ఫుట్ బాల్
“ఏమండీ! ఈసారి అక్టోబర్‌లోనే రెండు పండగలొస్తున్నాయ్! మీ అమ్మను రెన్నెల్లు మీ తమ్ముడి దగ్గరే ఉండేట్టుగా చూడండి. దసరా-దీపావళి పండగ రోజుల్లో నేను ఆమె మొహం చూస్తూ సేవలందించలేను”.. శుక్రవారం పొద్దటిపూట తలస్నానం చేసి, తలపై టర్కీ టవల్‌ను గోవర్ధనగిరిలా చుట్టుకొని, పూజకు సిద్ధమవుతూ.. భరించే మనిషికి హుకుం జారీచేసింది జయంతి. సునీల్ లాప్టాప్ స్క్రీన్ వైపే సీరియస్‌గా చూస్తూ.. వేళ్లను టకటక లాడిస్తున్నాడు. వేళ్లనొక్కులు తెరపై అక్షరాల రూపంలో కనిపిస్తున్నాయి. తన మాటలు సునీల్ చెవుల్లోకి దూరలేదని నిర్ధారించుకున్నది. మెల్లిగా అడుగులేస్తూ.. సునీల్ వెనక నిల్చుంది.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.వెయ్యి బహుమతి పొందిన కథ.
“ఏమండీ! ఈసారి అక్టోబర్‌లోనే రెండు పండగలొస్తున్నాయ్! మీ అమ్మను రెన్నెల్లు మీ తమ్ముడి దగ్గరే ఉండేట్టుగా చూడండి. దసరా-దీపావళి పండగ రోజుల్లో నేను ఆమె మొహం చూస్తూ సేవలందించలేను”.. శుక్రవారం పొద్దటిపూట తలస్నానం చేసి, తలపై టర్కీ టవల్‌ను గోవర్ధనగిరిలా చుట్టుకొని, పూజకు సిద్ధమవుతూ.. భరించే మనిషికి హుకుం జారీచేసింది జయంతి. సునీల్ లాప్టాప్ స్క్రీన్ వైపే సీరియస్‌గా చూస్తూ.. వేళ్లను టకటక లాడిస్తున్నాడు. వేళ్లనొక్కులు తెరపై అక్షరాల రూపంలో కనిపిస్తున్నాయి. తన మాటలు సునీల్ చెవుల్లోకి దూరలేదని నిర్ధారించుకున్నది. మెల్లిగా అడుగులేస్తూ.. సునీల్ వెనక నిల్చుంది. ఉలుకులేదు. పలుకు అంతకన్నా లేదు. టవల్ తీసేసి.. తలవెంట్రుకలను సునీల్‌పై మృదువుగా జాడించాలని అనుకొన్నది. తుంపరతోనైనా ఈ లోకంలోకి వస్తాడన్న ఆశ. ఇలాంటి చేష్టలు జయంతికి ఇష్టం. తెరపైన అంకెలు, గ్రాఫులు చూసి సీరియస్ పనిలో మునిగిపోయాడని వెనక్కి జరిగింది. సోఫాలో కూర్చొని సెల్‌ఫోన్ తీసింది.
ఫోన్లో సందేశం వచ్చిన మృదు సంగీతం వినగానే.. సునీల్ యాంత్రికంగా మెసేజ్ చూశాడు. జయంతి నుంచి.. ఏమీ తెలియనట్టుగా ఎటో చూస్తున్నట్టు నటిస్తున్నది జయంతి. ‘వచ్చేనెల మీ అమ్మను తీసుకురావద్దు. రెండు పండగలొస్తున్నాయ్! మీ తమ్ముడి దగ్గరే ఉండేట్టుగా చూడండి. నవంబర్-డిసెంబర్ మన దగ్గర పడుండనీ. దసరా-దీపావళి రోజుల్లో ఆమె మొహం చూస్తూ నేను సేవలందించలేను’.. తన మాటలే మెసేజ్ రూపంలో.. సునీల్‌కు సర్రున కోపం వచ్చింది. ముఖంపై కనబడనీయకుండా పని కొనసాగించి డాక్యుమెంట్ మూసేశాడు.నీళ్లుతాగి జయంతికి ఎదురుగా కుర్చీ లాక్కొని కూచున్నాడు. అపజయమెరుగని జయంతి! జయం దరిదాపుల్లోకి కూడా దూరలేని సునీల్!!
