కొత్త మోకు
కార్తీక మాసం.. శుక్రవారం పొద్దున్నే మేల్కొని.. కుంకుడుకాయ రసంతో తలంటు పోసుకొని, తడిగా ఉన్న జుట్టును తువ్వాలుతో మరీమరీ తుడుచుకుంటూ ఇంటి ముందటి వాకిట్లోకి వచ్చింది వరమ్మ. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుణ్ని చూసి.. రెండు చేతులెత్తి దండంబెట్టింది.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.3 వేల బహుమతి పొందిన కథ.
కార్తీక మాసం.. శుక్రవారం పొద్దున్నే మేల్కొని.. కుంకుడుకాయ రసంతో తలంటు పోసుకొని, తడిగా ఉన్న జుట్టును తువ్వాలుతో మరీమరీ తుడుచుకుంటూ ఇంటి ముందటి వాకిట్లోకి వచ్చింది వరమ్మ. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుణ్ని చూసి.. రెండు చేతులెత్తి దండంబెట్టింది. రౌద్రవర్ణంలో ఉన్న సూర్య భగవానుడు తనను ఆశీర్వదిస్తున్నట్టు భావించి.. కళ్లు మూసుకొని, తలపై దండం బెడుతున్న రెండు చేతులూ అలాగే ఉంచి.. కొద్దిగా తలవంచి తన మనసులో ఉన్న కోరికలను నెరవేర్చమని వేడుకున్నది.
వెంట్రుకలు తడి ఆరిన తర్వాత గతంరోజు కుమ్మరి కొమురయ్య దగ్గర కొనుక్కొచ్చి.. యాపచెట్టు కింద పెట్టిన మట్టికుండల దిక్కు చూసింది. నాలుగు కుండలు.. 5, 10, 15 సీసాల కల్లు పట్టేవి. వెంట్రుకలను ముడి వేసుకొని, నాలుగు కుండలనూ సిమెంటు గోలెం దగ్గరికి తీసుకుపోయి, కొంచెంసేపు నీటిలో నానబెట్టింది. కాసేపయ్యాక.. బయటికి తీసి, తాటిపీసుతోని కుండల లోపల బాగా కడిగి ఎండలో ఆరబెట్టింది. వంటకోసం దడికి పారిన కాకర తీగకున్న కాయలు తెంపుతుండగా..
“వరం.. ఓ వరలక్ష్మీ!” అన్న భర్త వీరస్వామి పిలుపుతో..
“ఆ.. వత్తున్న వత్తున్న!” అంటూ, తెంపిన కాకరకాయలను కొంగు ఒడిలో కట్టుకొని ఇంట్లోకి పోయింది వరమ్మ. అచేతనంగా మంచంలో పడుకొని ఉన్న వీరస్వామి.. భార్య దగ్గరికి రాగానే తనకుతానే లేచే ప్రయత్నం చేశాడు.
“ఆగాగు.. లేవకు!” అనుకుంట కొంగులో ఉన్న కాకరకాయలను గిన్నెలో వేసి, భర్త మంచం దగ్గరికి పోయింది. తన కుడిచేతితో భర్త కుడిచేయి జబ్బను పట్టుకొని, ఎడమ చేయిని అతని వీపుపై ఆనించి.. మెల్లిగా లేపి, కూర్చుండబెట్టే ప్రయత్నం చేసింది.
“అబ్బబ్బా.. నొప్పే!” అంటూ వద్దని వారించాడు వీరస్వామి. అలాంటి పరిస్థితిలో ఉన్న భర్తను గత రెండు సంవత్సరాలనుంచి చూస్తూ.. పసిపిల్లాడికి చేస్తున్నట్టు సేవలు చేస్తున్నది వరమ్మ. కాలకృత్యాలు తీర్చుకోవడానికి భర్తను మెల్లగా మంచంలోంచి లేపి.. చక్రాల కుర్చీలో కూర్చుండబెట్టి, బాత్రూంలోకి తీసుకుపోయింది. టూత్ పేస్ట్, బ్రష్ చేతికి అందించి..
