వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీమ్ఇండియా.. ప్రపంచకప్‌లో మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే దాయాది పాకిస్థాన్‌తో పాటు నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన ఆదివారం దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. బలాబలాల విషయంలో ఇరు జట్లు సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నా.. టీమ్ఇండియానే ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బౌలర్లకు స్వర్గధామమైన పెర్త్ పిచ్‌పై భారత టాపార్డర్ ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరం.
మరో 28 పరుగులు చేస్తే టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డుల్లో కెక్కనున్నాడు. ప్రస్తుతం జయవర్ధనే (1016) అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ (989)రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
పొట్టి ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు ఐదుసార్లు ఎదురుపడగా.. భారత్ నాలుగు సార్లు నెగ్గింది.
పెర్త్: కప్పు కొట్టడమే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత క్రికెట్ జట్టు.. అందుకు తగ్గట్లే రెండు మ్యాచ్‌లు నెగ్గి మూడో పోరుకు రెడీ అయింది. గ్రూప్-2లో భాగంగా పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై విజయాలు సాధించిన రోహిత్ సేన.. ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన టీమ్ఇండియా నాలుగు పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా కొనసాగుతుండగా.. దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్ నెగ్గి, మరో మ్యాచ్ వర్షార్పణం కావడంతో మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు గ్రూప్‌లో అగ్రస్థానంతో సెమీస్‌కు అర్హత సాధించడం దాదాపు ఖాయం కావడంతో ఇరు జట్లు కసరత్తులు చేస్తున్నాయి. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగనుండగా.. దక్షిణాఫ్రికా జట్టు డికాక్, రాసో, మిల్లర్‌పై ఆశలు పెట్టుకుంది. రబడ, నోర్జే, ఎంగ్డీ రూపంలో ప్రపంచ అత్యుత్తమ పేసర్లు అందుబాటులో ఉండటం ప్రొటీస్‌కు కలిసొచ్చే అంశం కాగా.. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా రూపంలో టీమ్ఇండియాకు కూడా నాణ్యమైన పేస్ బలగం అందుబాటులో ఉంది.
పచ్చికతో కూడిన పిచ్ పేసర్లకు సహకరించనుంది. మైదానం పెద్దది కావడంతో బౌండ్రీలు బాదడం కాస్త కష్టతరమైనదే. ఈ పిచ్‌పై ఇప్పటి వరకు ఒక్క సారి మాత్రమే రెండొందల పైచిలుకు స్కోరు నమోదైంది. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్య, అక్షర్, పాండ్యా, కార్తీక్, అశ్విన్, షమీ, భువనేశ్వర్, అర్శ్‌దీప్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, రాసో, మార్క్మ్,్ర మిల్లర్, స్టబ్స్, పార్నెల్/జాన్సెన్, కేశవ్ మహరాజ్, నోర్జే, ఎంగ్డీ, రబడ.