ఫెటిసైడ్
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.2 వేల బహుమతి పొందిన కథ.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.2 వేల బహుమతి పొందిన కథ.
వీరేశం జేబులోంచి సెల్‌ఫోన్ తీసి.. కొన్ని నంబర్లు ప్రెస్ చేశాడు. ఫోన్ రింగవుతున్నది. అవతలి వైపు ఫోన్ ఎత్తగానే..
“హలో.. డాక్టరమ్మా!” అన్నాడు.
“ఆ.. హలో! వీరేశమా?” అడిగింది డాక్టర్
కాత్యాయినీ సుగంధ.
“అవును డాక్టరమ్మా! మరొక కేసు వచ్చింది. ఇద్దరాడపిల్లల తల్లి. మూడో సంతానం మగ పిల్లవాడు కావాలని అత్త, మొగుడు తెగ సతాయిస్తున్నరంట. ఆడనో, మొగనో పరీక్ష చేయాలమ్మా! ఆడపిల్ల అయితే కడుపులోంచి పిండం తీసేయాలి”.
“సరే.. సరే.. తీసుకురా!”.
“పైసలు ఎంతనో చెప్పలేదు”.
“కొత్తగా చెప్పేదేముంది? పెళ్లయిన అమ్మాయి అన్నావు కదా! అన్నీ కలిపి పదివేలు ఇమ్మను”.
“అంతనా డాక్టరమ్మా! ఆరువేలు తీసుకో!”.
“వీరేశం.. బేరాలు పెట్టకు! నా ట్రీట్మెంట్ గురించి నీకు తెలుసు. ఏ విధంగానూ వంక పెట్టడానికి ఉండదని! ఆరోగ్యానికి కూడా ఢోకా ఉండదని!”.. కాస్త అసహనంగానే అన్నది డాక్టర్.
“ఎర్కేగని.. ఇంకో వెయ్యి కలిపి ఏడు తీసుకో డాక్టరమ్మా!”.. ఒప్పుకొమ్మని ప్రాధేయపడ్డాడు.
“అలా కుదరదు. పోనీ తొమ్మిదివేలు ఇవ్వమను!”.. కాస్త దిగివచ్చింది.
“కూలీనాలీ చేసుకునేటోళ్ల దగ్గర వేలకు వేలు పైసలుంటయా డాక్టరమ్మా?”.. వీరేశం వదిలిపెట్టలేదు.
“అబ్బా విసిగించకు! కృష్ణానగర్‌లో పెద్ద నర్సింగ్ హోమ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. నాకు కూడా చాలా డబ్బులు అవసరం ఉంటాయి కదా వీరేశం!”.. నచ్చ చెప్పబోయింది.
“ఇప్పటికి ఎందర్ని నీ దగ్గరికి తీసుకరాలేదు. అందరినీ ఒకేలా చూస్తే ఎట్ల!? ఇసొంటోళ్ల దగ్గర కొంచెం తగ్గాలె డాక్టరమ్మా!”.. పట్టుపట్టాడు వీరేశం.
“సర్సర్లే! ఎనిమిదివేలు తెమ్మని చెప్పు. ఇంక తగ్గించకు”.. కరాఖండిగా చెప్పేసింది.
“అలాగే డాక్టరమ్మా!”.. అనగానే అవతలి వైపునుంచి ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది.
అబార్షన్ చేయించుకునే యువతులకు – డాక్టర్ కాత్యాయినికి మధ్య వారధిలా పనిచేస్తుంటాడు వీరేశం.
కమిషన్‌గా డాక్టరమ్మ ఒక వేయి రూపాయలు అతనికిస్తుంది.
భర్తకు రెండోసారి కాల్ చేసింది కాత్యాయినీ సుగంధ.
అవతలి వైపునుంచి ఈసారి ఫోన్ లిఫ్ట్ కాగానే ఆనందాన్ని వ్యక్తపరుస్తూ..