వారి పెళ్లయి మూడు దశాబ్దాలయ్యింది. ఒక్క కూతురు. రెసిడెన్షియల్ స్కూల్లో చదువుల పంజరపు చిలకై.. పై చదువుల కోసం స్వేచ్ఛా విహంగమై కెనడా వెళ్లింది.
* * *
గోడపై సంపూర్ణ కుటుంబ ఫొటో. అందులో నిత్యమూ నవ్వుతూనే ఉంటారందరూ! మధ్యలో మూలజంట. అటూఇటూ ఇద్దరు కొడుకులు. హత్తుకొని వారి భార్యలు. ప్రధాన జంటకు వెనకాల కూతురు – అల్లుడు. అమ్మ భుజాలపై ఆప్యాయతతతో ఆనించిన కూతురి చేతులు. అక్కడక్కడా.. పిల్లలు. ఫొటో నిండుగా సౌష్టవంతో ఉంది. ఫ్యామిలీ ఫొటోకు రెండడుగుల దూరంలో తండ్రి క్లోజప్ ఫొటో. సైజు పెద్దది. అద్దంపైనే అంటుకొన్న బొట్టు. ఎప్పటికీ చెదరని చిరునవ్వు. ఎన్నటికీ వాడని రంగురంగుల పూలమాల. ఆయన పెద్దబొట్టుతో, చిరునవ్వుతో గోడెక్కినప్పటినుంచే.. ఆమె నుదుటిబొట్టు మాయమైంది. నవ్వుకు సంకెళ్లు. కొప్పులో పూలు చుట్టుకోవిక. ఆమె అశుభమయ్యింది. సొంత ఇంట్లో.. పిల్లల ఇళ్లల్లో.. ఇరుగుపొరుగు వాడల్లో.. ప్రపంచానికే!
అంతకుమించి కన్నవారి హృదయాల్లో.. ఇంటికి కోడళ్లుగా వచ్చిన వారి మనసుల్లో మరీనూ!
ఆమెను దూరంగానే ఉంచాలి. మొహం చూస్తే అశుభం. ఇంట్లో శుభకార్యాలు జరిగితే దరిదాపుల్లో ఉండొద్దు. కొడుకుల ఇళ్లల్లో ఆమెకోసం చాటు గదులు. దాన్నే ప్రత్యేకగది అని గర్వంగా చెబుతారు.
ఇంట్లోనే ఉంటుంది. మనసుల్లో స్థలం లేదామెకు. వంతులవారీగా.. ఒక్కో నెల ఒకకొడుకు దగ్గర. తేదీలు తప్పని ఒప్పందం. శుభకార్యాలుంటేనో, పండగలొస్తేనో, సోషల్ పార్టీలు జరిగేదుంటే, ఇళ్లువిడిచి ప్రయాణాలు చేయాల్సివస్తే, దగ్గరి బంధువులొస్తే.. ఒప్పందాలు మెత్తబడతాయి. సర్దుబాట్లు తప్పవు. అందరికీ ‘ఆమె’ అక్కరలేదు. దూరంగా ఉంచాలి!
ఆమెలాంటి వారెందరో ఇంకా అశుభంగానే లెక్కించబడే ఒక ఆడ ప్రజాతి! ఒక్కొక్క సంతానాన్ని తొమ్మిదినెలలు ఏకధాటిగా కడుపులో పెంచిన తల్లి.. ఇప్పుడు కొడుకులవద్ద నిక్కచ్చిగా నెలలవారీగా.
