Sailing | అమర్, అక్బర్, ఆంథోనీ సరిగ్గా 48 ఏండ్ల క్రితం బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన సినిమా! మన్మోహన్ దేశాయ్ దర్శకత్వంలో అమితాబ్‌బచ్చన్, వినోద్‌ఖన్నా, రిశికపూర్ నటించిన సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. దాదాపు ఇదే కథ నిజజీవితంలో చోటు చేసుకుంది. ఊహ తెలియని వయసులోనే కన్నవాళ్లను కోల్పోయింది ఒకరైతే, బతుకుదెరువు కోసం పట్నం బాట పట్టింది మరొకరు, ఆలనాపాలన చూడాల్సిన వయసులో పెద్దదిక్కైన తండ్రిని కోల్పోయింది మరొకరు. ఇలా ఒక్కోక్కరిది ఒక్కో నేపథ్యం. ఆ ముగ్గురే నవీన్, సాత్విక్, రిజ్వాన్. వీరిని ఒక్క చోటకు చేర్చింది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్. ప్రతిభకు పదును పెడుతూ సెయిలింగ్‌లో శిక్షణనిచ్చి వారిని జాతీయస్థాయికి చేర్చింది. కాలం పెట్టిన పరీక్షలో అవరోధాలకు ఎదురీదుతూ అనతికాలంలోనే నవీన్, సాత్విక్, రిజ్వాన్ జాతీయ స్థాయికి ఎదిగారు. వీరి ప్రతిభను గుర్తించిన నేవీ యూత్ స్పోర్ట్స్ కంపెనీ చోటు కల్పించింది. యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌కు అమర్, అక్బర్, ఆంథోనీ అయిన సాత్విక్, రిజ్వాన్, నవీన్‌పై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
అనాథగా మొదలై ఆఫీసర్‌గా : పైన పేర్కొన్న ముగ్గురిలో 13 ఏండ్ల నవీన్‌ది చాలా భిన్నమైన నేపథ్యం. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం లక్ష్మప్ప గ్రామానికి చెందిన నవీన్ ఆరేండ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. మామ దగ్గర జీవనం సాగిస్తున్న నవీన్ ఉన్నట్టుండి ఒక రోజు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి పారిపోయాడు. బస్సెక్కి ఎక్కడికో వెళ్దామనుకున్న నవీన్‌ను కండక్టర్..సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించాడు. ఆ తర్వాత మానహ హక్కుల ఆర్గనైజేషన్‌కు చెందిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో నవీన్‌ను చేర్చారు. అక్కడి నుంచి 2019లో తారా అనాథ ఆశ్రమానికి నవీన్ మారాడు. అయితే పసిప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన నవీన్‌కు అనాథ ఆశ్రమమే ఇల్లుగా మారింది. 2023లో టాలెంట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ కింద హైదరాబాద్ యాచ్ క్లబ్ తారా హోమ్‌ను సందర్శించింది.
సెయిలింగ్‌లో శిక్షణ కోసం మొత్తం ఏడుగురిని ఎంపిక చేయగా, అందులో నవీన్ కూడా ఒకడు. సుహేమ్ షేక్ శిక్షణలో ముంబై, షిల్లాంగ్‌లో జరిగిన జాతీయ ర్యాంకింగ్ చాంపియన్‌షిప్‌లలో నవీన్ సత్తాచాటాడు. అంచనాలకు మించి రాణిస్తూ ప్రతిభకు కొదువలేదని చాటిచెప్పాడు. ఇలా అంచలంచెలుగా రాణిస్తూ ఇటీవల ఐఎన్ఎస్ మండోవి(గోవా)లో ఉన్న నేవీ యూత్ స్పోర్ట్స్‌కు ఎంపికయ్యాడు. జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్) సహకారంతో నడుస్తున్న స్పోర్ట్స్ కంపెనీ ద్వారా నవీన్ కెరీర్‌కు కీలకమైన అడుగుపడిందని, అతని నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకున్నారని సుహేమ్ పేర్కొన్నారు. అతి త్వరలో నవీన్..నేవీ ఆఫీసర్‌గా ముందుకు వస్తాడని ఆయన తెలిపారు. ‘గత ఆరేండ్లుగా నవీన్ చాలా క్రమశిక్షణతో మెదిలాడు. యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ద్వారా సెయిలింగ్‌లోకి ప్రవేశించాడు. కఠోర శిక్షణ ద్వారా సెయిలింగ్‌లో జాతీయస్థాయికి ఎదిగి ప్రస్తుతం నేవీకి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది’ అని ఫాదర్ జోస్ పేర్కొన్నారు.
పేద కుటుంబం నుంచి : వరంగల్ జిల్లా ఎర్రవల్లి గ్రామానికి చెందిన 14 ఏండ్ల ధోకి సాత్విక్‌ది పేద కుటుంబం. బతుకుదెరువు కోసం వరంగల్ నుంచి 2008లో సాత్విక్ కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చింది. మోండా కూరగాయల మార్కెట్లో సాత్విక్ తండ్రి పరమేశ్ కూలీ పనిచేస్తుండగా, తల్లి స్వప్న ఇండ్లలో పాచిపనిచేస్తూ కుటంబాన్ని పోషిస్తున్నారు. రసూల్‌పురాలోని ఉద్బవ్ స్కూల్ విద్యార్థి అయిన సాత్విక్..11 ఏండ్ల వయసులో యాచ్ క్లబ్లో చేరాడు. అతని చదువు, ఆహారం, ఆరోగ్యం సంబంధిత విషయాలన్నీ యాచ్ క్లబ్ దగ్గరుండి చూస్తుంది.
మహమ్మద్ రిజ్వాన్‌కు మరో భిన్నమైన నేపథ్యం. ఏడేండ్ల వయసులో తండ్రిని కోల్పోయిన 15 ఏండ్ల రిజ్వాన్.. ప్రస్తుతం దేశంలో నంబర్‌వన్ ర్యాంక్ సెయిలర్‌గా కొనసాగుతున్నాడు. యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌లో రిజ్వాన్ తల్లి వంటమనిషిగా పనిచేస్తున్నది. పాటిగడ్డ ఎమ్ఎమ్టీఎస్ స్టేషన్‌కు సమీపంలోని శాంతి టౌన్లో చిన్న గుడిసెలో ఉండే రిజ్వాన్..ప్రతీరోజు యాచ్ క్లబ్లో శిక్షణ తీసుకుని దేశం గర్వించదగ్గ సెయిలర్‌గా ఎదిగాడు. ఇప్పటికే యూకేలో జరిగిన టోర్నీతో పాటు లాంగ్వాయిలో (మలేషియా)నూ రిజ్వాన్ సత్తాచాటాడు. ‘భర్త లేని కుటుంబాన్ని నెట్టుకురావడం ఎంత కష్టమో. రిజ్వాన్ చాలా కష్టపడి పైకి వచ్చాడు. నేవీ యూత్ స్కూల్‌కు ఎంపికైన రిజ్వాన్ ఏదో ఒక రోజు దేశానికి సేవ చేసే స్థాయికి ఎదుగుతాడు’అని తల్లి నిశాత్ పేర్కొంది. నేపథ్యాలు వేరైనా ప్రతిభతో జాతీయ స్థాయికి చేరుకున్న నవీన్, సాత్విక్, రిజ్వాన్..యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌కు అమర్, అక్బర్, ఆంథోనీ అని కోచ్ సుహేమ్ షేక్ అభివర్ణించాడు.