కీడు గుడిసె
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో ప్రత్యేక బహుమతి పొందిన కథ.
గూడెం కట్టుబాటు తప్పడమంటే గుర్రప్పకు ఎదురు తిరగడమే! ఆయన ఆగ్రహానికి గురికావడమే! గూడెం ప్రజల సాయాన్ని కోల్పోవడమే! కన్నప్ప కొడుకు బాధను చూడలేకపోయాడు. ఆచారం కోసం కోడల్ని చంపు కోవడం ఆయనకూ ఇష్టం లేదు. దాంతో ఆయనలోనూ తెగింపు పొడచూపింది.
గోదావరి పరీవాహక ప్రాంతంలో, దట్టమైన కీకారణ్యంలో.. ఎత్తయిన కొండలమీదుంది ఆ గూడెం. నాగరికతకు చాలా దూరంగా ఉన్న ఆ గూడెంలో ఓ ఆటవిక తెగకు చెందిన ఇరవైమూడు కుటుంబాలు.. మాయామర్మం లేకుండా జీవిస్తున్నాయి. అనాదిగా వస్తున్న ఆచారాలను, కట్టుబాట్లను గౌరవిస్తూ ప్రశాంతజీవనం సాగిస్తున్నాయి.
గూడేనికి కాస్త ఎడంగా, చుట్టూ రక్షణగోడలా ఉన్న వెదురు తడికల మధ్య ఉంది ఆ గుడిసె. అందులో వెదురు బొంగులతో కట్టిన అటకమీద ముడుచుకుని పడుకున్న సోము.. చలికి గజగజా వణికిపోతున్నాడు. పక్కన అతని భార్య సిసిరి ఉండుంటే.. ఆమె కౌగిలిలో వెచ్చగా నిద్రపోయేవాడు. ఆమె లేకపోవడంతో రాత్రంతా సరిగ్గా నిద్రపట్టలేదు. చలిపులి గుండెల్లోకి దూరి గిలిగింతలు పెడుతుంటే.. సిసిరి గురించి ఆలోచనలు ముసురుతుంటే.. అతనికి నిద్రెలా పడుతుంది?
హఠాత్తుగా ఏదో ఆక్రందన చెవికి సోగ్గానే దిగ్గునలేచి, అటక దిగాడు సోము. బయట మంచు తప్ప ఏమీ కనిపించలేదు, వినిపించలేదు. అతడు చలికి వణుకుతూ.. ‘అంతా నా బెమ’ అనుకున్నాడు. గుడిసెలో ఓ మూలనున్న పొయ్యి దగ్గరికెళ్లి, ముట్టించాడు. చిన్న మంట వెచ్చగా తగిలి ప్రాణం లేచొచ్చింది. చలి కాగుతుంటే అతనికి సిసిరి గుర్తుకొచ్చింది. ‘ఈ సలిలో అదెట్టా ఉందో ఏటో?’ అనుకుని బాధగా నిట్టూర్చాడు.
‘ఒగ రేత్రి గడిసింది. ఇట్టాంటి రేత్రులు ఇంకెన్నో గడవాల! ఆలూమగలను ఇడదీసే ఈ ఆసారమేటి? దాన్నట్టుకుని గూడెం పెద్ద యాలాడ్డమేటి?’ అనుకుంటూ మొహం చిరాగ్గా పెట్టాడు.
పక్క పక్క గూడేలకు చెందిన సోము, సిసిరి ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలను ఒప్పించారు. ఆచారం ప్రకారం మనువుకు ముందు గుడిసె కట్టి, ఆనక మనువాడారు. ఆ కొత్తగుడిసెలో కాపురం పెట్టి ఏడాదిన్నరయింది. సోము చలాకీతనంతోనూ, సిసిరి కలివిడితనంతోనూ గూడెం ప్రజలకు ఇష్టులైపోయారు. ‘సోము సిసిరితో జోడి కట్టినాకే గూడేనికి సందడొచ్చింది’ అని అంతా అనుకునేవారు. సిసిరిని విడిచి క్షణం కూడా ఉండలేక పోయేవాడు సోము.
నిరంతరం ఒకరినొకరు అంటిపెట్టుకునుండే వారిద్దరినీ, సిసిరి నెలసరి సమయంలో తమ కీడు ఆచారం విడదీసేది. దాంతో ఆ ఆచారం పట్ల సోముకు ఎక్కడలేని కోపమూ వచ్చేది. సిసిరిని ఆచారం తప్పమనేవాడు.
