Virat Kohli | ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పరుగులు చేసేందుకు ఇబ్బందులుపడుతున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో రెండు వన్డేల్లో ఇప్పటి వరకు ఖాతా తెరువలేకపోయాడు. 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ, ఆస్ట్రేలియాతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో మ్యాచ్ అడిలైడ్‌లో జరుగుతోంది. మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
భారత్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. ముందుగా బ్యాటింగ్ చేస్తున్న భారత్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ముందుగా బ్యాటింగ్ చేస్తున్న భారత్ పవర్‌ప్లేలో రెండు వికెట్లు కోల్పోయింది. జేవియర్ బార్ట్లెట్ తన రెండవ ఓవర్లో భారత్‌కు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మిచెల్ మార్ష్ క్యాచ్ ఇవ్వగా.. ఆ తర్వాత కోహ్లీని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో 223 రోజుల తర్వాత కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. పెర్త్ వన్డేకు ముందు కోహ్లీ చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ తరఫున ఆడాడు.
పునరాగమనంలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. పెర్త్ వన్డేలో కోహ్లీ ఖాతా తెరువకుండానే పెవిలియన్‌కు చేరాడు. తాజాగా అడిలైడ్ వన్డేలోనూ డకౌట్ అయ్యారు. కోహ్లీ తన కెరీర్లో వరుసగా రెండు వన్డేలలో డకౌట్‌గా అవుట్ కావడం ఇదే మొదటిసారి. కోహ్లీ గతంలో అడిలైడ్‌లో రాణించాడు. కానీ, ఈసారి మాత్రం భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అడిలైడ్‌లో ఒక విదేశీ బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక అంతర్జాతీయ పరుగుల రికార్డు కోహ్లీ పేరిట ఉన్నది. అడిలైడ్‌లో 975 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌కు విరాట్ నెట్స్‌లో శ్రమించినా మ్యాచ్‌లో విఫలమయ్యాడు.