తిరువనంతపురం: సొంతగడ్డపై భారత్ జూలు విదిల్చింది. ప్రపంచకప్ టోర్నీకి ముందు న్యూజిలాండ్‌పై సిరీస్ విజయంతో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంది. శనివారం జరిగిన ఐదో టీ20 పోరులో టీమ్ఇండియా 46 పరుగుల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. తొలుత ఇషాన్ కిషన్(43 బంతుల్లో 103, 6ఫోర్లు, 10 సిక్స్‌లు) ధనాధన్ సెంచరీకి తోడు సూర్యకుమార్‌యాదవ్(30 బంతుల్లో 63, 4ఫోర్లు, 6సిక్స్‌లు) అర్ధసెంచరీతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 271/5 భారీ స్కోరు చేసింది. అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కివీస్ బౌలర్లను ఉతికిఆరేస్తూ స్టేడియాన్ని హోరెత్తించాడు. ఫెర్గుసన్(2/41)కు రెండు వికెట్లు దక్కాయి. లక్ష్యఛేదనలో అర్ష్‌దీప్‌సింగ్(5/51) ధాటికి కివీస్ 19.4 ఓవర్లలో 225 పరుగులు చేసింది. ఫిన్ అలెన్(38 బంతుల్లో 80, 8ఫోర్లు, 6సిక్స్‌లు), రచిన్ రవీంద్ర(17 బంతుల్లో 30, 2ఫోర్లు, 2సిక్స్‌లు) ఆకట్టుకున్నారు. తన కెరీర్లో తొలి టీ20 సెంచరీతో కదంతొక్కిన ఇషాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కగా, సూర్యకుమార్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు.
ఇషాన్ దుమ్మురేపగా:
దేశవాళీలో పరుగుల వరద పారించిన ఇషాన్ కిషన్ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. ఓపెనర్ అభిషేక్‌శర్మ మరోమారు జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, శాంసన్ అదే రీతిలో తన వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. జాకబ్ డఫీ బౌలింగ్‌లో సిక్స్‌తో ఖాతా తెరిచిన అభిషేక్..వరుసగా రెండు బౌండరీలతో టాప్‌గేర్‌లోకి వెళ్లాడు. సొంత ఇలాఖాలోనైనా సత్తాచాటుతాడనుకున్న శాంసన్ అభిమానులను ఘోరంగా నిరాశపరిచాడు. మూడో ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్..అభిషేక్‌కు జతకలిశాడు. వీరిద్దరు పోటాపోటీగా పరుగులు సాధించే ప్రయత్నం చేశాడు.
అయితే ఫెర్గుసన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన అభిషేక్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ క్రీజులోకి వచ్చాక ఇన్నింగ్స్ స్వరూపం మారిపోయింది. సాంట్నర్ 10వ ఓవర్లో సూర్య సిక్స్ కొడితే ఇషాన్ ఫోర్, సిక్స్‌తో జతకలిశాడు. ఇదే దూకుడుతో ఇష్ సోదీని ఇషాన్ ఉతికి ఆరేశాడు. 12వ ఓవర్లో వరుసగా 4,4,4, 6, 6 బాది 29 పరుగులు పిండుకున్నాడు. ఓవైపు కిషన్..మరోవైపు సూర్యకుమార్ చెలరేగడంతో 16 ఓవర్లకే టీమ్ఇండియా 200 పరుగుల మార్క్ అందుకుంది. సూర్య ఔట్‌తో మూడో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. సూర్య తర్వాత హార్దిక్ కూడా అదే దూకుడు కొనసాగించగా, ఇషాన్ తన ఇన్నింగ్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. హార్దిక్ జతగా కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ 42 బంతుల్లో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. ఆఖర్లో హార్దిక్, రింకూసింగ్, దూబే బ్యాట్లు ఝులిపించడంతో భారత్‌కు భారీ స్కోరు సాధ్యమైంది.
అలెన్ ఆడినా:
భారీ లక్ష్యఛేదనలో ఫిన్ అలెన్ మెరుపులు మెరిపించాడు. అర్ష్‌దీప్‌సింగ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఆఖరి బంతికి సిఫర్ట్(5) ఔటైనా అలెన్ అదే ఊపుతో బౌండరీలు బాదాడు. అర్ష్‌దీప్‌ను లక్ష్యంగా మూడో ఓవర్లో అలెన్ 23 పరుగులు కొల్లగొట్టాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి 79 పరుగులు చేసింది. టీ20ల్లో కివీస్‌కు ఇది భారత్‌పై అత్యధిక స్కోరు. 21 బంతుల్లోనే అర్ధసెంచరీతో ప్రమాదకరంగా మారుతున్న అలెన్‌ను అక్షర్‌పటేల్ ఔట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఇదే అదనుగా అర్ష్‌దీప్‌సింగ్ చెలరేగడంతో 117-2తో మెరుగ్గా కనిపించిన కివీస్..137కే 5 వికెట్లు కోల్పోయింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 271/5(ఇషాన్ 103, సూర్యకుమార్ 63, ఫెర్గుసన్ 2/41, డఫీ 1/53), న్యూజిలాండ్: 19.4 ఓవర్లలో 225 ఆలౌట్(అలెన్ 80, రవీంద్ర 30, అర్ష్‌దీప్ 5/51, అక్షర్‌పటేల్ 3/33)