పారిస్: పారిస్ పారాలింపిక్స్‌కు మరికొన్ని గంటల్లో అట్టహాసంగా తెరలేవనుంది. సుదీర్ఘ ఒలింపిక్స్ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో చారిత్రక సీన్నదిపై ఆరంభ వేడుకలతో ప్రపంచదృష్టిని ఆకర్షించిన పారిస్..మరోమారు అలరించేందుకు ముస్తాబవుతున్నది. తమ చారిత్రక వారసత్వాన్ని, వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఫ్రాన్స్ విభిన్న కళారీతులతో కనువిందు చేయనుంది. పన్నెండు రోజుల పాటు సాగనున్న మెగాటోర్నీలో మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు 22 క్రీడాంశాల్లో 549 పతకాల కోసం పోటీపడనున్నారు.
ఇక భారత్ విషయానికొస్తే..ఈసారి 84 మందితో 12 విభాగాల్లో పతకాల వేట కొనసాగించనుంది. టోక్యో పారాలింపిక్స్(2020)లో ఐదు స్వర్ణాలు సహా 19 పతకాలు సాధించిన మన అథ్లెట్లు ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చాలని చూస్తున్నారు.
పారిస్ పారాలింపిక్స్‌లో స్టార్ అథ్లెట్లు సుమిత్ అంటిల్, అవని లేఖరపై భారీ ఆశలు ఉన్నాయి. గత టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకాలతో మెరిసిన ఈ ఇద్దరు ఈసారి కూడా అదే ప్రదర్శన కనబర్చాలన్న పట్టుదలతో ఉన్నారు. 17 ఏండ్ల వయసులో ప్రమాదంలో ఎడమ కాలు కోల్పోయిన అంటిల్ జావెలిన్‌త్రోలో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. గత మేలో జరిగిన పారా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సుమిత్ పసిడి పతకంతో మెరిశాడు. పారిస్ పారాలింపిక్స్‌లో 75మీటర్ల మార్క్ లక్ష్యంతో అంటిల్ పోటీకి దిగుతున్నాడు.
ఇప్పటికే అంతర్జాతీయ టోర్నీల్లో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించిన సుమిత్..ఈ సారి పసిడి పతకంతో కొత్త చరిత్ర లిఖించాలని చూస్తున్నాడు. మరోవైపు మహిళల షూటింగ్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్‌తో పాటు 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో అవని తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. టోక్యోలో స్వర్ణంతో సహా కాంస్యం దక్కించుకున్న అవని..ఈసారి మరో రెండు పతకాల ద్వారా అరుదైన ఘనత సాధించాలని చూస్తున్నది.
పారిస్ పారాలింపిక్స్‌లో ఈసారి కచ్చితంగా పతకం సాధిస్తారన్న వారిలో తెలంగాణ యువ అథ్లెట్ జివాంజీ దీప్తి(టీ20 400మీ), మరియప్పన్ తంగవేలు(టీ63-హైజంప్), యోగేశ్ కథునియా(ఎఫ్56, డిస్కస్‌త్రో), శీతల్‌దేవి(ఆర్చరీ-కాంపౌండ్), కృష్ణనాగర్(ఎస్‌హెచ్6),సుహాస్ యతిరాజ్(బ్యాడ్మింటన్), భవీనాబెన్ పటేల్(టీటీ) ముందున్నారు.
పారిస్ పారాలింపిక్స్ ఆరంభ వేడుకల్లో సుమిత్ అంటిల్, భాగ్యశ్రీ జాదవ్ జాతీయ పతాకధారులుగా వ్యవహరించనున్నారు. పారాలింపిక్స్ గేమ్స్ చరిత్రలో తొలిసారి స్టేడియం బయట జరిగే ప్రారంభ కార్యక్రమంలో వీరు జాతీయజెండా చేతబూని ముందుకు సాగనున్నారు.