“నీ పనులు కానియ్! ఈలోపట చాయ, బిస్కెట్లు తీసుకొని వస్త!” అంటూ, వంటగదిలోకి వెళ్లింది.
వరమ్మ భర్త బత్తిని వీరస్వామి. గీత కార్మికుడు. అరవై కుటుంబాలు ఉన్న ఆ ఊరిలో ‘మంచివాడు’ అనిపించుకునే వ్యక్తి. ఆ మంచితనంతోనే పోటీ లేకుండా రెండుసార్లు గీత పారిశ్రామిక సహకార సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 85 మంది సభ్యులున్న ఆ సొసైటీలో ప్రతినెలా ఎల్లమ్మ గుడి నిర్వహణ, సంఘ నిర్వహణ కోసం సభ్యుల దగ్గర కొంతమొత్తం వసూలు చేసి, రూపాయిరూపాయి లెక్కలు రాసి.. వనంలో ఉన్న ఎల్లమ్మ తల్లి గుడిలో సభ్యులను కూర్చుండబెట్టి లెక్కలు చూపేవాడు. ఆ ఊరిలో గీతకు పనికివచ్చే పోద్దాళ్లు, పరుపుతాళ్లు, పండుతాళ్లు, కర్రలు అన్నీ కలిపి 700లకు పైగా ఉన్నాయి. అవేకాకుండా.. ఒక పెద్ద చెరువు, రెండు కుంటల కట్టలకు రక్షణగా ఉండే ఈతచెట్టు.. పెద్దవి, చిన్నవి కలిపి లెక్కకుమించి ఉన్నాయి. హరితహారంలో భాగంగా అటు పచ్చదనం, ఇటు చెరువులు, కుంటల కట్టలను రక్షించే చెట్లుగా.. ముఖ్యంగా కల్లు పారించి గౌడ కుటుంబాలను ఆదుకునే తల్లిగా ఈతచెట్లను ఎక్సయిజ్ శాఖ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రతి గ్రామంలో వేలాదిగా నాటించింది.
వీరస్వామి తన సొంత ఆలోచన, నిర్ణయంతో సంఘ కార్యవర్గ సభ్యుల సహకారంతో అందుబాటులో ఉన్న అటవీశాఖ నర్సరీని సంప్రదించి.. 200 ఖర్జూరం మొక్కలు తెచ్చి, ఎక్సయిజ్ అధికారులను పిలిపించి.. గీత కార్మికులు, సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ముఖ్య నాయకులు, అందుబాటులో ఉన్న రెవెన్యూ సిబ్బందిని ఆహ్వానించి, ప్రభుత్వ భూముల్లో నాటించాడు. అధ్యక్షుని హోదాలో వీరస్వామి ప్రతి సంవత్సరం దసరా పండుగకు నెల రోజుల ముందు గీతవనం మండువ దగ్గరున్న ఎల్లమ్మ గుడి ముందు గీత కార్మికుల సమావేశం ఏర్పాటుచేసి, అందరి సమక్షంలో మిద్దెలేసి, తాడిచెట్లు పంచేవాడు. ఆ పంపకంలో చెట్లు మారుతుంటాయి. అదృష్టవంతునికి బాగా కల్లుపారే చెట్లు వస్తాయి. గొర్ల మందలతో గొర్రెలకు పేర్లు ఉన్నట్టే.. వనంలోని తాళ్లకు కూడా పేర్లు ఉంటాయి. ఆ పేర్లు కూడా గౌడ కులస్థులకే తెలుస్తాయి. రెండు పర్యాయాలు అధ్యక్షుని హోదాలో ప్రభుత్వ, ఇతర కార్యక్రమాలు నిర్వహించడం వల్ల తన గీతవృత్తికి సమయం సరిపోకపోవడం వల్ల అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నాడు వీరస్వామి. అతనికి రెండెకరాల పొలం ఉన్నది. ఇద్దరు పిల్లలు. బిడ్డ పెద్దది. ఆ తర్వాత ఐదేండ్లకు కొడుకు పుట్టాడు. బాబుకు సాయినాథ్ గౌడ్ అని పేరు పెట్టుకొని.. అల్లారుముద్దుగా పెంచాడు. బిడ్డను పట్నంలోనే ఒక ల్యాబులో పనిచేసే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. కొడుకు ఊళ్లోనే పది దాకా చదివి, ఆ తర్వాత డిగ్రీదాకా పట్నంలో చదివాడు.
గౌడ కులస్థులకు వాళ్ల సంప్రదాయం ప్రకారంగా దసరా పండుగకంటే 15 – 20 రోజుల ముందు కొత్త మామూలు ప్రారంభం అవుతుంది. వనంలోని ఎల్లమ్మ తల్లి గుడికి రంగులు వేసి, దానిచుట్టూ ఈత, తాటి కమ్మలతో విశాలమైన పందిళ్లు వేసి.. వారం రోజులు జాతర చేస్తారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాధనగాళ్లతో గౌడ పురాణాలు చెప్పిస్తారు. పిల్లాపెద్దా అందరూ కలిసి గొర్రెలు, మేకలు, కోళ్లు కోసుకొని వంటలు చేసుకొని ఆనందంగా ఆరగిస్తారు. వాతావరణం సహకరించి చెట్లు బాగా కల్లు పారాలనీ, ప్రమాదాలు జరగకుండా కాపాడాలనీ ఎల్లమ్మ దేవతను వేడుకుంటారు. మోకులు, ముత్తాడులు పాతవడినట్లయితే.. వాటి స్థానంలో తిరిగి కొత్తవాటిని తయారు చేసుకుంటారు. అటు పొలం పని.. ఇటు గీత పని చేసుకుంటూ రెండు సంవత్సరాల క్రితం పోద్దాళ్ల సీజన్ ప్రారంభంలో పాతమోకు స్థానంలో కొత్తది తయారుచేసుకోవాలని నిర్ణయించుకున్నాడు వీరస్వామి. పట్నం వెళ్లి దానికి కావాల్సిన దారాలు, సైకిల్ టైర్.. మరిన్ని వస్తువులు తెచ్చుకొని బందవస్తుగా తయారుచేసుకున్నాడు. పోద్దాళ్ల గెలలు, తాడిచెట్టు మట్టల నుంచి బయటికి వెళ్లగానే.. పాతమోకు స్థానంలో కొత్తమోకు పట్టుకొని వారం రోజులు తాళ్లు ఎక్కాడు వీరస్వామి. పోద్దాళ్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. మూడుసార్లు క్రమం తప్పకుండా గీయాలి.
ఆరోజు ఎప్పట్లాగే సూర్యోదయానికంటే ముందే ముత్తాడు నడుముకు కట్టుకొని, మోకు భుజానికి తగిలించుకొని కాళ్ల గుజ చేతపట్టుకొని వనానికి పోయాడు వీరస్వామి. తనకున్న మూడు పోద్దాళ్లలో రెండు ఎక్కి, రెండు కుండలలో కల్లు దించి తను కల్లు అమ్ముకునే స్థలం.. మర్రిచెట్టు కిందపెట్టి, మూడో చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. రాత్రంతా మంచు కురిసినందున చెట్టు తడిసి ఉంది. అలా మంచుతో తడిసిన తాళ్లు, ఈదులు ఎక్కి కల్లు గీయడం గౌడ కులస్థులకు మామూలు పనే! కానీ, కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు.
