ICC ODI World Cup | కర్ణుడి చావుకు కారణాలు అనేకం అంటారు. వెస్టిండీస్ ( West Indies ) జట్టుకు కూడా సరిగ్గా ఇదే వర్తిస్తుంది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన విండీస్ ఇప్పుడు సోదిలో లేకుండా పోయింది. అదొక దిగ్గజ జట్టని, దిగ్గజాలు అనదగ్గ క్రికెటర్లు అందులో ఉండేవారని నేటి తరం క్రికెట్ ప్రేమికుల్లో అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. కారణం దాని ఆటతీరు. అభిమానులను ఏమాత్రం మెప్పించలేకపోతున్న ఆ జట్టు ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి వరల్డ్ కప్‌కు అర్హత సాధించలేకపోయింది.
క్లైవ్ లాయిడ్, కీత్ బోయ్స్, వివ్ రిచర్డ్స్, గార్డెన్ గ్రీనిడ్స్, డెస్మండ్ హేన్స్, రాయ్ ఫ్రెడ్రిక్స్, లాన్స్ గిబ్స్.. వంటి అరివీర భయంకురులైన ఆటగాళ్లతో కూడిన వెస్టిండీస్ జట్టు బరిలోకి దిగడానికి ముందే విజయాన్ని సొంతం చేసుకునేది. ప్రత్యర్థి జట్లు అయితే మానసికంగా ముందే ఓటమికి సిద్ధపడేవి. తొలి రెండు వరుస ప్రపంచకప్‌లు సాధించి ప్రపంచంలోని దిగ్గజ జట్టుగా ఎదిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. పూర్వ వైభవాన్ని కోల్పోయి పడుతూ లేస్తున్న జట్టు 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. ఎందుకిలా?.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఇది.
అంతమాత్రాన అదేమీ అనామక జట్టు కాదు. ఇప్పటికీ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల వీరులో జట్టులో పుష్కలంగా ఉన్నారు. అయినప్పటికీ విజయాలు సాధించడంలో బొక్కబోర్లా పడుతూ అథఃపాతాళానికి పడిపోయింది. ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో స్కాట్లాండ్ వంటి బలహీన జట్టు చేతిలో ఓటమి పాలై తలవంపులు తెచ్చుకుంది. అంతమాత్రాన బాగా ఆడలేదా? అంటే అదీ కాదు. 374 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. గతమెంతో ఘనత కలిగిన విండీస్ జట్టు ఉత్థానపతనాలను ఒకసారి పరిశీలిస్తే..
విండీస్.. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టు. దీనికి తోడు దేహధారుఢ్యం వారికి సహజంగా వచ్చిన లక్షణం. ఈ రెండూ ఆ జట్టును ప్రపంచంలోనే మేటి జట్టుగా మార్చాయి. 1975, 1979లలో జరిగిన తొలి రెండు ప్రపంచకప్‌ను కొల్లగొట్టి 1983 హ్యాట్రిక్ కప్ కోసం ఉవ్విళ్లూరింది. అయితే, కపిల్‌దేవ్ సారథ్యంలోని భారత జట్టు విండీస్ ఆశలను వమ్ము చేసింది. ఫలితంగా మూడోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. నిజానికి విండీస్‌కు అప్పటి నుంచే మంచి రోజులు నిండుకున్నాయి. ఆ తర్వాత ఎప్పుడూ ప్రపంచకప్ ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది. ప్రతిసారి ఎన్నో ఆశలతో బరిలోకి దిగినప్పటికీ తొలి రౌండ్లోనో, లేదంటే క్వార్టర్ ఫైనల్లో ప్రస్థానాన్ని ముగించి ఇంటిదారి పట్టేది. చివరిసారి 1996లో మాత్రం సెమీఫైనల్ వరకు చేరుకోగలిగింది. 1980వ దశకం వరకు విండీస్ అంటే మేటి జట్లు కూడా వణికేవి. ఫార్మాట్‌తో పనిలేకుండా దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించేది.
విండీస్ జట్టుప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లకు పెట్టింది పేరు. జోయెల్ గార్నర్, మైఖేల్ హోల్డింగ్, కర్ట్లీ ఆంబ్రోస్, మాల్కం మార్షల్, ఆండీ రాబర్ట్స్, , కోర్ట్నీ వాల్ష్, ఇయాన్ బిషప్ వంటి ఫాస్ట్ బౌలర్లు బంతి అందుకుంటే అవతలపక్క క్రీజులో ఎవరున్నా ఆడేందుకు భయపడేవారు. అలాగే, జెఫ్ డూజాన్ వంటి వికెట్ కీపర్ బ్యాటర్, కార్ల్ హూపర్, రోజర్ హార్పర్ వంటి ఆల్ రౌండర్లతో జట్టు సమతూకంగా ఉండేది. వీరిలో ప్రతి ఒక్కరు జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించిన సందర్భాలు అనేకం.
