న్యూఢిల్లీ, జూన్ 24 : పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల్ని నిశితంగా గమనిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. అలాగే వడ్డీరేట్ల పెంపుపై ఇప్పుడు మాట్లాడటం తొందరపాటే అవుతుందని వ్యాఖ్యానించారు. ‘రేట్ల పెంపునకు మార్కెట్‌ను సిద్ధం చేయాలని నిజంగానే మేము అనుకున్నైట్టెతే.. అప్పుడు మా పాలసీ విధానాన్ని మేము మార్చుకొనేవాళ్లం. రాబోయే నెలల్లో వడ్డీరేట్లను పెంచడానికి వీలుగా తటస్థం నుంచి నియంత్రణ వైఖరికి గతంలోనే మారే వాళ్లం.
కానీ అలా చేయలేదు’ అని ఓ ప్రముఖ జాతీయ వార్తా చానెల్‌తో మల్హోత్రా స్పష్టం చేశారు. కాబట్టి వడ్డీరేట్ల పెంపుపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుందన్నారు. అయితే కొన్ని సవాళ్లు తమ ముందున్నాయన్న విషయం తమకు తెలుసన్న ఆయన.. ద్రవ్యోల్బణం, జీడీపీ వృద్ధిరేటు తీరుతెన్నులను దగ్గరగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ద్రవ్యోల్బణం విషయంలో అప్రమత్తంగానే ఉన్నామని పేర్కొన్నారు. ఈ నెల ఆరంభంలో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచిన విషయం తెలిసిందే.
క్రెడిట్ కార్డు ద్వారా మోసపూరిత ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలపై ఫిర్యాదులున్నైట్టెతే.. కస్టమర్ నోటిఫికేషన్ తేదీ నుంచి 5 రోజుల్లోగా సదరు మొత్తం యొక్క షాడో రివర్సల్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్‌కు వీలు కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ఈ తాత్కాలిక క్రెడిట్‌తో బాధిత కస్టమర్లకు ఊరట లభిస్తుందన్నది. ఈ మేరకు డిజిటల్ లావాదేవీల్లో కస్టమర్ బాధ్యతల పరిమితులపై సవరించిన విధివిధానాలను తాజాగా ఆర్బీఐ జారీ చేసింది. అలాగే రూ.500కుపైగా ఉండే అన్ని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీ (ఈబీటీ)ల గురించి ఖాతాదారులకు బ్యాంకులు ఎస్ఎంఎస్లను పంపించాల్సిందేనని ఆర్బీఐ స్పష్టం చేసింది.
రూ.500 వరకు ఉండే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి కస్టమర్లకు ఎస్ఎంఎస్లు పంపాలా? వద్దా? అన్నది బ్యాంకుల ఇష్టమని చెప్పింది. అయితే ఈ సందేశాలకు ఖాతాదారుల నుంచి చార్జీలను వసూలు చేయరాదన్నది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇకపోతే చిన్నతరహా ఈబీటీ మోసాల్లో నష్టపరిహారంపై స్పందిస్తూ.. రూ.50,000 వరకు నష్టపోయిన కేసుల్లో బాధిత ఫిర్యాదుదారునికి నష్టపోయిన సొమ్ములో 85 శాతం లేదా గరిష్ఠంగా రూ.25,000 ఇవ్వాలని కూడా బ్యాంకులకు ఆర్బీఐ చెప్పింది. అయితే ఈ సాయం ఒక్కసారే వర్తిస్తుందన్నది. 65 శాతం ఆర్బీఐ ద్వారా, 10 శాతం కస్టమర్ బ్యాంక్ నుంచి, 10 శాతం బెనిఫీషియరీ బ్యాంక్ ద్వారా చెల్లించడం జరుగుతుందని వివరించింది.