Paris Olympics | గురి కుదిరేనా?.. ఆర్చరీలో బోణీ కొట్టని భారత్
ద్రోణాచార్యుడి మట్టి ప్రతిమనే గురువుగా మలుచుకుని తన విలువిద్య విన్యాసాలతో పాండవులను ఆశ్చర్యచకితుల్ని చేసిన ఏకలవ్యుడి ఘనమైన వారసత్వం.. పక్షి కంటిని గురిపెట్టి కొట్టిన అర్జునుడి వీరత్వం ఉన్న విలువిద్య (ఆర్చరీ)లో మన దేశానికి ఒలింపిక్స్‌లో ఇంత వరకూ ఒక్కటంటే ఒక్క పతకం రాలేదు.
- ఆర్చరీలో బోణీ కొట్టని భారత్
- ఆరుగురు ఆర్చర్లపై భారీ ఆశలు
ద్రోణాచార్యుడి మట్టి ప్రతిమనే గురువుగా మలుచుకుని తన విలువిద్య విన్యాసాలతో పాండవులను ఆశ్చర్యచకితుల్ని చేసిన ఏకలవ్యుడి ఘనమైన వారసత్వం.. పక్షి కంటిని గురిపెట్టి కొట్టిన అర్జునుడి వీరత్వం ఉన్న విలువిద్య (ఆర్చరీ)లో మన దేశానికి ఒలింపిక్స్‌లో ఇంత వరకూ ఒక్కటంటే ఒక్క పతకం రాలేదు. 1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి ఈ ఆటలో పాల్గొంటున్న మన విలుకాళ్లు ఇప్పటిదాకా పతక బోణీ కొట్టలేదు. విశ్వక్రీడావేదికపై పతకాల వేటలో తడబడుతున్న మన ఆర్చర్లు ‘పారిస్’లో అయి నా తమ అమ్ములపొదిలో దాగి ఉన్న విల్లంబులతో పతక కరువును పారదోలుతారా?
– నమస్తే తెలంగాణ క్రీడా విభాగం
Paris Olympics | ఒలింపిక్స్‌లో ఇంతవరకూ ఆర్చరీలో పతక బోణీ కొట్టని భారత్.. పారిస్ ఒలింపిక్స్‌లో అయినా ఆ లోటును పూడ్చుకోవాలని భావిస్తోంది. గడిచిన రెండు మూడేండ్లుగా అంతర్జాతీయ స్థాయిలో మన ఆర్చర్ల నిలకడైన ప్రదర్శనతో ఈసారి భారత్‌కు పతకాలు తెచ్చే ఈవెంట్స్‌లో ఆర్చరీ కూడా చేరింది. పారిస్‌లో ఐదు ఈవెంట్లలో ఆరుగురు ఆర్చర్లతో బరిలోకి దిగుతున్న భారత్.. గతంతో పోల్చితే ఈసారి మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. అనుభవజ్ఞులు, యువకులతో కూడిన విలుకాళ్ల బృందం ఈసారి పతకాలతోనే తిరిగిరావాలనే పట్టుదలతో ఉంది. 40 ఏండ్ల వయసులో మూడోసారి ఒలింపిక్స్‌లో పాల్గొననున్న తరుణ్‌దీప్ రాయ్, మాజీ ప్రపంచ నంబర్‌వన్, నాలుగో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న దీపికా కుమారి, రెండోసారి విశ్వక్రీడల్లోకి దిగుతున్న ప్రవీణ్ జాదవ్ అనుభవం.. తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర, 18 ఏండ్ల అమ్మాయి భజన్ కౌర్, ప్రపంచ 40వ ర్యాంకర్ అంకితా భక్త్ వంటి తొలిసారి ఒలింపిక్స్ ఆడనున్న వారితో ఆర్చరీ బృందం సమతూకంగా ఉంది.
వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో పైన పేర్కొన్న ఆటగాళ్లు ఇటీవలి కాలంలో అత్యుత్తమ ర్యాంకులను నమోదుచేసి జోరుమీదున్నారు. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ధీరజ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ‘ప్రస్తుతం ఆర్చర్ల ప్రదర్శనను బట్టి చూస్తే భారత్‌కు పురుషుల వ్యక్తిగత, టీమ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్స్‌లో పతకాలు కచ్చితంగా వస్తాయి’ అని ‘సాయ్’ ఆశాభావంతో ఉంది. ఒలింపిక్స్‌లో ఆర్చరీ పోటీలు జూలై 25న మొదలై ఆగస్టు 4 దాకా జరుగుతాయి.
కొరియన్ సవాలు..
రికర్వ్ ఈవెంట్లో పురుషుల, మహిళల వ్యక్తిగత విభాగాలతో పాటు టీమ్ ఈవెంట్స్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న మన ఆర్చర్లు.. కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ 1, 2, 3లో అంచనాలకు మించి రాణించి పారిస్ బెర్తులను దక్కించుకోవడం శుభసూచకం. ప్రతి ఒలింపిక్స్‌లో పతకాలు కొల్లగొట్టే కొరియా ఆటగాళ్ల నుంచి ప్రధాన పోటీ ఎదురయ్యే ఈ క్రీడలో మనవాళ్లు ఆ సవాళ్లను ఎలా దాటతారనేది ఆసక్తికరం. ప్రపంచకప్, ఇతర టోర్నీలలో రాణిస్తున్నా అసలైన సవాలు ఎదురయ్యే ఒలింపిక్స్‌లో ‘ఆ ఆరుగురు’ ఏ మేరకు సత్తా చాటుతారనేది చూడాలి.
భారీ ఖర్చు..
పారిస్ ఒలింపిక్స్‌లో మన ఆర్చర్లు పతకం నెగ్గాలనే లక్ష్యంతో కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ‘టాప్స్’ స్కీమ్ కింద పలువురు ఆర్చర్లపై 2021 నుంచి ఇప్పటిదాకా రూ. 39.18 కోట్లను ఖర్చు చేసింది. ఆటగాళ్లకు 41 నేషనల్ క్యాంపులు, 24 ఫారెన్ ఎక్స్పోజర్ ట్రిప్‌లు, ఆటగాళ్ల వ్యక్తిగత శిక్షణ, వారికి సదుపాయాలు తదితరాలపై వీటిని ఖర్చు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