* * *
ఆమె ఆయనకు ఎంతచెప్పినా వినలేదు. పెళ్లయిన కొన్నాళ్లకే తెలిసింది.. భర్తకు సిగరెట్టు పెదిమల మధ్యే ఉంటుందని. మానేయమని ప్రేమతో చెప్పింది. యాష్ ట్రే ఎప్పటి మాదిరిగానే నిండుతుంది. మరికొన్నాళ్లకు బుజ్జగించి చెప్పింది. ఫలితం శూన్యం. రాత్రిపూట తియ్యటి మాటల్తో చెప్పింది. ‘సరే!’ అన్నాడు. మరునాడే మరిచాడు. ఇలా ఎన్నిసార్లో! ఆయన దగ్గినప్పుడల్లా వింత శబ్దం.
“మీరు సిగరెట్టు తగ్గించకపోతే మీతో మాట్లాడను”.
“….”
“మీరు సిగరెట్టు మానెయ్యక పోతే నేను అన్నం ముట్టుకోను”.
“….”
“నువ్వు సిగరెట్టు తాగడం ఆపకపోతే నేను చస్తాను”.. ఏడుస్తూనే నిలదీసింది.
“….”
“మనిషివా? పశువ్వా? గొడ్డుకు నాలుగు దెబ్బలేస్తే వింటుంది. నీకెంత చెప్పినా బుర్రకెక్కదు”.
“….”
“నీ చావేదో నువ్వే చావు!”.
“చస్తాను!”..
సిగరెట్టు చివరన బూడిదను కప్పుకొన్న మంట.. పొగను పీల్చినప్పుడల్లా ఎర్రగా కనిపిస్తుంది. ఆ మంటలోని ఎరుపు కణాలు నోటిద్వారా, ఆ తరువాత గొంతుద్వారా నల్లబడ్డ ఊపిరితిత్తుల్లోకి చేరాయి. అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకొని మినుకుమినుకు మంటూ రోజుల్ని లెక్కబెడుతున్నాయి. శరీరంలోనే చితిమంటకు ప్రతిష్ఠానం!
కొన్ని రోజుల్లోనే ఎరుపు కణికలు ఇంటిబయట పిడకలతో రాజుకొంటున్న కణికల్లో కలిసిపోయాయి. సిగరెట్లను కాల్చిన శరీరాన్ని కాల్చడానికి సంసిద్ధమవుతున్నాయి. ఆమెకు ఏడుపురాలేదు. పోయినందుకు బాధేంలేదు. సిగరెట్టు పీల్చినప్పుడల్లా కనిపించే ఎర్రనిమంటే వెంబడున్న చితిమంటలా కనిపించేది. శరీరాన్ని మెల్లగా కాలుస్తున్నట్టుగా ఊహించుకొనేది. ఆ రోజు రానే వచ్చింది. సంసారజీవితం సమాప్తం. ఒంటరి స్త్రీ జీవితం ఆరంభం.
* * *
ఫ్యామిలీ ఫొటోలోని ప్రాణులందరూ, కీలక వ్యక్తి మినహా హాల్లో కూర్చొని ఉన్నారు. ఆమె ఎటోచూస్తూ అచేతనంగా ఓచోట శిలలా. ఆ రోజు చర్చాంశం.. ఆమె! పిల్లలు తమ సబ్జెక్ట్ కాదని టీవీ రూములోకి చేరి రక్తమాంసాల్లేని కార్టూన్ ఫిల్మ్ చూస్తున్నారు. హాల్లో రక్తమాంసాలతోపాటు భావోద్రేకాలూ నిండిన ప్రాణులు. ఆమె చుట్టూ ఎన్నో ఊరించే ఉపగ్రహాలున్నాయి. ఇల్లు, నగలు, బాంకు బ్యాలెన్సు. ప్రతినెలా వచ్చే పెన్షన్.. ఇంకా.. ఇంకా! పిల్లలు బాగా నవ్వుతున్నారు. కదలని కార్టూనే ప్రింటులో నవ్వు తెప్పిస్తుంది. తెరపై కదిలే కార్టూన్లంటే ఇంటి బాధ్యతలెరుగని పిల్లలకు మరెంతో ఇష్టం. పెద్దలు సీరియస్‌గా ఉన్నారు. ఆమె వింటూనే ఉంది. పిల్లలు తన భవిష్యత్తును నిర్ణయిస్తున్నారు. జీవితకాలాన్ని ముక్కలుచేసి నెలలవారీగా పం(ఉం)చుకొనే యోచన రూపం పోసుకొంటున్నది. తలుపుల్లేని చెవుల్లోకి చర్చల మాటలు దూరుతుంటే.. తన పిల్లలపట్ల ఆమెకు పరమ అసహ్యం కలిగింది. ‘నాలోంచేనా వీళ్లు పుట్టింది?’ అన్న అనుమానమూ వేసింది.