“శ్రీవారూ! కంగ్రాచ్యులేషన్స్!” అంటూ తన భర్త కమల్‌నాథ్ కులకర్ణికి విషెస్ చెప్పింది.
భార్య సంతోషాన్ని షేర్ చేసుకుంటూ..
“సేమ్ టూ యూ! మై డియర్ లవ్..” అంటూ బదులిచ్చాడు కమల్‌నాథ్ ఉత్సాహంగా.
“నేను చెప్పకముందే తమరికెలా తెలిసింది?”.. బోలెడు ఆశ్చర్యపోయింది సుగంధ.
“పిచ్చిమొద్దూ! నువ్వు నాకు చెప్పినా, నేను నీకు చెప్పినా.. ఆ ఆనందకరమైన క్షణాలు మనిద్దరికీ చెందినవై ఉంటాయి కదా!” అన్నాడు హాయిగా నవ్వేస్తూ.
“యూ స్మార్ట్!”.
“ఇంతకూ విషయమేంటో చెప్పనే లేదు!”.
“ఇప్పుడే కన్ఫర్మ్ అయ్యింది! మనం భార్యాభర్తల నుంచి ఒక మెట్టు పైకి ఎక్కేశాం. తల్లిదండ్రులం కాబోతున్నాం”.. అంటుంటే, ఆనందంతో ఆమె గొంతు వణుకుతున్నది.
“వావ్! వాట్ ఏ గుడ్ న్యూస్! వెరీ హాపీ డియర్!” అంటూ తను కూడా ఎగ్జయిటింగ్‌గా ఫీల్ అయ్యాడు.
“సేమ్ విత్ యూ!” అంటూ నవ్వింది.
“ఇకనుంచి డాక్టర్‌గారు అన్ని విషయాల్లో చాలా కేరింగ్‌గా ఉండాలన్న మాట”.
“ష్యూర్!”.
“సో.. డాక్టరమ్మగా నర్సింగ్ హోమ్‌లో సమయాన్ని తగ్గించుకోవాలి. అమ్మగా బిడ్డ యోగక్షేమాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి” అన్నాడు క్యాజువల్‌గా.
“ఏం చేసినా, ఎంత సంపాదించినా పుట్టబోయే బిడ్డ కోసమే కదండీ!” అన్నదామె.
“కావచ్చు. కానీ కాత్యా.. నాకెందుకో నువ్వు చేస్తున్నది నచ్చడం లేదు. ప్లీజ్.. ఇకనుంచైనా నీ.. బిజినెస్ ఆపేసేయ్!” అన్నాడు.
‘ప్రాక్టీస్’ అనడానికి మనసొప్పక..
భార్య బదిలివ్వక పోయేసరికి ఆమె మూడ్‌ను అర్థం చేసుకున్న వాడిలా మాట మార్చేశాడు.
“అయ్యో! డాక్టర్గారికి పుట్టబోయే శిశువు యోగక్షేమాల గురించి నేను జాగ్రత్తలు చెప్పడమేంటి?”.
“చాలు చాల్లెండి! తమరి ఆజ్ఞానుసారం మన బేబీతోనే రోజంతా గడిపేస్తాను. సరేనా? అయినా అందుకింకా బోలెడు టైముందిగా!”.
“అవుననుకో!”.
“బయట పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. రిపోర్ట్స్ రాగానే కాల్ చేశాను. ఇంటికి వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం. బైబై!” అంటూ ఫోన్ పెట్టేసింది.
నర్సు లోపలికి వెళ్లడానికి అనుమతించగానే.. తన కూతురిని వెంటపెట్టుకొని విచార వదనంతో ఒక మధ్యవయస్కురాలు కన్సల్టింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టింది. డాక్టర్ కాత్యాయినీ సుగంధ కనిపించగానే.. రెండు చేతులెత్తి నమస్కారం చేసిందావిడ. వాళ్లు తనకు ఎదురుగా కూర్చోగానే..
