Chris Gayle : ఐపీఎల్ 2023 మినీ వేలం ముగిసింది. మరికొన్ని రోజుల్లో షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంఛైజీలు జట్టు కూర్పు మీద కసరత్తు చేస్తున్నాయి. కొన్ని జట్లు కెప్టెన్లను మారుస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకొంటాడని, స్టోక్స్‌కు పగ్గాలు అప్పగిస్తాడనే చర్చ అభిమానుల్లో మొదలైంది. ఇదే ప్రశ్నకు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ ఒక్క ముక్కలో క్లారిటీ ఇచ్చాడు.. ధోనీనే. అతను ఆడుతున్నంత కాలం జట్టుని నడిపిస్తాడు అని చెప్పాడు. అంతేకాదు డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ, స్టోక్స్ ఉండడం అనేది సీఎస్కేకు కలిసొస్తుందని గేల్ అన్నాడు. భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేతో కలిసి గేల్ జియో సినిమా సీఎస్కే జట్టు రివ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వేలంలో స్టోక్స్‌ను దక్కించుకున్న సీఎస్కేను అతను ప్రశంసించాడు. పోయిన ఏడాది చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ వ్యవహారం దుమారమే రేపింది. సీఎస్కే యాజమాన్యం ధోనీ బదులు రవీంద్ర జడేజాను కెప్టెన్ చేసింది. వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతుండడంతో మధ్యలోనే మళ్లీ ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించింది.
ఈమధ్యే స్టోక్స్ కెప్టెన్సీలో 17 ఏళ్ల తర్వాత పాక్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ 3-0తో టెస్టు సిరీస్ నెగ్గింది. టీ20 వరల్డ్ కప్‌లోనూ స్టోక్స్ అద్భుతంగా ఆడాడు. దాంతో ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. పోయిన ఏడాది స్టోక్స్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు.