అహ్మదాబాద్ : సొంతగడ్డపై భారత అండర్-19 జట్టు ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది. ఇదివరకే వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన యువ భారత్.. బుధవారం ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌నూ 2-0తో గెలుచుకుంది. రెండో అనధికారిక టెస్టులో 10 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. యువ స్పిన్నర్ తన్మయ్ బలోడ రెండో ఇన్నింగ్స్‌లో (8/41) ఏకంగా ఎనిమిది వికెట్లతో మాయచేయగా కంగారులు 151 రన్స్‌కే ఆలౌట్ అయ్యారు.
తొలి ఇన్నింగ్స్‌లోనూ అతడు 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 11 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని భారత్ వికెట్లేమీ నష్టపోకుండా ఐదు బంతుల్లోనే కొట్టేసింది. కాగా మూడో రోజు ఉదయం 11 గంటల కు స్టేడియంలో బాంబు పెట్టామని బెదిరింపు మెయిల్ వచ్చింది. స్టేడియంతో పాటు పక్కనే ఉన్న హైకోర్టు, పలు స్కూళ్లకూ ఇలాగే బెదిరింపులు వచ్చినా పోలీసులు వాటిని బూటకమని తేల్చారు.