IND vs BAN | అఫ్గానిస్తాన్, నెదర్లాండ్స్‌లు అగ్రశ్రేణి జట్లకు షాకులివ్వడంతో భారత్ – బంగ్లాదేశ్ మ్యాచ్‌లో కూడా అలాంటి ఫలితమేమైనా పునరావృతమవుతుందేమోనని భావించిన క్రికెట్ విశ్లేషకుల అంచనాలు తలకిందులయ్యాయి. సంచలనాలను పక్కనబెడితే బంగ్లా పులులు రోహిత్ సేనకు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయారు. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా పూణే వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బంగ్లాను 257 పరుగులకే పరిమితం చేసిన భారత్.. లక్ష్యాన్ని 41.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.
ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లీ (97 బంతుల్లో 103 నాటౌట్, 6 ఫోర్లు, 4 సిక్సర్లు)కి శతకానికి తోడు శుభ్‌మన్ గిల్ (55 బంతుల్లో 53, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (40 బంతుల్లో 48, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆఖర్లో కెఎల్ రాహుల్ (34 బంతుల్లో 34 నాటౌట్, 3 ఫోర్లు, 1సిక్సర్) రాణించడంతో భారత్ ఈజీ విక్టరీ కొట్టింది. వన్డే ప్రపంచకప్ లో భారత్‌కు నాలుగో విజయం కాగా బంగ్లాదేశ్‌కు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడో ఓటమి.
లక్ష్య ఛేదనను భారత్ ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ లు తొలి వికెట్ కు 12.4 ఓవర్లలో 88 పరుగులు జోడించారు. ఈ ఇరువురూ కలిసి తొలి పవర్ ప్లేలోనే భారత్‌ను విజయం దిశగా నడిపించారు. రోహిత్ తృటిలో అర్థ సెంచరీ కోల్పోయినా 52 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. వన్డే ప్రపంచకప్‌లో గిల్‌కు ఇదే తొలి అర్థ సెంచరీ కావడం విశేషం.
రోహిత్ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా అదే దూకుడును కొనసాగించాడు. ఆడిన తొలి మూడు బంతుల్లోనే 4, 6 బాది తన ఉద్దేశాన్ని చాటిన కోహ్లీ.. 48 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేశాడు. నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (25 బంతుల్లో 19, 2 ఫోర్లు)ఆశించిన స్థాయిలో రాణించలేదు. శ్రేయాస్‌ను మెహిది హసన్ మిరాజ్ ఔట్ చేశాడు.
అయ్యర్ నిష్క్రమించినా కెఎల్ రాహుల్‌తో కలిసి కోహ్లీ భారత్‌ను విజయం దిశగా నడిపించాడు. చివర్లో భారత్ విజయం కంటే కూడా కోహ్లీ శతకం చేస్తాడా..? లేదా..? అన్న ఆందోళన భారత అభిమానులను వేధించింది. ఒకవైపు కెఎల్ రాహుల్ మ్యాచ్‌ను ముగించేందుకు ధాటిగా ఆడటంతో ఆ ఆందోళన మరింత ఎక్కువైంది. కానీ ఒక్కో పరుగు కూడబెడుతూ 90లలోకి వచ్చిన కోహ్లీ.. నసుమ్ వేసిన 42వ ఓవర్ మూడో బంతికి సిక్సర్‌బాది సెంచరీ చేయడమే గాక భారత విజయాన్ని ఖాయం చేశాడు. అంతకుముందు బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.