Sachin Tendulkar : క్రికెట్ గాడ్‌గా కోట్లాది మంది గుండెల్లో కొలువైన సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar ) మరోసారి తన ఆటతో వైరలవుతున్నాడు. వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా పదమూడేళ్ల క్రితమే వీడ్కోలు పలికిన సచిన్ తాజాగా విమానంలో క్రికెట్ ఆడుతున్న వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది. కుటుంబంతో కలిసి ప్రైవేట్ జెట్‌లో వెళ్తూనే.. తనకెంతో ఇష్టమైన, తన జీవితంలో భాగమైన క్రికెట్ ఆడుతూ మాస్టర్ బ్లాస్టర్ తెగ సంబురపడిపోయాడు.
మైదానంలో రికార్డుల రారాజుగా కెరీర్ ముగించిన సచిన్ ఆటకు మాత్రం దూరమవ్వడం లేదు. వీలు చిక్కినప్పుడల్లా బ్యాట్ అందుకొని క్రికెట్ ఆడుతూ మురిసిపోయే టెండూల్కర్.. ఈసారి విమానాన్నే ఆట స్థలంగా మార్చేశాడు. కుటుంబంతో కలిసి వెయ్యి అడుగుల ఎత్తులో ప్రైవేట్ జెట్‌లో వెళ్తూనే.. తన మనసుకు నచ్చిన క్రికెట్ ఆడాడు. అంతేనా.. నువ్వు నన్ను ఔట్ చేయలేవు అంటూ కూతురు సారా టెండూల్కర్‌ను ఆట పట్టడించాడీ దిగ్గజం. ”ఎంత ఎత్తైనా సరే.. ఆటిట్యూడ్ మాత్రం మారదు” అనే క్యాప్షన్‌తో వీడియో పంచుకున్నాడు సచిన్.
Altitude jo bhi ho, attitude change nahi hona chahiye. 😄 pic.twitter.com/TPbsNUe2Op
— Sachin Tendulkar (@sachin_rt) June 12, 2026
ప్రైవేట్ విమానం క్యాబిన్లో సచిన్ క్రికెట్ ఆడుతున్న వీడియోలో కోడలు సానియా చందోక్, కూతురు సారా ఉన్నారు. ఎరుపు బంతిని సానియా విసరగా.. సారా ఫీల్డింగ్ చేసింది. అయితే.. కూతురు క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించి విఫలమవ్వగా.. ‘నువ్వు నన్ను ఔట్ చేయలేవు’ అని సచిన్ సరదాగా అన్నాడు. ఒకప్పుడు మైదానంలో టన్నుల కొద్ది పరుగులతో అభిమానులను అలరించిన సచిన్ ఆకాశవీధిలో.. బ్యాట్ పట్టుకొని కనిపించడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఖుషీకి హద్దే లేదనుకో.