88 పవర్ ప్లే ముగిసేటప్పటికీ కేకేఆర్ స్కోరు 88/1. ఆ జట్టుకు ఐపీఎల్లో ఇది రెండో హయ్యస్ట్ పవర్ ప్లే. అంతకుముందు 2017లో ఆర్సీబీపై 105/0 పరుగులు చేసింది.
ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు (ఎస్ఆర్హెచ్ ఉప్పల్, కేకేఆర్ – వైజాగ్) ఒకే సీజన్లో రెండుసార్లూ అత్యధిక స్కోర్లు నమోదు చేయగా ఆ రెండు తెలుగు నేల మీదే నమోదయ్యాయి.
విశాఖపట్నం వాసులకు హెచ్చరిక! రాగల 24 గంటల్లో తుఫాన్ తీరాన్ని దాటబోతున్నది! ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి! సరిగ్గా ఇలాంటి హెచ్చరికే వైజాగ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఎదురైంది. సముద్రతీర నగరంలో పరుగుల తుఫాన్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. తీరం దాటేటప్పుడు తుఫాన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ఉప్పెనలా ఎగిసిపడింది. సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ పరుగుల హోరులో విశాఖ తడిసిముద్దయ్యింది. నరైన్ విధ్వంస రచనకు తెరలేపితే..రఘువంశీ, ఆఖర్లో రస్సెల్, రింకూ మరోస్థాయికి తీసుకెళ్లారు. ఫలితంగా 272 పరుగులతో ఐపీఎల్లో కేకేఆర్ రెండో అత్యధిక స్కోరు తమ పేరిట లిఖించుకుంది. భారీ లక్ష్యఛేదనలో రిషబ్ పంత్, స్టబ్స్ పోరాడినా అంతరం తగ్గించేందుకే తప్ప..ఫలితం లేకపోయింది.
IPL | విశాఖపట్నం: ఐపీఎల్-17లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయాల్లో హ్యాట్రిక్ కొట్టింది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముగిసిన మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. కేకేఆర్ బ్యాటర్లు సునీల్ నరైన్ (39 బంతుల్లో 85, 7 ఫోర్లు, 7 సిక్సర్లు), అంగ్క్రిష్ రఘువంశీ (27 బంతుల్లో 54, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 17.2 ఓవర్లలో 166 పరుగుల వద్ద ఆగిపోయింది. ఢిల్లీ తరఫున రిషభ్ పంత్ (25 బంతుల్లో 55, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 54, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) వేగంగా ఆడినా కేకేఆర్ విధించిన లక్ష్యం ముందు వాళ్ల పోరాటం చిన్నబోయింది. సునీల్ నరైన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
కోల్‌కతా ఇన్నింగ్స్ ప్రశాంతంగానే మొదలైంది. తొలి రెండు ఓవర్లలో ఆ జట్టు చేసింది పది పరుగులే. అందులోనూ నరైన్ ఆరు బంతులాడి చేసింది ఒక్క పరుగే. కానీ ఇది తుఫాను ముందు వచ్చే ప్రశాంతతే. ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్ నుంచే వైజాగ్ స్టేడియంలో బౌండరీల హోరు, సిక్సర్ల తుఫాను మొదలైంది. మూడో ఓవర్లో నరైన్ బౌండరీతో బాదుడుకు కొబ్బరికాయ కొట్టగా ఫిల్ సాల్ట్ (18) సైతం రెండు ఫోర్లతో స్కోరు వేగాన్ని పెంచాడు. ఇషాంత్ శర్మ వేసిన నాలుగో ఓవర్లో నరైన్.. 6, 6, 4, 6, 4 తో 26 పరుగులు రాబట్టాడు. నోకియా వేసిన ఐదో ఓవర్లో సాల్ట్ నిష్క్రమించడంతో 4.3 ఓవర్లలో 60 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది కానీ వన్ డౌన్లో రఘువంశీ రాకతో ఢిల్లీ బౌలర్ల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినైట్టెంది.