“గూడెం కట్టుబాటు దప్పితే తొప్పు గట్టాలి గద మావ” అని నచ్చచెప్పేది సిసిరి. కీడు గుడిసెకు వెళ్లి, అక్కడ మూడ్రోజులుండి వచ్చేది.
ప్రస్తుతం సిసిరి నిండు చూలాలు! దాంతో ఆమె మకాం కొద్దిరోజుల క్రితం కీడు గుడిసెకు మారింది. రెండునెలలు అక్కడే ఉంటుంది. దాంతో ‘అన్నిరోజులు ఆమెను విడిచి ఉండగలనా?’ అని తెగ గింజుకుంటున్నాడు సోము.
కొన్ని ఆటవిక తెగల్లో ఉండే ఆచారం, ఆ ఆటవిక తెగలోనూ ఉంది. స్త్రీలు నెలసరి అయితే మూడ్రోజులు, గర్భిణులు, రజస్వలైన వాళ్లూ రెండునెలలు గూడేనికి కాస్త దూరంలో ఉండే కీడు గుడిసెలో ఉండాలి. వారు గూడెంలో ఉంటే వారి కీడు (మైల) గూడేనికి అశుభం కలిగిస్తుందని భావిస్తారు. వారు ఆ కీడు గుడిసెలోనే ఉంటూ, వారికి కేటాయించిన దారుల్లోనే బయటికెళ్లి రావాలి. వారికి వారి బంధువులైన స్త్రీలు తినడానికి పట్టుకెళ్లిస్తారు. ఎవరైనా ఆచారం తప్పితే శిక్షలు కఠినంగా ఉంటాయి. గూడెం నుంచి నిర్దాక్షిణ్యంగా వెలివేస్తారు.
పురుడుకోసం కీడు గుడిసెలోకి వెళ్లిన వాళ్లు క్షేమంగా గూడేనికి తిరిగొస్తారన్నది సందేహమే! కీడు గుడిసెలో మంత్రసాని పురుళ్లు పోస్తుంది. ఒక్కోసారి కాన్పు కష్టమై ప్రాణాల మీదికి వచ్చినా సరే.. ఆసుపత్రికి తీసుకెళ్లరు. బలవంతంగా మోటుపద్ధతులలో కాన్పు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో కీడు గుడిసెలోనే కన్నుమూసిన అభాగ్యులెందరో? సోము అలాంటి సంఘటనలు ఎన్నో చూశాడు. మరెన్నో విన్నాడు. అందుకే అతను భయపడుతున్నాడు. చలి కాగుతూ సిసిరికి ఏం కాకూడదని కొండదేవతను వేడుకుంటున్నాడు.
తమ ఆచారాల్లో కొన్నిటిని మూఢాచారాలుగా భావిస్తాడు సోము. అడవిలో తాము సేకరించినవి అమ్మి, కావలసిన సరుకులు తెచ్చుకోవడం కోసం.. అప్పుడప్పుడూ సమీప పట్టణంలోకి వెళ్లేవాడు. వెళ్లినప్పుడల్లా పట్టణ ప్రజల జీవనవిధానాన్ని పరిశీలించేవాడు. అక్కడ కీడు గుడిసె ఆచారంతోపాటు తాము పాటిస్తున్న మరికొన్ని ఆచారాలు లేవని తెలుసుకునేవాడు. ఆ విషయమే తన నేస్తాలతో చెప్పి బాధపడేవాడు.
ఓ రోజు గూడెం పెద్ద గుర్రప్ప, కీడు గుడిసెకు మరమ్మతులు చేయడానికి మనుషులను పురమాయిస్తుంటే సోము ధైర్యంచేసి..
“పట్నంల యాడ ఇట్టాంటి కీడు ఆసారం నేదు. మనంగూడ మానుకుందాం” అన్నాడు.
గుర్రప్ప గుర్రుగా చూసి.. “నక్కబుట్టి నాలుగు వోరాలు గానేదు, ఈ గాలీవోన యెన్నడు సూడనేదన్నదంట. అట్టాగుంది నీ యెవ్వారం. మూతిమీద మీసమే సక్కంగ రానేదు. పెద్దకొబుర్లు ఆడేత్తున్నవు” వెటకారంగా అన్నాడు.
