బ్రిడ్జ్‌టౌన్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు.. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 50 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ ప్రకారం) గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.2 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. యువ ఓపెనర్ ఫిన్ అలెన్ (96; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో శతకం చేజార్చుకోగా.. మిషెల్ (41) రాణించాడు.
విండీస్ బౌలర్లలో కెవిన్ 4, జాసెన్ హోల్డర్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఓ మాదిరి లక్ష్యఛేదనలో విండీస్ తడబడింది. 35.3 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. సౌథీ (4/22), బౌల్ట్ (3/18) ధాటికి టాపార్డర్ కకావికలం కాగా.. అల్జారీ జోసెఫ్ (49), యానిక్ (52) ఆఖర్లో కాస్త పోరాడారు. తొలి వన్డేలో విండీస్ గెలుపొందగా.. ప్రస్తుతం 1-1తో సిరీస్ సమమైంది.