ముంబై: ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ప్రతీ మ్యాచ్ నెగ్గాల్సిన పరిస్థితిలో నిలిచిన ముంబై ఇండియన్స్ తన బ్యాట్ పవర్ చూపెట్టింది. గాయం నుంచి కోలుకొని వచ్చిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 84), ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 83) ఫోర్లు, సిక్సర్ల వర్షంతో వాంఖడే స్టేడియాన్ని ముంచెత్తిన వేళ ముంబై మూడో విజయం అందుకుంది. సొంతగడ్డపై సోమవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది.
వరుసగా ఆరో, మొత్తంగా ఏడో ఓటమితో లక్నో ప్లేఆఫ్స్ దారులు మూసుకున్నాయి. తొలుత వెస్టిండీస్ డ్యాషింగ్ హిట్టర్ నికోలస్ పూరన్ (21 బంతుల్లో 1 ఫోర్, 8 సిక్సర్లతో 63)తో పాటు మిచెల్ మార్ష్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44), హిమ్మత్ సింగ్ (31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 228/5 భారీ స్కోరు చేసింది. కార్బిన్ బాష్ (2/20) రెండు వికెట్లు తీశాడు. తర్వాత ముంబై 18.4 ఓవర్లలోనే 229/4 స్కోరు చేసి గెలిచింది. రికెల్టన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
నికోలస్ పూరన్ పూనకం వచ్చినట్టు చెలరేగడంతో పవర్‌ప్లేలోనే 90 పరుగులు చేసిన లక్నో భారీ స్కోరు అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు ఆరంభం నుంచే దూకుడు మంత్రం జపించింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ తొలి ఓవర్లో 6,4తో దీపక్ చహర్‌కు స్వాగతం పలికాడు. మూడో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన జోష్ ఇంగ్లిష్ (13)ను ఘజన్ఫర్ వెనక్కుపంపినా.. బుమ్రా బౌలింగ్‌లో 6, 4, 4తో మార్ష్ నాలుగు ఓవర్లకే స్కోరు 50 దాటించాడు. ఇక స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో మూడు భారీ సిక్సర్లతో పూరన్ తనలోని హిట్టర్‌ను నిద్రలేపాడు. ఆపై ఘజన్ఫర్ వేసిన ఆరో ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ రాబట్టాడు. ఫీల్డింగ్ మారిన తర్వాతా పూరన్ పవర్ తగ్గలేదు. బాష్ బౌలింగ్‌లో సిక్స్, చహల్ ఓవర్లో రెండు సిక్సర్లతో 16 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. మరో ఎండ్‌లో మార్ష్ సైతం దూకుడు చూపెట్టడంతో 8 ఓవర్లకే లక్నో 123/1తో నిలిచింది.
అయితే, తర్వాతి ఓవర్లో ఈ ఇద్దరినీ ఔట్ చేసిన కార్బిన్ బాష్ ప్రత్యర్థి జోరుకు స్పీడు వేశాడు. ఇక్కడి నుంచి ఆతిథ్య బౌలర్లు పుంజుకున్నారు. కీపర్ రికెల్టన్ పట్టిన అద్భుత క్యాచ్‌తో కెప్టెన్ రిషబ్ పంత్ (15)ను జాక్స్ వెనక్కుపంపగా.. అక్షత్ రఘువంశీ (11)ని రఘు శర్మ ఔట్ చేశాడు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుసగా 4 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాలేదు. మార్క్రమ్ (31 నాటౌట్)తో కలిసి అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన హిమ్మత్ సింగ్.. ఘజన్ఫర్ బౌలింగ్‌లో 6,4తో ఇన్నింగ్స్‌కు మళ్లీ ఊపు తెచ్చాడు. కానీ, చివరి మూడు ఓవర్లలో వరుసగా 9, 7, 6 పరుగులు మాత్రమే ఇచ్చిన ముంబై బౌలర్లు టార్గెట్ మరీ ఎక్కువ కాకుండా చూసుకున్నారు.
భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ బలమైన పునాది వేశారు. రికెల్టన్ తన ఫామ్ కొనసాగిస్తూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించగా.. గాయం నుంచి కోలుకొని ఇంపాప్ట్ ప్లేయర్‌గా వచ్చిన హిట్‌మ్యాన్ తన మార్కు ట్రేడ్‌మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. తొలి ఓవర్లో చెరో ఫోర్‌తో ఛేదన ఆరంభించిన ఈ ఇద్దరూ షమీ వేసిన మూడో ఓవర్లో చెరో సిక్స్‌తో వేగం పెంచారు. అవేశ్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో రోహిత్ 4, 4, 6, 6తో టాప్ గేర్‌లోకి వచ్చాడు. సిద్దార్థ్ బౌలింగ్‌లో తను మరో సిక్స్ బాదితే.. రికెల్టన్ 6,4,6 కొట్టాడు. వీళ్ల జోరుకు సగం ఓవర్లకే ముంబై 127/0తో నిలిచింది. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. స్పిన్నర్ల బౌలింగ్‌లో రోహిత్ 300 స్ట్రయిక్ రేట్‌తో దంచగా.. రికెల్టన్ పేసర్ల పని పట్టాడు.
ఈ బాదుడు చూస్తుంటే ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో పాటు వికెట్ కోల్పోకుండానే ముంబై గెలిచేలా కనిపించింది. అయితే మోసిన్ వేసిన 11వ ఓవర్లో ఫోర్, రెండు సిక్సర్లు బాదిన రికెల్టన్ మరో షాట్‌కు యత్నించి ఇంగ్లిస్‌కు చిక్కడంతో తొలి వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినా వెనక్కుతగ్గని రోహిత్ మరో రెండు ఫోర్లు, సిక్సర్లతో జట్టును విజయానికి చేరువ చేశాడు. అయితే, శతకం దిశగా వెళ్తున్న అతను స్పిన్నర్ సిద్దార్థ్ బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చాడు. అప్పటికే మ్యాచ్ పూర్తిగా ముంబై చేతుల్లోకి వచ్చింది. తిలక్ (11)ను కూడా సిద్దార్థ్ పెవిలియన్ చేర్చినా.. స్టాండిన్ కెప్టెన్ సూర్యకుమార్ (12), విల్ జాక్స్ (10 నాటౌట్)తోడుగా నమన్ ధీర్ (23 నాటౌట్) గెలుపు లాంఛనం పూర్తి చేశాడు.