“ఆడోల్ల పేనంమ్మీదకు దెచ్చే ఆసారం యెంతసెడ్డదో తెల్డానికి మీసమే రానొవసరం నేదు” అన్నాడు సోము ఆవేశంగా.
గుర్రప్ప అగ్గిమీద గుగ్గిలమైపోయాడు.
“ఏట్రా.. ఇప్పసారా తలకెక్కేసినదేటి? గూడెం బాగుకోసరం పెద్దోల్లెట్టిన ఆసారం మనం పాటించాల. మానుకుంతే కొండదేవతకు కోపమొస్తది. మల్ల ఇట్టాగ ఆసారాన్ని ఎటకారం సేత్తే గూడెంపెద్దగ ఏటి సేయాల్నో అదే సేస్తను” అంటూ హెచ్చరించాడు.
యాభై యేళ్ల గుర్రప్ప.. మొరటు మనిషి! ఆయనకు ఎదురుచెప్పి ఆ గూడెంలో ఎవరూ బతకలేరు. ఆ విషయం సోముకు తెలుసు. దాంతో ఆ మాట మళ్లా ఎత్తలేదు.
“ఒరే సోముగే! లెగిసినవ.. గుర్రెట్టుకొని నిద్రోతున్నవ?” అంటూ గుడిసెలోకి దూరాడు సోము అయ్య కన్నప్ప.
చలి కాగుతున్న సోము..
“నిద్రడితేనే కదర నిద్రోడనీకి! సిసిరికి ఎట్టుందో తెలిసినాదేటి?” ఆత్రుతగా అడిగాడు.
“అది సెప్పడానికే వొచ్చినను. సిసిరి పెరిస్తితి ఏం బాగోనేదంట. కాన్పు సేయడం కట్టమని మంత్రసాని అందంట. కోడలికేటి అవుతాదోనని మీయమ్మ రాగాలుదీత్తు నెత్తి బాదుకుంతున్నది” చెప్పాడు కన్నప్ప.
అది విని సోము భయంతో వణికిపోయాడు. సిసిరికి ఏం కాకూడదని తమ దేవతలకు మొరపెట్టుకుని..
“ఒరే అయ్య.. మరిప్పుడేటి సేయడం?” అన్నాడు బేలగా.
“సేసేదేటుందిర. సిసిరికి ఏటిగాకుండ కాన్పయితే కొండదేవతకు అడవిపందిని బలిత్తమని మొక్కీసుకోడమే! అంతకుమించి మనం సేసేది ఏటినేదు” అన్నాడు కన్నప్ప విచారంగా.
“ఒరే అయ్య.. అలాగనకుర. సిసిరి నా పేనం! అది సావగూడదు. ఆలిస్యెం సెయ్యకుండ ఆసు
పెత్రికి దీస్కుపోదం. దాన్ని బతికించుకుందం” అన్నాడు సోము ఏడుస్తూ.
“నీకేటి మతి పోనదేటిర? గూడెం ఆసారం నీకు తెల్దేటి? పోనేడు కాసమ్మ కాన్పుజెరక్క గిలగిల కొట్టుకుంతుంటే, దాని పెనిమిటి ఆసుపెత్రికి దీస్కు
పోతన్నడు. గుర్రప్ప ఒప్పుకున్నడేటి? ‘ఆసారం దప్పుతావేట్ర ఎదవ’ అంటు.. గయ్యిన లేసినడు గద!”.
“పేనంకంటే ఆసారం గొప్పదేటి? నాకు సిసిరికంటే మరేటి గొప్పది గాదు. దాన్ని బతికించుకుందానికి నాను ఆసారం దప్పుతను. గుర్రప్ప ఏటిసేస్తడో సేసుకోమను!”.. తెగింపుగా అన్నాడు సోము.
“గుర్రప్ప దయాదాచ్చన్యం నేనోడు. కట్టుబాటు దప్పితే సిచ్చేసి, ఎలేస్తడు. గూడెం ఇడిసి మనం బతకలేం. దేవతమీద బారమేసి వొల్లకుండుడే మంచిది” నచ్చజెప్తూ అన్నాడు కన్నప్ప.
“ఎలేస్తడని బయిపడితే సిసిరి సస్తది. అది సచ్చినాక నానుమాత్రం బతికి నాబమేటి? సిసిరికి ఉసురుంతే ఈడగాకబోతే ఏడన్న బతుకుతం.