తరాజుల్లేకుండానే పంపకాలయ్యాయి. ఆమెను శారీరకంగా ముక్కలు చేయలేదు. కానీ, ఆమె భవిష్యత్తు కాలాన్ని నెలలకు కుదించి స్థానభ్రంశ ప్రణాళిక గీశారు. నెల పెద్దోడి వద్ద. నెల చిన్నోడి వద్ద. నెలమానం కచ్చితంగా పాటించాలి. ఒక్కరోజు అటు-ఇటు కాకూడదు. ఎవరి దగ్గరుంటే వారికే పెన్షన్. ఆమెకు ఇష్టం వచ్చినప్పుడు కూతురు దగ్గరికి. నెలకాగానే దిగబెట్టాలి. వచ్చి తీసుకుపోవడం ఎవరికీ కుదరదు. ఆమె విని లోలోపలే నవ్వుకున్నది. తన రాతలు నుదుటలేవని, పిల్లల చేతుల్లోనే ఉన్నాయని గ్రహించింది. పిల్లలు కడుపులో ఉన్నప్పుడు చేసిన కదలికల్ని.. ‘వీడు తన్నుతున్నాడు’ అని సంతోషాలతో, ఆ మధుర క్షణాల్ని భర్తతో, అత్తగారితో, తల్లితో పంచుకొనేది. పరు
గెత్తుకొంటూ వారు వచ్చి పొట్టపై చేయిపెట్టి చిట్టి కదలికల్ని ఆప్యాయతతో అనుభవించేవారు. లోపలున్నపుడు తీపి తన్నులు. ఇప్పుడు బయటినుంచి గట్టిగా తన్నుతున్నారు. గుండె పిండినట్టయ్యింది ఆమెకు.
* * *
ఆమె.. పిల్లలు నిర్దేశించిన మాస వలసల కాలెండరయ్యింది. సూర్యచంద్రోదయాల్లో తేడా ఉండొచ్చు. ఒక్క రోజు అటు ఇటూ కాదు. ప్రతినెలా చివరిరోజున ఆమె ఇల్లు మారుతుంది. రెండు ఇళ్ల మధ్యదూరం మూడువందల కిలోమీటర్లు. మార్పు కోసం అపుడప్పుడూ చిన్నమజిలీ కూతురి దగ్గర. అల్లుడుండేది పొరుగు రాష్ట్రంలో. ఇంటి దగ్గర్లో ఉన్న మైదానంలో పిల్లలు ఫుట్‌బాల్ ఆడుతున్నారు. అందరి దృష్టీ కదిలే బంతిపైనే! ఆటగాళ్లు బంతిచుట్టూ. బంతి కాళ్ల మధ్యలోంచి నెట్టువైపు దొర్లుతూ వెళ్లింది. ఆటగాడు పరుగెత్తి బంతిని మరోవైపున్న నెట్టువైపు లాంగ్ షాట్ కొట్టాడు. గాలిలో ఈదుతూ బంతి మరోవైపు. అక్కడున్న కిలాడీ.. బంతినాపి అంతే వేగంతో వచ్చినవైపే తన్నాడు. బంతి అటునుంచి ఇటు.. ఇటునుంచి అటు!
