(హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)చెంచుగూడెంలో.. గూడెం నాయకుడు ఇందుడు రచ్చబండ మీద కూర్చొని ఉన్నాడు. ఆయనకు కొద్ది దూరంలో గూడెం పెద్దమనుషులు నలుగురు కూర్చొని ఉన్నారు. ఎదురుగా ఊళ్లోని జనమంతా పోగై ఉన్నారు. వాళ్లు తమ నాయకుడు ఇందుడు ఏం న్యాయం చెప్తాడోనని ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.ఇందునికి కుడి పక్కన నాలుగు గజాల దూరంలో బాధితులు సిరివగ్గు, ఉల్లోల హత్థి నిలబడి ఉన్నారు. ఎడమపక్క నిందితులుగా రాయహత్థి, కటిలుడు నిలబడి ఉన్నారు. వాళ్లకు కొంచెం దూరంలో రాయవగ్గు విచార వదనంతో ఉన్నాడు.
చర్చను ప్రారంభిస్తున్నట్లుగా ఇందుడు ఇట్లా అన్నాడు..“మంచి చేసే మణుసులని పెద్దమ్మతల్లి కాపాడుతుంది. ఆమెకు కోపం తెప్పించే పనులు చేస్తే మనమంతా మసి అయిపోతాం. ఈరోజు సిరివగ్గు పెండ్లాము ఉల్లోలహత్థి తమ బిడ్డను రాయహత్థి మాయం చేసిందని నింద మోపినారు. అందుకు కటిలుడు సాయపడ్డాడని కూడా చెప్పినారు. అందుకే వాళ్లిద్దరితోపాటు రాయహత్థి మొగుడు రాయవగ్గును కూడా ఇక్కడ నిలబెట్టినం. పెండ్లాము తప్పు చేసిందంటే పెనిమిటికి కూడా ఆ తప్పులో భాగం ఉన్నట్లే కదా!”గంభీరమైన ఇందుని మాటలు అందరూ శ్రద్ధగా విన్నారు. తర్వాత పెద్దమనుషులు, గ్రామ ప్రజలు తమలో తాము గుసగుసలాడుతూ ఏదో చర్చించుకో సాగినారు. అప్పుడు రాయవగ్గు ఈ విధంగా అన్నాడు..
“పెద్దలు నాకు మాట్లాడే అవకాశం ఇస్తే రెండు మాటలు చెప్తాను..”“నీవు మాట్లాడవచ్చు రాయవగ్గు! నీ మీద ఎవరూ నింద మోపలేదు కదా! సిరివగ్గు తన బిడ్డ అయిన చంద్రహత్థిని నీ పెండ్లాం, కటిలుడు కలిసి ఎక్కడికో పంపినారని నింద మోపినారు. వాళ్లు పంపించడం అతని పెళ్లాం ఉల్లోల స్వయంగా చూసింది. వయసులో ఉన్న ఒక ఆడపిల్లను అట్లా పంపడం న్యాయం కాదు కదా! పైగా ఆ పిల్ల మానసిక స్థితి కూడా ఆందోళనకరముగా ఉన్నది. ఈ పని వీళ్లు ఎందుకు చేసినారో తెలుసుకోవలసిన బాధ్యత నాకున్నది కదా!” అన్నాడు ఇందుడు.“నిజమే దేవరా! నా పెళ్లాం చేసింది తప్పే! ముమ్మాటికీ తప్పే! దానికి మొదటి నుంచీ తప్పులు చేయడం అలవాటు. అది చేస్తున్న తప్పులకు శిక్షించడం అవసరమే. లేకుంటే పెద్దమ్మ తల్లికి కోపం వస్తది. ఊరు అల్లకల్లోలం అయిపోతది..” రాయవగ్గు అట్లా మాట్లాడుతుంటే గ్రామ నాయకుడు ఇందునితోపాటు పెద్దలు, అక్కడ గుమిగూడిన జనం కూడా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టినారు. రాయహత్థికైతే తన మొగుడు తనను దోషిని చేసి మాట్లాడటం అవమానకరంగా ఉన్నది. ఉన్నపళంగా రచ్చబండకు తలబాదుకొని చచ్చిపోవాలని అనిపిస్తున్నది.
