Shoaib Bashir Visa Row: భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. తమతో పాటే రావాల్సి ఉన్న యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ వీసా జారీలో సమస్యల కారణంగా అబుదాబి నుంచి యూకేకు వెళ్లడం.. యూకే ప్రధానమంత్రి కార్యాలయం కూడా జోక్యం చేసుకోవడంతో అతడికి భారత్‌కు రావడానికి లైన్ క్లీయర్ అయింది. దీంతో బషీర్.. ఈ వారాంతంలో భారత్‌కు రానున్నాడు. హైదరాబాద్‌లోనే ఇంగ్లండ్ జట్టుతో కలిసినా బషీర్ మాత్రం తొలి టెస్టును మిస్ అవుతాడు. ఫిబ్రవరి 02 నుంచి విశాఖపట్నం వేదికగా జరగాల్సి ఉన్న రెండో టెస్టులో బషీర్ ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి.
అసలేం జరిగింది..?
భారత పర్యటనకు రావడానికంటే ముందే ఇక్కడి స్పిన్ పిచ్‌లను పరిగణనలోకి తీసుకున్న ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బషీర్‌తో పాటు రిహాన్ అహ్మద్, టామ్ హర్ట్లీలకు యూఏఈలో ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. భారత పిచ్‌ల మాదిరిగానే ఉండే అక్కడి పిచ్‌లలో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటుచేసింది. ఇండియా టూర్‌కు ఇంగ్లండ్ ప్రకటించిన జట్టులో అతడు కూడా ఉన్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెటర్లంతా అబుదాబికి వచ్చి భారత్ ఫ్లైట్ ఎక్కినా అతడు మాత్రం అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది.
Shoaib Bashir has now received his visa, and is due to travel to join up with the team in India this weekend.
We’re glad the situation has now been resolved.#INDvENG | #EnglandCricket pic.twitter.com/vTHdChIOIi
— England Cricket (@englandcricket) January 24, 2024
ఇంగ్లండ్‌లోనే పుట్టిపెరిగిన ఈ సర్రే క్రికెటర్ మూలాలు మాత్రం పాకిస్తాన్‌కు చెందినవి. 20 ఏండ్ల ఈ కుర్రాడి తల్లిదండ్రులు పాకిస్తాన్ దేశస్తులు. ఈ కారణంతోనే అతడి వీసా జారీలో సమస్యలు తలెత్తినట్టు తెలుస్తున్నది. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా (ఇతడూ పాకిస్తాన్ మూలాలున్న క్రికెటరే) తో పాటు ఇంగ్లండ్‌కే చెందిన మోయిన్ అలీ, సకిబ్ మహ్ముద్లూ వీసా సమస్యలతో ఇబ్బందులుపడ్డారు. తాజాగా బషీర్ కూడా ఆ బాధితుడే. బషీర్‌కు వీసా సమస్యలపై ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ సైతం స్పందించాడు. అతడికి వీసా నిరాకరించడం తమకు బాధ కలిగించిందని, బషీర్‌కు వీసా దొరికేదాకా మేమంతా అబుదాబి నుంచి రావొద్దని నిశ్చయించుకున్నామని బెన్ స్టోక్స్ మీడియా సమావేశంలో చెప్పాడు. రెండ్రోజులుగా సాగుతున్న ఈ సమస్య ఎట్టకేలకు సద్దుమణిగింది. బషీర్‌కు వీసా ఇస్తున్నట్టు భారత రాయబార కార్యాలయం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు సమాచారం అందించడంతో ఈసీబీ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.