Shaheen Afridi : పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రీది మైదానంలో దిగేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ విషయాన్ని తాజాగా అతను వెల్లడించాడు. పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘లయ అందుకున్నా. కచితత్వంతో బౌలింగ్ చేస్తున్నా. పునరాగమనం చేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. వరల్డ్ కప్ కంటే ఇప్పుడు మరింత మెరుగ్గా కనిపిస్తున్నా. ఈవారం దాదాపు 19 ఓవర్లు వేశాను. వచ్చే వారం 25 ఓవర్లు బౌల్ చేస్తాను’ అని షాహీన్ తెలిపాడు. ఫిబ్రవరిలో జరగనున్న పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 8వ సీజన్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. అతడి కెప్టెన్సీలో లాహోర్ క్యాలెండర్స్ పోయిన ఏడాది ఛాంపియన్‌గా అవతరించింది. ఈ ఏడాది కూడా తమ జట్టుకు ట్రోఫీ అందించాలనే పట్టుదలతో ఉన్నాడు.
గత ఆరు నెలలుగా షాహీన్ ఆఫ్రీది గాయాలతో సతమతం అవుతున్నాడు. మోకాలి గాయం కారణంగా శ్రీలంక అతిథ్యం ఇచ్చిన ఆసియా కప్, ఇంగ్లండ్‌తో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అయితే.. ఫిట్నెస్ సాధించి ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్‌లో ఆడాడు. దురదృష్టవశాత్తూ.. ఫైనల్లో ఫీల్డింగ్ చేస్తుండగా అతని మోకాలికి గాయమైంది. దాంతో, మైదానం వీడిన షాహీన్ మళ్లీ గ్రౌండ్లోకి వచ్చి కోటా ఓవర్లు పూర్తి చేశాడు. ఆ తర్వాత వారం రోజులకే దుబాయ్‌లో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకున్నాడు. మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్వదేశంలో ఇంగ్లండ్, పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు.