Warner – Elgar: నూతన సంవత్సరం వస్తుందంటే చాలా మంది ‘న్యూ ఈయర్ రెజల్యూషన్స్’ పేరిట కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. తాము అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేయడానికి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ టార్గెట్లు పెట్టుకుంటారు. ఎన్నో ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. క్రికెటర్లూ ఇందుకు మినహాయింపు కాదు. గతేడాది వైఫల్యాలను గుర్తించి ఈ ఏడాది బాగా రాణించేందుకు తమను తాము సిద్ధం చేసుకుంటారు. ఫామ్‌లో ఉన్నవాళ్లైతే తాము మరింత ఉన్నతంగా ఆడేందుకు ఆటను మెరుగుపరుచుకుంటారు. కానీ 2024 మాత్రం ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపును పలుకబోతోంది. ఆ ఇద్దరు ఎవరో కాదు.. ఆసీస్ దిగ్గజ బ్యాటర్ డేవిడ్ వార్నర్, సఫారీ సారథి డీన్ ఎల్గర్.. ఈ ఇద్దరూ కొత్త ఏడాది మొదలైన ఏడు రోజులకే ఆటకు గుడ్ బై చెప్పనున్నారు.
స్వదేశంలో పాకిస్తాన్‌తో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్న డేవిడ్ వార్నర్.. జనవరి 3 నుంచి (3-7 దాకా) సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ) వేదికగా తన ఆఖరి టెస్టు ఆడనున్నాడు. డీన్ ఎల్గర్ కూడా స్వదేశంలోనే భారత్‌తో కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ఆడబోతున్నాడు. యాధృచ్చికమో ఏమో గానీ అటు ఆసీస్, ఇటు దక్షిణాఫ్రికాలు తమ ప్రత్యర్థులను వైట్ వాష్ చేయడానికి సిద్ధమవుతుండటం గమనార్హం. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ ఇదివరకే 2-0తో సిరీస్ గెలవగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీలు ఇదివరకే 1-0 ఆధిక్యంతో ఉన్నారు.
చివరి టెస్టులో సెంచరీలు చేసి తమ కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు పలకాలని ఈ ఇద్దరు దిగ్గజాలు భావిస్తున్నారు. ఆసీస్-పాక్ సిరీస్‌లో ఇదివరకే వార్నర్.. రెండు మ్యాచ్‌లలో 208 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. మరోవైపు ఎల్గర్ కూడా భారత్‌తో తొలి మ్యాచ్‌లో 185 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇక తమ ఆఖరి టెస్టును కూడా శతకాలతో ముగిస్తే ఈ ఇద్దరు దిగ్గజాల అభిమానులకు పండుగే..
2011లో టెస్టులలో అరంగేట్రం చేసిన వార్నర్.. ఇప్పటివరకూ 111 టెస్టులాడి 8,695 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు (మూడు డబుల్ సెంచరీలు), 36 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టులలో వార్నర్ సగటు 44.59గా ఉండటం గమనార్హం. వార్నర్ టెస్టు ఎంట్రీ తర్వాత ఏడాదికి ఎల్గర్ (2012లో) తొలి టెస్టు ఆడాడు. 11 ఏండ్ల కెరీర్లో 85 టెస్టులు ఆడిన ఎల్గర్.. 5,331 పరుగులు సాధించాడు. టెస్టులలో ఎల్గర్‌కు 14 సెంచరీలున్నాయి. అయితే వార్నర్ టెస్టుల నుంచి రిటైర్ అయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కొనసాగుతానని ఇదివరకే చెప్పాడు. 2024లో అమెరికా/వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్ తర్వాత అతడు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పే అవకాశముంది. కానీ ఎల్గర్ మాత్రం కేప్‌టౌన్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్నాడు. మరి దశాబ్దకాలం పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఈ దిగ్గజాలు తమ ఆఖరి టెస్టులో ఎలా ఆడతారో చూడాలి.