యథావిధిగా నడుముకు కట్టుకున్న ముత్తాడు మెనుక కత్తుల గుత్తిలోని రెండు కత్తులు తీసి, నెర్సుబండ పొడితోటి పదునుపెట్టి తిరిగి వాటిని గుత్తిలో పెట్టాడు. భుజానికున్న మోకును చెట్టుచుట్టూ వేసి.. ముడికి లాక్ చేసి, ఒక్కసారి మోకును సరిచూసుకున్నాడు. తర్వాత కాళ్లకు గుజి తగిలించుకొని, చెట్టుకు మొక్కి పైకి ఎగబాకాడు. చెట్టు తలభాగానికి చేరుకున్నాక.. నాలుగు గెలలకు కట్టిఉన్న కుండల్లోని కల్లును ఒక కుండలో పోసి.. కుండను ముత్తాడు వెనుక కొక్కానికి తగిలించి.. కత్తి తీసి గెలల కొనలు చెక్కి, ఎప్పట్లాగే వాటికి కుండలు కట్టాడు. కిందికి దిగుతూ ఉండగా.. మంచు తడి కారణంగా ఒక్కసారిగా మోకు జారింది. పట్టుతప్పి కిందపడిపోయాడు వీరస్వామి.
“అమ్మా!” అన్న గావుకేకతో.. సమీపంలో ఉన్న గౌడ కులస్థులు ఉన్నపళంగా పరిగెత్తుకొని వచ్చారు. వీరస్వామి మాట పోలేదు. కానీ, విపరీతమైన నొప్పితో లేవలేకుండా నడుం పట్టుకొని మూలుగుతున్నాడు. 108కి ఫోన్ చేస్తే.. ఆలస్యం అవుతుందని రోజూ కల్లు కోసం వనం దగ్గరికే వచ్చే ఒక ఆటోను మాట్లాడుకొని.. సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ వీరస్వామిని పరీక్షించిన డాక్టర్.. వెన్నుపూస ఎముకలో ఫ్రాక్చర్ అయ్యిందనీ, పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. వెంటనే పట్నం తీసుకుపోయి పెద్దాసుపత్రిలో చూపించారు. అక్కడ ఎక్స్‌రే తీసిన డాక్టర్.. వెన్నుపూసలో రెండుచోట్ల ఎముకలు విరిగాయని చెప్పాడు. అవి అతుక్కునే అవకాశం లేదనీ, జీవితాంతం మంచానికే పరిమితం అవుతాడనీ తేల్చిచెప్పాడు. 15 రోజులపాటు ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ అందించారు.
ఎక్సయిజ్ అధికారులు పంచనామా చేసి, పైఅధికారులకు నివేదిక సమర్పిస్తే.. ఆరు నెలల్లోపే వీరస్వామిని శాశ్వత వికలాంగుడిగా గుర్తించి, తనకు రావాల్సిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు సాయినాథ్ డిగ్రీ పూర్తిచేసినా.. ఏదో ఒక పనిచేసుకొని సంపాదించుకునే స్థాయికి వచ్చినా.. అతిగారాబం కారణంగా ఇటు గీతవృత్తి పని, అటే వేరే ఏదైనా పనిచేయడంపై దృష్టిపెట్టకుండా, బండి పట్టుకొని స్నేహితులతో కలిసి ఆవారాగా తిరుగుతున్నాడు. వీరస్వామి భార్య వరమ్మ నిస్సహాయురాలై తీవ్ర మనస్తాపంతో బాధపడుతున్న సమయంలో వీరస్వామి స్నేహితుడు పరంధాములు గౌడ్ ముందుకొచ్చి..
“అక్కా! నువ్వేం బాధపడకు. స్వామి బావ బాపతు తాళ్లు, ఈదులు నేను చూసుకుంటా!” అని భరోసా ఇచ్చాడు. తనకు కష్టమైనా, వీరస్వామి బాపతు తాళ్లు, ఈదులు గీసుకుంటూ, వాటికి పారిన కల్లును వరమ్మకు అప్పగిస్తున్నాడు పరంధాములు. అప్పటినుంచి వరమ్మే తనకు వచ్చిన కల్లు వాటాలో పరంధాములు కష్టానికి ప్రతిఫలంగా కొంత కల్లును అప్పగించి, మిగలిన కల్లును వనం మండువాలో అమ్ముతున్నది. వచ్చిన డబ్బుతో భర్త ఆలనాపాలనా చూసుకుంటూ.. వీరస్వామికి పసిబిడ్డలా సేవలు చేస్తూ జీవనం సాగిస్తున్నది.