ఒరే అయ్య.. నా మాటిని సాయం సెయ్యి. సిసిరిని డోలీ గట్టుకుని ఆసుపెత్రికి దీస్కుపోదం” దీనంగా బతిమాలాడు సోము.
గూడెం కట్టుబాటు తప్పడమంటే గుర్రప్పకు ఎదురు తిరగడమే! ఆయన ఆగ్రహానికి గురికావడమే! గూడెం ప్రజల సహాయాన్ని కోల్పోవడమే! అయితే కన్నప్ప కొడుకు బాధను చూడలేకపోయాడు. ఆచారం కోసం కోడల్ని చంపుకోవడం ఆయనకూ ఇష్టం లేదు. దాంతో ఆయనలోనూ తెగింపు పొడచూపింది.
“సరే బయిలెల్లయితే!” అంటూ డోలీ కట్టడానికి దుప్పట్లు, పొడవైన వెదురుబొంగు అందుకున్నాడు. సోము గాబరాగా అటకెక్కి పెట్టెలో దాచుకున్న డబ్బులను మొల్లో దోపుకున్నాడు.
మంచుతెరలు ఇంకా తొలగిపోలేదు. డోలీ ముందు కొమ్ము కన్నప్ప, వెనుక కొమ్ము సోము భుజాలమీద ఉంచుకుని కీడు గుడిసెకు చేరుకున్నారు. పురిటినొప్పులతో లుంగలు చుట్టుకుపోతున్న సిసిరిని, డోలీలోకి చేరుస్తుంటే మంత్రసాని అడ్డుచెప్పింది. ఆమెను సోము పక్కకు తోసేశాడు. చేసేదిలేక గుర్రప్పతో చెప్పడానికి ఆమె పరుగుతీసింది. అదే అదనుగా సోము, కన్నప్ప డోలీని భుజాలకెత్తుకొని కీడు గుడిసెలోంచి వేగంగా ముందుకురికారు.
గంటపాటు ఆగకుండా ప్రయాణించి చాలా దూరమొచ్చేశారు. గుర్రప్ప తమనిక చేరుకోలేడని నమ్మకం కుదిరాక, అలుపు తీర్చుకోవడం కోసం ఆగారు. అయితే కొన్ని క్షణాలు మాత్రమే! నొప్పులకు తాళలేక సిసిరి చేస్తున్న ఆక్రందనలను చూడలేక, మళ్లీ డోలీనెత్తుకుని ముందుకు కదిలారు.
సిసిరి రోదన తప్ప మరే శబ్దమూ లేని ఆ అడవిలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆయాసపడుతూ అడుగులేస్తున్న కన్నప్ప, సోము హఠాత్తుగా ఆగిపోయారు. ఓ అమ్ము వారిపక్కనుంచి రివ్వున దూసుకొచ్చి ఎదురుగా ఉన్న జువ్వి
చెట్టుకు గుచ్చుకుంది. వెనక్కి తిరిగి చూసి హడలిపోయారు. ముంచుకొస్తున్న విపత్తును చూసి సోము తల్లి నారమ్మ గుండెలు బాదుకుంటూ కూలబడి పోయింది.
అల్లంత దూరంలో గుర్రప్ప. విల్లంబులు పట్టుకుని, గూడెం ప్రజలను వెంటేసుకుని వడివడిగా అడుగులేస్తూ వస్తున్నాడు. ప్రాణాలు తోడేసే యమకింకరుడిలా ఉన్న ఆయన్ను చూసి.. కన్నప్ప, సోము జడుసుకుని డోలీని కిందికి దించారు. గుర్రప్ప వస్తూనే కన్నప్పను మెడపట్టుకొని పక్కనున్న డొంకలోకి తోసేశాడు. నారమ్మవైపు కొరకొర చూసి బండబూతులు తిట్టాడు. సోమును పట్టుకొని చెంపలు వాయించేశాడు.
“ఏరా గుంట నాయాల.. గూడెం కట్టు బాటును దప్పే దయిర్నం వొచ్చేసినాదన్న మాట నీకు” అంటూ నిప్పులు కక్కాడు.
సోము గుర్రప్ప కాళ్లమీద పడిపోయాడు.
