ఆటలో సమోన్నత శిఖరాలు అధిరోహించి యువతరానికి మార్గదర్శకంలా నిలిచిన ఆ తండ్రి.. తన కూతురికి కూడా రాకెట్ పట్టడం నేర్పాడు. నాన్న బాటలోనే నడవాలని నిర్ణయించుకున్న ఆ తనయ.. అంచెలంచెలుగా ఎదుగుతూ కామన్వెల్త్లో పతకం గెలిచే స్థాయికి చేరింది. ఆ తండ్రి జాతీయ బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కాగా.. కూతురు పుల్లెల గాయత్రి గోపీచంద్. ఇటీవల ముగిసిన బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ మహిళల డబుల్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన గాయత్రితో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..
ఆడిన తొలి కామన్వెల్త్గేమ్స్లోనే పతకం సాధించడంపై మీ స్పందన?
అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పతకం నెగ్గడం చాలా ఆనందంగా ఉంది. మొదటి కామన్వెల్త్ క్రీడల్లోనే కాంస్యం గెలుచుకోవడం గర్వంగా అనిపిస్తున్నది. ఈ అనుభూతి మాటల్లో వర్ణించలేను. అంచనాలు ఎక్కువ ఉన్నా ఒత్తిడి దరి చేరనివ్వకూడదని ముందే నిర్ణయించుకున్నా. ఫలితంతో సంతృప్తిగా ఉన్నా.
టీమ్ ఈవెంట్లో పతకం నెగ్గడం ఎలా అనిపించింది?
మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం నెగ్గుతామని అనుకున్నాం. కానీ.. కుదరలేదు. జట్టులో సీనియర్లు ఉండటం మాకు కలిసొచ్చింది. భవిష్యత్తులో టీమ్ విభాగంలో తప్పక స్వర్ణం సాధిస్తాం. ఈ అనుభవం నాకు ఎంతగానో ఉపయోగపడింది.
త్రిసా జాలీతో మీ జోడీ ఎలా కుదిరింది?
చాన్నాళ్లుగా త్రిసాతో కలిసి ఆడుతున్నా. తన ఆటపై నాకు.. నా ఆటపై తనకు మంచి అవగాహన ఉంది. త్రిసా ఎక్కువ అటాకింగ్ గేమ్ ఆడేందుకు ఇష్టపడుతుంది. నేను నెట్ ఫినిషింగ్‌కు మొగ్గుచూపుతా. దీంతో ఇద్దరి కాంబినేషన్ బాగా కుదిరింది. ఎవరు తప్పుచేసినా తదుపరి పాయింట్ గురించే ఆలోచిస్తూ ముందుకు సాగడం మా నైజం.
తదుపరి ఏ టోర్నీలో పాల్గొంటున్నారు?
ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా. కాస్త విరామం తీసుకున్నాక టోక్యో వరల్డ్ చాంపియన్‌షిప్‌కు సిద్ధమవుతా. అక్కడ కప్ నెగ్గాలని నేను, త్రిసా లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసం శిక్షణ తీవ్రతరం చేస్తాం.
సీనియర్లతో కలిసి ఆడటంపై మీ కామెంట్?
టీమ్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉంటాం. సింధు, శ్రీకాంత్, సాత్విక్ లాంటి సీనియర్లు జట్టులో ఉండటం మాలో ఉత్సాహాన్ని నింపింది. డబుల్స్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో వారు పక్కన ఉండి మమ్మల్ని ప్రోత్సహించేవారు. వాళ్ల ఎంకరేజ్మెంట్ వల్లే మరింత ధైర్యంగా పోరాడగలిగాం.
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఎలా ఉంది?
ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ప్లేయర్లకు ఆర్థికంగా అండగా నిలుస్తూ.. మరింత మంది క్రీడారంగం వైపు అడుగులు వేసేలా
ప్రోత్సహిస్తున్నారు.
డబుల్స్‌లో మీకు ఎవరు పోటీ అని భావిస్తున్నారు?
క్రీడల్లో గెలుపోటములు సహజం. మలేషియా, చైనీస్ తైపీ, చైనా ప్లేయర్లు అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ చాంపియన్‌షిప్‌పైనే దృష్టి పెట్టాం. పతకంతో తిరిగొస్తామనే నమ్మకముంది. ప్రస్తుతానికి పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం లేదు. నిలకడగా రాణిస్తూ వరుస విజయాలు సాధించాలనుకుంటున్నా.
మీ విజయాల వెనుక తల్లిదండ్రుల పాత్ర?
అమ్మా, నాన్న ఇద్దరూ బ్యాడ్మింటన్ క్రీడాకారులే కావడం నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. మ్యాచ్ అనంతరం ఏమేం తప్పులు చేశాం, వాటిని ఎలా అధిగమించాలనే విషయాలు నాన్న వివరంగా చెప్తారు. వాటిని రానున్న మ్యాచ్‌ల్లో చేయకుండా చూసుకోవాలని వివరిస్తారు. ఆయన ఇచ్చిన సలహాల వల్లే కామన్వెల్త్లో పతకం సాధించగలిగా. ఇక్కడితో ఆగిపోవాలనుకోవడం లేదు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలనుంది.