చెన్నై: విజిల్స్ మోత మోగుతూ.. పసుపు సముద్రాన్ని తలపించిన చెపాక్ స్టేడియంలో ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్‌కు చెక్ పెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. బంతితో కెప్టెన్ కమిన్స్ (3/28), బ్యాటుతో ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) చెలరేగడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ 5 వికెట్ల తేడాతో సీఎస్కేను ఓడించింది. 8 విజయాలు 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తు సొంతం చేసుకున్న ఆరెంజ్ ఆర్మీ..తనతో పాటు గుజరాత్ టైటాన్స్ బెర్తు కూడా ఖాయం చేసింది. ఏడో ఓటమితో చెన్నై దాదాపు ఎలిమినేట్ అయింది.
సీఎస్కే ఇచ్చిన 181 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47) కూడా రాణించాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44), కార్తీక్ శర్మ (19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) రాణించారు. కమిన్స్ మూడు, సాకిబ్ హుస్సేన్ (2/34) రెండు వికెట్లు తీశారు. ఇషాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ అద్భుతమైన పేస్, లెంగ్త్‌తో కీలక సమయాల్లో వికెట్లు తీసినా.. బ్యాటర్ల సమష్టి కృషితో సీఎస్కే మంచి స్కోరే చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్ (27) చెన్నైకి మెరుపు లాంటి ఆరంభాన్ని ఇచ్చాడు. నితీశ్‌రెడ్డి వేసిన తొలి ఓవర్లోనే సిక్స్, రెండు ఫోర్లు, ఆపై ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించాడు. అయితే, మూడో ఓవర్లోనే రంగంలోకి దిగిన కమిన్స్.. బుల్లెట్ లాంటి బంతితో శాంసన్‌ను ఔట్ చేసి రైజర్స్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు.యంగ్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ (13) కమిన్స్ బౌలింగ్‌లోనే వరుసగా రెండు సిక్సర్లు బాదినప్పటికీ, సాకిబ్ వేసిన స్లో బాల్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ గైక్వాడ్ (21 బంతుల్లో 15) ఒక్క బౌండరీ కొట్టకపోయినా.. కార్తీక్ శర్మ ధాటిగా బ్యాటింగ్ చేశాడు.
హింగే బౌలింగ్‌లో 4,6, కొట్టిన అతను గైక్వాడ్‌తో మూడో వికెట్‌కు 42 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. కానీ, పదో ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన కమిన్స్ ఈ కుర్రాడిని పెవిలియన్‌కు పంపాడు. ఆ వెంటనే గైక్వాడ్‌ను కూడా ఓ పవర్ఫుల్ బౌన్సర్‌తో ఔట్ చేయడంతో 100/4తో చెన్నై ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో శివమ్ దూబే (26)తో కలిసి బ్రెవిస్ జట్టును ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నాడు. నితీశ్‌ను టార్గెట్ చేసి 4, 4, 6 కొట్టిన అతను కమిన్స్ బౌలింగ్‌లో 6,4తో అలరించాడు.ఈషాన్ వేసిన 18వ ఓవర్లో మరో సిక్స్ కొట్టిన అతను వెంటనే క్లీన్‌బౌల్డ్ అవ్వడంతో ఐదో వికెట్‌కు 59 పరుగులు భాగస్వామ్యం ముగిసింది. చివరి రెండు ఓవర్లలో దూబే, ప్రశాంత్ వీర్ (11)ను కట్టడి చేసిన రైజర్స్ బౌలర్లు చెన్నై భారీ స్కోరును అడ్డుకున్నారు.
లక్ష్య ఛేదనను సన్‌రైజర్స్ నింపాదిగా ఆరంభించినా తర్వాత దూకుడు చూపెట్టింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (6) మూడో ఓవర్లో ముకేశ్ చౌదరికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి నిరాశపరచగా.. తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (26) తనదైన స్టయిల్లో ఆడలేకపోయాడు. దాంతో వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బాధ్యత తీసుకున్నాడు. స్పెన్సర్ జాన్సన్ వేసిన నాలుగో ఓవర్లో మూడు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన అతను అన్షుల్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో పవర్‌ప్లేను 45/1తో ముగించాడు. స్పిన్నర్ నూర్ బౌలింగ్‌లో సిక్స్‌తో వేగం పెంచే ప్రయత్నం చేసిన అభి.. మరో స్పిన్నర్ అకీల్ హుస్సేన్‌కు వికెట్‌కు ఇచ్చుకున్నాడు. దాంతో రైజర్స్ 56/2తో ఇబ్బందుల్లో పడేలా కనిపించింది. అయితే, అప్పటికే క్రీజులో కుదురుకున్న ఇషాన్‌కు తోడైన క్లాసెన్ తనదైన శైలిలో విజృంభించాడు.
స్పిన్నర్లు అకీల్, నూర్‌ను టార్గెట్ చేసి రెండేసి ఫోర్లు, సిక్సర్లతో ఎదురుదాడికి దిగాడు. అటువైపు ఇషాన్ కూడా క్రమం తప్పకుండా బౌండరీలు కొట్టడంతో మ్యాచ్ రైజర్స్ వైపు మొగ్గింది. అర్ధ శతకం ముంగిట నూర్ వేసిన 15వ ఓవర్లో శాంసన్ మెరుపు స్టంపింగ్‌కు క్లాసెన్ పెవిలియన్ చేరడంతో మూడో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. దాంతో సీఎస్కే మళ్లీ రేసులోకి వచ్చేలా కనిపించింది. కానీ, కిషన్ అస్సలు తగ్గలేదు. 37 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న అతను.. నితీశ్ రెడ్డి (11) తోడుగా లక్ష్యాన్ని కరిగించాడు. 18 బంతుల్లో రైజర్స్‌కు 28 పరుగులు అవసరమైన దశలో 18 ఓవర్లో నితీశ్‌ను ఔట్ చేసిన ముకేశ్ చెన్నై శిబిరంలో ఆశలు రేపాడు. కానీ, ఆ జట్టుకు ఎలాంటి చాన్స్ ఇవ్వని ఇషాన్ అదే ఓవర్లో 4,6తో రైజర్స్ విజయం ఖాయం చేశాడు. ఆపై కాంబోబ్ బౌలింగ్‌లో ఇషాన్ ఔటైనా సలీల్ (10 నాటౌట్), స్మరన్ (5 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు.
8 ఐపీఎల్లో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ చేరడం ఇది ఎనిమిదోసారి
1 ఒక ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ తొలిసారి సీఎస్కేతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది.
చెన్నై: 20 ఓవర్లలో 180/ 7 ( బ్రెవిస్ 44, కార్తీక్ శర్మ 32, కమిన్స్ 3/28, సాకిబ్ హుస్సేన్ (2/34);
సన్‌రైజర్స్ : 19 ఓవర్లలో 181/5 (ఇషాన్ 70, క్లాసెన్ 47, ముకేశ్ 2/36)