“ఏంటి ప్రాబ్లం? చెప్పమ్మా!” అడిగింది కాత్యాయిని.. ఆ మధ్య వయస్కురాలిని. వెంటవచ్చిన అమ్మాయి వంక తీక్షణంగా చూస్తూ..
“ఇది నా కూతురమ్మా! ఎవడితోనో కడుపు చేయించుకుంది. ఈ గండం నుంచి ఎలాగైనా మీరే కాపాడాలి”.. మరోమారు చేతులెత్తి దండం పెట్టింది.
“ఇరవై ఐదు వేలు అవుతుంది. ఓకే కదా!”.. ఠకీమని చెప్పింది డాక్టర్ కాత్యాయినీ సుగంధ.
పెదవి విప్పబోయిన ఆ తల్లికి అవకాశం ఇవ్వకుండా..
“నాకీ అబార్షన్ ఇష్టం లేదు!”.. తలదించుకుని కూర్చున్న ఆ అమ్మాయి సర్రున తలెత్తి, తన నిరసనను వ్యక్తపరిచింది.
“నువ్వొక కుంతీదేవివి. ఆ పనికి మాలినోడు పెళ్లి కాకుండానే బిడ్డను వరమిచ్చాడు. పిచ్చి వాగుడు ఆపి.. నోర్మూసుకొని కూర్చో!”.. ఎదురుగా డాక్టర్ ఉన్నదన్న విషయమే మరిచి, కూతురి మీద గట్టిగా అరిచింది తల్లి.
డాక్టరమ్మకు రెండు చేతులెత్తి దండం పెడుతూ..
“ప్లీజ్.. డాక్టర్! భ్రూణహత్య నాకిష్టం లేదు. ఇందులో మా ఇద్దరి తొందరపాటు ఉంది. వాడెవడో అవసరం తీరాక పెళ్లి చేసుకోలేక పోయినంత మాత్రాన.. నేనీ బిడ్డకు తల్లిని కాకూడదా? పెళ్లి కాకుండా నేను సింగిల్ పేరెంట్‌గా బతకకూడదా?”.. ఆత్మవిశ్వాసంతో ప్రశ్నించింది ఆ లేత వయసు అమ్మాయి.
“మన కుటుంబం పరువు – ప్రతిష్ట మంట కలపడానికి కాకపోతే నీకిదేం పోయేకాలం? చెప్పింది బుద్ధిగా విను!”.. కూతురి మీద కయ్యిమని అంతెత్తున లేచింది తల్లి.
“మీ పరువుకు ఎలాంటి ముప్పు జరగదులే! మీకు దూరంగా నా బతుకేదో నేను ఒంటరిగా బతకగలను”.. రోషంగా తల్లికి సమాధానమిచ్చిందా అమ్మాయి.
“నువ్వు తల్లివి కావాలనుకుంటే.. ఈ తల్లి ఆయుష్షు ముగుస్తుంది. ఏదో ఒకటి తేల్చుకో.. జాగ్రత్త!”.. కళ్లెర్ర చేసిందావిడ.
“చూడమ్మాయ్! బాగా ఆలోచించు!”.. కలుగజేసుకుంది డాక్టర్ కాత్యాయిని.
ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి తిరిగి పెదవి విప్పింది డాక్టర్.
“చిన్నపిల్లవు. పెళ్లి కాకుండానే తల్లి కావడం అంత మంచిది కాదు. నీలాగే మోసపోయిన అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. పాపాన్ని తుడిచేసుకుని నిర్భయంగా బతుకుతున్నారు. మంచి, చెడు ఆలోచించాకే మీ అమ్మ ఈ నిర్ణయానికి వచ్చి ఉంటుంది! కన్నతల్లి మాట వినడంలో అంతా మంచే జరుగుతుంది. చెడు జరగదు కదా! నువ్విలా మొండిపట్టు పట్టడంలో అర్థం లేదు”.. ఆ అమ్మాయికి హితబోధ చేసింది డాక్టర్ కాత్యాయిని. ఆ అమ్మాయి తలొంచుకుని మౌనంగాఉండిపోయింది.
“డాక్టరమ్మా! మీ పని మీరు కానివ్వండి. డబ్బు గురించి ఆలోచించకండి. నాకు కావాల్సింది నా కూతురు క్షేమం. కాకపోతే మూడో కంటికి ఈ విషయం తెలియనివ్వకపోతే చాలు!”.
ఆ తల్లి తిరిగి రెండు చేతులూ జోడిస్తూ ప్రాధేయపడింది. ఆ అమ్మాయి పేచీ పెట్టలేదు. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు.
“నా దగ్గరికి ఎవరు వచ్చినా నమ్మకంతోనే వస్తారు. ఈ విషయం మన ముగ్గురి మధ్య రహస్యంగానే ఉంటుంది. భయపడకండి. నిశ్చింతగా ఉండండి!” అంటూ భరోసా ఇచ్చింది డాక్టర్.
“చాలా ఆతృతగా ఉందండీ!” అన్నది కాత్యాయిని, కాస్త టెన్షన్‌కు గురవుతూ.
“దానికింత కంగారెందుకు?”.
“పుట్టబోయేది అబ్బాయో.. అమ్మాయో తెలిసేదాకా నాకిలాగే ఉంటుందండీ!”.
“ఎవరైతే ఏంటీ? బేబీ అయినా, బాబు అయినా మన రక్తం పంచుకొని పుట్టబోతున్న శిశువు. చిరునవ్వుతో స్వాగతిద్దాం!”.
“అమ్మో? ఈ ఉత్కంఠ భరించడం నా వల్ల కావడంలేదండీ! నాకెందుకో బాబైతే బాగుండనిపిస్తున్నది”.. తన మనసులోని మాట బయటపెట్టింది.
“అలాంటప్పుడు ఆ రేడియాలజిస్ట్ నిన్న స్కానింగ్ చేసినప్పుడే జెండర్ తెలుసుకోవాల్సింది. ఈ రోజు దాకా ఆగడం దేనికి? టెన్షన్‌కు గురికావడం దేనికి?” అడిగాడతను.
“నిన్న మంచిరోజు కాదని ఆ విషయం దాచిపెట్టమని చెప్పాను. ఇంకొక ఐదు నిమిషాల్లో శుభ ఘడియ రాబోతుంది. ఆ సమయానికే కాల్ చేయమని ఆల్రెడీ చెప్పేశాను” బదులిచ్చింది కాత్యాయిని.
ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం.
ఐదు నిమిషాలు కాస్తా.. ఐదు యుగాలై భారంగా కరిగిపోతుండగా ఫోన్ రింగ్ అయ్యింది.
ఉద్వేగంతో చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ గ్రీన్ బటన్ నొక్కింది కాత్యాయిని. అవతలి నుంచి..
“హాయ్! గుడ్ ఈవినింగ్ కాత్యా! నువ్వు కోరుకున్నట్టే రిజల్ట్స్ వచ్చాయి. కంగ్రాచ్యులేషన్స్! మగ శిశువుకు జన్మనివ్వబోతున్నావ్! బీ కూల్!”.. రేడియాలజిస్ట్ ఫ్రెండ్ శివగామిని గొంతు వినిపించింది.
“థాంక్యూ! శివా! థాంక్యూ వెరీమచ్!” సంతోషంతో థ్యాంక్స్ చెప్పింది కాత్యాయిని.
“ఎంజాయ్! ఓకే.. బై!” అంటూ ఫోన్పెట్టేసింది రేడియాలజిస్ట్ శివగామిని.
పక్కనే కూర్చుని ఉన్న భర్త వైపు చూస్తూ..
“హమ్మయ్య! బాబేనట!” గాఢంగా ఊపిరి పీలుస్తూ భర్తకూ తీపికబురు అందించింది కాత్యాయిని.
“చూశావా! నువ్వు అనుకున్నవి అనుకున్నట్టే అన్నీ జరుగుతున్నాయి”.
“కావచ్చు. కానీ, మన చేతిలో ఏమీ ఉండదు కదండీ! పిల్లలు దేవుడిచ్చే బహుమతులు కదా!”.
“ఎనీ హౌ.. నీ ఆనందమే నా సంతోషం!”.
కులకర్ణి వాత్సల్యపు మాటలకు కాత్యాయిని ముఖం విప్పారింది. అనురాగాతిశయంతో భర్తను అల్లుకుపోయింది.
కొన్ని రోజులు గడిచాయి. తానొక డాక్టర్ అనే విషయం విస్మరించి కాత్యాయిని కళ్లు ధారాపాతంగా స్రవిస్తున్నాయి.. ఒక సాధారణ బాలింతరాలిలా. ఆమె ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నది. వాస్తవం అదే కనుక తప్పదు. కాత్యాయినికి నెలలు నిండాక నార్మల్ డెలివరీ కాలేదు. అందుకని ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసి మగ శిశువును ఈ ప్రపంచానికి పరిచయం చేసింది సీనియర్ డాక్టర్ వేదవతి ప్రభ.
“సో సారీ.. కాత్యాయినీ! నీకు పుట్టిన శిశువు మెంటల్లీ రిటార్టెడ్గా పుట్టాడు!”..
విషయం చెప్పి ఆ గదిలో నుంచి వెళ్లిపోయింది డాక్టర్ వేదవతి ప్రభ. అది వినగానే వేనవేల నీడిల్స్ ఒక్కసారిగా తన గుండెను గుచ్చినట్టు ఝల్లుమంది కాత్యాయినికి. చాలాసేపు షాక్‌లోనే ఉండిపోయింది.
‘ఎందుకిలా జరిగింది?’.. చాలాసేపు తనలో తనే మదనపడింది.
“నాకే ఎందుకిలా జరిగిందండీ?”.. తిరిగి పైకి అనేసింది.. పక్కనే కూర్చున్న భర్తకు వినిపించేలా. ఆమె ఆవేదనకు బదులుగా చాలా కూల్‌గా పెదవి విప్పాడు కులకర్ణి.
“దేనికీ ఆందోళన పడాల్సింది లేదు కాత్యా! జీవితంలో దేన్నయినా పాజిటివ్‌గా స్వీకరించే తత్వాన్ని అలవర్చుకోవాలి. పిల్లలు దేవుడిచ్చే బహుమతులని నువ్వే అన్నావు కదా! దేవుడు మనకు ఇలాంటి బహుమతి ఇచ్చాడనుకుందాం. అయినా ప్రకృతి అంటే అంతే కదా కాత్యా! మనం ప్రపంచానికి ఎంత ఇస్తే.. అంతే మనకూ దక్కుతుంది. అది వాస్తవం. సమాజానికి మనవంతుగా దుఃఖం పంచితే, మనకు మాత్రమే ఆనందం ఎలా మిగులుతుంది? నో.. నెవర్!”.
భార్య తన మాటలు వింటున్నదో లేదోనని కూడా ఆమెవైపు చూడలేదు కులకర్ణి. తన ధోరణిలో తను చెప్పుకొంటూ పోసాగాడు.
“ఇన్నాళ్లూ ఒక డాక్టర్‌గా నువ్వేం చేశావో ఒక్కసారి గుర్తుచేసుకో! డాక్టర్‌గా ఉమ్మనీరులోని ఆకృతికి ఊపిరిపోసి ప్రకృతిలోకి ఆహ్వానించాల్సింది పోయి.. ఏకంగా ప్రాణాలు తీస్తూ హత్యలకు.. భ్రూణహత్యలకు పాల్పడ్డావు. ఒక డాక్టర్‌గా నువ్వు చేయాల్సిన పని కాదది. అయినా నువ్వూ ఒక అమ్మవే కదా! ఏనాడు కూడా ఒక అమ్మగా ఆలోచించ లేకపోయావు. నీ చెంతకు వచ్చిన ఆడ కూతుళ్లకు కౌన్సెలింగ్ చేసి అబార్షన్ల బారినుంచి విరమించుకునేలా కనీస ప్రయత్నం కూడా చేయలేక పోయావు. నువ్వు తలుచుకుంటే అది సాధ్యమయ్యేది. భ్రూణహత్యలు జరగకుండా ఆపగలిగే దానివి. కానీ, ఎప్పుడూ అలాంటి మంచి పనికి పూనుకోలేదు. స్వార్థంగా, వ్యర్థంగా ఆలోచించావు”.. తాను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పేశాడు కులకర్ణి.
