న్యూయార్క్: పురుషుల టెన్నిస్ చరిత్రలోనే అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్ తొలి రౌండ్లోనే అనూహ్యంగా ఓడిపోయాడు. ఆర్ధర్ ఆషే స్టేడియంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ఫస్ట్ రౌండ్లో అర్జెంటీనాకు చెందిన 25 ఏండ్ల అన్‌సీడెడ్ ప్లేయర్ మరియానో నవోనే 7-6(7/5), 5-7, 4-6, 6-2, 6-1తో నాలుగో సీడ్, 39 ఏండ్ల నొవాక్‌ను ఓడించి అతిపెద్ద సంచలనం సృష్టించాడు.
ఈ మెగా టోర్నీలో 21 ఏండ్లుగా ఆడుతున్న నొవాక్ ఇలా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం, 2006 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ మొదటి పోరులోనే ఓడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గ్రాండ్‌స్లామ్స్‌లో వరుసగా 78 తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అజేయ రికార్డుకు కూడా బ్రేక్ పడింది.4 గంటల 36 నిమిషాల పాటు సాగిన ఈ ఐదుసెట్ల మారథాన్ పోరులో నొవాక్ కడుపు నొప్పి, భుజం, వెన్నునొప్పితో ఇబ్బంది పడి డగౌట్ పక్కనే వాంతులు కూడా చేసుకున్నాడు.
జొకోవిచ్ తొలి రౌండ్లో ఓడటం అతిపెద్ద సంచలనంగా మారినా.. మిగతా సీడెడ్ ప్లేయర్లు అరీనా సబలెంకా, డానిల్ మెద్వెదెవ్, జెస్సికా పెగులా, స్వితోలినా, మార్తా కోస్ట్యుక్ శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ తొలి పోరులో టాప్ సీడ్ సబలెంకా (బెలారస్)6-2, 6-4తో ఒసోరియో (కొలంబియా)ను ఓడించింది. మూడో సీడ్ అమెరికన్ పెగులా 6-3, 6-2తో రూస్ (రుమేనియా)ను, 9వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6-1, 6-2తో సియెరా (అర్జెంటీనా)ను చిత్తు చేయగా.. 11వ సీడ్ కోస్ట్యుక్ 6-4, 6-1తో స్టార్మ్ హంటర్‌ను ఓడించింది. కానీ, వీనస్ విలియమ్స్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. పురుషుల్లో ఏడో సీడ్ రష్యా స్టార్ మెద్వెదెవ్ 6-4, 6-2, 6-4తో హ్యూగో గాస్టన్‌ను, 20వ సీడ్ లోకల్ ప్లేయర్ టామీ పాల్ 6-7(3/7), 6-1, 6-3, 6-3తో కోల్మన్ వాంగ్‌ను ఓడించారు.