సోచి (రష్యా): ఫార్ములావన్ స్టార్ లూయిస్ హామిల్టన్ వంద విజయాలు సాధించిన తొలి రేసర్‌గా చరిత్రకెక్కాడు. ఆదివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచన ఈ బ్రిటన్ డ్రైవర్.. చాంపియన్‌షిప్ పాయింట్లలోనూ తిరిగి అగ్రస్థానానికి చేరాడు. మెర్సెడెస్కు చెందిన హామిల్టన్ 1:30:41.001 సెకన్లలో అగ్రస్థానంలో నిలిస్తే.. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), సెయిన్జ్ (ఫెరారీ) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు చేజిక్కించుకున్నారు. క్వాలిఫయింగ్ రేస్‌లో అగ్రస్థానంలో నిలిచి ప్రధాన రేసును పోల్ పొజిషన్‌తో ప్రారంభించిన నోరిస్ (మెక్లారెన్) ఏడో ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు. ‘ఇవి అద్భుత క్షణాలు. రేసింగ్ ప్రారంభించినప్పుడు వంద విజయాలు సాధిస్తానని అనుకోలేదు. ఈ ప్రయాణం చాలా సుదీర్ఘంగా సాగింది’ అని రేస్ అనంతరం హామిల్టన్ పేర్కొన్నాడు.