“నీకు దన్నం పెడత గుర్రప్ప. సిసిరికి వయిద్యమందకబోతే సచ్చిపోద్ది. అది సస్తే నాను బతకనేను. ఈ పాలికి మా తొప్పుకాసి ఒగ్గియ్యి” అంటూ ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు.
“ఒగ్గియ్యిడానికేట్ర.. మామంత పరుగు పరుగునొచ్చింది. ఆసారాన్ని కాపాడుకోనీకి. కట్టుబాటు దప్పినోల్లను అట్టుకుని సిచ్చించనీకి!” గుర్రప్ప కోపంగా అన్నాడు.
సోము ధైర్యం కూడగట్టుకొని..
“ఆసారం కోసరం సిసిరిని బలిదీసుకోడం నాకిట్టంనేదు. మడిసి పేనాలు తీసే ఆసారం మాకొద్దు. కాలం మారినది గుర్రప్ప! దిగువున సాన గూడేలు మార్నయి. మనము మారదం. ఈ ఆసారాలను ఇడిసేద్దం” అన్నాడు.
“గుంటడు సెప్పే కొబుర్లు ఇనీడానికి నానేమి ఎర్రిమేకను గాదు. మేకల్ని నమిలేసే పెద్దపులిని! గూడెం పెద్దగ ఆసారాన్ని రచ్చించడం కోసరం ఎంతకైన తెగిత్తను”.
డొంకలో పడ్డ కన్నప్ప నెమ్మదిగా లేచి, గుర్రప్పవైపు దీనంగా చూశాడు.
“గుర్రప్ప.. కోపమిడిసి సాంతంగ ఆలోసించు. ఇంతవొరకు ఆసారం కోసరం అన్నెంపున్నెం ఎరగని ఎందరో ఆడకూతుర్ల ఉసురోసుకున్నం. ఇంతటితో యీ బలిని ఆపుదం. పురుడు రాక గిలగిలకొట్టుకుంతున్న సిసిరిని బతికించుకుందం. కూస్త పెద్దమనుసు సేసుకుని మమ్ము ఆసుపెత్రికి అంపు” బతిమాలుతూ అన్నాడు.
“ఈల్లేదు. గూడెం ఆసారాలు, కట్టుబాట్లు అందరు ఆచెరించాల్సిందే! ఆట్ని దప్పినోల్లని సిచ్చించాల్సిందే!” అన్నాడు గుర్రప్ప కళ్లెర్రజేసి.
మంచు క్రమంగా తొలగిపోతున్నది. సూర్యకిరణాలు చెట్ల మధ్యనుంచి విచ్చుకుంటున్నాయి. సిసిరి ప్రసవవేదనతో గింజుకుంటున్నది. కాళ్లు తన్నిపెట్టి పిడికిలి బిగించి, గుండెలవిసేలా గగ్గోలుపెడుతున్నది. అక్కడికి దగ్గరలో ఏ క్రూరజంతువుకు అడవిపంది చిక్కిందోగాని.. సిసిరి రోదనతో శ్రుతి కలుపుతున్నది. అడవి ఏకకాలంలో రెండు విషాద సంఘటనలను మౌనంగా తిలకిస్తున్నది.
గుర్రప్ప సిసిరిని సమీపించి..
“నొప్పులోర్సుకుని కులదేవతకు మొక్కుకోయే.. నీకేటిగాదు!” అంటూ ధైర్యం చెప్పి, డోలీని కీడు గుడిసెకు చేర్చమని ఓ ఇద్దరు యువకులకు పురమాయించాడు. వారు డోలీని భుజాలకు ఎత్తుకుంటుంటే సోము, కన్నప్ప.. ఆచారానికి సిసిరిని బలివ్వొద్దని ఏడుస్తూ అడ్డుపడ్డారు. వారిని అక్కడున్న మగోళ్లు తలోమాటతో దూషిస్తూ పక్కకు లాగారు. ఆడోళ్లు చోద్యం చూస్తూ నిల్చున్నారు.
అంతలో ఆ ఆడోళ్ల మధ్యనున్న గుర్రప్ప పెళ్లాం చుక్కమ్మ.. జుట్టు విరబోసుకుని గట్టిగా అరుస్తూ పూనకంతో ఊగిపోతున్నది. ఆమెకు తమ కుల
దేవత పూనిందని, ఎవరో వేపకొమ్మలు విరిచి ఆమె చేతిలో పెట్టారు. ఆమె తల గుండ్రంగా ఊపుతూ, రాగాలు తీస్తూ..
