Temba Bavuma : దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా తెంబ బవుమా త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నాడు. సఫారీ జట్టు టెస్టు కెప్టెన్ అయిన తొలి నల్ల జాతీయుడిగా అతను రికార్డు సృష్టించనున్నాడు. డీన్ ఎల్గర్ నుంచి 32 ఏళ్ల బవుమా టెస్టు పగ్గాలు అందుకోనున్నాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. ‘పురుషుల జట్టు టెస్టు కొత్త కెప్టెన్‌గా తెంబ బవుమాకు దక్షిణాఫ్రికా క్రికెట్ తరఫున స్వాగతం చెప్తున్నాం. అతనికి ఆటగాడిగా, కెప్టెన్‌గా దేశవాళీ, అంతర్జాతీయంగా అపారమైన అనుభవం ఉంది.
2021 మార్చి నుంచి అతను టీ20, వన్డే టీమ్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను జట్టును సమర్థంగా నడిపిస్తాడని మాకు నమ్మకం ఉంది. గత రెండేళ్లుగా సుదీర్ఘ ఫార్మాట్ సారథిగా ఉన్న ఎల్గర్‌కు ధన్యవాదాలు. అతని కెప్టెన్సీలో జట్టు కష్టమైన దశనుంచి బయటపడింది. అంతేకాదు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పట్టికలో మంచి స్థానంలో ఉంది’ అని డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఎనోక్ క్వే తెలిపాడు.
బువుమా ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో సఫారీ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అయితే.. అతను టీ20 కెప్టెన్‌గా ఉండేందుకు ఆసక్తి చూపించడం లేదు. దాంతో, అతని ప్లేస్‌లో మరొకరిని కెప్టెన్‌గా త్వరలోనే నియమించే అవకాశం ఉంది. బవుమాకు టెస్టు కెప్టెన్‌గా తొలి పరీక్ష వెస్టిండీస్‌తో ఎదురు కానుంది. రెండు టెస్టుల సిరీస్ ఫిబ్రవరి 28న ప్రారంభం కానుంది. విండీస్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన తర్వాత టీ20 కెప్టెన్ పేరు వెల్లడిస్తామని దక్రిణాఫ్రికా క్రికెట్ తెలిపింది.
క్వింటన్ డికాక్ నుంచి పగ్గాలు అందుకున్న ఎల్గర్ రెండేళ్లుగా సఫారీ టెస్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అతని సారథ్యంలో ఆ జట్టు 15 టెస్టులు ఆడింది. కెప్టెన్‌గా ఎల్గర్ ఘనత ఏంటంటే.. స్వదేశంలో సఫారీ జట్టు భారత్‌పై సిరీస్ గెలిచింది. అయితే.. ఆస్ట్రేలియా పర్యటనలో మాత్రం ఎల్గర్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఆకట్టుకోలేదు. స్థాయికి తగ్గట్టు రాణించలేదు. మూడు టెస్టుల సిరీస్‌లో సఫారీ జట్టు చిత్తుగా ఓడిపోయింది. దాంతో, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆ జట్టు నాలుగో స్థానానికి పడిపోయింది.