ఆమె అటునుంచి ఇటు.. ఇటునుంచి అటూ!
ఏళ్లు గడిచాయి. కొన్ని సవరింపులు. అవసరాలను బట్టి ఒక కొడుకు దగ్గర వరుసగా రెండునెల్లుంటే.. తరువాతి రెండునెల్లు ఇంకొకరివద్ద. పిల్లల పరీక్షలు ఉన్నాయని.. మీ ఇంట్లో పరీక్షలు రాసే పిల్లలులేరని.. మేము వచ్చేనెల్లో ఇంట్లో ఉండమనీ, మాకు బంధువులు వస్తున్నారనీ.. శుభకార్యాలున్నాయనీ.. సవరింపులు కాలక్రమేణా రూపం మార్చుకొన్నాయి. వచ్చేనెల మా ఇంట్లో శుభకార్యముందని.. ఆమె ఇంట్లో ఉండకూడదనీ.. వాళ్లు అలాచేస్తే మనమెందుకు చేయకూడదని కోడళ్లకు కొత్త కారణాలు దొరికాయి. బంతిని ఎవరు వారివారి మైదానాల్లో ఉంచుకోకుండా అటునుంచి ఇటు, ఇటునుంచి అటు.. తన్నుతూనే ఉన్నారు. తన్నుల్ని భరిస్తూ ఆమె ప్రయాణం చేస్తూనే ఉంది. చిన్నకొడుకు దగ్గరినుంచి పెద్దోడింటికి. పెద్దకొడుకు దగ్గరినుంచి చిన్నోడింటికి.
* * *
సునీల్ ఓపిగ్గా జయంతివైపే చూస్తున్నాడు. చూడనట్టుగా ఆమె నటన. సహజ ప్రవర్తన – నటనల మధ్య నిమిషం గడిచింది. నిద్రపోతున్నట్టు నటించేవారిపై ఎన్ని నీళ్లు కుమ్మరించినా లేపలేం! మరింత దగ్గరగా జరిగాడు. జయంతి తలతిప్పక తప్పలేదు. చేతుల్ని పట్టుకొన్నాడు.
“మీరు నన్ను ఓదార్చి ఒప్పించే ప్రయత్నం చేయొద్దు”.. చేతుల్ని వెనక్కి లాక్కొంటూ.
“నిన్ను బలవంతంగా ఒప్పించను. నీ సహకారం లేకుండా ఏదీచెయ్యను. సరేనా?”.
ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకొన్నారు.
“నాకొక మాటిస్తావా జయంతీ?” ప్రేమతో అన్నాడు సునీల్.
“మాటల గారడిలోకి దించొద్దు”.
“చెప్పాను కదా! నువ్వు ఒప్పుకోని పని చేయనని”.
“చెప్పండి”.
“రెండురోజుల ప్రయోగం. నేను చెప్పింది జాగ్రత్తగా విను. స్వతహాగా అనుభవించి అన్వయించుకొనే ప్రయోగం. నువ్వు నిజాయతీగా పాల్గొనాలి మరి”.
“తమాషాగా మాట్లాడకండి. వివరించి చెప్పండి”.
“కొన్నేళ్ల క్రితం మనం వార్తల్లో చదివాం.. గుర్తుంది కదూ? సాధారణ మనుషులు జైలు జీవితాన్ని ఒక్కరోజు అనుభవించడానికి సంగారెడ్డిలో, దిల్లీలోని తిహార్ జైల్లో.. ఎవరైనా ఒక్కరోజు జైల్లో గడిపిరావచ్చు”. విచిత్రంగా చూసింది సునీల్ వైపు. ఆమె మొహంలో భయం..
“భయపడకు! నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దు. మనింట్లోనే ప్రయోగం. ఒప్పుకొన్నట్టేనా?”. జయంతి సందిగ్ధంలోనే ఉంది. ‘ప్రయోగ వివరాలు తెలియకుండానే ఎలా ఒప్పుకోను?’.
