ముల్లాన్‌పూర్: ఐపీఎల్-19వ సీజన్‌ను నిరుటి రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఘనంగా ప్రారంభించింది. తమ తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తుచేసి విజయంతో టైటిల్ వేటను మొదలెట్టింది. ముల్లాన్‌పూర్ వేదికగా టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని 3 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. గిల్ సేన నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కింగ్స్.. 19.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి గెలుపు బోణీ కొట్టింది. ఈ లీగ్‌లో అరంగేట్ర మ్యాచ్ ఆడిన కూపర్ కనోలి (44 బంతుల్లో 72 నాటౌట్, 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకానికి తోడు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (24 బంతుల్లో 37, 1 ఫోర్, 4 సిక్స్‌లు) రాణించారు. పంజాబ్ ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. బ్యాటర్ల వైఫల్యంతో 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ గిల్ (27 బంతుల్లో 39, 6 ఫోర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 38, 3 ఫోర్లు, 2 సిక్స్) మినహా మిగిలినవారంతా తేలిపోయారు.
స్వల్ప ఛేదనలో రెండో ఓవర్లోనే ప్రమాదకర ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (7) వికెట్‌ను కోల్పోయిన పంజాబ్ ఆ తర్వాత ధాటిగా ఆడింది. ప్రభ్‌సిమ్రన్, కనోలి గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో స్కోరుబోర్డు కరిగిపోయింది. రబాడా నాలుగో ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ రెండు సూపర్ సిక్స్‌లతో అలరించగా కనోలి కూడా ఓ సిక్స్ బాదడంతో 19 పరుగులొచ్చాయి. సుందర్ ఓవర్లో సిక్స్‌తో టచ్‌లోనే కనిపించిన ప్రభ్‌సిమ్రన్.. రషీద్ పదో ఓవర్లో లాంగాన్ మీదుగా భారీ షాట్ ఆడబోయి ప్రసిద్ధ్ చేతికి చిక్కడంతో 49 బంతుల్లోనే 76 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి రావడంతోనే అశోక్ ఓవర్లో రెండు పుల్‌షాట్ సిక్స్‌లు కొట్టిన కెప్టెన్ శ్రేయాస్ (18).. ప్రసిద్ధ్ ఓవర్లో నిష్క్రమించాడు. ఐదో స్థానంలో వచ్చిన వధెర (3)ను వాషింగ్టన్ ఔట్ చేశాడు. ఇదే జోష్‌లో ప్రసిద్ధ్ తన మరుసటి ఓవర్లో శశాంక్ (4), స్టోయినిస్‌ను ఔట్ చేయడంతో మ్యాచ్ కాస్తా ఉత్కంఠకు దారితీసింది. యాన్సెన్ (9) కూడా నిరాశపరిచినా బార్ట్లెట్ (11*) అండతో కూపర్ ఏకాగ్రత కోల్పోకుండా లాంఛనాన్ని పూర్తిచేశాడు.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు.. బార్ట్లెట్ వేసిన రెండో ఓవర్లో గిల్ మూడు బౌండరీలతో 14 రన్స్ రాబట్టాడు. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్లో సాధించిన అత్యధిక పరుగులివే. యాన్సెన్ తాను వేసిన తొలి ఓవర్లోనే సాయి సుదర్శన్ (13)ను ఔట్ చేయగా పవర్ ప్లే ముగిసేసరికి టైటాన్స్ వికెట్ నష్టపోయి 54 రన్స్ మాత్రమే చేయగల్గింది. గిల్, బట్లర్ క్రీజులో ఉన్నా స్కోరువేగం మాత్రం పుంజుకోలేదు. చాహల్ 9వ ఓవర్లో బౌండరీ సాధించిన గిల్.. మూడో బంతికి కనోలికి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 46 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఆ తర్వాత టైటాన్స్ ఇన్నింగ్స్ టెస్టులను తలపించింది. పంజా బ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 11-19 ఓవర్ల మధ్య టైటాన్స్ రాబట్టిన పరుగులు 66 మాత్రమే. 12వ ఓవర్లో 13 పరుగులు రాగా మిగిలిన ఓవర్లలో డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయలేక గుజరాత్ బ్యాటర్లు చతికిలపడ్డారు. మధ్య ఓవర్లలో వైశాక్.. ఫిలిప్స్ (25), వాషింగ్టన్ (18)ను బోల్తా కొట్టించగా 16వ ఓవర్లో బట్లర్‌ను చాహల్ వెనక్కిపంపాడు. తెవాటియా (10*), షారుఖ్ ఖాన్ (4) వంటి ఆటగాళ్లూ బ్యాట్ ఝుళిపించలేకపోయారు.
గుజరాత్: 20 ఓవర్లకు 162/6 (గిల్ 39, బట్లర్ 38, వైశాక్ 3/34, చాహల్ 2/28); పంజాబ్: 19.1 ఓవర్లకు 165/7(కూపర్ 72*, ప్రభ్‌సిమ్రన్ 37, ప్రసిద్ధ్ 3/29, అశోక్ 1/31)