కాసేపు ఆ గదిని నిశ్శబ్ధం ఆక్రమించేసింది.డాక్టర్ కాత్యాయిని తన మనసులో విచారాన్ని వదిలిపెట్టి.. కొత్త ఆలోచనలకు తావిస్తున్నదన్న విషయం ఆమె వాలకాన్ని బట్టి గ్రహించ గలిగాడతను. అందుకే తిరిగి గొంతు విప్పాడు.
“ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వాస్తవం గ్రహించు. అంతా మంచే జరుగుతుంది. ఎంత డాక్టర్వైనా నువ్వూ అమ్మవే కదా!”.
కొద్దిరోజుల తర్వాత..
ఎప్పటిలాగే పేషెంట్లను చూడటానికి హాస్పిటల్‌కు వెళ్తున్నది డాక్టర్ కాత్యాయిని.
“హలో.. డాక్టరమ్మా!”.
“వీరేశం.. చెప్పు”.
“మరో కేసు వచ్చింది. పరీక్ష చేసి ఆడపిల్ల అయితే కడుపు తియ్యాలి. పంపమంటవా డాక్టరమ్మా?”..
ఫోన్లో కాత్యాయినితో మాట్లాడుతున్నాడు వీరేశం.
“నేనిప్పుడు అబార్షన్లు చేయడం లేదు”..
ముక్తసరిగా జవాబిచ్చింది డాక్టర్.
“అయ్యో! ఇప్పుడెలా? వాళ్లకు మాట ఇచ్చానమ్మా! పోనీ ఒక పని చేయరాదు డాక్టరమ్మా! ఈ ఒక్కసారికి పని పూర్తి చేసిపెట్టు. ఇకనుంచి మరొక డాక్టర్ జాడ చూసుకుంటానమ్మా!”.
ఒక్క క్షణం మాట్లాడకుండా ఉండిపోయిందామె.
ఏదో స్ఫురించిన కాత్యాయిని..
“అక్కర్లేదు వీరేశం. మరో డాక్టర్‌ను వెతుక్కోవాల్సిన పనిలేదు. ఎప్పటిలాగే నీ దగ్గరికి వచ్చిన వాళ్లను నా చెంతకు పంపు. సరేనా! నీ కమిషన్ గురించి భయపడకు. నీకు రావాల్సింది ఇచ్చేస్తాను” అన్నది.
“సరే!” అంటూ ఫోన్ పెట్టేశాడు.
తనకు ఎదురుగా కూర్చుని భయంగా చూస్తున్న ముప్ఫై ఏళ్ల మహిళను..
“చెప్పమ్మా! ఏంటీ నీ ప్రాబ్లం?” నింపాదిగా అడిగింది డాక్టర్ కాత్యాయిని.
విషయం ఎలా మొదలుపెట్టాలో తెలియక కాసేపు లోలోపల సతమతమయ్యిందా మహిళ.
“పర్లేదు.. దాచకుండా చెప్పు! నువ్వు, నేను తప్ప ఈ గదిలో మరెవరూ లేరు కదా! భయం దేనికమ్మా? సంకోచించకుండా విషయమేంటో చెప్పు!”. బిడియ పడుతూనే..
“స్కానింగ్ చేసి నా కడుపులో పెరుగుతున్నది ఆడపిల్లనా, మగ పిల్లవాడా చెప్పాలి డాక్టర్!”. అసలు విషయం బయటపెట్టిందామె.