ఇవేవీ పట్టించుకోకుండా అతను చెప్పుతూ పోతున్నాడు..“నా ఇంటి దీపం ‘రాయ’ ఉత్త పిచ్చిది. తాను ఏమైపోయినా నలుగురు సంతోషంగా ఉండాలని కోరుకునే వెర్రి బాగులది. ఈ గూడెం ఆడపిల్లలను కాపాడటానికి తెగించి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న పోటిసునికి కన్నబిడ్డకు సేవ చేసినట్లు సేవ చేసి కాపాడుకున్నది. ఊరందరికీ ఆరాధనీయుడైన పోటిసుని ప్రేమించిన చంద్రహత్థి మనసు తెలిసి, వాళ్లిద్దరి మధ్య స్నేహం కలిపింది. తన కర్తవ్యం కోసం పోటిసుడు వెళ్లిపోతే పిచ్చిదైన చంద్రహత్థి రోగాన్ని సరిగ్గా గుర్తించి, చొరవచూపి, బాగుపడేటట్లు చేసింది. ఈ పరిస్థితిలో చంద్రహత్థిని వ్యతిరేకిస్తే ఆమె వెర్రి తిరగబడుతుందని, అప్పుడు దాన్ని బాగు చేయడం సాధ్యం కాదని వైద్యుడు హెచ్చరించడం వల్ల ఆమె కోరిక మేరకే పోటిసుణ్ని కలుసుకోవడానికి పంపింది. ఇవన్నీ క్షమించరాని తప్పులే! అందుకు మా హత్థికి శిక్ష పడవలసిందే!” అని ఒక్క క్షణం ఆగినాడు.అందరిలో కలకలం మొదలైంది.
రాయవగ్గు మళ్లీ ఇట్లా అన్నాడు.. “ఇక ఈ కటిలుడు దుర్మార్గుడుగా మొదటి నుండి పేరున్న వాడే! కానీ, మంచివాడు దుర్మార్గుడుగా మారడానికి అవకాశం ఉన్నట్లే.. దుర్మార్గుడు మంచివాడిగాను మారే అవకాశం ఉంటది. వాడిప్పుడు మా రాయ బోధతో మంచివాడైనాడు. చంద్రహత్థికి ఇటువంటి పరిస్థితి ఒకటి ఎదురవుతుందని ముందే ఊహించినట్లున్నాడు, గుర్రానికి శిక్షణను ఇచ్చి పంపించినాడు. వీళ్లు చేసిన పనులన్నీ నేరాలైతే, వీళ్లకు తగిన శిక్ష విధించవలసిందే. అయితే చివరిగా ఒక్క మాట..లేమి లేని సుకవి; పాముల రక్షణ లేని నిధియు గనగలేము అట్లెకొండెగాళ్ల బాధ ఉండని రాజుయు కష్టమే లభింప కలియుగాన!
(పేదరికం లేని సత్కవి, పాముల రక్షణ లేని నిధి ఎక్కడా కనిపించవు. అదేవిధంగా ఈ కలియుగంలో రాజుల మనసులను చెడగొట్టే కొండెగాళ్లు కూడా ఉంటారు)ఉత్తములైన నాయకులు చెప్పుడు మాటలకు తలవొగ్గరు. నేను నా హద్దులు దాటి ఏమైనా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి!” అంటూ ముగించినాడు రాయవగ్గు.రాయవగ్గు మాటలు అక్కడున్న వాళ్లందరినీ ప్రభావితం చేసినాయి అనడానికి అందరి చప్పట్లే సాక్ష్యం. మొదట కటువుగా అనిపించినా, ఇందుడు కూడా అతని మాటల్లోని సత్యాన్ని గ్రహించి, సంతృప్తి చెందినాడు. తర్వాత నవ్వుతూ..“భళా రాయవగ్గు! చాలా చక్కగా మాట్లాడినావు. నీ మాటల వల్ల ఈ సమస్య గురించిన స్పష్టత వచ్చింది. నేను మాత్రం చెప్పుడు మాటలకు చెవియొగ్గే నాయకుణ్ని కాను” అన్నాడు. అందరూ నవ్వినారు.