“నువ్వు ఒప్పుకొంటే నేనూ ఓ రకంగా ఈ ప్రయోగంలో పాల్గొన్నట్టే!”.
“అయితే ఓకే”.
“నువ్వు అమ్మలా.. నేను నీలా!”.
“సరేలే! ఇప్పుడైనా క్లియర్‌గా చెప్పండి” చిరాగ్గా అన్నది జయంతి. సునీల్ జాగ్రత్తగా వివరించాడు.
‘గమ్మత్తుగా ఉందే! రెండు రోజులు ఇంట్లోనే కదా!’ అని జయంతి నవ్వుతూ ఉత్సాహంగా ఉంది. సునీల్ ప్రశాంతంగా ఊపిరిపీల్చాడు. రెండో శనివారం, మరునాడే వచ్చే ఆదివారం రంగానికి సిద్ధమయ్యాయి.
* * *
వచ్చినపుడల్లా ఆమెను ‘ప్రత్యేకంగా’ ఉంచే పైగదిలోకి జయంతి శనివారం పొద్దున్నే మారింది. వసతులు ఎప్పటిలాగే. అదనంగా ఏమీ ఉండవు. టీవీలో ఒకటే తెలుగు ఛానెల్. న్యూస్ పేపర్ ఉండదు. ఫోనులో కాల్స్ వస్తాయి. కానీ, తాను వేరే కాల్స్ చేయరాదు. తన పనులు తాను చేసుకొని గదిలోనే గడపాలి. సమయానికి తిండి వస్తుంది. మాట్లాడేందుకు ఎవరూ రారు. తాను కిందికి పోకూడదు. గృహిణి పాత్రలో సునీల్ ఇల్లు, కిచెన్ చూసుకోవాలి. సమయానికి తిండి పైకివెళ్లి ఇవ్వాలి. కావాల్సిన కనీసావసరాలు పైగదిలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. టీ, బిస్కట్లతో సునీల్ పైకి వెళ్లాడు. జయంతి శూన్యంలోకి చూస్తున్నది. టేబుల్‌పై కప్పుపెట్టి జయంతివైపు చూడకుండానే.. మాట్లాడకుండానే బయటకొచ్చాడు. ఆమెకు తాను అలాగే విసురుగా పెట్టి బయటపడే సంగతి గుర్తుకొచ్చింది. జయంతి టీవీ ఆన్ చేసింది. కాసేపు చూశాక బోర్. ఒకటే ఛానెల్ పెట్టించారు. కుర్చీలోంచి లేచి కిటిల్లోంచి బయటికి చూసింది. గదిలో అటూఇటూ అడుగులేసింది. ఎనిమిదిన్నర అవుతున్నది. సునీల్ ఉప్మాతో వచ్చాడు. టేబుల్ పైన పెట్టి.. ఖాళీకప్పు తీసుకొని వెళ్లాడు. సునీల్‌ను అదో విధంగా చూసింది. కాసేపు ఒరిగింది. నిద్ర రాలేదు. టీవీ చూసింది. పన్నెండవుతున్నది. కిందినుంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎవరో వచ్చినట్టున్నారు.
“ఒంటరిగా ఉన్నారా?”.. బంధువు అడిగాడు.
“అవును. జయంతి రెండ్రోజుల కోసం హైద్రాబాద్ వెళ్లింది”.
“మరైతే రాత్రికి మా ఇంటికి రండి భోజనానికి”.
“రెండ్రోజులే కదా! అన్నీ చేసే వెళ్లింది. మీకు తెలుసు.. నాకు వంట చేయడం ఇష్టమని”.
“వచ్చే నెల మీవంతు కదూ? అమ్మెప్పుడొస్తుంది? పండగలకు మీదగ్గరే ఉంటుందన్నమాట!”. జయంతికి సంభాషణ మెల్లిగా వినిపిస్తున్నది.
“అవునండీ! ఈసారి పండగలకు అమ్మ మాదగ్గరే. సంతోషంగా ఎదురుచూస్తున్నాం”.. సునీల్ జవాబు.
