‘అద్భుతాలు జరిగేప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగాక ఎవరూ గుర్తించాల్సిన పన్లేదు..’ అంటాడు ఖలేజా సినిమాలో ఓ పాత్రదారి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అద్భుతాన్ని మాత్రం చరిత్ర గుర్తించింది. అనామక ఆటగాడిగా వచ్చి ప్రపంచ స్పిన్ బౌలింగ్ కు రిఫరెన్స్ గా మారిన ఓ దిగ్గజ ఆటగాడికి సమున్నత గౌరవాన్ని ఇచ్చింది ఆ అద్భుతం. ఆ అద్భుతం పేరు షేన్ వార్న్. చేసిన మాయ ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’.
సరిగ్గా 29 ఏండ్ల క్రితం.. 1993 జూన్ 4. యాషెస్ టెస్టులో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ లో మాంచెస్టర్ లో తొలి టెస్టు ఆడుతున్నది. ఆసీస్ పెద్దగా స్కోరేమీ చేయలేదు. 289 పరుగులకే చాప చుట్టేసింది. కంగారూలను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఆనందం ఇంగ్లీష్ ఆటగాళ్లకు ఎక్కువ సేపు నిలువలేదు.. కారణం షేన్ వార్న్.
ఇంగ్లాండ్ ఓపెనర్ మైక్ అథర్టన్ ఔట్ అయ్యాక వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చాడు మైక్ గాటింగ్. వార్న్ చేతిలో బంతి. ఫీల్డింగ్ సెట్ చేసుకుని బంతిని విసిరాడు. లెగ్ స్టంప్ ఆవల పడింది ఆ బాల్. ఆ ఇదేం చేస్తుందిలే అనుకున్నాడు గాటింగ్. ఎంత స్పిన్ అయినా వికెట్ల మీదకు చొచ్చుకురాదనే ధీమా అతడిది. తనదైన శైలిలో డిఫెన్స్ ఆడటానికి యత్నించాడు. బంతి మిస్ అయింది. ఆసీస్ వికెట్ కీపర్ ఇయాన్ హేలితో పాటు ఆ జట్టు ఆటగాళ్లంతా సంబురాలు చేసుకుంటున్నారు. గాటింగ్ కు అర్థం కాలేదు.
వెనక్కి తిరిగి చూసుకుంటే ఆఫ్ స్టంప్ బెయిల్స్ పడిపోయి ఉన్నాయి. లెగ్ స్టంప్ ఆవల పడ్డ బంతి.. ఆఫ్ స్టంప్‌ను ఎలా పడగొట్టింది..? అని గాటింగ్ కు పాలు పోలేదు. అసలు ఆ బంతి లోపలికి ఎలా వచ్చింది..? అనుకుని బిత్తర చూపులు చూసుకుంటూనే పెవిలియన్ వైపు నడిచాడు. గాటింగ్ తో పాటు మరో వ్యక్తికి కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ మరో వ్యక్తి అంపైర్. ఆ అద్భుతాన్ని అత్యంత దగ్గరగా చూసి ఆశ్చర్యపోయింది ఆ ఇద్దరే మరి.. ఆ బంతిని ఐసీసీ ఈ శతాబ్దపు బంతి (బాల్ ఆఫ్ ది సెంచరీ) గా గుర్తించి గౌరవించారు.
స్పిన్ మాంత్రికుడు చేసిన ఆ మాయ జరిగి నేటికి 29 ఏండ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఐసీసీ.. అదే విషయాన్ని ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ‘ఇదే రోజు ప్రపంచం షేన్ వార్న్ చేసిన అద్భుతాన్ని చూసింది..’ అని రాసుకొచ్చింది.
On this day in 1993, the world witnessed Shane Warne's 'Ball of the Century' 🔥 pic.twitter.com/E47RM3BpwA
— ICC (@ICC) June 4, 2022