ్లు.. వయసుతోపాటు పెద్దగా మారని కన్నులు.
వేణు మరీదు
వేణు మరీదు స్వస్థలం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వంగా ముత్యాల బంజర్ గ్రామం. తల్లిదండ్రులు రాధ – రుక్మాంగద. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్, నల్లగొండ గోకుల్ కళాశాలలో బీఈడీ చేశారు. 27 సంవత్సరాలుగా పాఠశాల, కళాశాల స్థాయుల్లో ఆంగ్ల భాషోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా 15 కథలు రాశారు. ‘నాక్కొంచెం ఇంగ్లీషు కావాలి’, ‘ప్రెజెంటెడ్ బై వసుధ’, ‘నలుగురూ లేనినాడు’, ‘బామ్మ’ కథలు పాఠకుల మన్ననలు పొందాయి. ఇంగ్లిష్‌లో రాసిన కవిత్వం, చిరువ్యాసాలు ప్రముఖ ఆంగ్ల దినపత్రికలు, వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పేదరికంలో పుట్టిన తనకు అక్షరాలే ఆస్తులని వేణు చెబుతున్నారు.
వేణు మరీదు, 85550 53547
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