* * *
కాలకృత్యాలు తీర్చుకొని చక్రాల కుర్చీలో మంచం దగ్గరికి వచ్చాక.. వీరస్వామిని మెల్లిగా కుర్చీలోంచి లేపి, మంచంలో పడుకోబెట్టింది వరమ్మ. ఒక గ్లాసులో చాయ, చిన్న ప్లేటులో నాలుగు బిస్కెట్లు తెచ్చి, తినిపిచ్చి.. చాయ తాగించింది. ఇంతలో బయటినుంచి..
“అక్కా..” అన్న పరంధాములు పిలుపు విని, ఖాళీ చాయగ్లాసు, ప్లేటును పక్కనున్న స్టూలుపై పెట్టి.. వేసుకోవాల్సిన ట్యాబ్లెట్లను భర్త చేతిలో పెట్టి..
“ఆ.. వత్తన్న వత్తన్న తమ్మీ!” అంటూ, బయటికి వెళ్లింది వరమ్మ.
“అక్కా.. ఇప్పుడిప్పుడే పోద్దాళ్ల గెలలొత్తాన్నయ్. మొన్న జెప్పినగదా! కొత్త కుండలు కట్టాల్నని. తెచ్చినవా!?” అంటూ, తన బండి స్టాండ్ వేసి అడిగిండు పరంధాములు.
“ఆ.. తెచ్చిన తమ్మీ! నిన్న మాపటీలే కుమ్మరి కొంరయ్య ఇంటికి పోయి.. నాలుగు కుండలు తెచ్చిన. అగో.. ఇప్పుడే మంచిగ పీసేశి కడిగి, ఎండపొడకు ఆరబెట్టిన!” అంటూ, కుండల దిక్కు చూపించింది.
“ఎంతకోటి వడ్డది.. రేటు బాగనే పెంచిండట కదా.. కొంరయ్య!”.
“అవును గావచ్చు. శిన్నదైనా, పెద్దదైనా.. కుండకు వంద రూపాలన్నడు. కొసరంగ కొసరంగ ఎనభైకొకటి ఇచ్చిండు!”.
“ఏదో పోనీతియ్! అన్నిటికీ ధరలు పెరుగుతున్నయి గదా! శెర్లకెల్లి మట్టిదెచ్చి, నీళ్లు వోశి కలిపి.. ర్యాకమీద ఇగురంగ వంగి, కుండ జేశి.. తీసి ఎండవెట్టి.. ఉనుక, కట్టెలతోని బట్టీవెట్టి కాలువాల్నంటె వట్టిగనే అయితదా!? అవుగని అక్కా.. బావకెట్లున్నది?”.
“గట్నే ఉన్నది తమ్మీ! ఇగ లేశి తిరిగే ఆశలేదు. వయసు గూడ పెర్గుతాంది గదా! మనిషింకా శాతగాకుండ అయితాండు. కొడుకు శేతికొచ్చిండుగనీ.. వాని ఆసరా అసలే లేదు. తింటాండు. బండేసుకొని బజార్లపొంటి తిరుగుతాండు. ఈ రోజులల్ల పిల్లగాండ్లను ఏమనేటట్టు లేదు!”.
“మరి వాని ఖర్సులు ఎక్కడినుంచి వస్తున్నయక్కా!?”.
“ఏమున్నది తమ్మీ! వాళ్ల నాయిన శెట్టుమీది నుంచి పడ్డంక.. గవర్నమెంటు ఇచ్చిన ఐదు లక్షలు బ్యాంకుల ఉన్నయి గదా! అదేదో ఏటీఎం కార్డని తీసుకచ్చిండు. నా అవసరం ఉన్నా, వానికి అవసరం ఉన్నా.. గా కార్డు తీసుకపోయి పైసలు తీత్తాండు. ఉట్టుట్టి ఖర్సులైతే పెడుతలేడనుకో..!”.
