దక్షిణాఫ్రికా గడ్డపై భారత అమ్మాయిలు అద్భుతం చేశారు. అరంగేట్రం ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ నవచరిత్రకు నాంది పలికారు. సీనియర్లకు సాధ్యం కానీ ఫీట్‌ను జూనియర్లు తమ తొలి ప్రయత్నంలోనే చేతల్లో చూపించి ఔరా అనిపించారు. ఫైనల్లో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు.
దేశం యావత్తు గర్వపడేలా మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించారు. భారత ఖ్యాతిని ఇనుమడింపచేసిన జాతీయ జట్టులో మన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష గర్వకారణంగా నిలిచింది. అవకాశాలను అందిపుచ్చుకుంటూ సఫారీ పిచ్‌లపై ఈ భద్రాచలం డైనమైట్ అదరగొట్టింది. ప్రత్యర్థి ఎవరైనా పరుగుల వరద పారిస్తూ సత్తాచాటింది. టైటిల్ పోరులో టాప్ స్కోరర్‌గా నిలిచిన త్రిషపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. సమిష్టితత్వంతో ఇది సాధ్యమైందన్న త్రిష .. నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ప్రపంచకప్ గెలువడం గర్వకారణమన్న ఈ యువ క్రికెటర్ డబ్ల్యుపీఎల్ ద్వారా సీనియర్ జట్టులో చోటే లక్ష్యమని స్పష్టం చేసింది.
ప్రపంచకప్ విజయంపై ఫీలింగ్?
అరంగేట్రం ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచకప్‌లోనే భారత్ విజేతగా నిలువడంలో జీవితంలో మరిచిపోలేని అనుభూతి. భారత అమ్మాయిలు గెలిచిన తొలి ప్రపంచకప్ ఇది కావడం ప్రత్యేకం. పదిహేను రోజుల పాటు జరిగిన పోరులో ప్రతీ జట్టుపై విజయాన్ని ఆస్వాదించాను. లీగ్ దశ నుంచి సూపర్ సిక్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ ఇలా మ్యాచ్‌కు మ్యాచ్‌కు పరిణతి సాధించాం. ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా అంచనాలు అందుకోవడంలో సఫలమయ్యాం. ఇంగ్లండ్‌తో ఫైనల్లో తొలుత స్వల్ప స్కోరుకే కట్టడి చేయడం, ఆ తర్వాత ఛేదనలో వికెట్లు కోల్పోయినా వెరవకుండా ముందుకు సాగి విజయాన్ని అందుకున్నాం.
జట్టు కూర్పు ఎలా ఉంది?
జట్టులో సభ్యులందరం ఒక కుటుంబంలా మెదిలాం. దక్షిణాఫ్రికాలో ప్రపంచకప్ కోసం గత ఆరు నెలల నుంచి మేమంతా కలిసి టోర్నీలు ఆడటం వల్ల ఒకరి ఆటపై ఒకరికి అవగాహన ఏర్పడింది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో అనుభవజ్ఞులైన కోచ్‌ల సమక్షంలో శిక్షణ పొందడం లాభించింది. జట్టు కోచ్ నూషిన్ అల్ ఖదీర్‌తో పాటు సహాయక సిబ్బంది జట్టును అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఇంగ్లండ్‌తో ఫైనల్‌కు ఎలా సిద్ధమయ్యారు?
మెగాటోర్నీలో ఆస్ట్రేలియా చేతిలో అనూహ్య ఓటమి మినహాయిస్తే వరుస విజయాలతో ఆకట్టుకున్నాం. సూపర్‌సిక్స్ ఆఖరి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించడం ద్వారా ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకున్నాం. సెమీస్‌లో న్యూజిలాండ్ రూపంలో దీటైన ప్రత్యర్థి ఎదురైనా వెనుకకు తగ్గకుండా విజయాన్ని సొంతం చేసుకున్నాం. అదే జోరులో తుది పోరులో ఇంగ్లండ్ పనిపట్టాం. టిటాస్ సాధు, అర్చనా దేవి టాపార్డర్ పనిపట్టారు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ గ్రేస్ స్క్రీవెన్స్ క్యాచ్ నేను పట్టడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. లేకపోతే ఫలితం మరోలా ఉండేది.
సీనియర్ జట్టులో అరంగేట్రం ఎప్పుడు?
రానున్న డబ్ల్యుపీఎల్ ద్వారా భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాను. మార్చిలో జరుగనున్న డబ్ల్యుపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారత ప్లేయర్లతో పాటు వివిధ దేశాల స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం డబ్ల్యుపీఎల్ ద్వారా కలుగనున్నది. బీసీసీఐ చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్పది. దీని ద్వారా మరింత మంది ప్రతిభ కల్గిన ప్లేయర్లు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
నీరజ్ చోప్రా సందేశం ఏంటి?
స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా..మాలో స్ఫూర్తి నింపాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు చోప్రా..జట్టు సభ్యులందరితో మాట్లాడాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురికావద్దు అంటూ మాకు సూచించాడు. అతనిచ్చిన విలువైన సలహాలు, సూచనలు ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.
స్టార్ క్రికెటర్ల ప్రశంసలపై కామెంట్?
ప్రపంచకప్ గెలిచిన యువ భారత్‌పై స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్‌శర్మ, సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు తెలపడం జీవితాంతం గుర్తుండిపోతుంది.
శ్రీధర్ శిక్షణ ఎలా ఉపయోగపడింది?
టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన ఆర్ శ్రీధర్ దగ్గర శిక్షణ తీసుకోవడం బాగా కలిసివచ్చింది. ఫిట్నెస్ను పెంపొందించుకోవడంతో పాటు భారీ షాట్లు ఆడటంలో నేను మరింత రాటుదేలాను. దీనికి తోడు ఆహారం, వ్యాయామం విషయంలో నిపుణుల సలహాలు, సూచనలు పాటించాను.
తల్లిదండ్రుల ప్రోత్సాహం?
దేశం గర్వపడేలా నేను ఈ స్థాయికి ఎదగడానికి తల్లిదండ్రులు రాంరెడ్డి, మాధవి ప్రధాన కారణం. వాళ్లు ఇచ్చిన ప్రోత్సాహం వెలకట్టలేనిది. పసి ప్రాయం నుంచే క్రికెట్లో ఓనమాలు నేర్పుతూ చాలా కష్టపడ్డారు. వారు పడ్డ కష్టానికి ప్రతిఫలం ప్రపంచకప్ రూపంలో లభించింది. నా కెరీర్ కోసం నాన్న కెరీర్, ఉద్యోగాన్ని వదిలి పూర్తి స్థాయి కోచ్‌గా మారిపోయారు. మెరుగైన శిక్షణ కోసం పుట్టిన ఊరు భద్రాచలం నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాము. అంచలంచెలుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇక్కడికి చేరుకున్నాను. భవిష్యత్‌లో భారత సీనియర్ జట్టుకు ఆడాలన్నదే నా కల.
-త్రిష