“ఇప్పుడు చెప్పండి సిరివగ్గు దంపతులూ! రాయహత్థి చేసింది నేరమా? కటిలుడు నేరస్థుడా? రాయవగ్గు అన్న మాటల్లో అబద్ధాలు ఏమైనా ఉన్నాయా? నేరం ఎవరిది..?” ఇందుని మాట పూర్తి కాలేదు. సిరివగ్గు, ఉల్లోలహత్థి గబుక్కున రాయహత్థి పాదాల మీద పడ్డారు. కన్నీళ్లతో క్షమించమని వేడుకున్నారు.“అమ్మా! నీవు దేవతవు! బిడ్డ కనిపించలేదన్న బాధలో, అసలే దాని మతి సక్కగా లేదన్న ఆందోళనలో చెప్పుడు మాటలు విని, మీరే ఏదో తప్పు చేసినారని భ్రమపడ్డాము..” అని ఉల్లోలహత్థి అంటుండగా.. “మరి ఈ సంగతి నేరుగా మమ్ములను అడగవచ్చు కదా అత్తమ్మా!” అన్నాడు రాయవగ్గు.“మిమ్ములను అడిగే అంత ధైర్యం లేకనే నాయకుని ద్వారా విషయం తెలుసుకోవాలని అనుకున్నాము నాయనా! అది ఇట్లా పదిమంది ముందు మిమ్ములను నిలబెడుతుందని అనుకోలేదు..” తలవంచుకొని సంజాయిషీగా అన్నాడు సిరివగ్గు.“ఇందులో నా తప్పిదం కూడా ఉన్నది రాయవగ్గూ!”.. ఇందుడు మధ్యలో కలుగజేసుకుంటూ..“ఈ దంపతులు మోపిన అభియోగంలో నిజానిజాలు ఏపాటివో నేను ముందుగా విచారించిన తర్వాత మిమ్ములను రచ్చబండ వద్దకు పిలిపించవలసింది. ఇది నా తొందరపాటే!” అన్నాడు నొచ్చుకుంటూ.
“అయితే అయింది లే నాయకా! ఒక మేలు జరిగింది కదా!” అన్నాడు పెద్ద మనుషుల్లో ఒకడైన దూరమానుడు. అందరూ అతని వైపు చూసినారు.“ఏది జరిగినా మన మంచికే అనుకోమన్నారు మన పెద్దలు. ఏదో ఒక రకంగా ఊరి వాళ్లమంతా ఒక్కచోట చేరినాము కదా! ఇదే పెద్ద ప్రయోజనం!” మళ్లీ అన్నాడు అతను. “ఇది కాదు ప్రయోజనం దూరమాను తాతా! ఇంత మందిమి కలిసినందుకు ఒక ప్రయోజనకరమైన పని చేయాలి!” అన్నాడు ఇందుడు.“ఏమిటది?” మిగతా పెద్ద మనుషులు అడిగినారు ఒకేసారి.“ఈ ఊరి ఆడపిల్లలను కాపాడిన ఒక యువకుడు ప్రమాదంలో ఉన్నాడు. అతణ్ని ప్రేమించిన ఈ ఊరి ఆడపిల్ల కూడా ప్రమాదానికి తెగించి గొప్ప సాహసం చేయడానికి పూనుకున్నది. మనం మాత్రం చేతగాని వాళ్లలా మిగిలిపోవడం ఎందుకు? వాళ్లను కాపాడుకోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేయవచ్చును కదా! ఏం చేస్తే బాగుంటదో మన రాయవగ్గునే అడుగుదాం!” అన్నాడు.అందరూ ‘అవునవును’ అని చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని, ఆమోదాన్ని ప్రకటించినారు.