“గట్లయితే మంచిదేగనీ.. గవర్నమెంటు నౌకరీ ఇప్పట్లో రాదు. పట్నంవోయి ఏదో కంపెనీల ప్రయత్నం చేసుకోవచ్చు గదా అక్కా!.. అక్కడ బొచ్చెడు కంపెనీలు ఉన్నయి. దేంట్లనో వోదాంట్ల జేరితే.. కనీసం పదివేలన్నా జీతం ఇత్తరు గదా!”.
“అప్పుడప్పుడు నేనూ, మీ బావ గదే మొత్తుకుంటున్నం. ‘సూద్దం తియ్యి!’ అంటడుగనీ.. పోతనేలేడు. నువ్వన్నా ఒక్కసారి శెప్పి సూడరాదు తమ్మీ!”.
“అబ్బో! మీరు జెప్తనే ఇననోడు. నేను జెప్తె ఇంటడా!? అయినా.. ఒక పనిజేత్త అక్కా!”.
“ఏం పని తమ్మీ!?”.
“రెండ్రోజుల తర్వాత తాళ్లల్ల నుంచి వచ్చినంక సాయిని మా ఇంటికి తోలుకపోత. ఆమాటా ఈమాటా మాట్లాడి.. ‘తాళ్లెక్కి కష్టపడే మీ నాయిన మంచంల వడె. ఏదో నాకింత తిప్పలైనా.. మీ నాయిన శెట్లుగూడ నేనే గీశి, కల్లుదీశి మీ అమ్మకిత్తె వనంల అమ్ముకోవట్టె. పాపం ఆడమనిషి. ఇంట్ల పని, బయటి పని జేసుకోలేక సతమతం గావట్టె. మన కులవృత్తి గీతపని నేర్సుకో!’ అని జెప్త. ఇటు మన పని జేసుకుంట, అటు ఉద్యోగ ప్రయత్నం గూడ చేసుకోమ్మని సంజాయిస్త. సమ్మతమనిపించి సరేనంటే.. నా ఎంబడి తీస్కపోయి, మోకు పట్టించి.. గీతపని నేర్పిస్త. ఏమంటవక్కా!?”.
“నేనేమంట.. గట్ల మంచిపని చేత్తనంటే.. నేను కాదంటనా!? గట్లనే కానీయ్ తమ్మీ!”.
“సరేగనీ.. తాళ్లకు టైమయితాంది. రొండు కొత్త కుండలు బండిమీద తీసుకపోత. నువ్వు తీరిగ్గా మిగిలిన రొండు కుండలు తీసుకొని రా. అన్నట్టు.. మాటల్ల మర్శిపోయిన. వీరస్వామి బావను పలుకరించి పోత..” అంటూ, ఇంట్లోకి పోయిండు పరంధాములు.
* * *
పోద్దాళ్లు బాగా ముదిరి కల్లు పుష్కలంగా పారుతున్నది. రోజురోజుకూ వనంలో జనం తాకిడి ఎక్కువ అవుతున్నది. కల్లు మండువ చిన్నపాటి జాతరలెక్క ఉన్నది. తన పాలుకు వస్తున్న కల్లు అమ్ముకోవడంతో వరమ్మ చాలా ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఉండబట్టలేక కొడుకు సాయినాథ్ సాయం అడిగింది. అందుకు వాడు ససేమిరా అని..
“మొన్న పరంధాములు మామ వాళ్ల ఇంటికి పిలిచి.. నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి, నీ కష్టం గురించీ మాట్లాడి మన కులవృత్తి గీతపని నేర్చుకోమని చాలా ఫోర్స్ చేసిండు. తాళ్లు, ఈదులు గీసుడు, కల్లు అమ్ముడు నాతో కానిపని అని చెప్పిన. అది రిస్కుతో కూడుకున్న పని. అందుకే, మనూళ్లె చాలామంది గౌండ్లోళ్లు పట్నంబోయి ఏదో ఒకపని చేసుకొని బతుకుతున్నరు. ముఖ్యంగా నాతోటోళ్లు. నేనుగూడ పట్నంబోయి.. ఏదో ఒకపని చూసుకుంట. నన్ను బలవంత పెట్టకు!” అంటూ కసురుకున్నాడు.
