సూర్య.. సూర్య.. సూర్య..
గత కొంతకాలంగా భారత క్రికెట్లో విపరీతంగా వినిపిస్తున్న పేరిది.. మర్రిచెట్టు కింద మరో వృక్షం మనగలగలేదు అనే నానుడిని అబద్ధమని నిరూపిస్తూ.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఇద్దరు దిగ్గజాల మధ్యలోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడీ ముంబైకర్!
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య.. సిక్స్ కొట్టామా లేదా అన్నట్లు.. లేటు వయసులో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. పరుగుల కోసం ఆకలిగొన్న సింహంలా మైదానంలో ప్రత్యర్థి బౌలర్లను తన అసాధారణ విన్యాసాలతో చీల్చిచెండాడుతున్నాడు!!
కట్, కవర్, స్ట్రెయిట్ ఇలా క్రికెట్ పుస్తకాల్లోని ప్రతి షాట్‌ను అలవోకగా ఆడేసే సూర్యకుమార్.. స్కూప్, ర్యాంప్, స్నూకర్‌తో పాటు అతడికి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో 360 డిగ్రీస్ షాట్లతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. లంకతో మూడో టీ20లో దంచికొట్టి కెరీర్లో మూడో శతకం నమోదు చేసుకున్న సూర్యకుమార్ తన షాట్ల వెనుక కఠోర శ్రమ దాగుందని అంటున్నాడు. ఆ వివరాలు అతడి మాటల్లోనే..
రాజ్‌కోట్: మైదానంలో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే.. మ్యాచ్‌కు ముందు సాధన చాలా ముఖ్యం. అప్పుడే ఒత్తిడిని దూరం చేసుకోగలం. మ్యాచ్‌కు ముందే వీలైనంత ఎక్కువ ఒత్తిడి అనుభవిస్తే.. అది ఆటలో ఉపయోగపడుతుంది. లంకతో మూడో మ్యాచ్‌కు ముందు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. మైదానంలోకి వెళ్లాక వికెట్ వెనుక బౌండ్రీ తక్కువగా ఉందని గుర్తించా. 60 మీటర్ల దూరం కొట్టడం ఎక్కువ కష్టం కాకపోవడంతో ఆ దిశగా ఎక్కువ షాట్లు ఆడా. కొన్ని షాట్లు ఆడాలని ముందే నిర్ణయించుకున్నా.. బంతి పడే విధానాన్ని బట్టి ఏ షాట్ ఆడేందుకైనా మనం సిద్ధంగా ఉండాలి. అప్పుడే బౌలర్లపై పైచేయి సాధించగలం. ఎక్కువ శాతం ఫీల్డర్ల మధ్య ఖాళీల్లో నుంచి బంతిని పంపి పరుగులు రాబాట్టాలని చూస్తా. కోచ్ రాహుల్ ద్రవిడ్ నాపై ఎప్పుడు ఒత్తిడి చేయలేదు. నా సహజమైన ఆట ఆడమని స్వేచ్ఛనిచ్చాడు. మిడిలార్డర్లో బరిలోకి దిగి అంతర్జాతీయ టీ20ల్లో మూడు సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా నిలువడం ఆనందంగా ఉంది. మ్యాచ్ గమనాన్ని బట్టి షాట్ల ఎంపిక ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఫామ్‌తో సంతోషంగా ఉన్నా. మున్ముందు కూడా ఇదే జోరు కొసాగించాలనుకుంటున్నా.
ఆలస్యంగా జట్టులోకి రావడంతో తన పరుగుల దాహం మరింత పెరిగిందని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడి 30 ఏండ్ల వయసులో భారత జాతీయ జట్టుకు ఎంపికైన సూర్య.. లంకపై సిరీస్ నెగ్గిన అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా ద్రవిడ్ వేసిన పలు ప్రశ్నలకు సూర్య తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
ద్రవిడ్: అరంగేట్రం ఆలస్యమవడం వల్లే సక్సెస్ అయ్యావనుకుంటున్నావా?
సూర్య: దేశవాళీల్లో చాలా పరుగులు చేశా. మ్యాచ్ ఏదైనా బ్యాటింగ్‌కు దిగితే దంచికొట్టాలని అనుకుంటా. ఐపీఎల్లో ముంబై తరఫున కూడా ఇదే చేశా. జాతీయ జట్టులోకి ఆలస్యంగా రావడం కూడా నాలో మరింత ఆకలి పెంచింది.
ద్రవిడ్: నీ ఆటతీరు చూస్తుంటే.. చిన్నప్పుడు నేనాడిన మ్యాచ్‌లు చూడలేదనే అనుకుంటున్నా?
సూర్య: లేదు, మీ బ్యాటింగ్ చాలా చూశా.
ద్రవిడ్: నువ్వాడిన ఇన్నింగ్స్‌ల్లో ఏది అత్యుత్తమం?
సూర్య: ఒక్క ఇన్నింగ్స్‌ను ఎంపిక చేసుకోవడం కష్టం. భిన్న పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. బ్యాట్ పట్టుకొని క్రీజులో అడుగుపెట్టానంటే.. ప్రతి షాట్‌ను ఆస్వాదిస్తా. ఏడాది కాలంగా చాలా బాగా సాగుతున్నది. ఇక ముందు కూడా ఇలాగే ఆడాలనుకుంటున్నా.
ద్రవిడ్: బ్యాటింగ్ చేసే సమయంలో ఏం ఆలోచిస్తావు?
సూర్య: నా వరకైతే వీలైనంత ఎక్కువసేపు క్రీజులో నిలువాలనుకుంటా. అప్పుడే మ్యాచ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లగలం. అది నాతో పాటు జట్టుకు మేలు చేస్తుంది.
ద్రవిడ్: నీ షాట్ల గురించి ఏం చెప్తావు?
సూర్య: పొట్టి ఫార్మాట్లో కాస్త ముందస్తు సన్నద్ధత అవసరం. అయితే బౌలర్ మనకంటే ఒక అడుగు ముందుంటే మాత్రం మరిన్ని షాట్ల కోసం ప్రయత్నించాల్సిందే. మ్యాచ్ పరిస్థితిని బట్టి ఫీల్డర్లకు అందకుండా బంతిని ఆడాలనే అనుకుంటా.
ద్రవిడ్: ప్రాక్టీస్ సెషన్లో వినూత్న షాట్లు ఆడినట్లు కనిపించవుగా?
సూర్య: నెట్ సెషన్లో బ్యాట్ మధ్యలో బంతి తగులుతుందా లేదా అనేదే చూసుకుంటా. సరిగ్గా కాంటాక్ట్ అయితే వచ్చే సౌండ్ వేరే విధంగా ఉంటుంది. నెట్స్‌లో ఫాస్ట్ బౌలర్లు, లెఫ్టార్మ్ స్పిన్నర్లను సరిగ్గా ఎదుర్కున్న రోజు ప్రాక్టీస్ బాగా సాగిందనుకుంటా.
ద్రవిడ్: నీ విజయం వెనుక కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలాంటిది?
సూర్య: ఈ జర్నీలో కుటుంబ సభ్యుల సహకారం వెలకట్టలేనిది.