ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్( Inzamam ul Haq) .. భారత బౌలర్ హర్షదీప్ సింగ్‌పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు చేశారు. ఓ టీవీ షోలో పాల్గొన్న అతను ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో.. హర్షదీప్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో అతను 37 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. అయితే టార్గెట్‌ను డిఫెండ్ చేస్తున్న సమయంలో.. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో హర్షదీప్ రివర్స్ స్వింగ్ బౌలింగ్ చేశాడని, అది ఎలా సాధ్యమైందని ఇంజమాముల్ హక్ ప్రశ్నించాడు. మరీ ముందుగానే బాల్ రివర్స్ స్వింగ్ అయ్యిందని, అంటే ఇన్నింగ్స్ 12 లేదా 13వ ఓవర్లో బంతి రివర్స్ స్వింగ్ స్టార్ట్ అయ్యిందని, అంపైర్లు తమ కళ్లు తెరిచి బౌలర్లపై దృష్టి పెట్టాలని ఇంజీ ఆ షోలో వ్యాఖ్యానించాడు.
Inzamam-ul-Haq accusing the Indian team of ball-tampering during their match against Australia #T20WorldCup #Cricket (via News 24) pic.twitter.com/rUi8egN847
— Saj Sadiq (@SajSadiqCricket) June 26, 2024
ఆ టాక్ షోలోనే మరో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సలీమ్ మాలిక్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కొన్ని జట్ల పట్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి కళ్లు మూసి చోద్యం చూస్తోందని ఆయన ఆరోపించాడు. కొన్ని జట్ల విషయంలో ఐసీసీ కళ్లు మూసుకుంటుందని, ఇండియా విషయంలోనూ ఐసీసీ ఇదే చేస్తుందని పేర్కొన్నాడు. ఒకవేళ పాకిస్తానీ బౌలర్ రివర్స్ స్వింగ్ చేసినట్లు గమనిస్తే, అప్పుడు గొడవ గొడవ చేసేవారని ఇంజీ ఆరోపించాడు. రివర్స్ స్వింగ్ గురించి తమకు తెలుసు అని, హర్షదీప్ 16వ ఓవర్లో రివర్స్ స్వింగ్ చేస్తే, అంటే దానికి ముందు ఏదో జరిగిందని అర్థమవుతోందని ఇంజీ తెలిపాడు.
సూపర్-8 స్టేజ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా 5 వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 181 రన్స్ మాతమ్రే చేసింది. ఆఫ్ఘన్ చేతిలో బంగ్లా ఓడిపోవడంతో.. ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం టోర్నీలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లలో హర్షదీప్ ఉన్నాడు. అతనితో పాటు ఆఫ్ఘన్ బౌలర్ ఫజల్లక్ ఫారూకీ కూడా 15 వికెట్లు తీసుకున్నాడు.