కొడుకు మాటలకు వరమ్మ మనసు కలత చెందింది. చేసేది లేక బాధను, వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని భర్త తిండికి ఏర్పాటుచేసి, సద్ది తీసుకొని మండువకు బయల్దేరింది.
ఒకరి తర్వాత ఒకరు కల్లు ప్రియుల తాకిడికి వరమ్మకు క్షణం తీరిక లేకుండాపోయింది. మధ్యాహ్నం అన్నం తినే సమయం కూడా దొరకలేదు. ఏదో శక్తిని కూడగట్టుకొని సాయంత్రం వరకూ మొత్తం కల్లు అమ్ముకొని.. వచ్చిన డబ్బులు కూడా లెక్కపెట్టుకునే ఓపికలేక సద్ది సంచిలో భద్రంగా దాచుకొని ఇంటికి బయల్దేరింది. సరిగ్గా ఇంటి గడపలోకి అడుగుపెట్టగానే.. నిలువునా నరికిన చెట్టులా కిందపడిపోయింది.
“అయ్యో వరం..” అంటూ, గట్టిగా మొత్తుకుంటూ మంచంలోంచి లేవబోతూ దిండుపై వాలి.. సెల్లు తీసుకొని కొడుక్కు ఫోన్ చేశాడు వీరస్వామి. పది నిమిషాల్లో సాయినాథ్ వచ్చి, ఆటో మాట్లాడుకొని అమ్మను దగ్గర్లోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. డ్యూటీ డాక్టర్ పరీక్ష చేసి, నీరసం వల్ల బీపీ బాగా పెరిగిపోయి పడిపోయిందని చెప్పాడు. కొన్ని మందులు ఇచ్చి, రాత్రంతా అక్కడే ఉంచుకొని మర్నాడు డిశ్చార్జ్ చేశాడు. వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు. సాయినాథ్.. పట్నంలో ఉన్న అక్కకు ఫోన్ చేసి విషయం చెబితే, వెంటనే బయల్దేరి వచ్చింది లక్ష్మి.
* * *
వీరస్వామి ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక దిక్కు వీరస్వామి.. మరో దిక్కు వరమ్మ. మంచంలో కదలకుండా పడుకొని ఉన్నారు. వరమ్మ కూతురు లక్ష్మి వంటగదిలో పనిలో నిమగ్నమై ఉంది. అమ్మ మంచం పక్కన కుర్చీలో కూర్చొని దీర్ఘాలోచనలో పడ్డ సాయినాథ్.. ఏదో నిశ్చయానికొచ్చి కుర్చీలోంచి లేచి సెల్ తీసుకొని బయటికి వచ్చాడు.
“పరంధాములు మామా! నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒక్కసారి ఇంటికి వచ్చిపోవా!?” అని చెప్పి, తిరిగి ఇంట్లోకి వచ్చాడు. వరమ్మ పడిపోయిన సంగతి తెలిసి, అప్పటికే వద్దామనుకున్న పరంధాములు.. సాయినాథ్ ఫోన్‌తో పావుగంటలోనే పరిగెత్తుకొచ్చాడు. వస్తూనే..
“అక్కెట్లున్నది? రాత్రే తెలిసింది వరక్క కండ్లు తిరిగి పడిపోయిందని!” అంటూ వరమ్మ దగ్గరికి వెళ్లాడు. మంచం దగ్గర ఉన్న కుర్చీలో కూర్చొని, పలకరించాడు.
“అమ్మకు బాగా నీరసంగా ఉంది మామా! బీపీ బాగా పెరిగి కండ్లు తిరిగి పడిపోయింది. వారం రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోమన్నాడు డాక్టర్!” అంటూ కంటి తడిని తడుచుకున్నాడు సాయినాథ్.