“నాను కొండదేవతన్రో గుర్రప్ప! నువ్వు తొప్పు సేత్తున్నవ్రో.. తొప్పు సేత్తున్నవు” అంటూ గుర్రప్పను వేపకొమ్మలతో కొడుతున్నది. ఆడోళ్లు చుక్కమ్మను గట్టిగా పట్టుకుని..
“తల్లీ.. అమ్మా! తప్పేటో సెప్పు తల్లీ.. సెప్పు!” అని అడుగుతున్నారు.
చుక్కమ్మ రౌద్రంగా మొహంపెట్టి..
“సిసిరి నా బిడ్డరో బిడ్డ! అది పాపంపున్నెం దెలీని పిల్లరో.. అది గూడేనికి ఎలుగురో! దాని కడుపులో బిడ్డ అడ్డం దిరిగినదిరో.. దాన్ని ఆసు
పెత్రికి దీసుకుబోనివ్వండ్రో! అది సస్తే గూడేనికి సేటు కాలమొస్తదిరో.. గూడెం వొల్లకాడవుద్దిరో! నా మాటినికోండ్రో!” అంటూ రాగాలు తీసి చెబుతూ, సొమ్మసిల్లి కింద పడిపోయింది.
అది విని గుర్రప్పతో సహా అంతా కొయ్యబారిపోయారు. ఏనాడూ చుక్కమ్మ మీదికి రాని కుల
దేవత, ఇప్పుడిలా వచ్చి చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. చుక్కమ్మ చెప్పింది నిజమని గట్టిగా నమ్మారు. సిసిరి చచ్చిపోతే గూడేనికి అరిష్టమని అంతా ఊసులెట్టుకున్నారు.
గుర్రప్ప తన పెళ్లాం మీదికి కులదేవత రావడంతో తెగ భయపడిపోయాడు. ఆకాశంలోకి చూసి దండం పెడుతూ..
“తప్పయిపోనాది.. సెమించు తల్లీ! గూడెమ్మీద గుర్రెట్టుకోకు. దయిసూపు తల్లీ! నువ్వు సెప్పినట్టే సిసిరిని ఆసుపెత్రికి దీస్కుబోతం” అని లెంపలేసుకున్నాడు. సిసిరిని ఆసుపత్రికి తీసుకుపొమ్మని ఆజ్ఞాపించాడు.
అంతే.. సోము, కన్నప్ప వేగంగా కదిలి డోలీని భుజాలకెత్తుకున్నారు. నారమ్మతోపాటు కొందరు యువతీయువకులు సాయంగా డోలీవెంట నడిచారు. మధ్యాహ్నానికి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సిసిరిని చేర్చారు. డాక్టర్లు వెంటనే స్పందించి, వైద్యం అందించారు. ఆపరేషన్ చేసి తల్లీబిడ్డలను కాపాడారు.
చలికాలం గడిచి, ఎండాకాలం ఆఖరు
కొచ్చింది. గుర్రప్పలో నెమ్మదిగా మార్పు మొదలైంది. కట్టుబాట్లను కొద్దిగా సడలిస్తున్నాడు. ఓ నిండు చూలాలును తానే దగ్గరుండి కాన్పుకోసం ఆసుపత్రికి పంపించాడు.
ఆ రోజు ఉదయం సోము గుడిసెలో ఒంటరిగా కూర్చుని, మూడ్రోజుల కిందట కీడు గుడిసెకెళ్లిన సిసిరి కోసం ఎదురుచూస్తున్నాడు. కాసేపటికి గెడ్డలో తలారా స్నానంచేసి బిడ్డను చంకనేసుకుని వచ్చింది సిసిరి. సోము పక్కన కూర్చుని..
“ఎవురుతోటి సెప్పనంటే నీకో రహస్యెం సెప్పుతను!” అంది నెమ్మదిగా.
“సెప్పనుగనీ ఏటా రహస్యెం?” అడిగాడు ఆత్రుతగా సోము.