“స్కానింగ్ తప్పక చేస్తాను. కేవలం లోపల పెరుగుతున్న పిండం ఆరోగ్యం తెలుసుకోవడానికి మాత్రమే! కానీ నువ్వు మోస్తున్నది ఆడ, మగ ఎవరనేది మాత్రం నీకు తెలియనివ్వను”.. ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ చెప్పింది డాక్టర్. అది విని ఆ మహిళ ముఖకవళికలు మారిపోయాయి.
“ఏమంటావు?” కావాలని ప్రశ్నించింది డాక్టర్.
“లింగ నిర్ధారణ చేసి తప్పకుండా చెప్పాల్సిందే డాక్టర్! లేకపోతే వాళ్లు నాకు డబ్బులివ్వనన్నారు”.
“వాళ్లా!? ఎవరు?”.
“నేను సరోగసి మదర్‌ను డాక్టర్!”.
“ఓ.. ఐసీ!”.
“మా ఒప్పందం అలాగే జరిగింది డాక్టర్. మగ పిల్లవాడు అయితేనే వాళ్లు పిల్లవాణ్ని తీసుకొని ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తామన్నారు. ఆడపిల్ల అయితే స్వీకరించమన్నారు. అలాగైతే నాకు వాళ్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు”.
“ఇట్స్ ఓకే!”.
“రహస్యంగా లింగనిర్ధారణ చేసి చెబితే డాక్టర్‌కు ముప్ఫై, నలభై వేల వరకైనా డబ్బులు ఇస్తామన్నారు”..
డబ్బు ఆశ చూపిందా మహిళ.
సాలోచనగా తల పంకిస్తూ..
“టెస్ట్ చేయకుండానే నీ కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని అనుకుందాం. సో అప్పుడేం చేస్తావ్?” ప్రశ్నించింది కాత్యాయిని.
“ఏం చేయడమేంటి డాక్టర్? అబార్షన్ చేసి పంపించండి. అందుకేగా మీ దగ్గరికి వచ్చాను”.
“కుదరదు. లింగ నిర్ధారణ, భ్రూణహత్య చేసినవారు, చేయించుకున్నవారు ఇద్దరూ చట్టం దృష్టిలో నేరస్తులే! ఒకవేళ చట్టానికి దొరక్కపోయినా దేవుని కోర్టులో తప్పక శిక్ష పడుతుంది” స్థిరంగా చెప్పింది కాత్యాయిని.
డాక్టర్ మాటలు పట్టించుకోకుండా..
“ఆడపిల్ల అని తేలితే అబార్షన్ చేయించడానికి మీకు లక్ష రూపాయలు ఇవ్వడానికైనా వాళ్లు సిద్ధంగా ఉన్నారు”. మరో మాట చెప్పిందా మహిళ.
“ఆ లక్ష ఇస్తానంటే నా బదులు మరొకరైనా నీకు అబార్షన్ చేస్తారేమో? ఆ విషయం వదిలిపెట్టు. ఒక పని చెయ్! ఆడ, మగ ఎవరైతేనేం? ఒక తల్లిగా ముందా శిశువుకు జన్మనిస్తానని వాళ్లతో చెప్పు. అలా కుదరదని వాళ్లంటే.. తెగతెంపులు చేసుకో! పుట్టిన శిశువును నీ సొంత బిడ్డగానే స్వీకరించు!”.
“అదెలా కుదురుతుంది డాక్టర్? నాకు ఆల్రెడీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పైగా పుట్టబోయేది మళ్లీ ఆడపిల్ల అయితే నేనెటు పోయేది? ఇప్పుడు నాకున్న ఆర్థిక పరిస్థితుల్లో ముగ్గురు ఆడపిల్లలను సాకడం మావల్ల కాదు”.
