హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో రిటైర్డ్ అధికారి. ఉద్యోగం నుంచి వైదొలిగాక ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన సందర్భం. కానీ అనారోగ్యం బారిన పడి కొన్నాళ్ల క్రితం గుండెకు బైపాస్ సర్జరీ అయింది. అయినా ఆయన అక్కడితో ఆగిపోలేదు. ఆరు నెలల క్రితమే పవర్ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుని ఇప్పుడు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడమే గాక ఏకంగా నాలుగు స్వర్ణాలతో సత్తా చాటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయనే భద్రాచలం నగరానికి చెందిన డీవీ శంకర్ రావు. ఇటీవలే కోజీకోడ్ (కేరళ) వేదికగా ముగిసిన జాతీయ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో శంకర్ రావు.. మాస్టర్ -4, 83 కిలోల విభాగంలో మూడు స్వర్ణ పతకాలతో పాటు ఓవరాల్ చాంపియన్‌షిప్‌నూ గెలుచుకుని సత్తా చాటారు. భారత పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఒక బైపాస్ సర్జరీ అయిన వ్యక్తి జాతీయ స్థాయిలో పాల్గొనడమే గాక పతకాలు గెలవడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.