“సుక్కమ్మ నిన్న కీడు గుడిసెకొచ్చినది. ఆసారాన్ని దిట్టుకుంట కూకున్నది. ఎవురుతోటి సెప్పొద్దని రేత్రి ఓ రహస్యెం సెవినేసింది. ఆ రోజున సుక్కమ్మమీదన నిజెంగ కొండదేవత పూన్లేదంట. నా పేనాలు గాపాడానీకి ఇంకో మార్గంనేక దేవతకు సెమాపన సెప్పి.. అట్టా నాటకమాడినదంట. ఇన్నాక నా కల్లమ్మట నీల్లొచ్చిసినయి. సుక్కమ్మ కాల్లమీద పడిపోనను” చెప్పింది ఉద్విగ్నంగా.
అది విని సోము ఆశ్చర్యపోయాడు. చుక్కమ్మ చేసిన సాయానికి అతని మనసు పులకించింది. గూడెం ఆచారాలకు, కట్టుబాట్లకు గుర్రప్ప ఇంటిలోనే వ్యతిరేకత మొదలైంది. ఇక తమ మూఢాచారాలకు త్వరలోనే చెల్లుచీటి పడుతుందని భావించాడు. గూడెం ఆడవాళ్లకు మంచిరోజులు రాబోతున్నాయని సంతోషించాడు.సిసిరి ఒళ్లోని బిడ్డ ఏడుపు మొదలెట్టడంతో, సోము ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుని.. “సిట్టితల్లీ.. మీయమ్మడుతున్న ఇక్కట్లు సూసి, ఆడబుట్టుక బుట్టినానని బెంగెట్టుకుంతున్నవ? ఇగ బెంగనేదమ్మ! నువ్వు పెద్దయ్యేసెరికి యీ ఆసారాలేం ఉండవునే! గూడెం పెద్దతోనే కీడు గుడిసెకు అగ్గెట్టేసే రోజు తొందర్లోనే వస్తది. ఆ రోజు కోసరం నాను పోరాడతనే ఉంట!” అన్నాడు దృఢంగా.. ఆశగా!
ఆ చంటిబిడ్డకు ఏమర్థమయిందో.. ఏడుపాపి తండ్రివైపు చూస్తూ బోసినవ్వు నవ్వింది.
చుక్కమ్మ చేసిన సాయాని సోము మనసు పులకించింది. గూడెం ఆచారాలకు, కట్టుబాట్లకు గుర్రప్ప ఇంటిలోనే వ్యతిరేకత మొదలైంది. ఇక తమ మూఢ ఆచారాలకు త్వరలోనే చెల్లుచీటి పడుతుందని భావించాడు. గూడెం ఆడవాళ్లకు మంచిరోజులు రాబోతున్నాయని సంతోషించాడు. సిసిరి ఒళ్లోని బిడ్డను సోము ప్రేమగా చేతుల్లోకి తీసుకొన్నాడు.
బొడ్డేడ బలరామస్వామి
విశాఖపట్నం జిల్లా కశింకోట.. బొడ్డేడ బలరామస్వామి స్వస్థలం. తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే, వ్యవసాయాన్నీ చూసుకుంటున్నారు. చరిత్ర, గ్రామీణ నేపథ్యంలో కథలు రాస్తున్నారు. ఇప్పటివరకూ 30కి పైగా కథలు, కొన్ని కవితలు వివిధ పత్రికలు, సంకలనాలలో ప్రచురితమయ్యాయి. చతురలో ‘ఆకుపచ్చని చంద్రుడు’ నవల అచ్చయ్యింది. స్వాతి మాస పత్రిక నుంచి ‘సముద్రం’ కథకు 2017లో ‘అనిల్ అవార్డు’ అందుకున్నారు. గౌరీ గ్రంథాలయం, అనకాపల్లి వారు నిర్వహించిన కథలపోటీలో ‘ఆడపిల్ల’ కథకు డా. సి. నారాయణ రెడ్డి చేతుల మీదుగా ద్వితీయ బహుమతి అందుకున్నారు. ‘కళింగ పౌరుషం’ చారిత్రక కథకు జాగృతి వార పత్రిక నుంచి, ‘పట్టుచీర’ కథకు హాస్యానందం పత్రిక నుంచి ప్రత్యేక బహుమతులను గెలుచుకున్నారు. ‘సముద్రం’ కథ హిందీలోకి, ‘ఒక ప్రయాణం’ కథ కన్నడంలోకి అనువాదమయ్యాయి.
– బొడ్డేడ బలరామస్వామి, 89197 07141
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