1990 దశకం చివరి నుంచి విండీస్ జట్టు పతనం క్రమంగా ప్రారంభమైంది. జట్టు అరివీర భయంకరంగా కనిపించినప్పటికీ చిన్న జట్ల చేతుల్లోనూ పరాభవాలు ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. కాగితంపై పులిలా కనిపించే జట్టు మైదానంలోకి అడుగుపెట్టేసరికి పిల్లిలా మారిపోయేది. దీంతో ఒకటి అరా విజయాలు తప్ప అత్యుత్తమ విజయాలు సాధించిన రికార్డు ఒక్కటి కూడా లేకుండా పోయింది. అయితే, 2012, 2016 మాత్రం ఆ జట్టు కాస్తంత మెరుగ్గా ఆడి టీ20 ప్రపంచకప్‌లు ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత దాని ప్రాభవం మళ్లీ దిగజారింది. ఇక టెస్టు క్రికెట్లో అయితే విండీస్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ప్రస్తుతం ఆ జట్టు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉంటే, వన్డేల్లో 10, టెస్టుల్లో 8వ స్థానంలో ఉంది. భారత జట్టుపై విండీస్ టెస్టు మ్యాచ్ గెలిచి ఇప్పటికి రెండు దశాబ్దాలు దాటింది. అప్పుడెప్పుడో 2002లో జమైకా టెస్టులో భారత్‌ను ఓడించిన విండీస్ ఇప్పటి వరకు మళ్లీ ఓడించలేకపోయింది. ఆస్ట్రేలియాపైనా ఇదే పరిస్థితి. 2003 తర్వాత ఒక్క మ్యాచ్‌లోనూ ఆసీస్‌ను ఓడించలేకపోయింది. కరీబియన్ జట్టుపై టీమిండియా గత నాలుగేళ్లలో మూడుసార్లు టీ20 సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసింది.
ఒకప్పుడు మైదానంలో బెబ్బులిలా పోరాడే వెస్టిండీస్ జట్టు ఇప్పుడిలా పేలవంగా ఎందుకు తయారైందన్న దాని వెనక చాలా కారణాలే కనిపిస్తాయి. రిచర్డ్స్, హేన్స్, మాల్కం మార్షల్, జెఫ్ డుజాన్, గార్డెన్ గ్రీనిడ్జ్, లారా, ఆంబ్రోస్ వంటివారు ఒక్కొక్కరు రిటైర్ కావడం.. వారి స్థానాలను తిరిగి పూడ్చగలిగేంత ఆటగాడు మళ్లీ జట్టులోకి రాకపోవడం ఆ జట్టుకు తొలి దెబ్బ. దీంతో జట్టు బలం నెమ్మదిగా క్షీణించడం మొదలైంది. ఆ తర్వాత గేల్, శర్వాన్, చందర్‌పాల్ వంటి వాళ్లు వచ్చినా నిలకడలేమి దెబ్బతీసింది. కొన్ని గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడి అత్యుత్తమ బ్యాటర్లుగా పేరుకెక్కినా ఆ ఫామ్ చివరి వరకు కొనసాగించడంలో వారు విఫలమయ్యారు. దీనికి తోడు ప్రత్యర్థి బ్యాటర్లను వణికించేందుకు చెప్పుకోదగ్గ ఒక్క బౌలర్ కూడా జట్టులో లేకుండా పోయాడు.
జట్టులో సమతూకం దెబ్బతినడానికి తోడు ఆటగాళ్ల మధ్య ఐక్యత లోపించడం, పారితోషికం, తిరుగుబాట్లు వంటివి విండీస్‌ను నెమ్మదిగా పతనం వైపు నడిపించాయి. బోర్డు వద్ద సరిపడా డబ్బు లేకపోవడంతో చాలామంది యువ ఆటగాళ్లు జాతీయ జట్టుకు కాకుండా లీగుల్లో ఆడడం మొదలుపెట్టారు. దీంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్నారు. వెరసి జట్టు రోజురోజుకు మరింత కునారిల్లుతోంది. ఒకప్పటి విండీస్ జట్టును చూడాలంటే ఇంకెన్నేళ్లు పడుతుందో చూడాలి మరి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విండీస్ అభిమానుల కోసమైనా ఆ జట్టు పునర్వైభవం సాధించాలని ఆశిద్దాం.