Royal Challengers | బెంగళూరు: ఐపీఎల్లో అత్యధిక అభిమానగణం కలిగిన ఫ్రాంచైజీలలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కొత్త సారథి వచ్చాడు. హేమాహేమీలు సారథ్యం వహించిన ఆర్సీబీని ఈ సీజన్లో మధ్యప్రదేశ్ క్రికెటర్ రజత్ పాటీదార్ నడిపించనున్నాడు. ఈ మేరకు గురువారం ఆర్సీబీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 2022లో బెంగళూరు జట్టులోకి వచ్చిన 31 ఏండ్ల పాటీదార్.. గత రెండు సీజన్లలో నిలకడగా రాణించాడు.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా పేర్లు సారథ్య రేసులో వినిపించినా జట్టు యాజమాన్యం మాత్రం రజత్ వైపే మొగ్గు చూపిం ది. అంతర్జాతీయ స్థాయి లో భారత జట్టుకు ఆడిన అనుభవం లేకపోయినప్పటికీ రజత్ గతేడాది దేశవాళీ టీ20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి ఆ జట్టును ఫైనల్ చేర్చాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ నాయకుడిగా నడిపించాడు. కాగా పాటీదార్ నియామకంపై కోహ్లీ స్పందిస్తూ.. ‘రజత్.. జట్టులో నువ్వు ఎదిగిన తీరు అద్భుతం. నాతో పాటు జట్టు ఆటగాళ్ల నుంచి నీకు పూర్తి మద్దతు ఉంటుంది’ అని తెలిపాడు.