“అంతా ఖర్మ! నాన్నకు జీవితాంతం మంచమే గతి అయ్యిందనుకుంటే.. ఇప్పుడు అమ్మకేమో ఈ గతి పట్టే! మూలిగే నక్కమీద తాటిపండు వడ్డట్టాయె!” అంటూ బాధపడ్డాడు పరంధాములు.
“అవును మామా! మా కుటుంబం అనే బండికి రెండు చక్రాలు నాన్న – అమ్మ! ఆ రెండూ ఇప్పుడు చతికిలబడి పోయాయి. అక్క బావతో పట్నంలో సంతోషంగా ఉంది. మిగిలింది నేను. ఇక వీళ్లకు దిక్కెవరు? నేనే కదా మామా! చిన్నదో పెద్దదో పట్నంలో ఏదో ఒక ఉద్యోగం వెతుక్కున్నా.. వీళ్లను ఇక్కడే విడిచి పోవాలి. అప్పుడు వీళ్ల గతి ఏం కావాలి? అందుకే, బాగా ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చిన.. పరంధాములు మామా!”.
“ఏం నిర్ణయం రా!?”.
“ఆరోజు నువ్వు నన్ను మీ ఇంటికి పిలిచి.. మా నాన్న పరిస్థితి, అమ్మ పడుతున్న కష్టాలు, నా భవిష్యత్తు గురించి మాట్లాడిన మాటలు పెడచెవిన పెట్టాను. ఆ మాటలే ఇప్పుడు నా చెవుల్లో సుద్దులుగా మారుతున్నాయి. నువ్వన్నట్టు.. ఉద్యోగం కులవృత్తికంటే మించింది కాదు. ఆ వృత్తికి సాటి మరేది రాదు”.. అంటూ, పక్క గదిలోకి వెళ్లి, చిలుక్కొయ్యకు తగిలించి ఉన్న మోకును తీసుకొని వచ్చాడు సాయినాథ్.
“ఇదిగో మామా! నాన్న ఎంతో ఇష్టంతో తయారుచేసుకున్న మోకు! ఈ కొత్త మోకుతోనే నేను గీతపని నేర్చుకుంట. ఇక వనంలోకి పోదాం పద మామా!” అంటూ మోకును భుజానికి తగిలించుకున్నాడు సాయినాథ్ గౌడ్.
కూతురు రాంరెడ్డి
కథకుడిగా, నటుడిగా బహుముఖ ప్రజ్ఞ చాటుతున్నారు కూతురు రాంరెడ్డి. ఈయన స్వస్థలం కరీంనగర్ జిల్లా సైదాపూర్. బీకాం చదివారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగ విరమణ పొందారు. 1970 నుంచి కథలు, కవితలు రాస్తున్నారు. ఇప్పటివరకూ 150 కథలు, 60 కవితలు రాశారు. కొత్తచివుళ్లు, జారుడు బండలు, కాలుతున్న కట్టెలు, గాలిలో తేలిపోతున్నాం (అమెరికా అనుభవ కథలు), బతుకమ్మ, నీరడిమడి, నేను నా యోగా పుస్తకాలను వెలువరించారు. ఉద్యోగిగా.. ఎక్సైజ్ శాఖలో 3 సార్లు ఉత్తమ సేవా పతకాలు అందుకున్నారు. 1995లో ఎక్సైజ్ శాఖ నిర్వహించిన రాష్ర్టస్థాయి నాటికల పోటీలో ‘లవ్ పాఠాలు’ నాటకంలో నటించి.. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతులమీదుగా ఉత్తమ నటుడిగా బహుమతిని దక్కించుకున్నారు. ‘తుమ్మల’ రంగస్థల పురస్కారం, భారత్ కల్చరల్ అకాడమీ హైదరాబాద్ నుంచి ‘విశిష్ట కళారత్న’ అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘కీర్తి పురస్కారం’ అందుకున్నారు.
– కూతురు రాంరెడ్డి
90004 15353
Read Today's Latest Stories News in Telugu and Telugu News
- Tags
- kathalu
- stories
- story
- sunday story
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