తన కెరీర్లో రెండో ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రఘువంశీ ఎదుర్కున్న తొలి రెండు బంతులనూ బౌండరీ లైన్ దాటించాడు. రసిక్ వేసిన ఆరో ఓవర్లో నరైన్ మూడు బౌండరీలు, ఓ సిక్సర్ సాయంతో 18 పరుగులు రాబట్టాడు. 21 బంతుల్లోనే అతడి అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ ఢిల్లీ బౌలర్లపై వంతులు వేసుకున్నట్టుగా చెలరేగారు. నరైన్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు రాబట్టగా రసిక్ 11వ ఓవర్లో రఘువంశీ రెండుసార్లూ బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. 11 ఓవర్లకే ఢిల్లీ స్కోరు 150 పరుగుల మార్కును దాటింది. మార్ష్ 13వ ఓవర్లో నరైన్‌ను ఔట్ చేయడంతో ఢిల్లీ ఊపిరి పీల్చుకుంది. నరైన్-రఘువంశీలు రెండో వికెట్‌కు 48 బంతుల్లోనే 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మార్ష్ ఓవర్లోనే ఐదో బంతికి సింగిల్ తీసిన రఘువంశీ.. తన తొలి ఐపీఎల్ ఫిఫ్టీని 24 బంతుల్లోనే పూర్తిచేశాడు. అర్ధ సెంచరీ పూర్తయ్యాక నోకియా వేసిన 14వ ఓవర్లో అతడు ఇషాంత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
నరైన్ – రఘువంశీ బాదుడుకు ఎండ్‌కార్డ్ పడ్డా ఆ తర్వాత వచ్చిన సిక్స్ హిట్టర్లు ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్ (8 బంతుల్లో 21, 1 ఫోర్, 3 సిక్సర్లు) బాదుడును నెక్స్ లెవల్‌కు తీసుకెళ్లారు. రసిక్, మార్ష్ ఓవర్లలో సిక్సర్లు, ఫోర్లతో రస్సెల్ స్కోరు వేగాన్ని రాకెట్ వేగంతో పరుగులు పెట్టించాడు. శ్రేయస్ అయ్యర్ (18) తర్వాత వచ్చిన రింకూ.. నోకియా వేసిన 19వ ఓవర్లో మూడు సిక్సర్లు, ఫోర్ సాయంతో 24 పరుగులు రాబట్టాడు. ఇదే ఓవర్లో ఆఖరి బంతికి నిష్క్రమించాడు. ఆఖరి ఓవర్ వేసిన ఇషాంత్.. 8 పరుగులే ఇవ్వడంతో కేకేఆర్ 272 వద్దే ఆగిపోయింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. కేకేఆర్ బ్యాటర్ల బాదుడుకు ఢిల్లీ బౌలర్లలో ఒక్క సుమిత్ కుమార్ తప్ప మిగిలిన బౌలర్ల ఎకానమీ 10 దాటింది. ఆ జట్టు స్ట్రైక్ బౌలర్ నోకియా 4 ఓవర్లలో 59 పరుగులు సమర్పించుకున్నాడు.
కొండంత లక్ష్యాన్ని కరిగించే క్రమంలో ఢిల్లీ ఆది నుంచే తడబడింది. కేకేఆర్‌పై మంచి రికార్డు కలిగిన డేవిడ్ వార్నర్ (18) ఈ మ్యాచ్‌లో మాత్రం విఫలమయ్యాడు. చెన్నైతో మ్యాచ్‌లో ధాటిగా ఆడిన పృథ్వీ షా (10) కేకేఆర్‌తో తేలిపోయాడు. ఈ సీజన్లో అత్యధిక ధర పలికిన స్టార్క్.. ఎట్టకేలకు వికెట్ల ఖాతా తెరిచాడు. తన మూడో ఓవర్లో మిచెల్ మార్ష్ (0)ను ఔట్ చేసిన స్టార్క్.. తర్వాత ఓవర్లో వార్నర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ ఇద్దరూ ఆస్ట్రేలియన్లే కావడం గమనార్హం. అభిషేక్ పొరెల్ (0) సైతం నిరాశపరిచాడు. 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీని రిషభ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్ ఆదుకున్నారు. 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసిన స్టబ్స్నూ చక్రవర్తి పెవిలియన్‌కు పంపాడు.
277/3 (ముంబైపై హైదరాబాద్, 2024)
272/7 (ఢిల్లీపై కోల్‌కతా, 2024)
263/5 (పుణెపై బెంగళూరు, 2013)
257/5 (పంజాబ్‌పై లక్నో, 2023)
కోల్‌కతా: 20 ఓవర్లలో 272/7 (నరైన్ 85, రఘువంశీ 54, నోకియా 3/59, ఇషాంత్ 2/43)
ఢిల్లీ: 17.2 ఓవర్లలో 166 (పంత్ 55, స్టబ్స్ 54, అరోరా 3/27 , చక్రవర్తి 3/33)