జంగిటిలో.. ఆహవ మాటలతో విషయం అర్థమైన కమలసత్తి ఆనందంతో.. “ఏంది, నా కొడుకు వచ్చినాడా?” అన్నది.‘అయ్యో అమాయకపు మహారాణీ! వాడు కొడుకు కాదు, కర్కోటకుడు!’ అని మనసులోనే అనుకుంటూ.. “కొడుకు కాదు అత్తమ్మా! వైద్యుడు” అన్నది సవరిస్తున్నట్లుగా.“కాదు కాదు! వాడే నా కొడుకు!” మరింత దృఢంగా అన్నది కమల సత్తి.“నా కళ్లు తెరిపించడానికి వచ్చిన మహానుభావుడు! తీసుకొని రా లోపలికి” అన్నది, ఇకపై తనకు కండ్లు కనిపిస్తాయన్న ఆశతో.‘హుఁ..! నీ కళ్లు తెరుచుకోవడమే అత్తా కావలసింది. నీవు కళ్లారా చూస్తే అయినా అసలు సంగతి తెలుస్తుంది’ అని మనసులోనే అనుకొని పైకి.. “రండి స్వామీ!” అని అతణ్ని ఆహ్వానిస్తూ, కమల సత్తిని సరిగ్గా కూర్చోబెట్టడానికి ముందుగా లోపలికి వెళ్లింది ఆహవ.ఇప్పుడు భాణుకు, బాటసారికి మధ్యనున్న అవాంతరం ‘ఆహవ’ అనే తెర అడ్డు తొలగినట్లయింది. ఆమె అతణ్ని పూర్తిగా చూడలేక, చూడకుండా ఉండలేక సతమతం అవుతున్నది. అతని పరిస్థితి కూడా ఇంచుమించు అట్లాగే ఉన్నది. బయట విజృంభిస్తున్న ప్రణాలుడు.. ‘ఇంతకంటే అవకాశం దొరకదు! ఆమె అందాన్ని అణువణువూ కళ్లతో జుర్రుకో!’ అంటున్నాడు. లోపల ఉన్న సాధనానందుడు వివేకాన్ని మేలుకొలుపుతున్నాడు.
‘ఈ లోకంలో దీనులు, దుఃఖితులు, ఆర్తులు నిస్సహాయులకు సాయం చేస్తూ; జ్ఞానాన్ని, సేవను అందించడమే నీ పని. కోరికలకు తలవంచడం, ఆకర్షణలకు లొంగిపోవడం సామాన్యుల బలహీనత. అది శ్రమణకుల పరిసరాల్లోకి కూడా రానీయకూడదు. ముసలమ్మకు చూపు తెప్పించడం మాత్రమే నీ విధి! ఆ పని చేయడం వల్ల నీకు కీర్తి లభిస్తుంది. తథాగతుడు సంతోషిస్తాడు. ఆత్మతృప్తి కలుగుతుంది. కాదని మాయలో పడిపోతే అపకీర్తి, అవమానం నిన్ను అక్కున చేర్చుకుంటాయి! మరచిపోయినావా గతంలో జరిగిన అవమానం..’ ఉలిక్కిపడ్డాడు ప్రణాలానందుడు.
ఆ వెంటనే అప్రయత్నంగా.. “అమ్మా! పక్కకు తప్పుకోండి లోపలికి వెళ్లాలి!” అన్నాడు.“నేను అమ్మను కాలేదు. అసలు ఇల్లాలి సుఖానికే నోచుకోలేదు. భర్త ముఖమైనా సరిగ్గా చూడలేదు. నన్ను అమ్మా అనడం సబబు కాదు! నాకంటూ ఒక పేరున్నది. ఆ పేరుతోనే పిలవవచ్చు బాటసారీ!” అన్నది ఏమాత్రం పక్కకు తప్పుకోకుండా భాణుసత్తి. ఆమె మాటల్లోని అంతరార్థం సాధనానందుని తొక్కి పారేసి, ప్రణాలుణ్ని మేల్కొలిపింది. ఆ సొగసరిలోని గడుసుదనం అతనిలోని మదనుడిని తట్టి లేపింది. కనులెత్తి మొహంలోకి చూసినాడు. ఆ అందానికి మకుటాయమానమైన చిరునవ్వు పువ్వు కమ్మగా విరిసి, నెమ్మదిగా ‘ర’మ్మని పిలిచినట్లు అనిపించింది. ఠక్కున తలదించుకున్నాడు!.. సాధనానందుడు తలెత్తడంతో.“ఏంటీ నా పేరు అడగరా? మీకు ముందే తెలుసా??” రెండు ప్రశ్నలు వెంటనే అడిగింది.“తెలియదు, చెప్పండి!” అన్నాడు ఎటో చూస్తూ.“నేను ఇక్కడున్నాను. నన్ను చూడండి!” అన్నది భాణు.ఆ మాటల్లో ఇప్పుడు అభ్యర్థన కంటే ఆజ్ఞ ధ్వనిస్తున్నది ఎక్కువగా. తప్పనిసరై చూసినాడు.
అతని చూపులు ఆగిపోయినయ్! సహజంగానే అందానికి ప్రతిబింబంలా ఉండే భాణుసత్తి ఇప్పుడు అలంకారాలతో తయారై, ఉపమానం లేని వస్తువు (ఉపమేయం)లా భాసిస్తున్నది.నిర్నిమేశుడై అతనట్లా చూస్తుంటే ఆమెకు ఎంతో సంతోషంగా ఉన్నది. కళ ఆరాధనీయం; అందం ఆస్వాదయోగ్యం. రెండూ ప్రశంసలను కోరుకుంటాయి, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో.. అవి లభిస్తేనే తృప్తి పడతాయి. అతని నుండి ఆమెకు ఆశించింది లభించిందో లేదో చెప్పడం కష్టం. ఆమె సంతృప్తి చెందిందో, సరిపెట్టుకుందో ఊహించలేం. “నా పేరు రోహ.. కాదు, కాదు! నా పేరు భాణు.. భాణుసత్తి!” అని, అంతలోనే మళ్లీ అడిగింది..
“మరి మీ పేరు?”“మీరు ‘బాటసారి’ అని పిలవవచ్చు. ఎందుకంటే నేను ఇంకా ప్రయాణిస్తూనే ఉన్నాను. సరైన గమ్యం చేరుకోలేక తిరుగుతూనే ఉన్నాను!” అన్నాడు ఎటో చూస్తూ.“బాగుంది భాణుసత్తి, బాటసారి! భలే సరిపోయింది కదా!” అన్నది సంబరపడుతూ.‘ఓ.. నీకు అలా అర్థమైందా?’ అనుకున్నాడు. అంతలోనే ఆమె మళ్లీ అన్నది.. “గమ్యం వెతుక్కుంటూ తిరగడం ధ్యాసలో నన్ను మరచిపోవు కదా!”“ఆఁ..” మరోమారు ఉలిక్కిపడ్డాడు.“అదే.. నాకు ఇచ్చిన మాట!” ఆమె సవరించుకున్నట్లు అన్నది..“మా అత్తకు నయం చేయడం; నా భర్త పరదేశం నుండి రావడం విషయాలు స్పష్టమయ్యేది ఎప్పుడు? అవి పూర్తయిన తర్వాతనే నీవు ఇక్కడి నుంచి ఎక్కడికైనా కదలాలి!” అంటూ, మరో సందేహం వ్యక్తం చేసింది..
“నిజంగానే మా అత్తకు చూపు తెప్పిస్తావా?”ఆమె అట్లా ఎందుకు అడిగిందో అతనికి వెంటనే అర్థం కాలేదు.(సశేషం)
జరిగిన కథ
బాటసారి ఆకర్షణలో భాణుసత్తి పడిపోయిందని ఆందోళన పడుతుంది ఆహవసత్తి. కొడుకుని చూసిన ఆనందంలో కుసుమ శ్రేష్ఠికి పడిపోయిన మాట తిరిగివస్తుంది.అవణాయరును నిద్రపుచ్చే పదార్థం కలిపిన పాలు ఇవ్వడానికి తెస్తుంది సుద్ది. తర్వాత..
-దోరవేటి
89788 71961