“అమ్మవి కదా! ప్రాణానికి ప్రాణమైన నీ గర్భంలోని ప్రాణికి జన్మనివ్వడానికి సంకోచిస్తున్నావేం? అబార్షన్ చేయించుకుని పాపం మూట కట్టుకుంటావా? ఏం.. నీలో రూపుదిద్దుకుంటున్న శిశువు నీ రక్తమాంసాలు కాదా? నీ ఊపిరి కాదా? బాగా ఆలోచించి సానుకూలంగా నిర్ణయం తీసుకో!”..
ఆమెలో ఆత్మస్థయిర్యాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నది కాత్యాయిని. బదులుగా తలవంచుకుందా మహిళ. ఆమె పాజిటివ్‌గానే స్పందిస్తున్నట్టు నమ్మకం కలిగింది కాత్యాయినికి.
“చూడమ్మా! నువ్వు సరేనంటే ఇప్పటినుంచి మొదలుకొని నీ డెలివరీ అయ్యేంతవరకు ఒక్క నయాపైసా ఫీజు కూడా తీసుకోను. ఆర్థికంగా కూడా నీకు వెన్నంటి ఉంటా! బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో! వీలైతే ఒకసారి మీ వారిని కూడా సంప్రదించు”. డాక్టర్ మాటలు ఆమెకు ఎనలేని ధైర్యాన్ని ఇచ్చినట్టున్నాయి. అప్పటికే ఒక స్థిర నిశ్చయానికి వచ్చేసిందా మహిళ. దిగులు పోయి ఆ మహిళ వదనం కాంతిమంతం అవుతుంటే..
“కడుపులో పెరుగుతున్నది ఎవరైనా సరే! నా మూడో బిడ్డగా సగర్వంగా లోకానికి పరిచయం చేస్తాను!”..
ఆప్యాయంగా తన కడుపును తడుముకుంటూ, ఆత్మవిశ్వాసంతో తలెత్తి ధైర్యంగా అన్నదా మహిళ.
అది విని కాత్యాయిని కనురెప్పలు తడిశాయి. మొదలైన తన దిగ్విజయ యాత్రకు నాందిగా ఈ తొలి విజయం ఆమెను ఉద్విగ్న భరితం చేసింది.
ఎనుగంటి వేణుగోపాల్
సామాజిక రుగ్మతలను ఎత్తిచూపుతూ రచనలు చేయడంలో ముందుంటారు ఎనుగంటి వేణుగోపాల్. ఈయన స్వస్థలం జగిత్యాల. ఎంఏ (తెలుగు), ఎంఏ (సోషియాలజీ) చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 1985 నుంచి రచనలు చేస్తున్నారు. ఇప్పటివరకూ 176 కథలు, 60 కవితలు, 4 నవలలు రాశారు. ఇప్పటివరకూ 9 కథా సంపుటాలు, ఒక నవలతోపాటు మరో మూడు పుస్తకాలను వెలువరించారు. బుజ్జిగాడి బెంగ, చెలి, శాలివాహన, కన్నీటి కావ్యం, ఆ దృశ్యం కథలు.. అవని, ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్ నవలలు గుర్తింపు పొందాయి.
అన్ని ప్రముఖ దిన, వార, ఆన్లైన్ పత్రికల్లో ఈయన కథలు ప్రచురితమయ్యాయి. సాహిత్య సేవలో భాగంగా అనేక సన్మానాలు, సత్కారాలు పొందారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జగిత్యాల కలెక్టర్ చేతుల మీదుగా ‘విశిష్ట సాహితీవేత్త’ పురస్కారం అందుకున్నారు. ‘ఉత్తమ సాహితీవేత్త’ పురస్కారం, ‘గాన కోకిల కళానికేతన్’ నుంచి ‘సాహితీ రత్న’ బిరుదు దక్కించుకున్నారు. ‘శ్రావణి సామాజిక సాహితీ సాంస్కృతిక సమాఖ్య’ ద్వారా ‘విశిష్ట సాహితీ పురస్కారం’, ‘ఆంధ్ర సారస్వత సమితి’ నుంచి ‘ప్రతిభా పురస్కారం’ అందుకున్నారు.
– ఎనుగంటి వేణుగోపాల్ 9440236055
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

