e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home స్పోర్ట్స్ రాజయోగం దక్కేనా!

రాజయోగం దక్కేనా!

రాజయోగం దక్కేనా!

మరొక్క టైటిల్‌.. అంటూ పుష్కర కాలంగా ఎదురుచూస్తున్న రాజస్థాన్‌ రాయల్స్‌ ఈసారి కొత్త కెప్టెన్‌, కొత్త క్రికెట్‌ డైరెక్టర్‌తో సిద్ధమైంది. అప్పుడెప్పుడో ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ (2008)లో విజేతగా నిలిచి ఆ తర్వాత చతికిలపడ్డ రాజస్థాన్‌ మళ్లీ రాజయోగం కోసం తపిస్తున్నది. యువ సంచలనం సంజూ శాంసన్‌ను సారథిగా చేసి, ఆటలో తలపండిన కుమార సంగక్కరను క్రికెట్‌ డైరెక్టర్‌గా తీసుకొచ్చిన రాయల్స్‌ ఫ్రాంచైజీ ఈసారి టైటిల్‌ దక్కుతుందని ఆశిస్తున్నది. మరి 14వ సీజన్‌లోనూ అంచనాలు లేకుండా బరిలోకి దిగుతున్న శాంసన్‌ సేన అద్భుతం చేస్తుందేమో చూడాలి.
పొట్టి ఫార్మాట్‌ వచ్చిన కొత్తలో ఆసీస్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ నాయకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌లో తొలి టైటిల్‌ పట్టింది. అప్పటి నుంచి ఎంతమంది ఆటగాళ్లను మార్చినా జట్టు తలరాత మారలేదు. వ్యక్తిగత ప్రదర్శనలు ఫర్వాలేదనపిస్తున్నా.. జట్టుగా మాత్రం అద్భుతాలు చేయడంలో విఫలమవుతున్నది. కుమార సంగక్కర వంటి దిగ్గజ ఆటగాడిని క్రికెట్‌ డైరెక్టర్‌గా నియమించిన ఫ్రాంచైజీ.. ఈ సారి ఎలాగైనా టైటిల్‌ పట్టాలని చూస్తున్నది. మోరిస్‌, బెన్‌ స్టోక్స్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లతో పాటు సంజూ శాంసన్‌, ఉనాద్కట్‌, రాహుల్‌ తెవాటియా వంటి దేశీయ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం రాయల్స్‌కు కలిసొచ్చే అంశం. పంజాబ్‌తో ఈ నెల 12న రాజస్థాన్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.
స్టోక్స్‌పైనే ఆశలు..
ఇంగ్లండ్‌ ఆటగాళ్లపై అత్యధికంగా ఆధారపడుతున్న రాజస్థాన్‌ రాయల్స్‌ ఈసారి కూడా బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌ను నమ్ముకుంది. అయితే ఎక్స్‌ప్రెస్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ గాయం వల్ల దూరం కావడం ఆ జట్టును కలవరపెడుతున్నది. ఐపీఎల్‌ వేలం చరిత్రలో అత్యధిక మొత్తం (రూ.16.25 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకున్న దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్‌ మోరిస్‌ ఆల్‌రౌండర్‌ బాధ్యతలు మోయనున్నాడు. ఆండ్రూ టై, ముస్తఫిజుర్‌ రహమాన్‌, స్టోక్స్‌, ఉనాద్కత్‌ రూపంలో లెక్కకు మిక్కిలి పేసర్లు ఉన్నా.. స్పిన్‌ విభాగంలో కొరత కనిపిస్తున్నది. మరి ఉన్న వనరులనే వినియోగించుకుంటూ శాంసన్‌.. మరో వార్న్‌ అవుతాడా చూడాలి!

బలాలు

బట్లర్‌, స్టోక్స్‌ వంటి మ్యాచ్‌ విన్నింగ్‌ ఆటగాళ్లు ఉండటం.
ఏ క్షణానైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగల సఫారీ ఆటగాళ్లు డేవిడ్‌ మిల్లర్‌, క్రిస్‌ మోరిస్‌
సంగక్కర వంటి క్రికెట్‌ దిగ్గజం కోచింగ్‌ స్టాఫ్‌లో భాగస్వామి కావడం.
యువ ప్రతిభకు పట్టం కడుతూ సంజూ శాంసన్‌కు జట్టు పగ్గాలు అప్పగించడం.

బలహీనతలు

విదేశీ ఆటగాళ్లపై అతిగా ఆధారపడి ఉండడం. దేశీయ ప్లేయర్ల విషయంలో బలహీనంగా ఉండటం.
ఆర్చర్‌ గాయంపై సందిగ్ధత. ఉనాద్కత్‌ తన ధరకు న్యాయం చేయలేకపోవడం.
పేస్‌ విభాగం ఫర్వాలేదనిపిస్తున్నా.. స్పిన్‌లో సరైన ప్రత్యామ్నాయాలు లేకపోవడం.
స్టీవ్‌ స్మిత్‌ లాంటి నమ్మకమైన బ్యాట్స్‌మన్‌ను వదిలేసుకోవడం.

భారత ఆటగాళ్లు: శాంసన్‌, యశస్వి జైస్వాల్‌, మనన్‌ వోహ్రా, అనూజ్‌ రావత్‌, రియాన్‌ పరాగ్‌, తెవాటియా, శ్రేయస్‌ గోపాల్‌, మయాంక్‌ మార్కండే, ఉనాద్కట్‌, కార్తీక్‌ త్యాగి, శివం దూబే, చేతన్‌ సకారియా, కరియప్ప, కుల్దీప్‌ యాదవ్‌, ఆకాశ్‌ సింగ్‌,లోమ్రర్‌.
విదేశీ ఆటగాళ్లు: బట్లర్‌, స్టోక్స్‌, మిల్లర్‌, ఆర్చర్‌, ఆండ్రూ టై, మోరిస్‌, ముస్తఫిజుర్‌, లివింగ్‌స్టోన్‌.

కొత్తగా వచ్చిన వాళ్లు: మోరిస్‌ (రూ. 16.25 కోట్లు), శివం దూబే (రూ. 4.4 కోట్లు), చేతన్‌ (రూ. 1.2 కోట్లు), ముస్తఫిజుర్‌ (రూ. కోటి), లివింగ్‌స్టోన్‌ (రూ. 75 లక్షలు), కరియప్ప (రూ. 20 లక్షలు), ఆకాశ్‌సింగ్‌ (రూ. 20 లక్షలు), కుల్దీప్‌ యాదవ్‌ (రూ. 20 లక్షలు).

Advertisement
రాజయోగం దక్కేనా!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement