కోల్‌కతా: భారత ఫుట్‌బాల్ జట్టు.. ఆసియా కప్‌నకు అర్హత సాధించేందుకు సిద్ధమైంది. క్వాలిఫయర్స్‌లో భాగంగా బుధవారం జరుగనున్న పోరులో ప్రపంచ 171వ ర్యాంకర్ కాంబోడియాతో సునీల్ ఛెత్రీ సేన తలపడనుంది. అంతర్జాతీయ అనుభవం, ఫామ్, మెరుగైన ఆటగాళ్లు ఇలా.. ఏ రకంగా చూసుకున్నా కాంబోడియా కన్నా మెరుగ్గా ఉన్న టీమ్ఇండియా.. అదే జోరులో అఫ్గానిస్థాన్ (150వ ర్యాంక్), హాంకాంగ్ (147వ ర్యాంక్)పై కూడా విజయాలు సాధించి ఆసియా కప్‌నకు అర్హత సాధించాలని భావిస్తున్నది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్ 104వ స్థానంలో కొనసాగుతుండగా.. గాయం నుంచి కోలుకున్న ఛెత్రీ తిరిగి జట్టులో చేరడం టీమ్ఇండియాకు కొండంత బలంగా మారింది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించి తమకు మద్దతివ్వాలన్న సునీల్ ఛెత్రీ కోరిక మేరకు ఈ పోరుకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశాలున్నాయి.