Ravichandran Ashwin | అదేంటి బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులో చోటు దక్కించుకోలేదుగా.. మరి వికెట్ తీయడంలో కీలక పాత్ర పోషించడం ఏంటీ అని సందేహపడుతున్నారా? కానీ ఇది నిజంగా నిజమే! పుణె వేదికగా జరుగుతున్న పోరులో బంగ్లా ఓపెనర్లు దుమ్మురేపడంతో ఒక దశలో ఆ జట్టు 93/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. 14 ఓవర్లు పూర్తయినా ఒక్క వికెట్ పడకపోతుండటంతో భారత ప్లేయర్లలో అసహనం కనిపించిది. సరిగ్గా ఆ సమయంలో ఓ సంఘటన చోటు చేసుకుంది.
డ్రింక్స్ బ్రేక్‌లో మైదానంలోకి వచ్చిన సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వికెట్‌కు సంబంధించిన కీలక అంశాలను రోహిత్‌కు వెల్లడించాడు. ఆ పిచ్‌పై ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న అశ్విన్.. బంతి గమనం, ఫీల్డర్ల మోహరింపుపై హిట్‌మ్యాన్‌తో సుదీర్ఘంగా చర్చించాడు. కాసేపటికి మ్యాచ్ తిరిగి ప్రారంభం కాగా.. ఆ మరుసటి ఓవర్లోనే భారత్‌కు తొలి వికెట్ దక్కింది. కుల్దీప్ బంతిని తప్పుగా అంచనా వేసిన తన్జిద్ హసన్ వికెట్ల ముందు దొరికిపోయాడు.
జట్టులో చోటు దక్కనంత మాత్రాన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అశ్విన్ మరోసారి నిరూపించాడు. అవకాశం వస్తే బరిలోకి దిగాలని చూడటంతో పాటు.. బయట కూర్చున్నా.. పక్కాగా పిచ్‌ను చదవడం వల్లే ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియాకు తొలి వికెట్ దక్కింది. బంతి కాస్త బౌన్స్ అవుతోందనే విషయాన్ని రోహిత్‌కు అశ్విన్ వివరించగా.. ఆ వెంటనే భారత్‌కు బ్రేక్‌త్రూ లభించింది. దీంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘చాంపియన్ ఎక్కడ ఉన్నా చాంపియనే’ (రాజు ఎక్కడున్నా రాజే: బాహుబలి డైలాగ్) అంటూ మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.