Aryna Sabalenka : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ అరీనా సబలెంక(Aryna Sabalenka) జైత్రయాత్ర కొనసాగిస్తోంది. తొలి రౌండ్ నుంచి ధాటిగా ఆడుతున్న ఈ బెలారస్ ప్లేయర్ అలవోకగా నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన పోరులో ఉక్రెయిన్‌కు చెందిన లెసియా త్సురెంకో(Lesia Tsurenko)ను వరుస సెట్లలో చిత్తుగా ఓడించింది.
లెసియాతో మ్యాచ్ అనంతరం కోర్టు ఇంటర్వ్యూలో సబలెంక ఆసక్తికర విషయం వెల్లడించింది. ‘ఒకవేళ రాకెట్ పట్టకపోయి ఉంటే కచ్చితంగా బాక్సర్ అయ్యేదాన్ని. టెన్నిస్ తర్వాత బాక్సింగ్ తప్పించి వేరే ఏ ఆట నా మనుసులో లేదు’ అని చెప్పింది. తర్వాతి రౌండ్లో ఆమె అమెరికాకు చెందిన అమంద అనిసిమోవ (Amanda Anisimova)తో తలపడనుంది.
అంతేకాదు నిరుడు ఇగా స్వియాటెక్(Iga Swiatek) నెలకొల్పిన రికార్డుపై గురి పెట్టినట్టు సబలెంక వెల్లడించింది. 2023లో స్వియాటెక్ చాలా సెట్లను 6-0తో గెలిచింది. ఈసారి నేను కూడా అదే చేయాలనుకుంటున్నా అని తెలిపింది.
సబలెంక, విక్టోరియా అజరెంక
ప్రస్తుతం సబలెంక ఫామ్ చూస్తుంటే ట్రోఫీ కొల్లగొట్టేలా ఉంది. ఒకవేళ ఈసారి కూడా విజేతగా నిలిస్తే విక్టోరియా అజరెంక(Victoria Azarenka) తర్వాత వరుసగా రెండో ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన క్రీడాకారిణిగా సబలెంక చరిత్ర సృష్టిస్తుంది. అజరెంక వరుసగా 2012, 2013లో ట్రోఫీని గెలుచుకుంది.