SA20 2024 : దక్షిణాఫ్రికా టీ20 లీగ్(SA20 20240 మరోసారి అభిమానులను అలరించనుంది. రెండో సీజన్ వేలం కంటే ముందే షెడ్యూల్ను నిర్వాహకులు ఈరోజు విడుదల చేశారు. జనవరి 10వ తేదీన టోర్నీ షురూ కానుంది. నెల రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 10వ తేదీన ముగుస్తుంది. డిఫెండింగ్ చాంపియన్ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape), జోబర్గ్ సూపర్ కింగ్స్(Joburg Super Kings ) జట్లు ఆరంభ మ్యాచ్లో తలపడనున్నాయి. ఈసారి ఐపీఎల్ మాదిరిగా ప్లే ఆఫ్స్ రేసు ఉంటుంది. ఫైనల్ బెర్తు కోసం రెండు క్వాలిఫైయర్స్, ఒక ఎలిమినేటర్ మ్యాచ్లు నిర్వహిస్తారు.
తొలి వారంలో ప్రతి జట్టు సొంతగడ్డపై ఒక మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. వాండరర్స్ స్టేడియంలో రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. మొదటి మ్యాచ్లో సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్లు ఢీ కొంటాయి. ఆ తర్వాతి మ్యాచ్లో డర్బన్ సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ మధ్య జరుగుతుంది. మొత్తంగా ఆరు వేదికల్లో 34 మ్యాచ్లు నిర్వహించనున్నారు. తొలి సీజన్లో ఎయిడెన్ మర్రం సారథ్యంలోని సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో ప్రిటోరియా కేపిటల్స్(Pretoria Capitals)పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.