Rohit Sharma | భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ సిడ్నీ వేదికగా జరుగుతున్నది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. హిట్‌మ్యాన్ స్థానంలో శుభ్‌మన్ గిల్, ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు చోటు దక్కింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ విశ్రాంతి తీసుకున్నాడని స్టాండ్-ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. ఇటీవల మ్యాచ్‌కు హిట్‌మ్యాన్ దూరం కానున్నట్లు వార్తలు రాగా.. నిజంగానే మ్యాచ్‌కు రోహిత్ విశ్రాంతి తీసుకోవడం ఊహాగానాలకు హైలెట్‌గా నిలిచింది.
టెస్టులకు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? వైట్ జెర్సీలో మళ్లీ కనిపించడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కాలమే సమాధానం చెప్పనున్నది. అయితే, ఇకపై టెస్టుల్లో తాను ఆడబోనని.. ఈ నిర్ణయాన్ని సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్కు చెప్పినట్లుగా పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. రోహిత్ తన నిర్ణయంతో ఏ స్థాయి ఆటగాడైనా.. జట్టే కీలకమని హిట్‌మ్యాన్ నిరూపించాడు.
సిడ్నీ టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ ఓ రికార్డును సృష్టించాడు. ద్వైపాక్షిక సిరీస్ మధ్యలో తుది జట్టు నుంచి తొలగించిన బడిన తొలి టీమిండియా కెప్టెన్‌గా నిలిచాడు. గతంలో ఏ సిరీస్ మధ్యలో భారత కెప్టెన్‌ను పక్కన పెట్టిన దాఖలాలు లేవు. అయితే, ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఈ పరిణామం నాలుగుసార్లు జరిగింది. రోహిత్ కంటే ముందుగా పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్, శ్రీలంక మాజీ కెప్టెన్ దినేష్ చండిమాల్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ డెనెస్లను ప్లేయింగ్-11 నుంచి తొలగించారు.
తుది జట్టు నుంచి కెప్టెన్‌ను తొలగించిన ఉదంతం తొలిసారిగా 1974 యాషెస్‌లో చోటు చేసుకున్నది. సిరీస్‌లో నాలుగో టెస్ట్ నుంచి డన్నెస్ స్వయంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతని స్థానంలో జాన్ ఎడ్రిచ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత డెన్సె్ అడిలైడ్ టెస్టులో పునరాగమనం చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత మెల్బోర్న్లో జరిగిన సిరీస్‌లోని ఆరో టెస్టులో 181 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది.
ఇదే తరహా ఘటన 2014లో రెండుసార్లు చోటు చేసుకున్నది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో మిస్బా మూడో మ్యాచ్‌లో తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత అతని స్థానంలో షాహిద్ అఫ్రిది పగ్గాలు చేపట్టాడు. అదే ఏడాది 2014 టీ20 ప్రపంచకప్ సమయంలో చివరి మూడు మ్యాచ్‌లు ఉన్న సమయంలో.. శ్రీలంక కెప్టెన్ దినేష్ చండిమాల్ తప్పుకున్నాడు. అతని స్థానంలో లసిత్ మలింగ పగ్గాలు చేపట్టాడు. మలింగ కెప్టెన్సీలో శ్రీలంక జట్టు చాంపియన్‌గా నిలిచింది. టెస్టు సిరీస్‌లో కెప్టెన్ తప్పుకోవడం 1974 తర్వాత అంటే 51 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు రోహిత్ దూరమయ్యాడు. అడిలైడ్ వేదికగా జరిగిన రెండు టెస్టులోకి అందుబాటులోకి వచ్చాడు. మొన్నటి మెల్బోర్న్ టెస్టు వరకు రోహిత్ బ్యాట్‌తో రాణించలేకపోయాడు. మూడు మ్యాచుల్లోని ఐదు ఇన్నింగ్స్‌లో కేవలం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సిరీస్‌లోని ఐదు ఇన్నింగ్స్‌లో వరుసగా 9, 3, 10, 6, 3 పరుగుల మాత్రమే చేయగలిగాడు. అంతకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల్లో 93 పరుగులు మాత్రమే చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో టీమిండియా 3-0 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. ఇక మెల్బోర్న్ టెస్టులో ప్లేయింగ్ లెవెన్ నుంచి శుభ్‌మన్ గిల్‌ను తొలగించి.. యశస్వి జైస్వాల్‌తో ఓపెనింగ్‌కు వచ్చాడు. కేఎల్ రాహుల్ మూడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టడంతో రోహిత్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
హిట్‌మ్యాన్ సారథ్యంలో టీమిండియా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల్లోనూ ఘోరంగా ఓటమిపాలైంది. ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా రెండు టెస్టుల్లో పరాజయం పాలైంది. రోహిత్ కెప్టెన్సీలో భారత్ గత ఆరు టెస్టుల్లో ఐదు టెస్టుల్లో ఓడిపోయింది. ఒక టెస్టు డ్రాగా ముగిసింది. ఇక గత 15 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 164 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ మాత్రమే ఉన్నది. వరుసగా 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3 (మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో), 9 (మెల్బోర్న్ రెండో ఇన్నింగ్స్‌లో) పరుగులు మాత్రమే చేయగలిగాడు. గత ఏడాది 14 టెస్టులు ఆడిన రోహిత్ 24.76 సగటుతో 619 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలున్నాయి. రోహిత్ ఇప్పటికే టీ20కి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. మళ్లీ టెస్టుల్లో కొనసాగుతాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇకపై ఈ ఫార్మాట్లో రోహిత్ కొనసాగడం కష్టమేనని పలువురు మాజీలు విశ్లేషించారు. రోహిత్ రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. సిడ్నీ టెస్టు తర్వాత అన్ని ఊహాగానాలకు సమాధానం దొరకనున్నది.