జయంతికి సర్రున కోపం. బంధువు వెళ్లిపోయినట్టున్నాడు. కింద నిశ్శబ్దం. లంచ్‌కు ఇంకా టైముంది. ఆమె వచ్చేనెలలో ఇంట్లో ఉండకూడదని అనుకొంటే.. ఈయనేమో పండగలకు తప్పక ఉంటుందని అంటున్నాడు. యుద్ధానికి జయంతి మాటల కత్తుల్ని పదునుపెట్టింది. సునీల్ పళ్లెంతో వచ్చి పెట్టివెళ్లబోతుంటే.. “మీతో మాట్లాడాలి” అన్నది కోపంగా. పట్టించుకోకుండా పెదవులపై నిలువుగా వేలును పెట్టి.. ‘మాట్లాడకూడదు!’ అనే సైగచేసి వెళ్లిపోయాడు.
రోజూ ఆమెతో ఏమీ మాట్లాడకుండా పళ్లెం పెట్టి విసురుగా వెళ్లే విషయం జయంతికి గుర్తుకొచ్చింది. నిమిషాలు గంటలుగా గడుస్తున్నాయి. టీవీ బోర్ బోర్. ఫోన్ అందుబాటులో లేదు. కిందికి దిగొద్దు. కాసేపు పడుకొందామని మంచంపై ఒరిగింది.
కునుకు పట్టిందో లేదో.. కింద పిల్లల మాటలు. పక్కింటి పాప తన బర్త్ డే కేకు ముక్కలతో వచ్చింది. వెంబడి చిన్నపిల్లల గుంపు. అరుపులు.. నవ్వులు.. జయంతికి ఆ గొంతులన్నీ పరిచయమే! కిందికిపోయి అందరినీ సరదాగా పలకరిద్దాం అనుకున్నది. ఒప్పందం ప్రకారం కిందికి దిగొద్దు. కళ్లలో నీళ్లు. సునీల్ పుట్టినరోజు కేకుముక్కను ఆమెకోసం తను గదికి పంపిన విషయం గుర్తుకొచ్చింది. సునీల్ పిల్లలతో క్యారమ్స్ ఆడాడు. ఆ వీధిలో పిల్లలు ఆయన్ని ‘క్యారమ్ అంకుల్’ అంటారు. జయంతి కూడ ఆడేది.
సమయం భారంగా గడుస్తున్నది. చీకట్లు పడుతున్నాయి. మొహంపై నీళ్లు చల్లుకుంది. కిటికీలోంచి బయటికి చూసింది. తెలిసినవారు తిరుగుతున్నారు. వీధి లైట్లు వెలిగాయి. గుడినుంచి పాటలు. అటూ ఇటూ తిరిగింది. మరో కిటికీ దగ్గరికెళ్లి చూసింది. ఎన్నో ఆలోచనలు! ఎన్నడూ ఇంత తీరిగ్గా ఉండని జయంతి బుర్రలోకి మరెన్నో ఆలోచనలు. సవాళ్లుచేసే ఆలోచనలు. వేడెక్కిన బుర్రతో మంచం దగ్గరికి వచ్చింది. టేబుల్‌పై డిన్నర్! సునీల్ ఎప్పుడు పెట్టివెళ్లాడో తెలియనే లేదు!
ఆమెతో మాటాముచ్చటా లేకుండా తాను ఎన్నిసార్లు టేబుల్‌పై పెట్టివెళ్లలేదు! ఠక్కున గుర్తుకొచ్చింది. పళ్లెం పట్టుకొని కిటికీ దగ్గరికెళ్లి బయటి లోకాన్ని చూస్తూ తినేసింది. రాత్రంతా నిద్రరాలేదు. ఏవేవో విషయాలు పీడించాయి. ప్రశ్నల పరంపర. గుర్తుకొచ్చి గుబులు నింపాయి. ఆమె మొహం స్పష్టంగా కనిపించింది. ఎన్నడూ లేనంత ప్రకాశవంతంగా! ఎంతో ఆప్యాయతతో తనవైపు చూస్తున్నది. తనవైపేకాదు.. తన భర్త, పిల్లలవైపు.. ప్రేమతో! వాత్సల్యంతో!
