వాషింగ్టన్: కెరీర్ చరమాంకంలో ఉన్న అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ త్వరలో జరిగే యూఎస్ ఓపెన్ టోర్నీ నుంచి తప్పుకుంది. మోకాలి కండరాల గాయంతో ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు బుధవారం ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గతేడాది జూన్‌లో కుడి కాలికి గాయమైనప్పట్నుంచి టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టని సెరెనా.. ఈ ఏడాది జరిగే చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. గాయాల కారణంగా ఇప్పటికే ఈ టోర్నీ నుంచి స్టార్ ఆటగాళ్లు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ దూరమవగా తాజాగా సెరెనా కూడా తప్పుకోవడంతో స్టార్లు లేకుండా యూఎస్ ఓపెన్ కళ తప్పనుంది.