బెర్లిన్: ప్రతిష్టాత్మక ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో భారత మహిళల హాకీ జట్టు వరుస ఓటముల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 0-3తో చైనా చేతిలో ఓటమిపాలైంది. యూరోపియన్ అంచెలో అమ్మాయిలకు ఇది వరుసగా ఏడో పరాజయం. దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 15 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో చైనా తరఫున చెన్ యాంగ్(21ని), జాంగ్ యింగ్ (26ని), అన్హుల్ యు(45ని)గోల్స్ చేశారు. ఆదివారం మరోమారు చైనాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్‌కు ప్రో లీగ్‌లో కొనసాగే చాన్స్ ఉంటుంది.
భారత్‌కు స్వర్ణం ; ఏషియన్ స్నూకర్ చాంపియన్‌షిప్
కొలంబో: ఏసీబీఎస్ ఏషియన్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత్ స్వర్ణ పతకంతో మెరిసింది. శనివారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన టీమ్ ఫైనల్లో భారత్ 3-1తో మలేషియాపై అద్భుత విజయం సాధించింది. రెండేండ్ల క్రితం ఇరాన్‌కు పసిడి చేజార్చుకున్న భారత టీమ్ ఈసారి సత్తాచాటింది. తొలి గేమ్‌లో బ్రిజేష్ దమాని 58-68తో తోర్ చువాన్న లియోంగ్ చేతిలో ఓడాడు. అయితే రెండో గేమ్‌లో స్టార్ క్యూయిస్టు పంకజ్ అద్వానీ 66(51)-25తో లిమ్ కాక్ లియోంగ్పై గెలిచి భారత్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. ఆఖరిదైన డబుల్స్‌లో అద్వానీ, దమాని జోడీ 76(60)-33, 58-1తో చువాన్, లిమ్ కాక్ ద్వయంపై గెలిచి పసిడి అందించారు.