నిద్రలేక గదిలోనే తిరిగింది. కిటికీల దగ్గరికెళ్లి చూసింది. లోకం నిద్రలో ఉంది. ఎవరూ కనిపించలేదు. శూన్యం. అంతా శూన్యం! నిశ్శబ్దం! వచ్చి మంచంలో వాలిపోయింది.
* * *
మరునాటి ఉదయం. ఇప్పటికి వేయి ఆరు వందల నిమిషాలు గడిచాయి. సునీల్ టేబుల్‌పై టీ పెడుతున్నప్పుడు మెలకువ వచ్చింది. జయంతి మాట్లాడాలని ప్రయత్నం చేసింది. కానీ, ఒప్పందం గుర్తుకొచ్చి మౌనంగా ఉండిపోయింది. ‘బ్రేక్‌ఫాస్ట్ తెచ్చినపుడు ఎలాగైనా మాట్లాడుతా!’ అనుకున్నది. బ్రేక్‌ఫాస్ట్ సమయం వరకూ ఆగలేకపోయింది. ఇరవైఏడు గంటల్లో మొదటిసారి జయంతి గది దాటింది. పేపర్ చదువుతున్న సునీల్.. వేగంగా మెట్లు దిగుతున్న జయంతిని ఆశ్చర్యంతో అపరాధం చేస్తున్నదానిలా చూశాడు. “ఏమండీ! అత్తమ్మను నెలనెలా కాదు. ఎప్పటికీ మన దగ్గరే ఉంచుకుందాం. పాప గది కింద ఖాళీగానే ఉంది. దాన్ని ఆమెకోసం రెడీ చేద్దాం. వచ్చేనెలలో రెండు పండగలు వస్తున్నాయి కదా.. నాలుగు రోజులు ముందుగానే తీసుకొద్దాం! అత్తమ్మను తీసుకెళ్లడానికి వస్తున్నామని మీ తమ్ముడికి ఫోన్ చేయండి”.
టి. సంపత్ కుమార్
టి. సంపత్ కుమార్ స్వస్థలం నిర్మల్ జిల్లా ఖానాపూర్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, ఢిల్లీ ఐఐటీలో పీహెచ్డీ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతోద్యోగిగా పనిచేసి, ముఖ్య సలహాదారుగా విరమణ పొందారు. ప్రస్తుతం నిర్మల్‌లో ఉంటూ, వ్యవసాయం నేర్చుకొంటున్నారు. 1987 నుంచి కథలు రాస్తున్నారు. మొదటి కథ ‘బాగా సదుకో!’ 1987 ఆంధ్రప్రభ – సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. ఇప్పటివరకు 50 కథలు, ఒక నవల రాశారు. ‘లియోసా’, ‘పెన్నులు’, ‘నా నుంచి మన వరకు’ కథా సంకలనాలను వెలువరించారు. లియోసా, రించిన్, పెన్నులు, చంద్రి-78,000, తాతయ్య దంతం, అనగా అనగా ఒక దేశం కథలు పాఠకుల ఆదరణ పొందాయి. చంద్రి-78,000 కథ.. కేంద్ర సాహిత్య అకాడెమీ హిందీ సంకలనంలో చోటు దక్కించుకున్నది. లియోసా కథ.. ఐదు ప్రత్యేక సంకలనాల్లో ప్రచురితమైంది. ‘లియోసా’ సంకలనానికి జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు పురస్కారం దక్కగా, ఇందులోని కొన్ని కథలు ఇంగ్లిష్, పంజాబీ, హిందీల్లోకి అనువాదం అయ్యాయి. వివిధ కథలు ప్రముఖ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
-టి. సంపత్ కుమార్
98104 02895
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

