అమ్మాన్(జోర్డాన్): ఏషియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్లు దుమ్మురేపుతున్నారు. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ టోర్నీలో ఏకంగా 43 పతకాలు పక్కా చేసుకున్నారు. శనివారం జరిగిన వేర్వేరు కేటగిరీల్లో మరో నలుగురు బాక్సర్లు సెమీఫైనల్ బెర్తులు ఖరారు చేసుకోవడం వల్ల పతకాల సంఖ్య 43కు చేరుకుంది.
అండర్-15లో 25 పతకాలు, అండర్-17లో 18 పతకాలు భారత్ సొంతం చేసుకోనుంది. బాలుర అండర్-17 క్వార్టర్స్‌లో అమన్ సివాచ్..జిద్రాచ్ జేమ్(ఫిలిప్పిన్స్)పై అలవోకగా గెలువగా, దేవాంశ్(80కి)..అబ్దుల్లా అల్దబాస్ను చిత్తు చేశాడు. మరోవైపు బాలికల అండర్-17 కేటగిరీలో సిమ్రన్‌జీత్‌కౌర్ 5-0తో అల్హసనత్పై గెలువగా, హిమాంశి.. ఫరా అబును ఓడించి ముందంజ వేసింది.